Sunday, December 21, 2025

శ్రీ విశ్వావసు 2025 మార్గశిర శుద్ధ ద్వాదశి / మత్స్యద్వాదశి / మత్స్యజయంతి పర్వసమయ శుభాభినందనలు...🙂💐


శ్రీమహావిష్ణువు స్వీకరించిన మొట్టమొదటి అవతారం శ్రీమత్య్సనారాయణావతారం...

కనురెప్పలు వెయ్యని చేపలు, కంటిచూపుతో వాటి సంతతిని అనుగ్రహించే శక్తిగల ఆశ్చర్యకరమైన జలచరాలు..

అందుకే భగవద్ తత్త్వాన్ని మీనతత్త్వం గా విజ్ఞ్యులు విశదీకరించారు...
ఎందుకంటే కనురెప్పలు వెయ్యని అనిమేశులైన దేవతలు
చూపులతో అనుగ్రహించే శక్తిసంపన్నమైన దివిజసమూహాలు...

ఒక ఆగమోక్త దేవతామూర్తిలోకి దైవికశక్తి ఏమేరకు స్థీరీకరింపబడింది అని తెలియజెప్పే అంశంగా నేత్రోన్మీలనం
అనే ప్రక్రియతో, కొత్తగా ఏదేని ఆలయంలో దేవతామూర్తి ప్రతిష్టాపన క్రతువుల్లో అచార్యులు వివరించి చూపడం విజ్ఞ్యులకు ఎరుకే....

అపౌరుషేయాలైన వేదములను అపహరించిన సోమకాసురుడి నుండి వేదాలను సంగ్రహించి లోకళ్యాణార్ధమై వాటిని తిరిగి చతుర్ముఖబ్రహ్మగారికి అప్పగించడం 
శ్రీమత్య్సనారాయణావతారం యొక్క ప్రాథమిక లక్ష్యం...

"య ఏవం వేద..."
అనే శృతివచనానికి వాచ్యార్ధం...
"ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో..."
అనగా
"బాగా బాగుగా తెలుసుకో..."
అని కూడా అర్ధం...

ఋగ్, సామ, యజుర్ (కృష్ణ, శుక్ల), అథర్వణ వేదములుగా
శ్రీవేదవ్యాసమహర్షి వారి అనుగ్రహంగా ఈ కలియుగంలో విభాగింపబడిన అధ్యాత్మశాస్త్ర నాలుగు వేదాలను అధ్యయనం చేసి తరించడం అందరికీ వీలైయ్యే అంశం కాదు...
కాబట్టి ప్రాపంచిక నిత్య జీవితం అనే వేదం
గురించి కొంత తెలుసుకొని తరించే ప్రయత్నం గావిద్దాం..

శ్రీకరమైన కొన్ని జీవిత సత్యాలు.....
రమారమి 39 ఏళ్ళ నా జీవితప్రయాణమంజరులన్నీ వడపోసి వచిస్తున్న కొన్ని వాస్తవ ప్రాపంచిక నైజాలు.....

1. "వాట్ గోస్ అరౌండ్...కంస్ అరౌండ్..." అనే కర్మసిద్ధాంతాన్ని ఒక్కొక్కరూ ఒక్కోపేరుతో విశ్వసిస్తూ ఉంటారు....
ఒకరు దాన్ని భగవంతుడి పట్ల భక్తిమయ జీవితం అని వచిస్తారు...
మరొకరు మనపట్ల మనకు ఉండే శ్రద్ధాభక్తిపూర్వక విశ్వాసం అని వచిస్తారు...
ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా,
సత్కర్మకు మంచిఫలితం, పుణ్యం, సుఖం...,
దుష్కర్మకు దుఃఖకారక ఫలితం,
లభించడం అనేది ఆనాటి భక్తప్రహ్లాద చరితం నుండి ఈనాటి 
కలియుగ ఇంటింటి రామాయణం వరకు ఎల్లరికీ విదితమై ఉండే అంశమే....

2. మన అభివృద్ధిని అభిలషించేవారు పరాయి వారు అని కొందరిచే పిలవబడినా సరే వారిని మనవారిగా భావించాలి....
మన అభివృద్ధిని ఓర్వని వారు మనవారే అయినా పరాయి వారిగానే భావించాలి....
ఎందుకంటే ఇంటిదీపమే కదా అని ముట్టుకుంటే కాలకుండా ఉంటదా....
వీధి దీపం కదా అని మన ఇంటికి వెలుగునివ్వకుండా ఉంటదా...

3. మనకంటూ జీవితంలో కొందరు మంచి మితృలు ఉండాలి....
ఎల్లవేళలా మన అభివృద్ధిని అభిలషించే వారు ఎవ్వరైనా అవ్వొచ్చు...ఎంత దూరంలో ఉండే వారైనా అవ్వొచ్చు....సద్గురువులు కూడా అవ్వొచ్చు...
ఎందుకంటే ఒకవ్యక్తి గతించిన వెంటనే తన భార్య అలోచించేది "బీర్వా తాళంచెవి ఎక్కడ ఉంది"  అని....
నగలు, సొమ్ములు, ఆస్తులు మొదలైనవి సర్ది తన పుట్టింటి వారి దెగ్గర దాచుకోవాలని..
తన బిడ్డలు అలోచిందేది, "మా పేర్ల మీద ఏమేం ఆస్తులు, ఎవరికి ఎంతెంత సమకూర్చిపెట్టాడు" అని....
తన మితృలు అలోచించేది, " గతించిన మా మితృడికి అన్ని మర్యాదలతో సకాలంలో అంత్యేష్టి సంస్కారం గావించడానికి తన కుటుంబసభ్యులు ఎందుకు ఇంత కాలయాపన గావించి తన మితృడి పార్ధివదేహాన్ని అవమానిస్తున్నారు" అని...
ఇది కొత్త కథేం కాదు..."ఆ నలుగురు" సినిమా లో ఉన్న కథే..

4. సద్బుద్ధితో సమకూరే సమతౌల్యం అనేది జీవితంలోని ప్రతీ అంశంలోనూ పాటించి తీరవలసిన విహిత కర్తవ్యం....

ఉప్పు ఎక్కువైతే వంట పాడైపోతది....
బి.పి ఎక్కువైపోతే ఆరోగ్యం పాడైపోతది.....
సద్బుద్ధి తక్కువైతే జీవితమే పాడైపోతది.....
ఆ సద్బుద్ధిని నిరంతరం అనుగ్రహించేది నిత్యభగవదారాధన....

5. ఓ 30 నిమిషాల పాటు వండే వంటలో, బిర్యాని వండేటప్పుడు మనం ఏమేం కూరగాయలు, మసాలా దినుసులు ఎంత పరిమాణంలో వేస్తామో,
వండిన తదుపరి ఓ 300 నిమిషాల నిడివిలో అ భోజనపదార్ధం ఆరగింపబడే సమయంలో అవే కూరగాయలు, అదే మసాలా యొక్క రుచి లభించును...
వండేటప్పుడు క్యారెట్ ముక్కలను వేయకుండా క్యాప్సికం ముక్కలు వేసి తినేటప్పుడు మాత్రం క్యారెట్ ముక్కలే రావాలంటే అది అసమంజసమైన అపేక్ష....

జీవితం కూడా అంతే....

దైనందిన జీవితంలో దేనికోసం ఎక్కువగా పరిశ్రమిస్తున్నామో, జీవితంలో వాటి తాలూకా "రుచి" మాత్రమే ఎక్కువగా ఉండును....
జీవిత సిమ్హభాగమంతా ఇతరులను ఇబ్బంది పెట్టి, పీడించి, దోచుకుంటూ బ్రతికే వారికి, జీవిత చరమాంకంలో ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందం, లభించమంటే అది ఎండమావిలో జలాన్వేషణలా ఉండును...

అనగా, గొప్పపనులు, గొప్పవ్యాపకాలు, ధర్మబద్దమైన ఆర్జన, వివేకభరిత వినిమయం, తో పరిఢవిల్లే జీవితంలో, 
చరమాంకంలో ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందం, లభించును అనే జీవిత సారంశం ఎల్లప్పుడూ స్మృతిపథంలో ఉండవలసిన జీవితసత్యం....

6. మన చుట్టూ ఉండే లోకం అనేది ఒక పెద్ద భోజనశాల అయితే...
అందులో మన జీవితం అనేది మనం భుజించే విస్తరి వంటిది...
ఏఏ పదార్ధం, ఎంతెంత, ఎవరెవరితో వడ్డింపజేయించుకొని, ఎవ్విధంగా ఆరగిస్తామో, అదే మనకు మనం మన బుద్ధితో ఏర్పాటు చేసుకున్న భోజనం గా పిలువబడుతుంది...
(ఆరగించిన భోజనంలో ఆరోవంతు మన మనసు అవుతుంది.
ఆ మనసే అన్ని రకాలుగా జీవితాన్ని శాసించే అగోచర ఆంతర ఇంద్రియం...)

పదార్ధం విస్తరిలోకి రానంతవరకు అది భోజనశాలకు సంబంధించిన పదార్ధం, అంశం...
పదార్ధం విస్తరిలోకి వడ్డింపబడిన తదుపరి అది మన జీవితానికి సంబంధించిన అంశం...

అది భుజింపవలసింది మనమే....
తత్ భోజనం తాలూకా ఆరోగ్యాన్ని / అనారోగ్యాన్ని అందుకునేది కూడా మనమే...
అందుకు ఇతరులు, వడ్డించిన వారు, ఎంతమాత్రమూ బాధ్యత వహించరు, కాజాలరు....

మన నిత్య ప్రాపంచిక జీవితం కూడా అంతే....

ఈ లోకంలో మన చుట్టూ ఎందరో వ్యక్తులు, వ్యక్తిత్వాలు, తత్త్వాలు, వస్తువులు, వాస్తవాలు, విషయాలు, ఉండడం లోకనైజం.....

వాటిలో, ఎవరెవరిని, ఎట్టివారిని, ఎట్లాంటివాటిని, వేటిని, మనం మన దైనందిన జీవితంలో భాగంగా 
ఎంతవరకు, ఎప్పుడెప్పుడూ, ఎందుకు, ఎట్ల
ఆహ్వానిస్తూ, ఆస్వాదిస్తూ, ఆరగిస్తూ, 
ఉంటామో, మన జీవితం అనేది వాటి యొక్క సమ్మిళిత సమాహార స్వరూపంగా రూపుదిద్దుకుంటూ ఉంటుంది....

ఎల్లరి జీవితాల్లోనూ....

ఒక డాక్టర్, ఒక పోలీస్ ఆఫిసర్, ఒక ఎంజినీర్, ఒక లాయర్, ఒక ఆర్టిస్ట్, ఇలా ఎందరో వ్యక్తులు....

ఒక శాంతస్వభావి, ఒక నేర్పరి, ఒక ముక్కోపి, ఒక సౌమ్యస్వభావి, ఇలా ఎందరో వ్యక్తిత్వాలు...

లౌకికతత్వం, అధ్యాత్మతత్త్వం, ఆంతరతత్త్వం, బాహ్యతత్త్వం, ఉష్ణతత్త్వం, శీతలతత్త్వం, ఇలా ఎన్నో తత్త్వాలు...

సైకిల్, బైక్, కార్, పెన్, మొబైల్, చైర్, స్టవ్, ఇలా ఎన్నో వస్తువులు...

ఇత్యాదిగా తారసపడుతూ ఉంటారు, ఉండును, ఉంటాయి..

వీరందరూ కూడా ఎవరికివారు, వారివారి మార్గాల్లో, వారివారి శైలిలో, వారివారి పరిధిలో, వారివారి ఔన్నత్యానికి తగ్గట్టుగా, మనతో బాంధవ్యం కలిగి ఉంటారు....
ఇట్టి ప్రాపంచిక యవనికలో ఎవరి జీవితంలో ఎవరి పాత్ర ఎట్టిది, ఎవరికి ఎవరు ఎందుకు మితృలౌతారు, ఎవరి పట్ల ఎవరు ఎందుకు కృతజ్ఞ్యతాపూర్వక వైఖరితో ఉండాలి, ఇత్యాదిగా ఎవరికి వారే వారివారి ఈశ్వరానుగ్రహ విజ్ఞ్యతతో వివేకభరిత యోచనతో నిర్దేశించుకొని తరించవలసి ఉంటుంది..
అంతే కాని ఇతరుల ఉన్నతిపై ఏడుస్తూ బ్రతకడం అనేది నిష్పయోజకరమైన, అర్ధరహితమైన, జీవితప్రాయాస..

సర్వే సుజనాః సుఖినోభవంతు...💐

సర్వం వక్షస్థలశ్రీవ్యూహలక్ష్మీ సహిత శ్రీవేంకటకృష్ణార్పణమస్తు........💐🙂🙏

No comments:

Post a Comment