Sunday, December 21, 2025

శ్రీ విశ్వావసు 2025 ధనుర్మాస పావన శ్రీవ్రత పర్వసమయ శుభాభినందనలు...🙂💐 [ Dec-16-2025 thru Jan-13-2026 ]


మార్గశిరమాసం / ధనుర్మాసం అనగానే తిరుప్పావై పాశురానుసంధానం / పఠనం తో ప్రతిధ్వనించే శ్రీవైష్ణవాలయాల ప్రాభవం కడుమధురమైనది....

సాక్షాత్తు భూదేవి అంశలో కోదై / గోద / చూడికుడుత్త నాచ్చియార్ గా,  శ్రీవిళ్ళిపుత్తూర్ తులసివనంలో పెరియాళ్వారులకు అనుగ్రహింపబడిన ఆదిపరాశక్తి ఆండాళ్ తల్లి....

జీవజీవేశ్వర మధురభక్తికి ప్రత్యక్షతార్కాణంగా తన జీవితయాత్రను శ్రీరంగనాథుని ఆరాధనామంజరిగా గావించి శ్రీరంగనాయకిగా అధ్యాత్మ జగత్తులో శాశ్వత సర్వోత్తమ శ్రీవైష్ణవభక్తిలోకచింతామణి గా రూపాంతరం చెంది, పన్నిద్దరాళ్వారుల్లో ఏకైక మహిమాన్వితశ్రీమహిళామణి గా పరిఢవిల్లే పరమపదనాథుడి ప్రియసఖి...

" శ్రీవైష్ణవభక్తిలోకచింతామణి " అని ఆండాళ్ తల్లిని అభివర్ణించడంలోని ఆంతర్యం ఏమనగా....

గోదమ్మ దర్శించి రచించి అందించిన ముప్పది ద్రావిడ పాశుర సారస్వతం, ద్రావిడవేదంగా భాసిల్లే నాళాయిరదివ్యప్రబంధసారస్వత మహిమ్నతను తనలో నిక్షిప్తం చేసుకున్న సంక్షిప్తద్రవిడవేదసారం.... అని విజ్ఞ్యుల ఉవాచ....

ఈ కలియుగానికి లభించిన 5వ వేదంగా శ్రీవేంకటేశ్వరసంకీర్తనా వేదాన్ని అభివర్ణించిన శ్రీతాళ్ళపాక అన్నమార్యుల అంతరంగమే, ఆనాడు ఆండాళ్ తల్లి తన శ్రీవ్రత / తిరుప్పావై 30 పాశురాల్లో నిక్షిప్తం గావించి పరమాత్మను సంకీర్తించి తరించారు.....

అందుకే శ్రీ నమ్మాళ్వార్ రచించిన తమిళ గ్రంథం "తిరువాయిముడి" అనే పదంతో గౌరవించి 
శ్రీవేంకటేశ్వరసంకీర్తనా వేదాన్ని అన్నమాచార్యులవారు మనకు సెలవిచ్చారు ఈ క్రింది అరుదైన సంకీర్తనలో...

తమిళనాట శ్రీనమ్మాళ్వారుల "తిరువాయ్ముడి" ఎంతగానో ప్రశస్తిని పొందిన శ్రీవైష్ణవభక్తిసారస్వతరాజం...!
మీకు "తిరువాయ్ముడి" యొక్క మహిమ గురించి తెలియాలంటే, ఆరోజుల్లో ఒక సాధారణ సింగర్ అయిన శ్రీమతి శోభారాజు గారిని, పద్మశ్రీ, అన్నమయ్యపదకోకిల శ్రీమతి డాక్టర్ శోభారాజు గారిగా, తీర్చిదిద్దిన "శ్రీ నమ్మాళ్వార్" ఆలయం,
[ తిరుపతి శ్రీకామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళే మార్గంలో, శ్రీ అభయాంజనేయస్వామి వారి ఆలయం తర్వాత కొలువుతీరిన ఆలయం ] లో ధ్యానించి తెలుసుకోగలరు...

కలియుగంబునకు గలదిదియే
వెలసిన పంచమ వేదమె కలిగె ||

పరమగు వేదము బహుళము చదివియు
హరి నెరిగిన వారరుదనుచు
తిరువాయిముడియై దివ్య మంత్రమై
వెలసిన పంచమ వేదమె కలిగె ||

బింకపు మనుజులు పెక్కులు చదివియు
సంకెదీర దెచ్హుట ననుచు
సంకీర్తనమే సకల లోకముల
వేంకటేశ్వరుని వేదమె కలిగె ||

అంతటి మహాత్మ్యభరిత ద్రావిడ పాశురసారస్వతం కాబట్టే, శ్రీచాగంటి గారు తిరుప్పావై ని ఒక ప్రత్యేక ప్రవచన టాపిక్ గా ఎంచుకొనిమరీ, ప్రాచీన తమిళం బాగా చదవగల ఒక అమ్మయితో తిరుప్పావై పాశురాలను చదివింపజేయిస్తూ అప్పట్లో ప్రవచనాలు కూడా అనుగ్రహించారు..

అంతటి మహిమోపేతమైన తిరుప్పావై పాశుర వేదానికి తలమాణికమైన పాశురంగా అలరారే 27వ పాశురం / కూడారై పాశురంలో నిక్షిప్తమైన పరమపదసోపానతత్త్వం గురించి శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆనందనిలయంలో తిరుప్పావై పఠనం ప్రారంభైన తదుపరి, స్వామివారి అనుగ్రహంతో, మార్గళి ప్రారంభమై సూర్యుడి ధనూరాశిలోకి ప్రవేశించిన తదుపరి వివరిస్తా.....

సర్వం శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత,
శ్రీభూసహితశ్రీశ్రీనివాస శ్రీచరణారవిందార్పణమస్తు....🙏🙂💐

No comments:

Post a Comment