శ్రీవేంకటాచలపుణ్యక్షేత్రంలో ఏకాహ్నిక / ఒక్కరోజు బ్రహ్మోత్సవ పర్వసమయంగా బహు ప్రసిద్ధినొందిన "మాఘ శుద్ధ సప్తమి" / "సూర్య సప్తమి" అనే ప్రముఖ పండగ విజ్ఞ్యులకు విదితమైనదే....
రథసప్తమి పర్వసమయం అనగా...,
సప్తాశ్వచోదకఏకచక్రరథసారధిగా వర్ధిల్లే అనూరుడు (గరుత్మంతుడి అన్నగారు) సూర్యపరమాత్మ యొక్క రథాన్ని ఉత్తర దిశగా మళ్ళించే సమయం గా వినుతికెక్కిన ఉత్తరాయణపుణ్యకాల ప్రారంభ సమయం...,
ఇటు భూలోక వాసులకు / మనుష్యులకు ప్రత్యక్ష పరమాత్మగా భాసిల్లే సూర్యబింబం యొక్క తేజోలభ్యత వృద్ధిచెందుతూ, ఎండలు పెరిగే ఎండాకాల సమయం....
తదనుగుణంగా
అటు వివిధ దేవలోక వాసులకు / దివిజులకు సూర్యపరమాత్మ ప్రసాదించే సకలజీవచైతన్యోద్దీపక ఆత్మశక్తి తత్త్వం మెండుగా పరిఢవిల్లే "దేవతల పగటి" సమయం....
కాబట్టి ఈ ధనుర్మాసం దేవతలకు ఉషోదయకాలం....
అని సాధారణంగా ఎల్లరూ వచించే అంశం....
ఇక్కడ మనం గమనించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే....
ఒక ట్రైన్ సికింద్రాబాద్ లో ఆగి ఉన్నప్పుడు,
అందులో ఒక బోగీలో ఒక సీటింగ్ అరీనాలో ప్రయాణించే 9 మంది ప్రయాణికుల్లో, (అటు ముగ్గురు, ఇటు ముగ్గురు, సైడ్ కి ఇద్దరు, సైడ్ అప్పర్ బెర్త్ లో ఒకరు, మొత్తం కలిపి 9 మంది)
ఎవరికి ఎవరు ఉత్తరంలో ఉన్నారో, ఎవరికి ఎవరు దక్షిణంలో ఉన్నారో, ఎవరికి తూర్పున ఎవరు ఉన్నారో,
ఎవరి పడమరకు ఎవరు ఉన్నారో, చెప్పడం తేలిక....
ఎందుకంటే భూగురుత్వాకర్షణశక్తికి లోబడి పనిచేసే దిక్సూచి / కంపాస్ అనే పరికరం యొక్క సహాయంతో చెప్పగలం ...
అదే ట్రైన్ నిర్దేశిత రైలుపట్టాలపై శరవేగంతో తన గమ్యం దిశగా ప్రయాణించే సమయంలో, ఎన్ని సార్లు దిశలు మారుతూ ఉంటాయో ఆ ట్రైన్ డ్రైవర్ గారికి కూడా తెలియదు..
అట్టి రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు, అదే ఉత్తరం, ఇదే దక్షిణం, ఇది తూర్పు, అది పడమర అనే వాదనకు అర్ధం ఉండదు...
ఒక వేళ అట్టి రైలు ప్రయాణంలో కదులుతూ తిరుగుతూ ఉండే రైల్లో, బోగీలు కూడా నిరంతరం కదులుతూ తిరుగుతూ ఉంటే ఇక అసలు దిక్కుల ప్రస్తావన అనేది వర్తించని అంశంగా ఉండును...
(ఉదాహరణకు, వాటర్ వరల్డ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే హైపర్స్పీడ్ రోలర్ కోస్టర్స్ / రోటేటింగ్ జాయంట్ వీల్స్, లాంటివి గమనించే ఉంటారు.....)
ఇదే సిద్ధాంతాన్ని మీరు రోదసీలో భ్రమణం గావించే గ్రహాలకు, "ఇతర ఖేచర వస్తు సముదాయానికి" వర్తింపజేసి గమనిస్తే, అసలు అంతరిక్షంలో దిక్కుల ప్రస్తావన అనేది అర్ధరహితమైన అంశం....
ఈ అంశాన్ని ఐ.ఎస్.ఎస్ లో భ్రమణం గావించే వ్యోమగాములను మీరు అడిగి తెలుసుకోవచ్చు.....
అనగా ఎవ్విధంగా పగలు, రాత్రి, క్రింద, పైన, ఇత్యాది ఏ లౌకిక అంశాలు కూడా వర్తించని వారి చిత్రవిచిత్రమైన
వ్యోమనౌకాంతర భారరహిత జీవిత ప్రయాణాన్ని...,
మరియు ఆ వ్యోమాంతరశూన్యంలో సాగే వారి ప్రయాణంలో భాగంగా సైన్స్ కి అందని ఎన్నో రోదసీ విజ్ఞ్యాన అంశాల పట్ల వారు ఏర్పరుచుకునే అవగాహన గురించి...
కాబట్టి ఒక్కసారి భూగురుత్వాకర్షణ వలయం నుండి విడివడిన భూలోక వస్తువులకు, తత్త్వాలకు, దిక్కులు, దివారాత్రములు ఇత్యాది మన భూలోక పరిభాష తాలూకా ఫినామిన / దృగ్విషయాలు అసలు వర్తించవు....
కాబట్టి సూర్యుడు జనవరి / ఫిబ్రవరి నుండి ఉత్తరదిక్కుగా ప్రయాణిస్తున్నాడు....జూన్ / జులై నుండి దక్షిణం దిక్కుగా ప్రయాణిస్తున్నాడు....
ఇత్యాది కాన్సెప్ట్స్ అన్నీ కూడా వర్తించేది మన భూలోక వాసులకే కాని, దివిజులకు, దేవతలకు, వివిధ దేవలోకవాసులకు కాదు....
కాబట్టి అసలు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగటి సమయం అంటే ఏంటి...
దక్షిణాయణ పుణ్యకాలం దేవతలకు రేయి సమయం అంటే ఏంటి...
వీటి మధ్యలో ఉండే మార్గశిర / పుష్య / మాఘ మాసాలనే సంధి సమయాల్లో ఏతెంచే ధనుర్మాసం, వైకుంఠ ఏకాదశి, మకర సంక్రాంతి, రథసప్తమి, పండగలకు అనాదిగా గల ప్రాభవంలోని ఆంతర్యం ఏంటి....
ఇత్యాదిగా సందేహాలు ఉండే అధ్యాత్మ విజ్ఞ్యాన జిజ్ఞ్యాసువులకు, శ్రీరుద్రంలో చాలావరకు సమాధానాలు లభించును....
ఎందుకంటే శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలు శ్రద్ధగా ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా...
"వ్యోమవత్ వ్యాప్తదేహాయ...." అని పరమశివుడు స్తుతింపబడుతున్నాడు...
అనగా ఈ వ్యోమం ఎక్కడివరకు వ్యాపించి ఉన్నదో / వ్యాపిస్తూ ఉండునో, అక్కడి వరకు కూడా అదంతా మహేశ్వరుడి వ్యోమమేని వైభవం అని శాస్త్రం కీర్తిస్తున్నది....
ఈ అధ్యాత్మ సత్యాన్ని గుర్తుంచిన విజ్ఞ్యులకు వ్యోమప్రయాణం అనేది శూన్యంలో ప్రయాణం కాకుండా పూర్ణంలో ప్రయాణంగా భాసిల్లును....
అనగా...
ఒక సామాన్యుణ్ణి ఈ కుండలో ఏమున్నది అని అడిగితే...
ఠక్కున వారు చెప్పే సమాధానం...
"ఇది ఖాళి కుండ...ఇందులో ఏమి లేదు..." అని....
ఇదే ప్రశ్నని మీరు ఒక సైంటిస్ట్ ని అడిగితే....
"ఈ కుండ నిండా గాలి ఉన్నది....
కావాలంటే చూడండి...నీటిలో ఈ
కుండను ముంచితే ఎవ్విధంగా బుడుక్ బుడుక్ అనే శబ్దం తో బుడగల రూపంలో ఆ గాలి కుండనుండి బయటకి వస్తున్నదో...."
అని సమాధానం ఇస్తారు....
ఇదే ప్రశ్నని మీరు ఒక అధ్యాత్మ సైంటిస్ట్ ని అడిగితే....
"ఈ కుండ నిండా ఘటాకాశం ఉన్నది.....
(మరియు నాలోన హృదాకశం ఉన్నది.....)
అది వెలుపల పరివ్యాప్తమై ఉన్న చిదాకాశంతో ఏకీకృత భావనను కలిగి ఉన్నది....
తత్ కారణంగా శూన్యంగా అనిపించే / కనిపించే ఈ కుండలో పూర్ణత్వం దాగి ఉన్నది....
తగు సాధనతో, ఆ పూర్ణత్వం పరిపూర్ణుడైన పరమేశ్వర తత్త్వాన్ని గ్రాహ్యపరిచే సాధనమై ఒప్పారుచున్నది....
కాబట్టి ఇందులో, అందులో, అన్నిట్లో, అన్నిటా, అందరియందు, అన్నిటికీ ఆవల కూడా ఉన్నది ఒకే ఒక తత్త్వం....అదే అద్వయమైన ఆద్యంతరహితమైన, ఆశ్చర్యకరమైన, అజరామరమైన, అందీఅందని ఆకాశతత్త్వం...
అదే పరమాత్మతత్త్వం....."
అని సమాధానం ఇస్తారు....
ఇంతకుముందు ఒక పోస్ట్లో, ఆకాశతత్త్వానికి పృథ్వీతత్త్వానికి గల సామ్యము, సంబంధము, తత్త్వసమన్వయము, వివరించాను....
అవ్విధంగా, అందరాని ఆకాశతత్త్వం గురించి ఆకళింపుచేసికొని తరించాలంటే,
అందుబాటులో ఉండే పృథ్వీతత్త్వాన్ని అవగతం చేసుకోవాలి.... తద్వారా ఆకాశతత్త్వం, తన్మూలంగా పరతత్త్వం అవగతమౌను....
భూదేవి అంశలో ఆనాడు త్రేతాయుగంలో సీతమ్మతల్లి / జానకి / వైదేహి, నిన్నటి ద్వాపరయుగంలో సత్య భా మా / సత్యభామ, ఇవ్వాళ్టి కలియుగంలో శ్రీవిళ్ళిపుత్తూర్ లో కోదై / గోదమ్మ / చూడికుడుత్తనాచ్చియార్ గా పరమాత్మయొక్క శర్వతత్త్వ శక్తి భక్తులను అనుగ్రహించడానికి ప్రభవించెను.....
అని విజ్ఞ్యులకు ఎరుకే...
పరతత్త్వం శ్రీరాముడిగా వచ్చినప్పుడు పరేశి సీతమ్మ గా ప్రభవించెను...
పరతత్త్వం శ్రీకృష్ణుడిగా వచ్చినప్పుడు పరేశి సత్య భా మ / సత్యభామ గా ప్రభవించెను...
శ్రీరంగనాథుణ్ణి వరించిన శ్రీరంగనాయకిగా గోదమ్మ పరేశి గా ప్రభవించెను...
కాబట్టి శ్రీరంగనాథుడిగా ఇలకు పరతత్త్వం ఎప్పుడువచ్చెను....?
శ్రీచాగంటి సద్గురువుల "సంపూర్ణ శ్రీమద్రామాయణం" ప్రవచనాలు శ్రద్ధాభక్తులతో ఆలకించిన విజ్ఞ్యులకు గుర్తునట్టుగా...,
శ్రీరాముడు కైకేయి విధించిన 14 సంవత్సరముల
అరణ్యవాసానంతరం, పౌలస్త్యవధ అనే అవతారప్రయోజనం సిద్ధించిన తదుపరి అగ్నిపరీక్షానంతరం,
సీతమ్మగా కాంచనలంకలో బంధీయై ఉండి రావణవధకు కారణమైన వేదవతిని అగ్నిదేవుడికి అప్పగించి,
"బ్రహ్మగారి ఆజ్ఞ్యమేరకు మీకోసం కాంచన లంకలో రావణుడిచెరలో బంధీయైన సీతమ్మగా జీవించిన నన్ను కూడా మీ భార్యగా స్వీకరించండి ప్రభు..."
అని అభ్యర్ధించిన వేదవతితో,
"రాబోవు కలియుగంలో ఆకాశరాజు పుత్రికగా నీవు ప్రభవించెదవు...
శ్రీవేంకటేశ్వరుడిగా పరిఢవిల్లే నేను పద్మావతిగా ప్రభవించే నిన్ను అగ్నిసాక్షిగా పెండ్లాడి, కలియుగభక్తజనోద్ధరణకై పద్మావతీప్రియుడైన శ్రీతిరుమలేశుడిగా ఏడుకొండల శ్రీవేంకటేశ్వరుడిగా కలియుగప్రత్యక్షవరదైవమై వర్ధిల్లెదను...."
అని శ్రీరాముడు వేదవతికి అభయమిచ్చి....,
అగ్నిదేవుడి సమ్రక్షణలో ఉన్న నిజమైన సీతమ్మవారిని గైకొని,
శ్రీ చాగంటి సద్గురువుల వివరణ విన్నవారికి గుర్తున్నట్టుగా.....,
ఎంతమంది ఎక్కినా కూడా ఇంకొకరికి ఎల్లప్పుడూ చోటు ఉండే మహిమాసిద్ధితో శోభిల్లే పుష్పకవిమానం రావణాసురుడి సొంత విమానం ఏంకాదు....వరసకు అన్నగారైన కుబేరుడి నుండి దోచుకున్న విమానం....కుబేరుడు పరమేశ్వరుడికి పరమమిత్రుడు.....అందుకే శ్రీసీతారాములు, వానరసేనతో సహా పుష్పకవిమానాన్ని అధిరోహించి అయోధ్యకు పయనమైనారు...
శ్రీసీతారాముడిగా, పుష్పకవిమానాన్ని అధిరోహించి, అయోధ్యకు తిరిగివచ్చి, 500 నదీజలాలతో కోసల మహాసామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన సందర్భంలో,
తన అన్నదమ్ములైనా కూడా రావణకుంభకర్ణుల పంచన ఉండకుండా..,ధర్మాత్ముడైన శ్రీరాముడి తరపున ఉండడమే భగవద్ సమ్మతమై ఉండును కాబట్టి, ఇంటిగుట్టులంకకుచేటు అన్న చందంగా, శ్రీరాముడిని ఆశ్రయించి రావణాసురుడి అపజయానికి కారణమైనందున, విభీషణుడికి శ్రీరాముడు ఏకంగా తరతరాలుగా ఇనవంశ కులదేవతయై అలరారే అపురూపమైన శ్రీరంగనాథమూర్తిని కానుకగా ఇచ్చి పంపించగా....,
ఎన్నో శతాబ్దాలుగా సాటిలేని సూర్యవంశ చక్రవర్తుల పూజామందిరంలో కొలువై ఎనలేని సౌరశక్తిసంపన్నమైన శ్రీరంగనాథమూర్తిని ఒక రాక్షసుడు తన రాజ్యానికి తీసుకొని, భరతఖండాన్ని దాటి వెళ్ళడం అంతగా నచ్చని వినాయకుడు, ఒక ఉపాయంతో, ఇప్పుడు ఉన్న శ్రీరంగంలో కావేరి నదీ మధ్యప్రాంతంలో లంకను చూస్తు దక్షిణాభిముఖంగా కొలువైఉండేలా ఒక లీలను ప్రదర్శించాడు...
ఆ కావేరి నది ప్రభవించడానికి కారకుడు కూడా తమిళనాడులో వీధివీధికి ఉండే గణపతి గుడిలో కొలువై పూజింపబడే పిళ్ళైయార్ / వినాయకుడే...
కావున, కావేరి నదీమధ్యలో అఘోరవదనంతో పరమేశ్వరుడు కొలువై ఉన్న ఒకానొక అత్యంత అరుదైన మహామహిమాన్వితమైన ప్రదేశంలో, అకాశమార్గంలో విభీషణుడు తీసుకొని వెళ్తున్న ఆ శ్రీరంగనాథమూర్తికి తన ఎనలేని పృథ్వీతత్త్వాన్ని గరిమ సిద్ధితో ఆపాదించి ఎవ్వరూ మోయలేనంత, కదిలించలేనంత బరువైన శ్రీరంగనాథమూర్తిగా అక్కడికక్కడే సద్యోప్రతిష్ట గావించగా, గణపతి యొక్క అమేయమైన పృథ్వీతత్త్వ అనుగ్రహం శ్రీరంగదివ్యదేశక్షేత్రానికి మెండుగా కలదు....
చాలా తక్కువమంది భక్తభాగవవతులకు తెలిసినట్టుగా, గహనమైన అధ్యాత్మశాస్త్రప్రకారంగా...
పరమేశ్వరపంచాస్యవదనవైభవం ఒక్కో దిక్కులో ఒక్కో ప్రశస్తమైన పంచభూతతత్త్వవైభవంతో అలరారుతూ ఉండును....
ఆకాశ తత్త్వం : ఈశాన వదన తత్త్వం
వాయు తత్త్వం : వామదేవ వదన తత్త్వం
అగ్ని తత్త్వం : తత్పురుష వదన తత్త్వం
జల తత్త్వం : సద్యోజాత వదన తత్త్వం
పృథ్వీ తత్త్వం : అఘోర వదన తత్త్వం
కావున, పరమేశ్వరుడి శర్వశక్తి వైభవంతో అలరారే శ్రీరంగక్షేత్రంలో శర్వాణి తనయుడైన శ్రీగణపతి అనుగ్రహంతో కొలువైన శ్రీరంగనాథుణ్ణే తన పరమేశ్వరుడిగా, పరేశి గా ప్రభవించిన గోదమ్మ ఎంచుకొని, భక్తభాగవతులను తరింపజేసే శ్రీవ్రతం / తిరుప్పావైని వచించి రచించి అనుగ్రహించి లోకాన్ని తరింపజేసేను...
ఇప్పుడు మనం కొన్ని అధ్యాత్మ విషయాలను గమనిద్దాం....
శాస్త్రప్రకారంగా / గరుడపురాణం ప్రకారంగా....
ఒక దేహం నుండి విడివడిన జీవుడు...
తైజసిక దేహధారియై తూర్పుదిక్కుగా ఆకాశంలో ప్రయాణిస్తే మిక్కుటమైన పుణ్యసంచయంతో ఆ జీవాత్మ ఉన్నతమైన జన్మలను అనుగ్రహంగా అందుకునే జీవప్రయాణానికై వెళ్తున్నట్టు అర్ధం.....
ఉత్తరదిక్కుగా ఆకాశంలో ప్రయాణిస్తే ఆ జీవాత్మ పుణ్యపాపరహితుడై ఉన్నతోన్నతమైన పరమపదాన్ని / కైవల్యాన్ని అందుకునే జీవప్రయాణానికై వెళ్తున్నట్టు అర్ధం.....
పశ్చిమం దిక్కుగా ఆకాశంలో ప్రయాణిస్తే ఆ జీవాత్మ తన ఆఖరి ఘడియల్లో ఉన్న కోరికలకు అనుగుణంగా ఇతర జన్మలను అందుకునే జీవప్రయాణానికై వెళ్తున్నట్టు అర్ధం.....
దక్షిణం దిక్కుగా ఆకాశంలో ప్రయాణిస్తే ఆ జీవాత్మ తన పాపాలకు ఫలితంగా అధోజన్మలను అందుకునే జీవప్రయాణానికై వెళ్తున్నట్టు అర్ధం.....
మీ నాయనమ్మో, పెద్దమ్మో, పెద్దనాన్నో, మామయ్యో, అమ్మమ్మో, తాతయ్యో / ఇత్యాది బంధువులు ఎవరో గతించినప్పుడు, వాళ్ళ పార్ధివదేహం యొక్క శిరస్సు దెగ్గర పెట్టిన దీపం యొక్క వెలుగులో ఆ దేహాన్ని త్యజించిన జీవుడి యాత్రను దర్శించినట్టుగా చెప్తున్నావు ఏంటి నాయనా....
అని కొందరికి ఈ విషయాలు విడ్డూరంగా అనిపించవచ్చేమో...
అందరికి గుండే లయ మామూలుగా వినిపిస్తదేమో...
కాని ఒక స్టెతోస్కోప్ ని ధరించిన డాక్టర్ గారికి బాగా గట్టిగా గుండే లయ ధ్వనిస్తూ వినిపిస్తది...
అందరికి నక్షత్రాలు మామూలుగా చిన్నచిన్న మెరిసే చుక్కలుగా కనిపిస్తాయేమో...
కాని టెలిస్కోప్ తో దర్శించే వారికి బాగా పెద్దగా ఒక దేదీప్యమానమైన గ్రహంగా కనిపిస్తాయ్...
అట్లే....
శ్రీగురువుల అనుగ్రహంగా స్వప్రకాశకమై భాసించే అసంఖ్యాకమైన అమేయమైన అధ్యాత్మ శాస్త్రార్ణవాన్ని విశ్వసించి దర్శించే వారికి కొన్నికొన్ని అట్లనే సవిస్తరంగా / డీటైల్డ్ గా అగపడే అంశాలుగా ఉంటాయ్....
అదంతే....
ఎందుకంటే....
నమ్మేవారికి అది శివలింగం....
ఇతరులకు అది రాతిలింగాకారం...
నమ్మేవారికి అది సగుణసాకార శ్రీహరిరూపం....
ఇతరులకు అది ఒక దేవతామూర్తి...
సరే, ఇంతకి అసల్ టాపిక్ ఏంటంటే...
గోదమ్మ ఆరాధన విశేషమైన శ్రేయస్కరమైన సిరిసంపదలను అనుగ్రహిస్తూ తుదకు పరమపదాన్ని అనుగ్రహించే సాధనంగా ఎట్లు ఒప్పారునూ అని తెలియాలంటే...
తిరుప్పావైలో ఆవిష్కరింపబడిన గోదా హృదయాన్ని / గోపికా మధురభక్తిని / గోవింద పరమాత్మ అనుగ్రహంగా లభించే పరతత్వవిశేషాన్ని, పైన పేర్కొనబడిన అధ్యాత్మవిషయాలన్నీ కూడా ఒక రీతిలో సమన్వయపరుచుకుంటూ, గోవిందుణ్ణి ఆరాధించే వారికి ఈశ్వరానుగ్రహంగా భాసించును....
గోదామధురభక్తి వైభవం అంతటి ప్రశస్తమైన అధ్యాత్మ భక్త భాగవత మధుకావ్యం కాబట్టే....
ఆనాడు శ్రీకృష్ణదేవరాయల వారు విజయనగరమహాసామ్రాజ్యాధీశులై భోగభాగ్యాల్లో మునకలాడే రాచరికజీవనంలో ఉన్నాకూడా,
" ఆముక్తమాల్యద " అనే గ్రంథాన్ని రచించి, తిరుమలేశుడైన శ్రీవేంకటేశ్వరుణ్ణి పరతత్త్వంగా ఆరాధించే కోదై గా వారిని వారు అభివర్ణించునున్నారు....
ఎన్నెన్నో పురాణ ఇతిహాస కావ్య ప్రవచనాసుధామృత లహరుల్లో తేలియాడే అధ్యాత్మవిద్యాకోవిదులుగా వర్ధిల్లే బ్రహ్మవేత్తలైన శ్రీ చాగంటి సద్గురువులు, ప్రాచీన ద్రావిడం బాగా పఠించగల ఒక బాలికతో తిరుప్పావై పాశురాలను
చదివిస్తూ మరీ "తిరుప్పావై" (శ్రీవ్రతం) అనే టాపిక్ మీద కూడా ప్రవచనాలను అనుగ్రహించారు....
పరతత్త్వం ఎన్ని నామరూపాలుగా పరిఢవిల్లుతున్నా...అవన్నీ ఒకే పరమాత్మ యొక్క వివిధ కార్యకారణసిద్ధాంత కారక
విభూతులు కాబట్టే శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఈ క్రింది సంకీర్తనలో.....
"భూలలనాధిపం భోగిశయనం"
అని
శ్రీరాముణ్ణి, శ్రీరంగనాథుణ్ణి, శ్రీకృష్ణుడే అయిన శ్రీవేంకటేశ్వరుణ్ణి ఎంతో ఘనమైన సంస్కృత పదమంజరులతో
ఆరాధించారు.....
దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం
రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం
నీలజీమూత సన్నిభశరీరం
ఘనవిశాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం
పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
వేంకటేశం సాధు విబుధ వినుతం
https://annamacharya-lyrics.blogspot.com/2006/10/53devadevambhajedivyaprabhavam.html
గోదమ్మ తన మెండైన అనుగ్రహంతో భక్తులెల్లరినీ ఘనంగా అనుగ్రహించాలని అభిలషిస్తూ...
ఆచార్య తిరువడిగలే శరణం....💐🙏🙂
ఆండాళ్ తిరువడిగలే శరణం....💐🙏🙂
కూడారై ఉత్సవం తరువాత మళ్ళీ ఇంకొక తిరుప్పావై వైభవం పోస్ట్ తో, గోవిందుడి పరతత్వ వైభవం గురించి సంభాషించుకుందాం.....
సర్వం గోదా సమర్పిత శ్రీతులసీశోభితపుష్పమాలాలంకృత శ్రీవేంకటకృష్ణార్పణమస్తు.....💐🙏🙂
[ నా మితృడు శ్రీ పొన్నాల వెంకటేశ్ గారు రచించి అందించిన మధురమైన గోదామంగళసంకీర్తన కామెంట్స్ సెక్షన్లో జతపరిచాను....విజ్ఞ్యులెల్లరూ ఆలకించి ఆనందించండి....🙂 ]
No comments:
Post a Comment