Thursday, January 3, 2019

శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం... పావనమీ రఘురామ నామం భవ తారకమంత్రం॥ :)

శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం
పావనమీ రఘురామ నామం భవ తారకమంత్రం॥ 
పై పంక్తులు ఆరుద్ర గారి అందెవేసిన చేతిలోని కలం నుండి జాలువారిన ఒక సినిమా పాటలోవే అయినా, అందు చెప్పబడినది వేదవేదాంత సారమే..!
శ్రీరామ నామం కేవల భగవంతుని నామం మాత్రమే అనుకున్న వారికి అది నామమే...
( అసల్ అలా అనుకోవడం కూడా భాగ్యమే అనుకోండి..! )
కాని అది సాక్షాత్ శ్రీవేంకటాచలం పై కొలువైన పరబ్రహ్మము యొక్క పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణుడు / గోవిందుని మరో నామమే...శ్రీరామ నామం తారక మంత్రమే...!
తులసీదాస్ గారిచే గతించిన జీవుడిని వెనక్కి రప్పించి మరీ శరీరంలోని పంచప్రాణములు తమ తమ స్థానాల్లో స్థిరంగా కొలువైఉండేలా చేసిన మృతసంజీవని శ్రీరామ నామము..!!
అంతటి " హనుమాన్ చాలిసా " ని లోకానికి ప్రసాదించిన సారస్వతామృతము కదా శ్రీరామ నామము...!!
" నను బ్రోవమనిజెప్పవే, సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే...నను బ్రోవమనిజెప్పు...నారీ శిరోమణి..జనకుని కూతుర జనని జానకమ్మ..." అని యాతనలు ఇకభరించ లేక ఎంతో ఆర్తితో వేడుకున్న కంచర్ల గోపన్నకు, కర్మఫలితాన్ని క్షయింపచేసి, రామోజి / లక్ష్మోజి గా సాక్షాత్ శ్రీవైకుంఠం నుండి స్వామివారిని, ఆదిశేషున్ని రప్పించి, త్రేతాయుగం నాటి రామ మాడల పైకంతో కప్పం కట్టించి మరీ సంకెళ్ళు విడిపించిన తారక మంత్రం...!! ఆనాటి తానీషా రాజ్య ప్రభువు నుండి ఈనాటి కే.సీ.ఆర్ ప్రజాప్రతినిధుల ప్రభువు వరకు, ఆ భద్రాద్రి రామయ్య ప్రతి చైత్ర శుద్ధ నవమికి కళ్యాణ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందుకుంటూనే ఉన్నాడుకదా...!!
ఉగ్రంగా ఊగిపోతున్న పరశురాముడు తన ఎదుట నిలబడగానే, ఆతని శక్తిని తనలో లయించి వేసిన అమేయ శక్తి పుంజము కదా శ్రీరామనామము....
ఆ శ్రీరామ నామమే గుండెల సవ్వడిగా మార్చుకున్న ఎవ్వరి ముందైనా ఎంతటి శక్తి నిలువజాలదు....
అలాంటి ఇరు శక్తులను పరస్పరం తారసపడేలా చేసిననాడు, శ్రీరామ నామము యొక్క శక్తి లోకి అవతలి శక్తి లయించి పోవడమో, లేదా ఆ సత్యాన్ని తెలుసుకుని తమను తాము అర్పించుకోవడమో...
అంతకు మించి అక్కడ సాధ్యమయ్యేది మరొకటి ఉండజాలదు...!!
అపర రుద్రాంశ సంభూతుడైన హనుమంతుని అంతటి మహాశక్తిసంపన్నుడి పైకి, సాక్షాత్ ఆ కోదండపాణి సంధించిన శరసమూహాలు, శ్రీరామ నామస్మరణ ముందు కోమల కుసుమాలై నేలరాలి ఆ చిరంజీవుని చరణారవిందాలకు అంజలి ఘటించాయే, ఇక ఇంతకు మించి శ్రీరామ నామమనే మంత్రానికి ఉన్న శక్తిని వర్ణించ ఉపమానం ఉందని నేనైతే అనుకోను...
శ్రీరాముడు ఎంతటి సౌకుమార్య సంపన్నుడో..శాంత / సాత్విక స్మరణగా ఉన్నప్పుడు శ్రీరామ నామం కూడా అంతటి కోమలమైన, శాంతి దాయక మంత్రం....
శ్రీరాముడు ఎంతటి అరివీర భయంకరుడో, రాములవారి చేతిలోని కోదండం అసురుల పాలిటి ఎంతటి సింహ స్వప్నమో, రాజస స్మరణగా ఉన్నప్పుడు శ్రీరామ నామం కూడా అంతటి శక్తి విస్ఫోటన మంత్రం...అది అణు శక్తి అయినా, మరే అన్య శక్తి అయినా, శ్రీరామ మంత్ర శక్తి ముందు అన్నీ బలాదూర్ అవ్వాల్సిందే...! 

No comments:

Post a Comment