Sunday, December 21, 2025

శ్రీ 2025 విశ్వావసు కార్తీక బహుళ పంచమి ప్రయుక్త భానువాసర పర్వసమయంలో,సంకల్పసహిత భానువాసర గౌతమీతీర్థస్నానానంతరం,సౌమిత్రి సహిత శ్రీభద్రాచలసీతారామచంద్రస్వామి వారి ఆలయ సందర్శనం...,శ్రీ యోగనారసిమ్హ ఆలయం....,గోదావరి తీర స్థిత సద్యోజాత శివలింగక్షేత్రం,శ్రీ అన్నపూర్ణ సమేత కాశి విశ్వేశ్వర స్వామి వారి ఆలయ సందర్శనంతో తరించిన ఈశ్వారానుగ్రహవిశేషానికి ప్రణమిల్లుతూ,....

శ్రీఆదిశంకరాచార్యుల వారిచే.....

వామాంకస్థితజానకీపరిలసత్ కోదండదండంకరే
చక్రంచోర్థ్వకరేణబాహుయుగళేశంఖంశరందక్షిణే
భిభ్రాణంజలజాతపత్రనయనంభద్రాద్రిమూర్ధ్నిస్థితం
కేయూరాదివిభూషితంరఘుపతింసౌమిత్రియుక్తంభజే

అని స్తుతింపబడిన వరదైవం, అరుదైన కలియుగ శ్రీరామనారాయణుడు, శ్రీవైకుంఠరాముడు, శ్రీభద్రగిరీషుడు, సౌమిత్రి సహిత శ్రీసీతారామచంద్రస్వామి వారు...

అనుపమానమై అతిసుందరమై
తనరు చక్రమది ధగ ధగ మెరిసెడి || అదిగో ||

https://te.wikisource.org/wiki/%E0%B0%85%E0%B0%A6%E0%B0%BF%E0%B0%97%E0%B1%8B_%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%97%E0%B1%8C%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF_%E0%B0%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%97%E0%B1%8B_%E0%B0%9A%E0%B1%82%E0%B0%A1%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF

అని ఎంతో పారవశ్యంతో శ్రీభద్రాచలరామదాసు (కంచర్ల గోపన్న) గారిచే సన్నుతింపబడిన అత్యంతమహిమాన్వితమైన సుదర్షనచక్రం ఆలయగోపురోపరికలశంగా కొలువైన అపురూపమైన ఏకశిలాలయం, దక్షిణ అయోధ్య గా భాసిల్లే, కలియుగ నవయుగ మోక్షారామం, గోదావరితీర స్థిత
శ్రీభద్రాచల శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయం...

శ్రీశైల అభయారణ్యాల్లో ఏ ఆగమాలకు చెందని స్వరూపంతో స్వయంవ్యక్తమూర్తిగా శ్రీఇష్టకామేశ్వరీదేవి అమ్మవారు ఎవ్విధంగా  కొలువై ఉన్నారో......,
భూగృహం నుండి శ్రీఆదిశంకరులవారు వెలికితీసేంతవరకు ఈ అమ్మవారిగురించి ఇక్కాలపు విజ్ఞ్యులెవ్వరికీ తెలియదు అని శ్రీచాగంటి సద్గురువులు వివరించడం కొందరికైనా గుర్తుండే ఉంటుంది...

అవ్విధంగానే
1620 వ సంవత్సరంలో జన్మించిన శ్రీకంచర్లగోపన్న గారు నిర్మించిన ఇప్పటి భద్రాద్రి ఆలాయంలో కొలువైన శ్రీసీతారామచంద్రస్వామి వారిని, రమారమి 820 వ సంవతసరంలో అనగా 800 సంవత్సరాలక్రితం, యావద్ భారతదేశాన్ని వారి ధర్మవిజయయాత్రలో భాగంగా పాదచారులై పర్యటించిన శ్రీఆదిశంకరాచార్యులవారు అంత రమ్యంగా స్తుతించారంటే, స్వామివారు ఎప్పుడు గోదావరి తీరంలో శ్రీవైష్ణవసాలగ్రామకృష్ణశిలారూపంలో ప్రభవించి కొలువైయ్యారో ఎవ్వరికీ తెలియదు...

శ్రీరమ సీతగాగ నిజసేవక బృన్దము వీరవైష్ణవా
చార జనమ్బుగాగ విరజానది గౌతమిగా వికుణ్ఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసిఞ్చు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 20 ॥

అనే పద్యం యొక్క తాత్పర్యాన్ని శ్రీచాగంటి సద్గురువులు ఎంతో రమ్యంగా వివరించడం కూడా కొందరికైనా గుర్తుండే ఉంటుంది...

సాక్షాత్తు శ్రీరామసౌమిత్రులే మోసుకొని వచ్చిన పేద్ద గుండిగలు రెండు ఇప్పటికీ శ్రీ పమిడిఘంటంవేంకటరమణహరిదాసు గారి నిరతాన్నదానసత్రంలో (అంబ సత్రం) ఎంతో ఠీవితో కొలువై ఉండడం విజ్ఞ్యులకు విదితమే...

కాశీక్షేత్రంలో వెయ్యిమందికి గావించే అన్నసమారాధన అనుగ్రహఫలం, భద్రాచలంలో ఒక్కరికి గావించే అన్నసమారాధన అనుగ్రహఫలంతో సమానం అని అంటే 
శ్రీవరభద్రగిరిక్షేత్రం యొక్క ప్రాశస్త్యం ఎట్టిదో విజ్ఞ్యులకు విదితమే...

జీవనదిగా నిత్యం గలాగలా ప్రవహించే దక్షిణభారతగంగానది   గా వాసికెక్కిన గౌతమి, విశాలగోదావరిగా విశ్వరూపాన్ని సంతరించుకోవడం ప్రారంభమయ్యే పరమపావనతీర్థక్షేత్రమే శ్రీభద్రాచలం...

కొన్ని తినాలన్నా, కొన్ని చూడాలన్నా, కొన్ని తిరగాలన్నా, కొన్ని ఆచరించాలన్నా...
ఎంతో గొప్ప పుణ్యముంటేనే సాధ్యమయ్యేది....

కాశి అన్నపూర్ణ అన్నప్రసాదం మరియు
పురి జగన్నాథుడి అన్నప్రసాదం తినాలన్నా...,

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించాలన్నా...,
సద్యోజాత శివలింగక్షేత్రాన్ని దర్శించాలన్నా..., 

అరుణాచల అగ్నిలింగ క్షేత్రం,
శ్రీశైలం జ్యోతిర్లింగ / శక్తిపీఠ క్షేత్రం పర్యటించాలన్నా...,

భానువాసరం నాడు సంకల్పసహిత శ్రీభద్రాచల తీర గోదావరి తీర్థస్నానం ఆచరించాలన్నా...,
గంగానదీ స్నానం ఆచరించాలన్నా....,

ఎంతో గొప్ప పుణ్యముంటేనే సాధ్యమయ్యేది....
ఎందుకంటే ఇవి ఎంతో మహిమాన్వితమైన పుణ్యసంచయకారకాలు అని విజ్ఞ్యుల ఉవాచ....

(పురి జగన్నాథుడు తమ అమృతమయమైన అన్నప్రసాదాన్ని నాకు త్వరలోనే అనుగ్రహించుగాక....అని ఆకాంక్షిస్తూ...)

శ్రీ 2025 విశ్వావసు కార్తీక బహుళ పంచమి ప్రయుక్త భానువాసర పర్వసమయంలో,
సంకల్పసహిత భానువాసర గౌతమీతీర్థస్నానానంతరం,
సౌమిత్రి సహిత శ్రీభద్రాచలసీతారామచంద్రస్వామి వారి ఆలయ సందర్శనం...,
శ్రీ యోగనారసిమ్హ ఆలయం....,
గోదావరి తీర స్థిత సద్యోజాత శివలింగక్షేత్రం,
శ్రీ అన్నపూర్ణ సమేత కాశి విశ్వేశ్వర స్వామి వారి ఆలయ సందర్శనంతో తరించిన ఈశ్వారానుగ్రహవిశేషానికి ప్రణమిల్లుతూ, సర్వం భద్రగిరి మూర్ధ్ని స్థిత
శ్రీసీతారామచంద్రపరబ్రహ్మార్పణమస్తు...🙏💐🙂

No comments:

Post a Comment