Thursday, March 16, 2023

శ్రీ వాణీజయరాం గారి పరలోక ప్రయాణం ఈశ్వరానుగ్రహంతో ప్రశాంతంగా సాగాలని ప్రార్ధిస్తూ వారికి ఒక సుసంగీతసాహిత్యాభిమాని యొక్క చిరు అక్షరనివాళి....🙏💐

శ్రీ వాణీజయరాం గారు ఎంతో హృద్యంగా ఆలపించిన ఆణిముత్యాల్లాంటి తెలుగు పాటల్లో ఒక మేటి ఆలాపనగా ఖ్యాతిగడించిన "ఆనతినీయరా హరా..." అనే స్వాతికిరణం చిత్రంలోని అజారమరమైన పాటలోని భావాన్ని ప్రతిబింబిస్తూ వెలువడిన ఈ శీర్షిక లో వారి గాత్రప్రస్థానం యొక్క వైభవం చాలా గొప్పగా వర్నింపబడింది....

కొందరు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కోవిధంగా సిద్ధహస్తులై ఉండడం మనం లోకంలో గమనించవచ్చు....

అటువంటి ఉత్తముల కోవకు చెందిన అగ్రశ్రేణి గాయనీమణిగా వాణీ జయరాం గారిని అభివర్నించడం అతిశయోక్తి కానేరదు.....

గంధర్వశ్రేణి స్వరశుద్ధి, మేటి కర్ణాటక సంగీత విద్వత్తు, తారాస్థాయిలోని ఆలాపనలను కూడా అలవోకగా ఆలపించగల గాత్రనైపుణ్యం కలగలిస్తే శ్రీ వాణీ జయరాం గారు అనే ప్రఖ్యాత భారత గాయనీమణి..!

వారి కాలంలోని ఇతర వర్ధమాన గాయకులతో పోల్చుకుంటే
వారు తెలుగులో పాడినపాటలు కొన్నే అయినా....పాడిన పాటల్లా అమరగానంలా కీర్తిగడించిన వారి తెలుగుసినీసంగీత పయనం ఎప్పటికీ ఎందరో సంగీతాభిమానుల హృదయాల్లో
నిలిచిఉండే మేటి సంగీత స్వరార్ణవం....

"అందెలరవమిది పదములదా......" అనే స్వర్ణకమలం చిత్రంలోని వారి ఆలాపనకు దాసోహం కాని సంగీతాభిమానులు ఉండరు.....
ఆనాడు మహాకవి శ్రీధూర్జటి గారి కవన ఆర్భటి ఎట్లుండెనో ఏమో కాని ఈ పాటలో వాణిజయరాం గారి స్వరవిన్యాసం మాత్రం ఖగోళాలు వారి స్వరపేటిక జనిత పదకింకిణులై పదిదిక్కుల ఆర్భటి రేగిన రాగరంజితమైన ఆలాపనగా తెలుగు సినీజగత్తులో శాశ్వతత్వాన్ని గడించిన అరుదైన పాటల్లో ఒకటిగా నిలిచిన వైనం ఇప్పటికీ ఎల్లరూ వినగలిగే గొప్పదనమే కద....

కవులకు, కళాకారులకు నిర్యాణం భౌతికంగా మాత్రమే.....
వారి సృజనాత్మక కళాఖండాల రూపంలో వారు ఎప్పటికీ చిరంజీవులే అనేది పెద్దల మాట......

శ్రీ వాణీజయరాం గారి పరలోక ప్రయాణం ఈశ్వరానుగ్రహంతో ప్రశాంతంగా సాగాలని ప్రార్ధిస్తూ వారికి ఒక సుసంగీతసాహిత్యాభిమాని యొక్క చిరు అక్షరనివాళి....🙏💐

No comments:

Post a Comment