శ్రీ సద్గురువాగ్వైభవం.....
న గురోరధికం తత్వం...
న గురోరధికం తపః...
తత్వజ్ఞ్యానాత్ పరమ్నాస్తి
తస్మై శ్రీగురవే నమః...!!
అని నమస్కరిస్తోంది సద్గురువుల సాటిలేని సహృదయ వైభవాన్ని శ్రీ గురుస్తోత్రం.....
శ్రీరాముడు పరిస్థితుల దృష్ట్యా 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళాల్సివస్తే, ఇంటికి పెద్దవాడైన అన్నకు దక్కాల్సిన సిమ్హాసనం కుట్రతో కైక భరతుడికి దక్కాలనే అలా చేసిందని గుర్తించి అలా పెద్దవాడుండగా రాజ్యం తనచేతిలోకి తీసుకోవడం శ్రేయస్కరం కాదని తెలిసి అన్నను తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరించమని అడిగిన సంస్కారమూర్తి ఆనాటి భరతుడు.....
14 సంవత్సరాలపాటు అరణ్యాల్లోనే ఉండడం తన విహితధర్మం కాబట్టి అంతః పురానికి
తిరిగిరావడం కుదరదని సున్నితంగా తిరస్కరించిన శ్రీరాముడి పాదుకలను శిరస్సుపై ధరించి వాటిని సిమ్హాసనంపై శ్రీరాముడికి ప్రతీకగా నెలకొల్పి రాజ్యాన్ని పాలించిన సుగుణం అనాటి తమ్ముడైన భరతుడిది......
శ్రీ చాగంటి సద్గురువుల సంపూర్ణరామాయణం విన్నవారికి గుర్తున్నట్టుగా, కోసల సామ్రాజ్య సైన్యంతో ఏనుగు అంబారీలతో శ్రీరాముడిని తిరిగి తీసుకురావడానికి, అరణ్యానికి వస్తున్న భరతుడిని సమీపంలోని ఒక చెట్టుపైకెక్కి చూసిన లక్ష్మణుడు అది భరతుడు వారిపై యుద్ధానికి వస్తున్నట్టుగా భ్రమించి, వారిపై దాడికి అనుమతించమని శ్రీరాముడిని అడిగినప్పుడు,
" అలా తొందరపాటు నిర్ణయాలతో ఎవ్వరినీ కూడా అన్యథా భావించి ఆవేశంలో పనులు చెయ్యకూడదు లక్ష్మణ....
నీ అనవసర కోపాన్ని తగ్గించి స్థిమితపడి నీ అన్న భరతుడి గురించి అలా వచించడం మానుకో....
భరతుడి మంచితనం గురించి నాకు తెలుసు......." అని
సర్దిచెప్పిన శ్రీరాముడి మాటలను ఔదలదాల్చి అన్నమాటను గౌరవించిన సంస్కారం ఆనాటి తమ్ముళ్ళది....
అది త్రేతాయుగం నాటి మాట.....
కలి ప్రకోపం లేని కల్మష రహితమైన మనసులు కాబట్టి అన్నను గౌరవించాలి అనే సంస్కారం బాగ ఉండగలిగే అవకాశాలు అప్పటి శ్రీరామాయణ కాలం నాటివి.....
అన్నను ఓర్వలేని వారు,
అన్న ఉన్నతిని భరించలేని వారు,
జిత్తులమారి నక్కలా ఎన్నెన్నో పన్నాగాలతో
అన్నను సాధించే మూర్ఖులతో కలిసి,
అన్న పడే కష్టానికి ఏ విలువ ఇవ్వడమే కాక అన్న ఉనికికే ప్రమాదకరమైన రీతిలో వ్యవహరించే దుర్మాగులతో అంటకాగే దౌర్భాగ్యపు పస్థితుల్లో జీవించడం ఈనాటి కలియుగపు తమ్ముళ్ళకే చెల్లుతుంది......
ఎన్నో కష్టాలకు ఎదురీది ప్రశాంతమైన వాతావరణంలో,జీవితాలను నిలుపుకుంటున్న మధ్యతరగతి కుటుంబాల్లో చిచ్చు పెట్టి లాభపడాలనే ఆ దౌర్భాగ్యుల మాటలు నమ్మి, అందరి క్షేమంకోరే
అన్న మాటకు ఎదురు చెప్పకూడదు కద అనే
కనీస ఆలోచన కూడా రాని అత్యంత శోచనీయమైన స్థితిలో జీవించడమే ఈ కలియుగ కౄరత్వానికి ప్రతీక...!
ఒక వ్యక్తి తమ్ముడికి, బంధువులకి, స్నేహితులకి, ఆఖరికి తన భార్యకు సైతం విషాన్ని నూరిపోసి మీరు సాధించేది ఏముంటుంది.....?
మీ సర్వసం తన బాధాతప్త ఆక్రోశజ్వాలల్లో హరించుకుపోవడం మినహ...
కాలం ఆసన్నమైనప్పుడు సమూలంగా
సర్వనాశనం అవ్వడమే మీ కౄరకర్మలకు ఈశ్వరుడి ఫలితం.....
మీలాగే నక్కలా కౄరపన్నగాలు పన్నిన
శకుని, దుర్యోధనుడు, సైంధవుడు, దుశ్శాసనుడు, వీళ్ళ పంచన చేరినందుకు కర్ణుడు, అశ్వత్థామ,
ఆఖరికి అందరిచేత పెద్దమనిషిగా నమస్కారం పొందిన భీష్మపితామహుడితో సహా సకల కౌరవ వంశం సర్వనాశనమయ్యింది....
1. మాయా జూదం బాగా వచ్చు కాబట్టి పాచికలతో ఎత్తులు వేసి పాండవులను అన్నీ కోల్పోయేలా చేసానని విర్రవీగాడు శకుని....
చిన్ని కృష్ణుడికంటే ముందే జగన్మాయ గా శ్రీకృష్ణసహోదరి గా అవతరించిన కాలస్వరూపిణి ఆదిపరాశక్తి వేసే పాచికలముందు ఎప్పటికైనా తలవంచవలసిందే అనే సత్యాన్ని మరిచాడు......
కాబట్టి అట్లే నశించిపోయాడు.....
2. దుశ్శాసనుడు నిండుసభమధ్యలో ఒక రాచకాంతను అవమానిస్తుంటే, విలపిస్తున్న ఆ పాంచాలి పక్షాన కనీసం ఒక్క మాటైనా మాట్లాడి ఆ దుర్మార్గాన్ని ఆపేందుకు కనీస మానవ ప్రయత్నమైనా చేయకుండా ఉన్నందుకు,
పైగా
" ధర్మరాజంతటి వారే ఏమి మాట్లాడట్లేదు కాబట్టి ఇక నేనేమి మాట్లాడగలను...."
అని....
అందరికీ పెద్దమనిషిగా ఉండి కూడా ఆ తీవ్రమైన అధర్మాన్ని కనీసం ప్రశ్నించని పాపానికి, శ్రీ చాగంటి సద్గురువులు వివరించిన ధర్మసూక్ష్మ వివరణ ప్రకారంగా,
అర్జునుడి గాండీవ సంధిత శరపరంపరకి
ఒళ్ళంతా తూట్లు పడి ఇక బాణాలు కొట్టడానికి జాగలేనంతగా యుద్ధభూమిలో నేలకొరిగి బాధపడి ఆ పాపానికి లెక్కలు చెల్లించవలసివచ్చింది కద భీష్మపితామహుడికి......
3. ఎవ్వరి జోలికి వెళ్ళకుండా ఒక గృహిణి గా గౌరవంగా జీవించే స్త్రీమూర్తిని, రాచకాంతను,
యజ్ఞ్యవేదిలో దేవతాంశలో దృపదమహారాజుకు పుత్రికగా లభించిన ద్రౌపదిని,
అత్యంత హేయమైన రీతిలో అలా జుత్తిపట్టి ఈడ్చుకొచ్చి అవమానించడం అనే మహాపాపం ఎంతో విర్రవీగుతు గావించాడు దుశ్శాసనుడు....
రాజసూయయాగానంతర అవబృథస్నానజలాలతో అభిషేకించబడిన ఆ శక్తివంతమైన జుత్తును అమర్యాదతో అలా పట్టి ఈడ్చినందుకు,
అప్పుడు ద్రౌపది చేసిన శపథం,
" నన్ను ఇంత ఘోరంగా అవమానించిన దుశ్శాసనుడి రక్తం కళ్ళజూసేంతవరకు ఈ కురులు ముడివేయను....."
దేవతాంశలో జన్మించిన రాచకాంత అలా కురులు ముడివెయ్యను అని భీష్మించుకొని వాడి మరణం కూడా అంత హేయమైన రీతిలో ఉండేలా ఆక్రోశించిది కాబట్టి,
భీముడి చేతిలో అంత కౄరంగా రక్తం ఏరులైపారేలా వధించబడ్డాడు దుశ్శాసనుడు...!
4. సైంధవుడు.....
అప్పటినుండి ఇప్పటికి కూడా మూర్ఖత్వానికి ప్రతీకగా లోకంలో అందరికి గుర్తుండిపోయిన పేరు....
" ఒక మంచి పని చేస్తుంటే....సైంధవుడిలా అలా అడ్డుపడుతున్నాడెందుకురా ఆ దౌర్భాగ్యుడు....."
అనే వాడుక గురించి అందరికి తెలిసిందే.....
ధర్మసంకల్పానికి అడుగడుగునా అలా అడ్డుపడ్డాడు కాబట్టి అంత ఘోరంగా అర్జునుడి శరప్రహారానికి తల తెగి, అది కింద భూమి మీద పడకుండా యుద్ధభూమికి దూరంగా అక్కడెక్కడో తపస్సు చేసుకుంటూ ఉన్న సైంధవుడి తండ్రి చేతిలో ఆ తల పడేలా, గాల్లో బంతి ఆటలా ఆ తలను పాశుపతాస్త్రంతో ఆడించాడు శ్రీకృష్ణపరమాత్మ.....
అర్జునుడితో అలా సమయానుగుణంగా పాశుపతాస్త్ర ప్రయోగంతో సైంధవుడి తల వాడి తండ్రి చేతిలోనే పడి, అప్పుడు అది క్రింద భూమిమీద పడేలా చేసిన శ్రీకృష్ణపరమాత్మ యొక్క చాణక్యం ముందు
వారి ఎత్తులన్నీ చిత్తైనాయి.....
వాడి తండ్రి అతి తెలివితో గావించిన ఏర్పాటు,
" సైంధవుడి తల ఎవరు భూమి మీద పడేందుకు కారణమవుతారో వారి తల వ్రక్కలై ఉత్తరక్షణం మరణించెదరు గాక...."
అనే కుసంకల్పం బెడిసికొట్టి,
ఎవరు చేసిన " ఒవర్యాక్షన్ " కి ఫలితం వారే అనుభవించాలి అనే సిద్ధాంతానుగుణంగా,
సైంధవుడి తల చేతిలో పడగానే ఉలిక్కి పడి అది పక్కన పడెయ్యడంతో అక్కడికక్కడే తల వ్రక్కలై మరణించాడు...
పరమాత్మ యొక్క సంకల్పం
ఇంత గొప్పగా ఉంటుంది కాబట్టే ఆయన్ని
" దుష్టసమ్హార గోవిందా.....
దురితనివారణ గోవిందా...." అని స్తుతించడం......
అర్జునుడు ఎంతో గొప్ప వీరుడే.....
కాని అర్జునుడు గురిచూసి కొట్టేది తన రెండు కళ్ళతో మాత్రమే.....
అనగా అక్కడ అర్జునుడు శరప్రహారం తో సైంధవవధ చేయడం అతని గొప్పతనమే.....
కాని ఆ తరువాత ఎదురయ్యే దురితం కేవలం పరమాత్మకు మాత్రమే దర్శించడం సాధ్యం.....
ఎందుకంటే ఆయన యావద్ ప్రపంచాన్ని అనునిత్యం తన రెండు కళ్ళతో చూస్తూనే ఉంటాడు కాబట్టి....
" సూర్యచంద్రౌచ నేత్రే....!" కద....
అలా అత్యంత సంక్లిష్టమైన సైంధవధ లో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనేలా సైంధవుడు మరియు మూర్ఖుడైన వాడి తండ్రి హతులైనారు....
బావకోసం బామ్మర్ది తపన అన్నట్టుగా దుర్యోధనుడికి అర్జునుడిపై గల వైరాన్ని తన వైరంగా భావించి అర్జునుడిని ఎట్లైనా సరే వధించి తీరాలని సంకల్పించి తుదకు తన వలలో తానే చిక్కి చచ్చాడు దుర్యోధనుడి సొంత బామ్మర్ది ( దుశ్శల భర్త).....
అవతలివైపు ఉన్న బావాబామ్మర్దుల జోడి సాక్షాత్ నరనారాయణులని తెలియక అలా తలలు పగలుకొట్టుకున్నారు సైంధవుడు మరియు వాడి తండ్రి...
5. ఇక అసలైన కురువంశ మూలఘాతి, శతకౌరవాగ్రేసరుడు, కలిపురుష అంశలో జన్మించినవాడు, మహాభారత సంగ్రామంలో
ఎందరో ప్రాణాలు కోల్పోవడానికి కారకుడు,
హద్దెరగని పొగరుబోతుతనానికి, దుష్టత్వానికి ప్రతీకైన
దుర్యోధనుడు,
విజ్ఞ్యులైన పెద్దలను అవమానపరిచి మైత్రేయుడు శపించినట్టుగా భీముడి చేతిలో అత్యంత కౄరంగా తొడలు విరిగి చచ్చాడు.....
నెత్తికెక్కిన గర్వంతో ఏ తొడలను చూపిస్తూ ఒక రాచకాంతను అవమానపరిచాడో ఆ తొడలు విరిగి చచ్చిన తర్వాతగాని వాడికి ఆ గర్వభంగం కాలేదు....
"మా జీవితంలో భోజనానికి ఇబ్బంది లేకుండా ఒక 5 ఊర్లైనా ఇవ్వండి చాలు....."
అని పద్ధతిగా, వినయంతో అర్ధించిన పంచపాండవుల సంస్కరాన్ని వారి తక్కువతనానికి ప్రతీకగా భావించి
ఎంతో పొగరుతో ఇవ్వనని అవమానించాడు.....
మంచివారు మంచిగ ఉన్నంతసేపే మంచివారు.......
వారిని అనవసరంగా బాధించి హింసించిన వారికి, ఆ మంచితనమే మహాశక్తిగా మారి దుర్మార్గులను సమూలంగా సమ్హరిస్తుంది......
అదే కాలం యొక్క గొప్పదనం......
అదే కాలస్వరూపమైన ఈశ్వరుడి యొక్క గొప్పదనం....
ఇవ్వాళ నీ చేతిలో అధికారం, ఐశ్వర్యం అన్నీ ఉండొచ్చు ఈశ్వరానుగ్రహంగా.....
కాని అవి నువ్వు వేటికోసం వెచ్చిస్తున్నావు అనే దానిపై అధారపడి ఉంటుంది నీ భవిష్యత్తు......
ఒళ్లు కొవ్వెక్కి మంది జీవితాల్లో అశాంతి కుంపట్లు రగిల్చి, ఒక కుటుంబంలో నిప్పులు పోసి సినిమా చూద్దాం అన్నట్టుగా మీ విద్వత్తును ఉపయోగిస్తే ఆ కౄరకర్మలను ఈశ్వరుడు కాల స్వరూపంగా ఎప్పుడు మీకు ఎట్లా అప్పజెప్పి బుద్ధిచెప్పాలో అట్లే చేసి మీకు కనువిప్పు కలిగిస్తాడు.....
శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో చాలా సింపుల్ గా చెప్పాలంటే
" పరోపకారమే పుణ్యం....పరపీడనమే పాపం....."
అంతే.....
నువ్వు నీదైన శైలిలో అతితెలివితో ఇతరుల జీవితాల జోలికి వెళ్ళి వాళ్ళ కన్నీళ్ళకు కారణమైనప్పుడు,
ఈశ్వరుడు తనదైన శైలిలో ఆ దుష్కర్మను కాలక్రమంలో పాపఫలితంగా నీతో అనుభవింపజేస్తాడు....
తద్వారా నీ పుణ్యం ఎంతో త్వరగా క్షయమై , మిగిలినదంతా పాపమే కాబట్టి ఏసీ కార్లల్లో బట్టలు నలగకుండా బ్రతికిన జీవితాలు, ఆ బాధితుల ఆక్రందనకు అల్లాడిపోయేలా చేస్తాడు ఈశ్వరుడు....
ఎవరి జీవిత నిర్ణయాలు వారు తీసుకుంటారు.....
అనాహ్వానితులుగా మీరు అనవసరంగా కలగచేసుకొని సద్గురువుల స్థానంలో ఉన్నట్టుగా ఇతరులను, వారి జీవితాలను ఇట్లే ఉండాలని శాసించడం మీకు తగదు.....
వారు నమ్ముకున్న సద్గురువులు వారికి ఎల్లవేళలా తమదైన జ్ఞ్యాన మార్గంలో వారిని కించపరచకుండా, బాధించకుండా దిశానిర్దేశం గావిస్తూనే ఉంటారు....
మీరు వారి జ్ఞ్యానమార్గానికి సైంధవుడిలా అడ్డుపడకుంటే అదే మీరు చేసే మహోపకారం...!
పొగరుతో ఇతరులను ఏ విధంగా ఇబ్బందిపెట్టి అడ్డుపడినా సరే,
శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో సైంధవుడికి పట్టిన గతే మీక్కూడా పడుతుంది.....
ఆనాడు ద్వాపరంలో భగవద్గీత గా తన జగద్గురుత్వాన్ని నిర్వహించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ.....
యుగభేదాన్ని అనుసరించి ఈశ్వరుడు తనదైన నామరూపాలతో భువికి దిగివచ్చి శరణాగతులను సమ్రక్షిస్తాడు కనుక,
ఇప్పటి ఈ 21వ శతాబ్దపు నవయుగ శ్రీకృష్ణపరమాత్మ యొక్క వాణి అనగా శ్రీ చాగంటి సద్గురువుల వాణియే ఎల్లరికి క్షేమదాయక సద్గురుత్వం......
ఎందుకంటే శ్రీ చాగంటి సద్గురువుల తత్త్వం, మనస్తత్త్వం, వ్యక్తిత్వం, గురించి ఒక్కమాటలో చెప్పాలంటే వారు ఒక చక్కని పూర్ణఫలవృక్షం వంటి వారు.....( కొబ్బరి చెట్టు )
పచ్చబంగారం గా లోకంలో ప్రసిద్ధి చెందిన కొబ్బరి చెట్టు వైభవం గురించి తెలియని వారుండరు కద....😊
అందుకే అస్మద్ గురుదేవులకు ఆ ఉపమానం చక్కగా ఉంటుందని భావించాను....
తన జీవితపర్యంతంలో, ఒక కొబ్బరి చెట్టు చేసే మేలు ఎల్లరికి విదితమే కదా...
భూమి పొరల్లో ఉన్న నీటిని గ్రహించి తను ఉన్న చోటిని సారవంతంగా మార్చుతుంది.....
చక్కని చల్లని ఆరోగ్యకరమైన గాలిని అందిస్తుంది....
అలసిన కళ్ళకు విశ్రాంతినందించే ఆకుపచ్చని కొబ్బరిమట్టలతో అలంక్రితమై ఉంటుంది....
కొబ్బరి బోండాల్లో ఎల్లరికి ఆరోగ్యదాయకమైన తియ్యని నీటిని అందిస్తుంది.....
( మనం చెట్టుకు ఉప్పునీటిని పోసినా సరే కొబ్బరి బోండాల్లో తియ్యని నీరే లభిస్తుంది....)
దేహదారుఢ్యానికి ఎంతో ఘనమైన ఆహారమైన కొబ్బరిని అందిస్తుంది.....
( మా ఇంట్లో చిన్నప్పుడు 9th క్లాస్ వరకు ఒక కొబ్బరి చెట్టు ఉండేది.....
మా అమ్మ నాటిన ఆ కొబ్బరి చెట్టు విరగకాసేది....
సాధారణంగా ఉండే ఎర్ర కొబ్బరి లా కాకుండా ఆ కొబ్బరి కాయల పెచ్చు నల్లగా ఉండేది.....
అసలు ఆ కొబ్బరి ఎంత తియ్యగా ఉండేదంటే కొబ్బరి లడ్డూల్లో చక్కెర కలపకుండానే తియ్యని లడ్డూలు చేసుకొని తినేవాళ్ళం....
ఇంట్లో పూసే వివిధ పూలు, కొబ్బరి కాయలు, దానిమ్మ కాయలు, జాంకాయలు.....ఇత్యాదివన్నీ
ఇంటికొచ్చే మా బస్తివాళ్ళందరికి తీసుకెళ్ళమని పంచేది మా అమ్మ ...
మిగతావి పెద్దగా పట్టించుకునే వాడిని కాదు కాని,
"ఆ కొబ్బరి బోండాలు మాత్రం అందరికి కాసినవి కాసినట్టే పంచేయకు....
నేను ఉన్నా కదా అన్నీ బోండాల పీచు ఒలిచి, కొబ్బరి నీళ్ళు మీకిచ్చి కొబ్బరి కాయలన్నీ లడ్డూలు చేసుకొని తినెయ్యడానికి....."
అని....నేను అసలు మా అమ్మ అలా అందరికి బోండాలు పంచిపెట్టడాన్ని సహించేవాడిని కాదు....
కొబ్బరి లడ్డూలంటే అంతగా ఇష్టం నాకు...
కొబ్బరిని అలా బాగ తినడానికి
కొబ్బరి బోండాల పీచును ఇంట్లో ఉన్న స్కౄడ్రైవర్ తోనే ఒలిచేసిన చేతులు కాబట్టి కొబ్బరి ఎన్ని రకాలుగా మనకు అనుగ్రహం ప్రసాదిస్తుందో అనేది నాకు చిన్నప్పుడే అవగతమైన సత్యం....
కొబ్బరి పీచుతో అప్పుడు మాకు ఉండే దోమల బెడదకు విరుగుడుగా రాత్రి 7 అవ్వగానే ఇంట్లో ఒక ఇనుపగంపలో కొంచెం కిరోసిన్ పోసి నిప్పంటించి పొగ పెట్టి, అది ఇల్లంతా ఆవరించి ఇంటిపైన ఉన్న రేకుల సందుల్లోనుండి పొగ బయటకు వచ్చినంక అప్పుడు తలుపులు తెరిసే వాళ్ళం....ఇంట్లోని దోమలన్నీ ఒక్క గంటలో దెబ్బకు చచ్చేవి.....
విరిగిన కొబ్బరి మట్టల ఆకులను చీరి చీపుర్లు చేసుకుంటే అవే ఒక సంవత్సరానికి సరిపోయేవి....
నేను ఆ కొబ్బరి ఆకులను చీరి మధ్యలో ఉన్న ఆ పుల్లలతో బాణాలు, ధనస్సు తయారు చేసి
రాబిన్హుడ్ లా అన్ని చెట్ల ఆకులపైకి బాణాలను సంధించి ఆడుకునే వాడిని....
మా చిన్ననాటి కొబ్బరి చెట్టుతో ఉన్న అనుబంధంతో
అలా కొబ్బరి చెట్టులోని అణువణువు మనకు ఉపకరించడం అనే సత్యం నాకు చిన్నప్పుడే గ్రాహ్యమైనందున నాకు కొబ్బరి చెట్టు తో శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల సద్వాక్కుల వైభవాన్ని పోల్చడం సబబు అనిపించింది....😊
ఎందుకంటే వారి ప్రవచనాంతర్గత సద్వాక్కుల వైభవం కూడా కొబ్బరి చెట్టు యొక్క వివిధ జనితములవలే ఎవ్వరు ఎంత శ్రద్ధతో ఒడిసిపట్టుకుంటారో వారికి కావలసిన ఐహిక పారామార్దిక లబ్ధికి అవి అంతగా అనుగ్రహమై వర్ధిల్లుతాయనేది నా గత దశాబ్ద కాల స్వానుభవ జీవిత సత్యం......!
ఇప్పటి ఈ కాలానికి, అప్పటి శ్రీ కంచి పరమాచార్య గారిలా,
ఎల్లరికి భగవద్ తత్త్వం యొక్క వైభవాన్ని అందించి శిష్యులందరి జీవితాల్లో ఆ ఈశ్వరానుగ్రహం శాశ్వత ఇష్టకామ్యార్ధ సిద్ధిని వర్షించేలా అనుగ్రహిస్తున్న ఈనాటి
శ్రీ చాగంటి సద్గురువుల్లో ఆనాటి శ్రీ కంచి మహాస్వామి వారిని దర్శిస్తు.....,
ఒకనాడు కాకినాడలో శిష్యులు శ్రీచాగంటి సద్గురువులను
'"నడిపించే దైవం" గా మిమ్మల్ని బిరుదాంకితులను చేసి పిలుచుకుంటాము ....' అని విన్నవిస్తే....
' "నడిచే దైవం" గా వినుతికెక్కిన శ్రీపరమాచార్యుల బిరుదు నామానికి దెగ్గరగా ఉండేలా మీరు అభిమానం కొలది అలా నన్ను పిలవాలనుకోవడం నేను అర్ధంచేసుకోగలను కాని అలా వద్దు....ఎప్పటిలానే గురువుగారు అని మాత్రమే పిలవండి....'
అని సున్నితంగా వారించినా,
అంతటి సహృదయ వైశాల్యమున్న శ్రీచాగంటి సద్గురువులు నిజంగానే ఈ 21వ శతాబ్దంలో మనకు ఈశ్వరానుగ్రహంగా ప్రసాదించబడిన నడిచే దైవమే అనేది శిష్యులెల్లరి హృదయ భావతరంగం అనేది అధ్యాత్మిక జగత్తుకి బాగా రూఢమైన సత్యమేకద...😊
శ్రీగురు పాదపద్మముల చెంత ఒక వినేయుడి చిరు కవనకుసుమాంజలిపూరిత సాష్టాంగప్రణామాలు....🙏😊💐🌷🌹🌼🌸🏵💮🌻
No comments:
Post a Comment