Sunday, January 27, 2019

2019 గణతంత్రదినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వంచే లలితకళల విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని వరించిన శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఒక సహిత్యాభిమాని సాదర నమస్సులు... :)

శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారు, శ్రీ (సిరివెన్నెల) సీతారామ శాస్త్రి గారు, ఈ రెండు రామనామప్రయుక్తమైన పేర్లు తెలియని తెలుగు సినిమా వీక్షకులు, తెలుగు సినీ సుసంగీతారాధకులు ఉండరనడం అతిశయోక్తి కానేరదు... అంతగా వెండితెరకు అక్షరవెలుగుజిలిగులు అలదిన పుంభావ సరస్వతీ స్వరూపులు వారిరువురు... తెలుగు సినిమా అనే బండికి 2 మేటి చక్రాలై సాగిన వారి రచనా ప్రస్థానం, భాషా మమకారం కలిగిన ఎందరెందరికో మదిలో చింతను దూరంచేసి ఎదలో స్వాంతన కలిగించేలా రచింపబడిన వన్నె తరగని పరిమళ సాహితీ పారిజాతాలు ఆస్వాదించేందుకు కలకాలం ఒక కమ్మని పాటగా నిరంతరం చెవిలో మార్మోగుతూనే ఉంటుందనడం కద్దు...!
శాస్త్రి గారి కలమునుండి జాలువారిన కవనాలు కోకొల్లలు...కాని ఆ సినిమా పేరునే తమ పేరులో కలిసిపోయేంతగా చేసిన, ఎందరెందరికో సిరివెన్నెల చిత్రంలోని ఈ క్రింది చరణాలు హృదయఫలకంపై ముద్రించుకుపోయిన శాశ్వత ఆనందలహరులు... ( ఈ పాట పాడుకుంటూ, అవి ప్రేరణగా తీసుకుని నేను ఎన్నో స్వకవనాలు రచించుకున్నాను కూడా..!  )
" నా ఉచ్ఛ్వాసం కవనం...నా నిశ్వాసం గానం...
సరసస్వర సుర ఝరీగమనమౌ సామవేదసారమిది..
నే పాడిన జీవన గీతం...ఈ గీతం...
విరించినై విరచించితిని ఈ కవనం...విపంచినై వినిపించితిని ఈ గీతం.... " ! 
2019 గణతంత్రదినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వంచే లలితకళల విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని వరించిన శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అమరసాహితీఝరి సదా సురగంగాతరంగతురగపు పదఘట్టనమై సాగిపోవాలని అభిలషిస్తూ, వారికి ఒక సహిత్యాభిమాని సాదర నమస్సులు... 

No comments:

Post a Comment