అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి గారితో,
" ఈ భరతభూమి యొక్క సర్వోన్నతమైన శాసక పదవిలో ఉన్న నేను మీకు ఏ విధంగా సహాయపడగలనో సెలవివ్వండి....." అని సంభాషించి.....
" మీ అభిమానం చాలు....నాకు అదే చాలా సంతోషకరం....."
అనేలా సమాధానం పొంది, శ్రీచాగంటి సద్గురువులకు అభిమానపాత్రులైన ఉన్నతమైన వ్యక్తిత్వసంపన్నులుగా,
భారతదేశమే కాకుండా యావద్ ప్రపంచ యవనికపై తమ సాటిలేని రాజనీతిజ్ఞ్యతతతో చెరగని ముద్ర వేసిన అనన్యసామాన్యమైన బహుభాషా కోవిదుడు, సాహితీ స్రష్ట, అన్నిటినీ మించి తమ అధికారంతో కొన్ని కోట్లమంది భారతీయులకు ఇవ్వాళ ఒక సుస్థిరమైన, ఆర్ధిక పరిపుష్టికలిగిన భారతావనిని అందించిన మహర్షి.....!
కాసులతో బొజ్జలు బాగా బరువెక్కిన అపర కుబేరులకు మాత్రమే కాకుండా,
వారి యొక్క దూరదృష్టి తో సగటు మధ్యతరగతి సామాన్య మానవుడికి కూడా తగు రీతిలో లాభదాయకంగా ఉండేలా ఇవ్వాళ మనం చూస్తున్న ఒక భవ్య నవ్యభారతానికి నాంది పలికిన ఎన్నెన్నో ధీటైన ఆర్ధిక, పరిపాలక, విదేశిప్రత్యక్షపెట్టుబడుల (FDIs) సంస్కరణలకు పునాది వేసిన బహుముఖ ప్రజ్ఞ్యాశాలి గా మాత్రమే కాకుండా ఎంతో అనుభవశాలిగా కేంద్రంలో బహుకోణాల్లో సామాన్య జనులకు ఉపయుక్తంగా ఉండేలా ఈ దేశ శాసనాలు సరిదిద్దబడేలా చక్రం తిప్పిన తెలుగు తేజం.....తెలంగాణ వజ్రం....
శ్రీ పి.వి.నరసిమ్హారావ్ గారు......
వారి పేరులో ఎంత రాజసమో, వారి
వ్యూహాత్మక చతురతభరిత సంక్లిష్ట కార్యనిర్వాహక శైలి కూడా అంతే రాజసభరితంగా ఉండేదని అనుభవజ్ఞ్యులైన మన పెద్దలెందరో చర్చించుకోవడం ఎంతో మందికి ఎరుకలో ఉన్న విషయమే....
రాజకీయాల్లోకి ఎందరో పెద్దలు ( కేవలం వయసు రీత్యా ) వచ్చేది కోట్లు పోగెయ్యడానికి, తమ తర్వాత ఒక వంద తరాలాకు సరిపడేలా భూములు, ధనకనకవస్తువాహనాలు, ఇత్యాది లౌకిక సంపదలను కూడబెట్టి అందరిలో ఒకరిలా ఒకనాడు నిష్క్రమించడానికి......
కాని కొందరు పెద్దలు ( వారి సద్గుణ సాంద్రత రీత్యా ) రాజకీయాల్లోకి వచ్చేది, ఎన్నెన్నో మంచి పనులు చేసి సామాన్య జనబాహుళ్యానికి అభిమానపాత్రులైన నాయకులుగా గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించేలా తమ యశోచంద్రికలు ఆచంద్రతారార్కమై నిలిచి ఎల్లరిచే నమస్కరించబడే వ్యక్తిత్వ సంపన్నులుగా చిరస్మరణీయులై శాశ్వతకీర్తికాయులై ప్రజల హృదయసీమల్లో జీవించడానికి....
అటువంటి వారి కోవకి చెందిన వారు శ్రీ పి.వి గారు...
తమ పేరుతో ఒక శిలాఫలకం అక్కడ ఉంటుంది కాబట్టి, అప్పటివరకు ఎందరో వచ్చి ఏమేమో సంక్షేమ కార్యక్రమాలకు పునాది రాళ్ళు వేసామని చెప్తారు....
కాని అవి ఎన్నో సంవత్సరాలకు గాని
కనీసం ప్రారంభానికి కూడా నోచుకోవు.....
కొందరు సంక్షేమమే ధ్యేయంగా పథకాలు రచించి ప్రారంభిస్తే కేవలం పునాదిరాళ్ళే కాదు, అవి ప్రారంభించబడి అనతికాలం లోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చి వారే మళ్ళి ముఖ్య ఆహ్వానితులుగా వచ్చి వాటియొక్క జయోత్సవాల్లో పాల్గొనేలా ఉంటుంది వారి కార్యనిర్వాహక దక్షత.....
అప్పటివరకు ఎండిపోయిన చెరువులు, తటాకాలు, పంట కాలువలు, బావులు, రిసర్వాయర్లు,........
కొందరు అధికారంలోకి వచ్చిన తదనంతరం
చెరువులు అలుగు పారడం,
కాలువలు జీవనదుల పాయలు గా ప్రవహించడం,
రిసర్వాయర్లు నిండుకుండళ్ళా తొణికిసలాడడం,
రైతులకు, ప్రజలకు దాహార్తి లేకుండా రాజ్యం సుభిక్షంగా ఉండడం మనం గమనించవచ్చు......
మరి ఎందుకు ఇంతకు ముందు అలా సంక్షేమధ్యేయంగా వాటి నిర్వహణ జరగలేదు అంటే....
అది ఎల్లరికి తెలిసిన విషయమే....
సంక్షేమం పట్ల హృదయాంతర్గత జనిత శ్రద్ధాసక్తుల లేమితో,
వారి ఇళ్ళకు కోట్లకు కోట్ల కమీషన్ల కట్టలు సమకూరనందుకు,
సామాన్య ప్రజానాడిని గ్రహించి మసలుకోవడంలోని అనుభవరాహిత్యం,
వెరసి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అనేలా ప్రాజెక్ట్లు, సంస్కరణలు, ఎప్పటిమాదిరే మరొకరి కోసం ఎదురుచూస్తు ఉండే స్థితిలోనే ఉండడం....
కాబట్టి ఇక్కడ ఆ అధికారం అనే అత్యున్నతమైన శక్తి కలిగి కూడా నిర్దేశిత సామాన్య ప్రజా సంక్షేమం అనే విహిత ధర్మాన్ని మరచి కేవలం వచ్చామా, కొన్నాళ్లో కొన్నేళ్ళో ఉన్నామా, నిష్క్రమించామా......
అనేలా ఉన్న సామాన్య మాన్యులకు.....,
మరియు
ఆ అధికారం అనే అత్యున్నతమైన శక్తి లభించిన పిదప నిర్దేశిత సామాన్య ప్రజా సంక్షేమం అనే విహిత ధర్మాన్ని ఎంతో శ్లాఘనీయమైన విధంగా నిర్వహించి,
వచ్చామా, కొన్నేళ్ళకే కాక తరతరాలకు సరిపడేలా ఎల్లరిచే నమస్కరించబడే రీతిలో ఉన్న దీక్షాదక్షతతో సాగిన కార్యనిర్వాహక పేరుప్రఖ్యాతలతో
ఎప్పటికి గుర్తుండి పోయేలా ఉన్నామా అనేలా ఉన్న అసామాన్య మాన్యులకు.....,
భేదం ఎక్కడ ఉంటుంది అంటే....
వారి చిత్తశుద్ధిలో....అంతే కద....
అటువంటి చిత్తశుద్ధి భరిత ప్రధానమంత్రుల్లో ఒకరిగా పేరు గడించిన నిరుపమాన మాన్యులు శ్రీ పీ.వీ నరసిమ్హరావ్ గారు.....
గ్లోబలైజేషన్ అనే ప్రక్రియను ఈ దేశ సర్వతోముఖాభివృద్ధికి, సుస్థిర ప్రగతికి ఒక సోపానంగా మలిచి తద్ ఫలాలను ఇప్పటి భావి తరాలు అందుకునే రీతిలో అప్పుడే రాజకీయ సేద్యం గావించిన అసామాన్య కృషీవలులు శ్రీ. పి.వి గారు....
ఒక శరీరానికి ఆరోగ్య ప్రదాయక ఆహార సంవృద్ధి ఎంతగా అవసరమో.....
దురితకాల ఆటుపోట్లను తట్టుకొని నిలిచి ఉండేలా ఎంతో ధృఢమైన రోగనిరోధక శక్తి కూడా అంతే అవసరం.....
అట్లే,
ఒక దేశానికి ఆర్ధిక పరిపుష్టిని కలిగించే సంస్కరణల నిర్వహణ ఎంత ముఖ్యమో...,
ఇతర దేశాల అవాకులు చవాకులకు
ధీటైన రీతిలో ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా సమాధానం ఇవ్వాలో అలా ఇచ్చే విధంగా దేశం యొక్క రక్షణ వ్యవస్థను అణుశక్తితో జతపరిచి భరతభూమి వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా ఎవరు చేయకుండా ఉండే రీతిలో భారత అణ్వాయుధ శక్తి సామర్ధ్యాలకు నూతన జవసత్వాలను అందించి ఈ దేశానికి ఎంతో దృఢమైన వజ్రసదృశమైన రక్షణ కవచాన్ని సమకూర్చిన రాజకీయ విశ్వకర్మ గా
శ్రీ పి.వి నరసిమ్హారావ్ గారిని అభివర్నించడం అతిశయోక్తి కానేరదు.....
మన ఉన్నతిని చూసి ఓర్వలేని కృరాత్ములు మన చుట్టూ వందమంది ఉన్నాసరే, ఆఖరికి వారు మనవారు అనబడే వరైనాసరే,
సహృదయులకు ఈశ్వరుడు ఎల్లప్పుడు ఒక మహాత్ముని బాసటను అందిస్తాడు అనే సత్యం శ్రీ పి.వి గారి జీవితంలో కూడా ఎల్లరు గమనించవచ్చు.....
సొంత కూటమి వారే శ్రీ పి.వి గారి
ప్రజాదరణను ఓర్వలేక వారికి సహాయ సహకారాలు అందివ్వడంలో విఫలమై ఉన్న పరిస్థితుల్లో,
మరో మహాత్ములు శ్రీ అబ్దుల్ కలాం గారి బాసటను ఈశ్వరుడు వారికి అందించి,
స్వామికార్యం, స్వకార్యం రెంటికి కూడా ఇబ్బంది కలగని రీతిలో ఎంతో ఘనమైన చాణక్యంతో దేశప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇవ్వబడేలా తమ రాజకీయ ప్రస్థానాన్ని సాగించి, దైన్యంతో సతమతమవుతున్న భారతదేశ రాజకీయ ఎడారి జీవితంలో, ఎన్నెన్నో ఒయాసిస్ లను ఏర్పాటు చేసి వాటితో అభివృద్ధి ఫలాలను ఈ దేశం అందుకొని నిలిచి గెలిచేలా సుస్థిర భారతదేశానికి నవజీవితాన్ని ప్రసాదించిన ఆరితేరిన రాజనీతికళాదురంధరులైన, అమరజీవి శ్రీ పి.వి నరసిమ్హారావ్ గారు.....
వారి సమయస్ఫూర్తిభరిత చారిత్రాత్మక నిర్ణయాలకు ఈ దేశం వారికి సదా ఋణపడిఉంటుంది అనేది జగద్విదితమైన సత్యం.....
వారి అపారమైన కృషికి తగు రీతిలో గౌరవమర్యాదను ఆపాదించే భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం " భారతరత్న " వారికి త్వరలోనే ప్రసాదించబడాలని అభిలషిస్తు వారి శతజయంతి ఉత్సవాలు ఎల్లరికి ఆదర్శదాయకమై వర్ధిల్లుగాక.....🙏😊
No comments:
Post a Comment