Friday, January 11, 2019

శరణంటి మాతని సమ్మంధమునజేసి | మరిగించి మమునేలి మన్నించవే ||

అన్నమాచార్యుల వారి పదకవితల ఆణిముత్యాల ల్లికల కూర్పులో ఇది ఒక అరుదైన ఘనమైన సంకీర్తన గా భావించవచ్చు.....
ప్రతిపాదించబడిన భావం తో పాటుగా, కొద్దిగా గమనిస్తే
" శ్రీవేంకటనిలయ " అనే పదప్రయోగంతో అన్నమార్యుల వారి సంకీర్తనల్లోని ' వేంకట ' అనే ఆచార్య ముద్ర ఇందులో ఒక్కసారికి బదులుగా 3 సార్లు రావడం విశేషం..
సాధారణంగా చరమచరణంలోని ద్వితీయార్ధంలో వచ్చే ' వేంకట ' ముద్ర ఈ కీర్తనలో శాక్తేయ ప్రణవమైన శ్రీకారంతో సమ్మిళితమై ' శ్రీవేంకటనిలయ ' గా 7 అక్షరాల పదమై 3 సార్లు రావడం, అంటే 21 అక్షరాలుగా పరతత్వ ప్రాభవాన్ని స్థిరపరిచి,
అట్లే " తాళ్ళపాకన్నమాచార్యుల " అంటూ కృతికర్త యొక్క నామధేయాన్ని ఆచార్య శబ్దగుణకంతో కలిపి 9 అక్షరాల పదం గా 3 సార్లు, అంటే 27 అక్షరాల్లో తమ కర్తృత్వాన్ని కీర్తనలో స్థిరపరిచి,
భగవద్ నామ మకుటం + ఆచార్య నామధేయం తో కలిపి, అంటే (7x3=21) + (9x3=27) = వెరసి 48 అక్షరాల్లో,
( 84 లక్షల జీవరాశుల సంఖ్యను తిరగేస్తే 48 )
జీవాత్మ యొక్క శరణాగతి + పరమాత్మ యొక్క వాత్సల్యతతి ని, దృఢపరిచేలా సంకీర్తనను రచించడం ఒకెత్తైతే,
" సకలవేదములు సంకీర్తనలుచేసి | ప్రకటించి నిను బాడి పావనుడైన | అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యుల | వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ || "
అని చెప్పడంలో, సకల వేదాల సారానికి సంక్షిప్తంగా ఒక కర్ణపేయమైన మనోరంజకమైన సంకీర్తన రూపును సంతరింపచేసి, భక్త భాగవత ప్రజానీకానికి అందివ్వడంలో, తమ సంకీర్తనయజ్ఞ్యం లోని సందేశాన్ని చెప్పకనే చెప్పడం జరిగింది...
అంటే ఈ కలియుగంలో భగవద్ నామగుణవైభవ కీర్తనమే సకల వేదాధ్యయనార్జిత భక్తిజ్ఞ్యానానికి సాటి అయిన యుగధర్మం అని, తన్మూలంగానే సమస్త మానవాళికి హృదయస్వచ్ఛత అలవడి సకల శ్రేయొభివృద్ధికి రాచమార్గము సిద్ధిస్తుందని, ఆచార్యుల ఆనతిగా అందివ్వబడిన అమరవంద్యుడి ఈ కలియుగ గీతోపదేశం...!! 
Shaik Rafi to ఫేస్ బుక్ అన్నమయ్య.. facebook annamayya
అన్నమాచార్య 598:1,2,3,4
1.శరణంటి మాతని సమ్మంధమునజేసి | మరిగించి మమునేలి మన్నించవే ||
2.సకలవేదములు సంకీర్తనలుచేసి | ప్రకటించి నిను బాడి పావనుడైన | అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యుల | వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ ||
3.నారదాది సనకసనందాదులవలె | పేరుపడి నిన్ను బాడి పెద్దలైనట్టి | ఆరీతి దాళ్ళపాకన్నమాచార్యుల | చేరి యేలినయట్టి శ్రీవేంకటనిలయ ||
4.సామవేద సామగాన సప్తస్వరములను | బాముతో నీసతినిన్ను బాడినయట్టి | ఆముకొన్న తాళ్ళపాకన్నమాచార్యుల | వేమరుమెచ్చిన శ్రీవేంకటనిలయా ||

No comments:

Post a Comment