Thursday, March 16, 2023

శ్రీకరమైన అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ శుభాభినందనలు.....🙂🍨💐🍦🍿🍧🎂🍕


ప్రేమ్నగర్ (1971) చిత్రం లో,
కె.వి. మహదేవన్ గారి సంగీత దర్శకత్వంలో, ఆచార్య ఆత్రేయ గారి సాహిత్యానికి శ్రీ ఘంటసాల గారు రంగరించిన స్వరలహరుల్లో ఊయలలూగిన అమరగానం లా ఇప్పటికీ ఎంతో మంది తెలుగు భాషాభిమానులకు ఈ క్రింది పాట బాగా గుర్తుండే ఉంటుంది.....

తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా
తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా
కదలి వచ్చింది.. కన్నె అప్సరా...
వచ్చి నిలిచింది.. కనుల ముందరా...

తెల్లవారే జామున నింగి నుండి జాలువారే లేలేత అరుణోదయ ప్రభల సౌందర్యంలా......
ఎంతో వైభవంతో పరమాత్మ యొక్క ఊరెరిగింపులో ముందుకు సాగే ఒక తేరు/రథం యొక్క గాంభీర్యం లా...
వైవిధ్యభరిత సంగీత స్వరఝరులను సృజిస్తూ గలగల సాగిపోయే సెలయేటి సవ్వడిలా....

అంటూ వివిధ గొప్పగొప్ప ఉపమానాలతో కూడిఉన్న ఒకానొక రచనలో కొలువైన 
"తేటతేట తెలుగులా...." అనే ఉపమానం మన తెలుగు భాష యొక్క సౌందర్యానికి, గాంభీర్యానికి, వినసొంపైన స్వరమధురిమకు పెట్టింది పేరుగా ఎల్లరూ భావించడం కద్దు....

ఆంధ్రము అంతటి అమృతమయమైన ఆనందరసస్ఫోరకమైన భాష కాబట్టే ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయలవారు 
"దేశభాషలందు తెలుగు లెస్స...."
అనే కితాబుతో తెలుగు భాషకు పట్టంకట్టారు....

ఆదికవి శ్రీనన్నయ గారి నుండి ఈనాటి నవతరంలోని ఆధునిక సమాజంలో కొలువైన ఎందరో విద్వణ్మూర్తులవరకు......
తెలుంగుసీమగా, ఆంధ్రదేశముగా ఖ్యాతిగడించిన 
తెలుగునాడులో ప్రభవించిన సాహితీ మహారసార్ణవములు కోకొల్లలు....

అటువంటి ఉత్తమోత్తమ కవికులతిలకులుగా, 
అత్యున్నతమైన పాండిత్య ప్రౌఢిమతో అలరారే స్థాయిలో ఉంటూనే సకలజనరంజితమైన శైలిలో రచనలు కావించి "సహజకవి" గా వినుతికెక్కిన......
శ్రీ బమ్మెర పోతనామాత్యులంతటి మహనీయులే సంస్కృతమూలం లో శ్రీవేదవ్యాసుల వారిచే అనుగ్రహింపబడిన శ్రీమద్భాగవత గ్రంథరాజమును
ఆంధ్రీకరించడం వారి జన్మజన్మల సౌభాగ్యంగా చెప్పుకున్నారు.....

ఎంతో గహనమైన, గంభీరమైన, క్లిష్టమైన, వివిధ 
సంస్కృతబీజాక్షర జనిత శక్తిపుంజములను.....
ఎంతో రమణీయమైన అలతి అలతి తెలుగు పదాల్లోకి క్రోడీకరించి, అచ్చతెనుగు సరళ పద్యాలుగా భక్తలోకానికి అందించి, తెలుగు భాషకు శాశ్వతమైన దైవత్వాన్ని అలదిన చిరస్మరణీయ మహనీయులుగా శ్రీపోతనామాత్యులవారు ఎప్పటికీ తెలుగు కవుల హృదయడోలికల్లో కొలువైఉండే తెలుగుభాషాభారతీ వరిష్టులు.....

మరలా అంతటి దైవిక మహత్తును తెలుగు భాషకు అలదిన అగ్రగణ్యుల్లోని అమరసాహితీ స్రష్టలు,
పదకవితాపితామహులు, 
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు.
మరియు
కవిరాజత్రయంలోని మిగతా ఇద్దరు అనగా....,
సద్గురు త్యాగయ్య గా వినుతికెక్కిన శ్రీ కాకర్ల త్యాగబ్రహ్మం గారు, మరియు భద్రాచల శ్రీరామదాసు గా బిరుదాంకితులైన కంచర్ల గోపన్న గారు.....

ఎవరి శైలి వారిది....ఎవరి మహత్తు వారిది...ఎవరి సిద్ధాంతం వారిది....ఎవరి సృజనాత్మకశైలి వారిది.....
ఇవ్విధంగా బహుముఖప్రజ్ఞ్యాశాలురుగా జీవించిన ఎందరో మాన్యులు వారి వారి తెనుగుభాషాభారతీ అనుగ్రహమైన మేటి సాహితీసృజనలతో అమరజీవులై ఇప్పటికీ మనందరిచే ఆరాధ్యులై చిరంజీవులైన కళాకారులుగా వర్ధిల్లే కోవిదులుగా ఖ్యాతిగడించారు....

వారి అత్యున్నతమైన మహత్తరమైన దైవిక రచనలను మనుష్యాధములకు అంకితమివ్వరాదని చెప్పబడుతూ ఏకంగా సరస్వతీదేవితోనే ప్రత్యక్షంగా సంభాషించిన సార్ధకపుణ్యజీవులైన శ్రీపోతనామాత్యులకు ఒకానొక సందర్భంలో ఎలా రాయాలో తెలియక కొద్దికాలం వారి సిద్ధహస్తంలోని ఘంటం ఆగినప్పుడు ఏకంగా శ్రీరాములవారే వారి ఇంటికి ఏతెంచి వారి కుమార్తెతో సంభాషించి...
"అల వైకుంఠపురములో...." అనే పద్యాన్ని వారే స్వయంగా రచించడం తో....
ఆ పద్యం ఈనాటికి కూడా లోకంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పద్యరాజంగా వినుతికెక్కడం ఎందరో మాన్యులకు తెలిసిన విషయం....

ఎప్పుడూ చూసినా ధనస్సును చేబూని సాక్షాత్కరించే కోదండరాముడు ఒక్కసారిగా ఘంటం చేతబూనగానే ఎంతటి ఆశ్చర్యకరమైన, కవనశక్తిస్ఫోరకమైన భావుకతాభరిత తెలుగు పద్యాలు వెలువడినాయో కద....!
(ఆ మహత్తరమైన పద్యంలోని మొదటి రెండుపదాలను సినిమా పేరుగా పెట్టుకున్నందుకు మన బన్ని నటించిన 
"అల వైకుంఠపురములో...." అనే సినిమా బాక్స్ ఆఫీస్లో ఏరేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.....)

"చాలదా బ్రహ్మమిది సంకీర్తనం..."
అంటూ మహత్తరమైన తెనుగు సంకీర్తనలను బ్రహ్మపదార్ధముగా వెలయించిన అనన్యసామాన్యమైన శ్రీవేంకటహరిభక్తశిఖామణులు, శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారి భావంలో చెప్పాలంటే
"సామీప్యమిందరికి సంకీర్తనం...
సామాన్యమా విష్ణుసంకీర్తనం..."....
అందుకే శ్రీతాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలపై ఈ కాలంలో తెలుగుభాషావైభవంపై పీహెడి కూడా చేసే మాన్యులు ఉండడం మన భాగ్యవిశేషం...

శ్రీత్యాగయ్య గారి భావంలో సంగీతం యొక్క మహత్తును వర్ణించే సాహిత్యమైన ఈ క్రింది త్యాగరాయకృతిలో
సదాశివమయమైన నాదశక్తి ఏవిధంగా అత్యున్నతమైన స్థాయిలోని సంగీతసాహిత్యాల మేళవింపుగా ప్రభవించి మనిషికి స్వాంతన చేకూర్చి తరింపజేస్తున్నదో అనే సత్యం ఎంతో ఘనంగా విశదీకరింపబడింది....

ప. రాగ సుధా రస పానము జేసి
రంజిల్లవే ఓ మనసా
అ. యాగ యోగ త్యాగ భోగ ఫలమొసంగే (రా)
చ. సదాశివ మయమగు నాదోంకార స్వర
విదులు జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు (రా)

(ఈ త్యాగరాయకృతిని వారి సినిమా పాటగా స్వీకరించిన "సరిగమలు" సినిమాలో శ్రీ కే.జే యేసుదాస్ గారి ఆలాపన ఏ రేంజ్లో హిట్ అయ్యిందో కర్ణాటక శాస్త్రీయ సంగీతాభిమానులకు సుపరిచితమే....)

"పలుకే బంగారమాయేన కోదండపాణి..." అంటూ
శ్రీరామచంద్రుడు తన భక్తిభావభరితభవభంజితమైన భవ్య పలుకుల్లో కొలువుదీరి ఉండేలా అచ్చతెనుగు సాహితీ పలుకులతో అర్చించి, 
ఆ వైకుంఠ రాముడే ఈ కలియుగంలో దక్షిణ అయోధ్యారాముడిగా వేంచేసి ఉండగ...,
అటు తనహృదయంలో గూడుకట్టుకున్న శ్రీరాముడికే భద్రగిరిపై తనచే భవ్యమైన చారిత్రక శ్రీరామాలయాన్ని నిర్మింపజేయించిన ఘనత శ్రీరామదాసు గారి తెనుగు సంకీర్తనలది....

పైకి ఒక కేవల సామాన్య నదీతీర్థముగా కనపడే భద్రగిరి పరీవాహక గోదావరి నదీ, స్థిరభానువాసరములలో ఎంతటి మహత్తర శక్తివంతమైన సిద్ధగౌతమి తీర్థంగా అలరారుతుందో.....కవికోవిదులకు, ఆధ్యాత్మశాస్త్రవైజ్ఞ్యానికులకు, భక్తితత్త్వద్రష్టలకు తెలిసిన సత్యమే.....

" తెలుగులో భక్తి ప్రవచనాలు " అనే ఒకానొక అనన్యసామాన్యమైన భక్తిజ్ఞ్యానయజ్ఞ్యాన్ని నిర్వహిస్తున్న 
ఈతరంలోని మాన్యులలో అగ్రగణ్యులైన శ్రీచాగంటి సద్గురువుల రసనపై కొలువైన తెలుగుభాషాసరస్వతీ సృజించిన వందలాది ప్రవచనాలు ఎంతటి
భక్తిజ్ఞానదాయక అక్షరమయి అనుగ్రహంగా పరిఢవిల్లుతున్నాయో యావద్ ప్రపంచంలోని విజ్ఞ్యులైన తెలుగువారందరికీ సుపరిచితమే...

అజరామరమైన తెలుగువెలుగులను విశ్వవ్యాప్తం గావించిన / గావిస్తున్న ఎందరో మహానుభావులకు, శారదాజ్ఞ్యానపుత్రులకు, సరస్వతీ ఉపాసకులకు, శ్రీశారదాచంద్రమౌళీశ్వర అనుగ్రహసంపాకభరితులకు,
నమస్కరిస్తూ.....
అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవాన్ని పురస్కరించుకుంటున్న సాటి తెలుగువారందరికీ కూడా నా సవినయ సాక్షరాలంకృత శుభాభినందనాభరిత
నమస్సుమాంజలి...

ఎల్లరికీ ఆంగ్లము చక్కెరపాకము వంటి తియ్యని పదార్ధం...
అది జీవితంలో ఎంతవరకు అవసరమో అంతవరకు స్వీకరించడం అవశ్యమైన ఎల్లరి విహిత కర్తవ్యమే.....

ఎల్లరికీ వారి వారి మాతృభాష, ప్రత్యేకించి తెనుగు భాష, పరిశుద్ధమైన తేనే వంటి ఎన్నటికి చెడని అమృతమయమైన బ్రహ్మపదార్థం....
అది జీవితంలో విస్మరింపబడిన నాడు జీవన మధురిమ లుప్తమై మనిషికి ఆనందజీవనమనేది మృగ్యమౌను....

మాతృభాషపై ఎనలేని పట్టుగల భాషాకోవిదులు.....
ఎన్నెన్నో రంగాల్లో ఆరితేరిన అగ్రగణ్యులుగా రాణించడం గమనించే ఉంటారు....
ఈతరం యువతీయువకులకు పరిశుద్ధమైన తెలుగు భాషపట్ల మక్కువను కలిగించే రీతిలో వ్యవహరించే మాన్యులుగా ప్రసిద్ధిచెందిన ప్రముఖ గాయకులు,
స్వర్గీయ శ్రీ ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారి మాటలైన,

సర్వే జనాః సుజనాభవంతు....
సర్వే సుజనాః సుఖినోభవంతు...

అనే నానుడి ఈకాలానికి ఎంతో ఆవశ్యకమైనది...

శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో ఒకచోట చమత్కరించినట్టుగా......

" గోదావరి ఎక్స్ప్రెస్ " ను 
" గొడావరి ఎక్స్ప్రెస్ " అని...

అచ్చమైన తెలుగు నుడికారాన్ని ఆంగ్లీకరిస్తూ జీవిస్తున్న ఆధునికులే ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో.....
పిల్లలకు స్వచ్ఛమైన తెలుగును తద్వారా శ్రేష్ఠమైన మేధోవికసనను అందించేలా కనీసం మన ఇళ్ళల్లోనైనా తెలుగు వారిగా జీవించడం, తెలుగు భాషను గౌరవించడం, అధ్యయనం గావించడం అనేది భావితరాల భాషాసాంస్కృతిక వైభవం పట్ల ఎల్లరికీ ఉండవలసి విహిత కర్తవ్యం.....

ఇట్లు ఒక తెలుగు భాషాభిమాని అయిన భవదీయుడు...
" అయిత వినయ్ కుమార్ ", అనబడే నా పేరులో తెలుగు అక్షరమాలలోని తొలి అక్షరమే నా పూర్తి పేరులోని మొదటి అక్షరం కూడా కావడం కాకతాళీయమే అయినా అది ఆ అక్షరమయి యొక్క అనుగ్రహంగా ఒక ఆనందకారకాంశమే కద....🙂

ఓం శ్రీవాగ్దేవ్యై నమః.....
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment