వ్యవస్థీకృత వినిమయాంతర్భాగంగా ఓ నాలుగు ధర్మదానం గావించు వత్సా .....
అని సాక్షాత్తు శ్రీజగద్గురు సంస్థానం నుండి అనుగ్రహం లభించగా....
అందలి శ్రేయస్కరమైన ఆంతర్యాన్ని, అంతరార్ధాన్ని, అర్ధంచేసుకొనే మేధోపరిణతి లేని వారు...,
ఎదుట సాక్షాత్తు పరమేశ్వరప్రసాదిత శ్రీచంద్రమౌళీశ్వర స్ఫటికశివలింగానికి శ్రీజగద్గురువులు శ్రీరుద్రాభిషేకం గావిస్తూ భక్తులెల్లరినీ అనుగ్రహిస్తూ ఉంటే, మనోలగ్నత వేదిక దిశగా కాక...,
ముందువరుసలో కూర్చున్న సదరు భక్తుడు, ఏం చేస్తున్నాడు, ఏం దర్శిస్తున్నాడు, శ్రీరుద్రసూక్తం ఎట్ల చదువుతున్నాడు...,
ఇతడిమీద నిఘా పెట్టమని మనల్ని ఒక భక్తుడి రూపంలో ఇక్కడికి పంపించిన వారికి ఇతడు ఏమౌతాడు...,
అని పనికిమాలిన డిటెక్టివ్ వేషాలు వేసేవారికి,
కనీసం శ్రీరుద్రనమక అష్టమానువాకం కూడా సరిగ్గా పఠించడంరాని వారికి,
కళ్ళెదుట అపర శ్రీదక్షిణామూర్తి స్వరూపులై ఆసీనులైన శ్రీజగద్గురువులకు పద్ధతిగా నమస్కరించడం కూడా రాని వారికి...,
"ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ "
అనే ఉన్నతమైన స్థాయిలో, శ్రీగురుశిష్యుల మధ్య జరిగే మౌనసంభాషణ గురించి, అందలి ప్రతిపాదిత సారాంశం గురించి, విచారించడం కొందరు మూర్ఖులకు "అవసరమా..." ?
శ్రీజగద్గురువుల మౌన అనుగ్రహ ఆశీర్వాదాన్ని వివేచించి వారివారి అభిప్రాయాలను, స్పందనలను తెలియజేసేంతటి స్థాయి ఈ లోకంలో "ఎవ్వరికీ" కూడా ఉండదు అని అనడం నిర్వివాదాంశం....
ఎందుకంటే శ్రీజగద్గురువులు అలంకరించి ఉన్నది సాక్షాత్తు శ్రీసరస్వతిదేవితో సంభాషించి, చర్చోపచర్చలు గావించి,
కాశ్మీర సర్వజ్ఞ్య పీఠాన్ని అధిరోహించిన శ్రీఆదిశంకరాచార్యుల అనుగ్రహంతో పరిఢవిల్లే శ్రీశారదాంబాపీఠం....
అట్టి పీఠాన్ని అలంకరించి ఉండే మాన్యుల బోధ, సాక్షాత్తు శ్రీఆదిశంకరాచార్యుల బోధయే అగును...
కావున, కొంగలు వచ్చి హంసలకు క్షీరనీర న్యాయం గురించి వచించాలని అనుకోవడం అత్యంత హాస్యాస్పదమైన అంశంగా ఉండును అనే విజ్ఞ్యతతో మసులుకోవడం ఎల్లరికీ మంచిది...
"భద్రకాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః |
వేద వేదాంగ వేదాంత విద్యాస్థానేభ్య ఏవ చ ||
భద్రమైన అనుగ్రహాన్ని ప్రసాదించే ఓ భద్రకాళీ నీకు నిరంతర నమస్కారాలు! వేదములకు,వేదాంగములకు,వేదాంతాలకు,, మరియు అన్ని ఇతర విద్యలకు నీవు మూలమూర్తివి.
ఓ విద్యా దేవత, నీకు నమస్కారాలు."
అని శ్రీశాదదాదేవిని నమస్కరిస్తున్నది శ్రీ అగస్త్య మహర్షి శ్రీశారదాస్తోత్రం....
అనగా..,
ఋగ్, సామ, యజుర్, అథర్వణం అనే 4 వేదాలు....
శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, కల్పం, జ్యోతిషం అనే 6 వేదాంగాలు....
1. ఈశావాస్య ఉపనిషత్తు (శుక్ల యజుర్వేదం)
2. కేన ఉపనిషత్తు (సామవేదం)
3. కఠ ఉపనిషత్తు (కృష్ణ యజుర్వేదం)
4. ప్రశ్న ఉపనిషత్తు (అథర్వవేదం)
5. ముండక ఉపనిషత్తు (అథర్వవేదం)
6. మాండూక్య ఉపనిషత్తు (అథర్వవేదం)
7. తైత్తిరీయ ఉపనిషత్తు (కృష్ణ యజుర్వేదం)
8. ఐతరేయ ఉపనిషత్తు (ఋగ్వేదం)
9. ఛాందోగ్య ఉపనిషత్తు (సామవేదం)
10. బృహదారణ్యక ఉపనిషత్తు (శుక్ల యజుర్వేదం)
అనే ప్రధానమైన 10 ఉపనిషత్తులు / వేదాంతాలు
[
11. శ్వేతాశ్వతర ఉపనిషత్తు (కృష్ణ యజుర్వేదం)
12. కౌషీతకీ ఉపనిషత్తు (ఋగ్వేదం)
]
మరియు ఇతర అన్నీ విద్యలను సాకారస్వరూమైన / మూలమూర్తియైన శ్రీశారదాదేవికి నమస్కారం...
అని శ్లోక తాత్పర్యం...!
"అట్టి శ్రీశారదాదేవి ఉపాసకుల వాగ్వైభవానికి, జ్ఞ్యానమార్గనిర్దేశిత్వానికి, శ్రేయోకారకవిద్యాప్రకాశత్వానికి,
ఎవరు ఈ లోకంలో సాటిరాగల వారు....?"
అని ఎవరికి వారు వివేచన గావించడం విజ్ఞ్యత అనబడును..
***** ***** ***** ***** ***** ***** ***** ***** *****
రాకచంద్రాభాసమానవారిజవదనాం
రాచకీరస్థపాణిపద్మశోభితకంబుకంఠీం
రజనీశకళాధరాంచితశిరోభూషణాఢ్యాం
రమాగిరిసుతనుతవైరించిశక్తిస్వరూపాం
నమామిచిన్ముద్రధరసకలసుజ్ఞానదాం
నమామినాదస్వరూపనందివిద్యాప్రదాం
నామామిసంతతసకలసురసేవితపాదపద్మాం
నమామిశ్రీశారదాపరమేశ్వరీంశర్వసహోదరీం
శ్రీశారదాంబాపాదపద్మముల చెంత వినయభరిత చిరు కవనకైంకర్యనమస్సుమాంజలి...🙏💐
***** ***** ***** ***** ***** ***** ***** ***** *****
సర్వే సుజనాః సుఖినోభవంతు...💐
No comments:
Post a Comment