Sunday, February 2, 2025

శ్రీత్యాగరాయ ఆరాధనోత్సవాల్లో అత్యంత రమనీయమైన కమనీయమైన రసప్లావితమైన మహితాత్ముల రాగాలాపనల్లో మనసు రంజిల్లుతూ రసార్ణవడోలికల్లో ఊయలలూగిన ఉత్కృష్ట ఉత్సవం నేటి, శ్రీ క్రోధి నామ 2025 సంవత్సర భానువాసర మాఘ శుద్ధ చతుర్థ్యోపరి పంచమి పుణ్యదివస శ్రీత్యాగరాయ పంచరత్నగానగొష్టి పర్వం....!😊💐


" లోకో భిన్న రుచిః " అనే నానుడి గురించి వినేఉంటారు కద...
అనగా ఈ లోకంలో ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి.....
అందుకుమూలం వారి వృత్తి, ప్రవృత్తి, గతజన్మలపుణ్యకర్మఫలం, జన్మాంతరసంస్కారం, విశేషమైన ఈశ్వరానుగ్రహం, ఇత్యాదిగా కారణం ఏదైనా కావొచ్చు....

అట్టి అనేకానేక అభిరుచుల్లో, శాస్త్రీయ సంగీత సాహిత్యాల పై మక్కువకలగడం అనేది ఎన్నో జన్మల ఈశ్వరానుగ్రహంగా మాత్రమే సంభవించే అంశం....

అందులోను, భారతీయ శాస్త్రీయసంగీతచక్రవర్తిత్రయమైన,
శ్రీత్యాగరాయ,
శ్రీశ్యామశాస్త్రి,
శ్రీముత్తుస్వామిదీక్షితర్,
వార్ల, సంగీత సాహిత్యాల గురించి అవగాహన ఉండడంకూడా ఎంతో ఈశ్వరానుగ్రహంతో మాత్రమే సాధ్యమయ్యేది...

ఎందుకంటే, అట్టి సుస్వరసంగీతభరితసాహిత్యాలాపనల్లో సామగానలోలుడైన పరమాత్మ ఎంతగానో పరవశించును కనుక...ఆ పరవశంలో పరమాత్మ అనుగ్రహించే వరాల ప్రాభవం అనిర్వచనీయం కనుక...
అట్టి అనిర్వచనీయమైన అవ్యక్త ఆశ్చర్యానందామృతరసఝరిలో ఓలలాడే అనుగ్రహంతో వర్ధిల్లుతూ జీవించేవారు జీవన్ముక్తులౌదురు కనుక...
జీవన్ముక్తిని గడించి తరించడమే మానవజన్మ యొక్క సర్వోన్నతమైన మజిలి కనుక...

"ముఖే ముఖే సరస్వతీ.." అనే నానుడి గురించి వినే ఉంటారు కద.. ఆయా లలితకళల్లో ఆరితేరిన ఏ మహానుభావుల వదనకమలం ఎట్టి సరస్వతీ అనుగ్రహంతో పరిపుష్టమై ఉన్నదో ఎవ్వరికెరుక....
అట్టి మహితాత్ములకు నమస్కరించే సౌభాగ్యం లభించడం కూడా ఎంతో ఈశ్వరానుగ్రహంతోనే సాధ్యమయ్యేది...

నా ఎంజినీరింగ్ విద్యార్జన తరువాత, వారాంతాల్లో లభించిన తీరిక సమయంలో, నా పురాకృత పుణ్యవిశేషం కొలది, శ్రీ రామకృష్ణ మఠ్ లో, (లోయర్ ట్యాంక్ బండ్, దోమల్గుడ), 
శ్రీమతి హేమారావ్ మేడం గారి శిష్యరికంలో కర్ణాటకశాస్త్రీయసంగీతప్రాథమికవిద్యాభ్యాసం, మరియు 
శ్రీమతి ఉమారమణ మేడం గారి శిష్యరికంలో శ్రీతాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలను, ఏకకాలంలో అభ్యసించే సౌభాగ్యాన్ని ఈశ్వరుడు అనుగ్రహించాడు.....

కర్ణాటక శాస్త్రీయసంగీతార్ణవాన్ని వారి త్రివళుల కంఠసీమకు ఆభరణంగా గావించి జీవించే ఎందరో అగ్రశ్రేణి విద్వణ్మూర్తులు అలకరించే సంగీతసభాసరస్వతికి నమస్కరించి,
ఒక్క త్యాగరాయ సంకీర్తనైనా తమతమ అణువంత అర్హతకు తగ్గట్టుగా ఆలపిస్తూ, ఆలకిస్తూ, తరించడం అనేది ప్రతీ సంగీతాభిమానియొక్క కల....!

ఆ సంగీతసరస్వతి యొక్క అనుగ్రహంగా ఇన్నాళ్ళకు స్వరసాహిత్యంతో కూడిన ఆలాపనలతో అనందించడం నా జన్మాంతరసుకృతం...!
కొందరికి అతిశయంగా అనిపించవచ్చునేమో కాని, కర్ణాటక శాస్త్రీయసంగీతాన్ని అభ్యసించే, ఆలపించే, ఆలకించే వారికి సకల రుగ్మతలు కూడా ఆమడదూరంలోనే లయించిపోవును...
అది సంగీతసరస్వతి యొక్క సాటిలేని మహత్తు....!!
ప్రత్యేకించి శ్రీరాగం ఒనరించే శ్రియఃకారక / రోగనాశక శక్తి సాటిలేనిదని విద్వాంసుల ఉవాచ...

ఈ మహత్తు గురించి తెలుసుకున్నప్పటి నుండి శ్రీరాగంలో శ్రీత్యాగరాయుల వారు అనుగ్రహించిన సుప్రసిద్ధమైన సంకీర్తనను, "ఎందరో మహానుభావులు...", నేను ఎంతగానో అభ్యసిస్తూ తరిస్తుంటాను....

సదరు టాబ్లెట్ స్వీకరించిన వారికే అందులోని ఓషధీ శక్తి గురించిన ఎరుక కలుగును..
అట్లే సదరు రాగాన్ని ఆలకించేవారికి, ఆలపించేవారికి, అందులోని ఓషధీ శక్తి గురించిన ఎరుక కలుగును...

కనిపించే పాలల్లో కనిపించని అమృతపదార్ధమైన నెయ్యి ఎవ్విధంగా ఉండునో...
పాలను మరిగించి, పెరుగుగా మార్చుకొని, పెరుగు నుండి వెన్నను సంగ్రహించి, వెన్న నుండి నెయ్యిని లభింపజేసుకోవడం ఎట్లో...
రాగాల్లో నిక్షిప్తమై ఉండే అమృతసిద్ధితో అలరారే ఓషధీశక్తిని వాటి ఆలాపనల్లో అందుకొని తరించడం కూడా అట్లే...
అట్టి అనుగ్రహం ఎంతో సాధనతో మాత్రమే లభించే అనుగ్రహం....
అందుకే వివిధ సరస్వతీ ఉపాసకుల కళాప్రభంజనంలో పెల్లుబికి ప్రవహించే అమృతరససిద్ధికి ఈ లోకం ఎప్పటికీ దాసోహం చెంది ఉండును...

మన ఇంట్లో అరలీటర్ పాల ప్యాకెట్ నుండి పెరుగు చేసుకొని, వెన్నను సంగ్రహించి నెయ్యిని లభింపజేసుకోవడానికి....
మరియు
ఏదేని గోశాలలో వందలాది లీటర్లకులీటర్ల 
పాలనుండి పెరుగు, పెరుగు నుండి వెన్న సంగ్రహింపబడి నెయ్యి లభించినప్పుడు ఉండే ఆనందానికి...
ఎంతో భేదం ఉండును...
అచ్చం అదే విధంగా...
మనం ఇంట్లో మనకు ప్రాప్తమైన సరస్వతీ అనుగ్రహం కొలది ఆలపించి తరించడానికి మరియు...
సంగీతసరస్వతీ సభల్లో కొలువుతీరిన ఎందరో 
అగ్రశ్రేణివిద్వన్మణుల గాత్రకచేరి / గోష్టిగానం లో, పాల్గొని పరవశించి తరించడం కూడా...!

నెయ్యి లౌకిక అమృతం కాబట్టి...
కొందరికి కొంత మాత్రమే లభించును...
శాస్త్రీయసంగీతాలాపనల్లోని సంగీతామృతం అలౌకికామృతరససిద్ధి కాబట్టి, పాల్గొని తరించేవారందరికి కూడా లభించే విశేషమైన ఈశ్వరానుగ్రహ వైభవం...!

తిరువారూర్ / తిరువైయ్యూర్ ద్రవిడనగరాల్లో మాత్రమే కాక, 
ఇవ్వళ్టి రోజుల్లో ప్రపంచమంతటా ఎందరో విజ్ఞ్యుల,విద్వాంసుల ఆధ్వర్యంలో నిర్వహింపబడే అనేక శ్రీత్యాగరాయ సంగీత ఆరాధనోత్సవాల్లో శక్తి కొలది పాల్గొని తరించడం ఈతరానికి లభించిన భాగ్యం...

మన భాగ్యనగరభాగ్యపరిపాకమై సంస్కృతి ఫౌండేషన్ వారి సౌజన్యంతో ప్రతియేటా నిర్వహింపబడే 
" హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన మ్యూసిక్ ఫెస్టివెల్ HTAMF" లో సంగీతాభిమానులు, ఉపాసకులు, విద్వాంసులు, అందరూ ఓకేచోట కొలువుతీరి ఎంతో వైభవభరితమైన రీతిలో శ్రీత్యాగబ్రహ్మం గారికి సుస్వర సంగీతాంజలిని సమర్పించి తరించడం ఎంత విశేషమో కద...

ఈ జన్మలో తగులుకునే...
తల్లితండ్రి సోదరసోదరీ దారసుతాదులు, లౌకికవిద్యావైదుష్యాలు, ఆస్తిపాస్తులు, ఇత్యాదివన్నీకూడా తనువు తగలబడేంతవరకు మాత్రమే వెంటవచ్చే సంపదలు.....
ఈ జన్మలో అలుముకునే శ్రీసరస్వతీ అనుగ్రహం, జన్మజన్మల సౌభాగ్యానికి మనకు మనమే సముపార్జించుకునే అక్షయమైన పుణ్యరాశి అనే శాశ్వతమైన జన్మాంతర విద్యాసంపద....
అనే సత్యం విజ్ఞ్యులకు ఎరుకే...

నాదబ్రహ్మ, సద్గురు శ్రీత్యాగరాయుల శ్రీపాదపద్మములకు
ఒక సంగీతసాహిత్యాభిమాని యొక్క సవినయ సాక్షరాంజలిభరిత నమస్సుమాంజలి...😊💐

ఎందరో మహానుభావులు...అందరికీ వందనములు...🙏😊💐

***** ***** ***** ***** ***** ***** ***** *****

(మహిమాన్వితమైన భజనసంప్రదాయంలో ఎంతో ఖ్యాతి గడించిన కృతి..)

నీ నామ రూపములకు నిత్య జయ మంగళం 
పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు ||నీ నామ||
పంకజాక్షి నెలకొన్న అంక యుగమునకు ||నీ నామ||
నళినారి గేరు చిరునవ్వు గల మోమునకు ||నీ నామ||
నవ ముక్త హారములు నటియించు యురమునకు ||నీ నామ||
ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండు ||నీ నామ||
రాజీవ నయన త్యాగరాజ వినుతమైన ||నీ నామ||

మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం

***** ***** ***** ***** ***** ***** ***** *****

"నీ నామునకు, రూపమునకు నిత్యము జయము, మంగళము కలుగు గాక! వాయుపుత్రుడైన హనుమంతుడు సేవించే నీ పాదములకు, కలువలవంటి కన్నులు గల సీత కూర్చునే నీ అంకములకు (తొడలకు), చిరునవ్వుతో చంద్రునివలె ఉండే నీ మోమునకు, మంచి ముత్యముల హారములు నర్తించే నీ వక్షస్థలమునకు, ప్రహ్లాదుడు, నారదాదులు పొగడే అందమైన కన్నులు కలిగి పరమశివునిచే నుతించబడిన నీకు మంగళము"

- సద్గురు శ్రీత్యాగరాయుల వారు శ్రీరామునికి పాడిన మంగళ హారతి

***** ***** ***** ***** ***** ***** ***** *****

https://www.facebook.com/share/v/14kr4VnQdr/

https://www.facebook.com/share/v/1Ei4b7SjxD/

.---- .-.-.- ..--- ..... .---- ...-- ....- --... -.... / -..- / -.--. / -.--. .---- ---.. .-.-.- ..--- / -..- / ..--- / -...- / ...-- -.... .-.-.- ....- -.--.- / .-.-. / -.--. ..... / -..- / ...-- / -...- / .---- ..... -.--.- / -...- / ..... .---- .-.-.- ....- / -.--.- / -...- / -.--. / -.--. ....- ..... .-.-.- ..... ....- ----. ----- ..... ..--- -.... ....- / ..-. .-. --- -- / --- .-. -.-. .-.. / .-.-. / .---- ---.. .-.-.- --... --... ----- ..--- .---- ....- / ..-. .-. --- -- / .. ..-. .. / -...- / -.... ....- .-.-.- ...-- .---- ----. ..--- -.... -.... -.... ....- -.--.- / -.--.- / -. . -