Saturday, October 9, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సర శరన్నవరాత్రోత్సవ / శ్రీవారి వార్షిక తిరుమల బ్రహ్మోత్సవ శుభాభినందనలు....😊🍕🍨💐

శరన్నవరాత్రాంతర్గత ఆదిపరాశక్తి ఆరాధనలో ముఖ్యంగా చాలామంది భక్తులు పాటించేది నవదుర్గా ఆరాధన సంప్రదాయం....

నవదుర్గాస్తోత్రంతో అమ్మవారిని ఎంతో భక్తి ప్రపత్తులతో ఆరాధించి అనుగ్రహాన్ని బడసి తరించడం చాలా విశేషమైనదిగా మన పెద్దలు మనకు ఈ సంప్రదాయాన్ని అందించినారు....

మరెన్నో ఇతర శక్తివంతమైన స్తోత్రాలు అనగా...
శ్రీదేవిఖడ్గమాలాస్తోత్రం, మహిషాసురమర్దిని స్తోత్రం,
శ్రీదుర్గస్తుతి, అష్టాదశశక్తిపీఠస్తోత్రం, ఏకాదశజ్యోతిర్లింగ స్తోత్రం, అన్నపూర్ణాష్టకం, శ్రీదుర్గాసప్తశతి పారయణ ఫలప్రదాయక అర్గళాస్తోత్రం, ఇత్యాదిగా ఎన్నెన్నో శక్తివంతమైన ఋషిప్రోక్త స్తోత్రాలను అనుసంధించి ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహవీక్షణలను ప్రసరింపజేసుకొని తరించడం అనేది అనాదిగా ఈ దేవభూమిపై పరిఢవిల్లుతున్న సంస్కృతి సదాచారం...

"
అసలు ఈ నవదుర్గలెవరు, ఇంతమంది దుర్గలు, వివిధ దేవుళ్ళు, వీళ్ళ వివిధ క్లాసిఫికేషన్లు, అసలు ఇదంతా ఏంటి...
మళ్ళీ అందరు దేవుళ్ళూ ఒక్కటే...పరమాత్మ తత్త్వం ఒక్కటే...ఎవరిని ఆశ్రయించినా లభించే శ్రేయస్సు ఒక్కటే....
అంటూ కన్ఫ్యూస్ చేయడం ఏంటి... "

అనేలా ఉండే వాదనలు ఎప్పుడో ఎక్కడో
ఎవరి దెగ్గరో వినే ఉంటారు....

దేవతల వివిధ క్లాసిఫికేషన్ లో ఉండే అర్ధపరమార్ధాల వరకు ఎందుకులే కాని మన లౌకిక వ్యవస్థల్లో ఉండే ఎగ్సాపుల్స్ తో ఈ భిన్నత్వం లోని ఏకత్వం ఏంటో వివరిస్తా...

మనం రోజు టీ.వీ ల్లో చూసే న్యూస్ ని విని కొందరు ఏకంగా మా నాయకుడిని అట్లంటవ.....మా హీరో ని ఇట్లంటవ....అంటూ తెగ ఫీల్ అయిపోతు వారు ప్రశాంతంగా ఉండరు...వారి చుట్టూ ఉండే వారిని ప్రశాంతంగా ఉండనివ్వరు...

"మన ముందు మీడియాలో వాళ్ళు ఏమేమనుకున్నా సరే, ఎట్లున్నా సరే, తెర వెనక వాళ్ళందరూ
కలిసే ఉంటారు కాబట్టి మనం అయోమయంలో పడి మన ప్రశాంతతను కోల్పోవడంలో అర్ధం లేదు..."
అని తెలుసుకునేంతటి స్థాయికి ఇంకా సదరు వ్యక్తి / సమూహం బౌద్ధికంగా ఎదగలేదు కాబట్టి అట్లా అశాంతితో ఉంటారు అనేది వాస్తవం....

" రెయ్ బావా...కొత్త జిమ్మాస్టర్ ని పెట్కున్నవ...?
నీ సిల్కి సిల్కి హేరు... పేపర్ దోశ లాంటి సన్నని నీ కొత్త స్లిం సిక్స్పాక్ బాడి, నీ వెరైటి డాన్స్ స్టెప్పులు, నీ అదరగొట్టే ఫైటింగ్ సీన్లు, అదిరే పంచులు...అసల్ ఎట్లుండేవాడివి ఎట్లైనవ్ మామ...
మా ఇంటికి కూడ ఆ జిమ్మాస్టర్ ని పంపు...నా నెక్స్ట్ సినిమాకి నీలా తయార్ అవుతా..."

అని గుసగుసలాడుకునే ఇద్దరు హీరోలకు లేని భేషజాలు....
ఏదో ఒక విషయానికి బట్టలు చించుకుంటూ నానా రభస చేసే వారి అభిమానా సంఘాలకు ఎందుకో అర్ధం కాదు.......

"అన్నా ఎట్లున్నవే....ఎన్ని దినాలైంది మనం ఇట్ల కూసొని ముచ్చట్లు పెట్ట్కొని...ఏడికి పొయినా ఈ మీడియా వాళ్ళ లొల్లి ఒకటి...ప్రశాంతంగా ఉండనివ్వరు....ఫోన్లల్ల ముచ్చట్లు పెడ్దామంటే ఎవరు ఎవరి ఫోన్ టాపింగ్ చేస్తున్రో తెలవదాయే....
హుం....
మొన్న గా సభలో గంతగనం తిట్టినవేమే నన్ను...ఇంట్ల టీ.వీ లో చూసి మా పోరలు పరేషానైతున్రు....
సరేగాని...
మీ సీ.ఎం సాబ్ కి చెప్పి గా 5 ఎకరాల సంగతి ఏందో సూష్నవా లేదా....మా పోరలు ఏదో ఇంజనీరింగు కాలేజ్ పెట్టుకుంటరటనే.... పని జర జల్దిగ అయ్యెట్టు చూడ్రాదే...."

"....ఆ ఏముమ్నదే ఏదో గిట్లున్నం...మంత్రి పదవొస్తె 5 ఏండ్లల్ల ఇంకో వంద కోట్లు సంపాయిస్తుంటి... దానికోసమె అట్ల ఎదురు జూస్తూ ఉన్న.....
ఆ ఏముంది...సభలో ఆమాత్రం నిన్ను తిట్టకుంటే నాకు యిజిల్లు ఎట్లేస్తరే జనాలు...
యాద్మర్సిన....ఆ 5 ఎకరాల పని అయిపోయిందె...
నమ్మకస్తుడైన ఒక పోరన్ని మా బావింటికాడికి పంపు...పేపర్లన్నీ గాన్నే ఉన్నై...సరేనా..."

అని ఒక బిగ్షాట్ ఏర్పాటు చేసిన ఫంక్షన్ల కలుసుకున్నప్పుడు ముచ్చట్లు పెట్టుకునే ఇద్దరు రాజకీయ నాయకుల గురించి వారికి చెందిన వర్గాల వారు ఏదో చిన్న విషయం గురించి ఒకరినికరు తిట్టుకుంటూ ఉండడం చూసే ఉంటారు....

కాబట్టి బయటకి ఏవో భేదాలు ఉన్నట్టుగా కనిపించినంత మాత్రాన అది వేరు...ఇది వేరు...
వారు వేరు...వీరు వేరు...
అని అనుకోవడంలో మన ప్రశాంతతను మనం పాడు చేసుకోవడమా....లేదా
ఈశ్వరానుగ్రహంతో సత్యద్రష్టలై
ఒక్కో ప్రయోజనం సిద్ధింపబడడానికి, ఒక్కో వ్యవస్థలోని ఒక్కో పదవికి తగ్గట్టుగా ఉండడానికి, అలా ఒక్కొకరు ఒక్కోలా విభిన్నంగా కనిపించినా అందరు ఒక్కటే అని తెలుసుకొని...

శ్రీచాగంటి సద్గురువులు నుడివేట్టుగా
" ఉద్ధరేత్ ఆత్మనాత్మానం " మనల్ని మనం ఉద్ధరించుకోవడంతో బాగుపడ్తామ అనేది వారి వారి విచక్షణకు, వివేకానికి, బౌద్ధిక పరిపక్వతకు సంబంధించిన అంశం....

అత్యంత శక్తివంతమైన శ్రీదుర్గా సూక్తం వివరించే ఆదిపరాశక్తి వైభవాన్ని. మీరు గమనిస్తే....

"
తామగ్నివ’ర్ణాం తప’సా జ్వలంతీం వై’రోచనీం క’ర్మఫలేషు జుష్టా”మ్ |
దుర్గాం దేవీగ్‍మ్ శర’ణమహం ప్రప’ద్యే సుతర’సి తరసే’ నమః’ ||
"

"అగ్ని సదృశమైన తైజసిక దేహంతో జ్వలించే ఓ ఆదిపరాశక్తి...."

అంటూ కీర్తింపబడింది ఆ పరదైవం...

" అగ్ని " అన్నప్ప్పుడు.....ఎన్నో విధాలుగా ఉండే అగ్నిలో

ఏ అగ్ని...?

" చిదగ్నికుండసంభూత దేవకార్యసముద్యతా..." లో ఉండే చిత్ అగ్ని యా..?

"అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం...."

లో ఉండే వైశ్వానరాగ్ని యా..?

"అగ్నిమీళేపురోహితం యజ్ఞ్యస్యదేవఋత్విజం...." లో ఉండే యాగాజ్ఞి యా...?

" నేను ఒకసారి శ్రీశైలం యాత్రలో ఉండగా చూసి ఆశ్చర్యం చెందాను..."
అంటూ శ్రీ చాగంటి సద్గురువులు వివరించిన
" దావానలం " లోని అగ్ని యా ?

"
కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా..
సమయం సరదా పడితే సమరంలో గెలిచెస్తా...
నె ఫెల ఫెల ఉరుమై ఉరుముతు..
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతు..
పెను నిప్పై నివురును చీల్చుతు..
జడివానై నె కలబడతా..
"

అని విశ్వ గారి కలం నుండి జాలువారిన అతడు సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ లో చెప్పబడిన ప్రాకృతిక ఉరుములు, మెరుపులు, పిడుగులు లలో ఉండే అగ్ని యా..?

"సముద్రాలను సైతం శుష్కింపజేయగల
బడబాగ్ని నాలో ఉంది....నాతో పెట్టుకుంటే మాడి మసైపోతావ్రరై..."

అనేలా ఉండే సినిమా డైలాగ్స్ లో చెప్పబడే సముద్రంలోని అగ్ని యా..?

ఐఫిల్ టవర్ ను కూడా అట్టే కరిగించే అగ్ని పర్వతాలలో ఉండే లావాగ్ని యా ?

ఇలా...
ఏ అగ్ని...? అనే ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఏంటి..??

" ఒక్కో అగ్నిది ఒక్కో స్పెషాలిటి...
కాని అన్ని కూడా అగ్ని స్వరూపాలే..."
అని మాత్రమే చెప్పగలము....కద...

"అదే విధంగా తైజసాత్మిక దేహులైన దేవతలు కూడా వివిధ నామరూపాలతో, వివిధ వర్ణనలతో,
వివిధ ప్రత్యేకతలతో, వివిధ ప్రయోజనాలకు  వివిధ భక్తులచే వివిధ రీతుల ఆరాధింపబడే విశేషమైన ఒక వైశ్విక వ్యవస్థాంతర్భగామైన శక్తి కేంద్రాలు...." ​

అని మాత్రమే నిర్వచింపగలం...కద...

లౌకికమైన ఎనర్జి సిస్టంస్ ని ఇన్ని కిలోజౌల్స్ అని లెక్కేసి మేయపరచగలం....

లౌకికమైన లైట్ / కాంతి ప్రసరణ సిస్టంస్ ని ఇన్ని ల్యూమెన్స్ అని లెక్కేసి మేయపరచగలం...

లౌకికమైన ఉష్ణకారకాలను ఇంత సెంటిగ్రేడ్ /
ఫారెన్హీట్ అని మేయపరచగలం...

మరి అలౌకికమైన ఎనర్జి, కాంతి, ఉష్ణము, రూపము, ఇత్యాదుల సమ్మిళిత సమాహరా స్వరూపాలైన దేవతాశక్తులను ఏమని మేయపరచగలము...??

ఎవ్విధంగాను మేయపరచలేని శక్తి కాబట్టే అది దేవతా శక్తి / పరమాత్మ శక్తి / పరతత్వము గా అనాదిగా విజ్ఞ్యులచే స్తుతింపబడి నమస్కరింపబడి అనుగ్రహమును సముపార్జింపబడి సూచింపబడుతున్నది...

అట్లా సూచింపబడే ఆ పరతత్త్వము ఎంతో దూరాల నుండి అందేంత దూరంలో బాగా దెగ్గరగా శ్రీవేంకటగిరిపై శ్రీశ్రీనివాస పరదైవమై కొలువై ఉండగా....

"భావనామాత్రసంతుష్టాయై నమః..." అని ఆదిపరాశక్తిని శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా....

"పరమాత్ముడితడె భావించరో..."

అని శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు
" ఇతనికంటే ఘనులికలేరు..."
అనే సంకీర్తనలో ఆ శ్రీవేంకటపరతత్త్వమును బహుధా స్తుతించినారు....

2021 సాలకట్ల బ్రహ్మోత్సవాంతర్గత 5దవ వాహనసేవగా సాగే ముచ్చటైన ముత్యపుపందిరి వాహనసేవకు ఆ శ్రీభూసమేత శ్రీమలయప్పస్వామి గా పరమాత్మ తయారు అవుతున్న శుభవేళ...
అందరము స్వఛ్చమైన ముత్యంలాంటి మనసుతో ఆ పరమాత్మను భావించి సేవించి ముక్తినిబడసే మజిలీలకు మన జన్మపరంపరలు మరింత దెగ్గరయ్యేలా ఈశ్వరానుగ్రహన్ని అపేక్షిస్తూ జీవించడంలో ఉండే జీవనసాఫల్యతను గుర్తించి గౌరవించి తరిద్దాం....

శ్రీవేంకటేశపరబ్రహ్మణేనమః....🙏🙏🙏🙏🙏😊💐🍨

http://annamacharya-lyrics.blogspot.com/2008/09/531-itanikamte-ghanulikaleru.html?m=1


No comments:

Post a Comment