Friday, January 11, 2019

శరణంటి మాతని సమ్మంధమునజేసి | మరిగించి మమునేలి మన్నించవే ||

అన్నమాచార్యుల వారి పదకవితల ఆణిముత్యాల అల్లికల కూర్పులో ఇది ఒక అరుదైన ఘనమైన సంకీర్తన గా భావించవచ్చు.....
ప్రతిపాదించబడిన భావం తో పాటుగా, కొద్దిగా గమనిస్తే
" శ్రీవేంకటనిలయ " అనే పదప్రయోగంతో అన్నమార్యుల వారి సంకీర్తనల్లోని ' వేంకట ' అనే ఆచార్య ముద్ర ఇందులో ఒక్కసారికి బదులుగా 3 సార్లు రావడం విశేషం..
సాధారణంగా చరమచరణంలోని ద్వితీయార్ధంలో వచ్చే ' వేంకట ' ముద్ర ఈ కీర్తనలో శాక్తేయ ప్రణవమైన శ్రీకారంతో సమ్మిళితమై ' శ్రీవేంకటనిలయ ' గా 7 అక్షరాల పదమై 3 సార్లు రావడం, అంటే 21 అక్షరాలుగా పరతత్వ ప్రాభవాన్ని స్థిరపరిచి,
అట్లే " తాళ్ళపాకన్నమాచార్యుల " అంటూ కృతికర్త యొక్క నామధేయాన్ని ఆచార్య శబ్దగుణకంతో కలిపి 9 అక్షరాల పదం గా 3 సార్లు, అంటే 27 అక్షరాల్లో తమ కర్తృత్వాన్ని కీర్తనలో స్థిరపరిచి,
భగవద్ నామ మకుటం + ఆచార్య నామధేయం తో కలిపి, అంటే (7x3=21) + (9x3=27) = వెరసి 48 అక్షరాల్లో,
( 84 లక్షల జీవరాశుల సంఖ్యను తిరగేస్తే 48 )
జీవాత్మ యొక్క శరణాగతి + పరమాత్మ యొక్క వాత్సల్యతతి ని, దృఢపరిచేలా సంకీర్తనను రచించడం ఒకెత్తైతే,
" సకలవేదములు సంకీర్తనలుచేసి | ప్రకటించి నిను బాడి పావనుడైన | అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యుల | వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ || "
అని చెప్పడంలో, సకల వేదాల సారానికి సంక్షిప్తంగా ఒక కర్ణపేయమైన మనోరంజకమైన సంకీర్తన రూపును సంతరింపచేసి, భక్త భాగవత ప్రజానీకానికి అందివ్వడంలో, తమ సంకీర్తనయజ్ఞ్యం లోని సందేశాన్ని చెప్పకనే చెప్పడం జరిగింది...
అంటే ఈ కలియుగంలో భగవద్ నామగుణవైభవ కీర్తనమే సకల వేదాధ్యయనార్జిత భక్తిజ్ఞ్యానానికి సాటి అయిన యుగధర్మం అని, తన్మూలంగానే సమస్త మానవాళికి హృదయస్వచ్ఛత అలవడి సకల శ్రేయొభివృద్ధికి రాచమార్గము సిద్ధిస్తుందని, ఆచార్యుల ఆనతిగా అందివ్వబడిన అమరవంద్యుడి ఈ కలియుగ గీతోపదేశం...!! 
Shaik Rafi to ఫేస్ బుక్ అన్నమయ్య.. facebook annamayya
అన్నమాచార్య 598:1,2,3,4
1.శరణంటి మాతని సమ్మంధమునజేసి | మరిగించి మమునేలి మన్నించవే ||
2.సకలవేదములు సంకీర్తనలుచేసి | ప్రకటించి నిను బాడి పావనుడైన | అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యుల | వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ ||
3.నారదాది సనకసనందాదులవలె | పేరుపడి నిన్ను బాడి పెద్దలైనట్టి | ఆరీతి దాళ్ళపాకన్నమాచార్యుల | చేరి యేలినయట్టి శ్రీవేంకటనిలయ ||
4.సామవేద సామగాన సప్తస్వరములను | బాముతో నీసతినిన్ను బాడినయట్టి | ఆముకొన్న తాళ్ళపాకన్నమాచార్యుల | వేమరుమెచ్చిన శ్రీవేంకటనిలయా ||

Wednesday, January 9, 2019

సంక్రాంతి పండుగ సంబురాల్లో భాగమైన పతంగుల ఉత్సవాంతర్గతంగా నాకు తోచిన జీవన సారం..... :)

సంక్రాంతి పండుగ సంబురాల్లో భాగమైన పతంగుల ఉత్సవాంతర్గతంగా నాకు తోచిన జీవన సారం..... 
అస్మద్ గురుదేవులు, శ్రీ చాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాల సారంగా దర్శించిన మనుష్య జీవన సాఫల్యతను / అనేకానేక శరీరాలను ధరించే జీవుడి గమనాన్ని, సంక్రాంతి పండుగ యొక్క ప్రత్యేక ఆకర్షణగా ఉండే పతంగుల (గాలిపటాల) ఉత్సవాంతర్భాగంగా వర్ణించే చిరు ప్రయత్నం చేస్తాను..
" దీపావళి పటాకీల తర్వాత సంక్రాంతి పతంగుల్లో కూడా పరతత్వ విషయ ప్రామాణ్య స్థిరీకరణ చేస్తున్నావా నాయనా..." అని అనుకుంటారేమో....
మన పూర్వీకులు ఏర్పరిచిన ప్రతి పండుగలో, ప్రతి ఆటలో, ప్రతి ఆచారంలో, ఎన్నెన్నో గొప్ప అధ్యాత్మ విజ్ఞ్యాన విషయాలు దాగున్నాయి అని మన పెద్దలు ఎప్పుడూ చెప్పడం చూస్తూనే ఉంటాం...
దేహం దహ్యం కాకముందే అవి శక్తిమేర గురువులచే తెలుకుసుని, ఆ జ్ఞ్యాన గంధాన్ని అలదుకుని, అసంఖ్యాక జన్మల పరంపర అనే చక్రం నుండి విడివడి, పరమాత్మలో ఐక్యం అవ్వడమే కదా ప్రతి జీవి యొక్క తుది గమ్యం...!
భోగి - మకరసంక్రాంతి - కనుమ - ముక్కనుమ / పొంగల్ / లొహ్రి / గుడిపడ్వ ఇత్యాది పేర్లతో భరతభూమి పై ఎన్నో ప్రదేశాల్లో జరుపుకునే పండుగ సంక్రాంతి... మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, సంక్రాంతి అంటే, దసరా, దీపావళి, తర్వాత ఇంకో పెద్ద పండుగే...
సంక్రాంతి పండుగ యొక్క శాస్త్ర సంబంధమైన విశేషాలు టీ.వీ ల్లో ఎందరో ఆధ్యాత్మికవేత్తలు, గురువుల దెగ్గర వినే ఉంటారు...
సూర్యుని మకర సంక్రమణాన్ని పురస్కరించుకొని జరుపుకోవడం, చాంద్రమాన మరియు సౌరమాన - సాయన సిద్ధాంతాల్లో కూడా సరిగ్గా ఒకేసారి జరుపుకునే పండుగ, దక్షిణాయనం నుండి ఉత్తరాయనం వైపుగా, చైత్రం మొదలు ఫాల్గుణం వరకు ఉండే 12 మాసములతో, వసంత-గ్రీష్మ-వర్ష-శరద్-హేమంత-శిశిరం వరకు 6 ఋతువులతో ఉండే సంవత్సర కాలచక్రపు గమనాన్ని, సూర్యుని సప్తాశ్వ రథ చక్రలాను ఉత్తరం వైపునకు సూర్యరథసారథిగా ఉండే వినతా జ్యేష్ఠ పుత్రుడు ( గరుత్మంతుని అన్నయ్య ) అనూరుడు మళ్ళిస్తూ...,
వానలు, చీకట్లు, చలి తో కొంత ఇబ్బంది గా సాగిన కాలాన్ని,
వెలుతురు, ఆహ్లాదాం, పచ్చదనం, వైపుగా తీసుకెళ్ళడం, ఆరుగాలం శ్రమించిన రైతులకు సస్యలక్ష్మి గా పంటచేతికి అందివచ్చే కాలం, ఇత్యాది పరంగా సంక్రాంతి పండుగ యొక్క విశేషాలను వినే ఉంటారు....
శాస్త్ర సంబంధంగా కాకపోయినా, కాలక్రమంలో లౌకిక ప్రాంతీయాచారంగా వచ్చి చేరిన ఉత్సవాలు, పద్దతులు, ఆటపాటలు, కొన్ని మనం చూస్తూనే ఉంటాం...
అట్లాంటివే ఈ సంక్రాంతి గొబ్బెమ్మలు, డూ డూ బసవన్నలు / గంగిరెద్దులతో ఒగ్గు కథ / హరి కథ గానం చేసే హరిదాసుల నృత్యాలు, పతంగుల ఉత్సవాలు మొదలైనవి అన్నమాట... 
సంక్రాంతి పండుగ అనగానే అటు వినువీధులన్నీ రంగురంగుల పతంగులతో, ఇటు తెలుగింటి లోగిళ్ళన్నీ రంగు రంగుల రంగవల్లికలతో చూడముచ్చటగా మారిపోవడం కద్దు.....
చిన్నప్పుడు, అంటే మా స్కూల్ డేస్ లో, సంక్రాంతి పండుగ అనగానే మాఇంట్లో హాఫ్ ఇయర్లీ ఎగ్సాంస్ అయిపోయి నేను, తమ్ముడు 1 వీక్ హాలిడేస్ లో ఉండే టైం....
కాలని కమాన్ దెగ్గర ఉండే బాగా ఫేమస్ అయిన ' రాజన్న హోల్ సేల్ పతంగీల షాప్ ' లో ఈ సారి ఏ స్టైల్ పతంగీలు కొనాలి ? ఏ కలర్ మాంజా కొనాలి..? సజ్జపైన ఉన్న లాస్ట్ ఇయర్ చరక్ వాడాలా లేదా కొత్త చరక్ కొనాల..? సంక్రాంతి టైంలోనే వచ్చే నా బర్త్ డేకి ఈ సారి కొత్త డ్రెస్ అమీర్పేట్ చెర్మస్ లో కొనాలా లేక బాలానగర్ ఎస్.కుమార్ లోనా...? బర్త్ డేకి అమ్మని గులాబ్ జామూన్ చేయమనాలా లేక డబల్-కా-మీఠా నా..?
అంటూ సాగేవి మా హాలీడే టైం టాక్స్...
నేనూ, తమ్ముడు...ఇద్దరూ ఇద్దరే....ఎవరి పతంగీలు వారివి...ఎవరి మాంజ వారిది...ఎవరి ఫ్రెండ్స్ తో వారు... ఎవరు ఎన్ని పతంగీలు ' పేంచ్ లో అఫ్ ' చేసామో, అఫ్ అయిన పతంగీలు ఎవరికి ఎన్ని దొరికాయో, పొద్దున మొత్తం కాలని అంతా తిరుగుతూ పతంగీలు ఎగిరేసి సాయంత్రం అలిసిపోయి ఇంటికి వచ్చి, అమ్మ చేసిన సంక్రాంతి స్పెషల్ అరిసెలు, సకినాలు, మురుకులు, తింటూ,
' అరెయ్ విజ్జు, నీకు దొరికిన ఈ గుడ్డు డిసైన్ పెద్ద పతంగి నాకు ఇయ్యవారా ప్లీజ్...నీకు 2 సకినాలు ఎక్కువ ఇస్తరా...." అని నేను....
' నీకు దొరికిన ఆ పెద్ద తోకపతంగి, దాని మాంజ కూడా నాకు ఇస్తే...అప్పుడు నాకు దొరికిన గుడ్డు డిసైన్ పెద్ద పతంగి నీకు ఇస్తా అన్న..." అని వాడు...
ఇలా ఇద్దరం మాకు ఆ రోజు దొరికిన పతంగీల లెక్కలను సరి చూసుకుంటూ, చిరిగిన పతంగీలను పేపర్ ముక్కలకు అన్నం మెతుకులు రాసి అతికించి సరిచేసుకుంటూ, తెగిపోయిన ' కన్నాలను ' సరిగ్గా కడుతూ, మరునాటి కైట్ ఫ్లయింగ్ కి సంసిద్ధమయ్యే మా సుందర బాల్యకౌమారపు రోజులు సదా ఆనందాన్ని పంచే మధురస్మృతులే కదా...
సజ్జపైన దాచి పెట్టిన పతంగీలు ఎవరికైనా కనిపిస్తే తీసుకుంటారేమో అని, నా ఇంటర్ 1స్ట్ ఇయర్ వరకు (2003 వరకు) మాకున్న 50 గజాల చిన్న 2 రూముల సిమెంట్ రేకుల ఇంటి పైకి పాకిన సోరతీగ ఆకుల క్రింద పతంగీలను దాచిపెట్టడం తలచుకొని ఇప్పటికీ అప్పుడప్పుడు ఆపకుండా నవ్వుకుంటాను నేను...!
ఆ చిన్ననాటి పతంగుల ఆటలో కూడా ఎంతటి ఆధ్యాత్మికత దాగుందో,
10 తరగతి తర్వాత 6 సంవత్సరాలకు, బి.టెక్ డేస్ నుండి ఒక 7 సంవత్సరాల పాటున్న జీవితంలోని ఎంతో గడ్డుకాలంలో నాకు లభించిన ఎకైక స్వాంతన, శ్రీ చాగంటి సద్గురువుల బోధాంతర్భాగంగా జీవితాన్ని సమన్వయం చేసుకున్నప్పుడు గోచరించి,
" ఔరా...ఎంతటి ఘనమైనది మన సనాతన సంప్రదాయప్రతిపాదిత విజ్ఞ్యాన సారస్వతం..." అని అనిపించి, సద్గురువుల శ్రీమద్భాగవతప్రవచన బోధలో సంక్రాంతి పతంగులను కూడా దర్శించి తరించాను...!
ఆ సమన్వయం ఏమనగా...
చిన్నవి, పెద్దవి, ఆ రంగు, ఈ రంగు, ఆ స్టైల్, ఈ స్టైల్, అన్నీ కలిపి పతంగులు ఎన్ని రకాలైనా సరే, వాటన్నిటి ఉనికికి ఆధారం 2 పుల్లలు / వెదురు బద్దలు మాత్రమే....
ఇక్కడ ఆ పతంగుల తయారీకి ఉపయోగించిన పేపర్ / కవర్, 7 ధాతువుల మానవ శరీరం అని భావిస్తే, ఆ శరీరానికి ఉనికిని ప్రసాదించేందుకు మూలకారణమైనవి ఆ 2 పుల్లలు...
ధనస్సు లేదా శుద్ధ తదియనాటి చంద్రవంక లా అడ్డంగా ఉండే ఆ బద్ద జీవుడి " జన్మ " మరియు, ధనస్సును ఎక్కు పెట్టినట్టు ఉండే ఆ నిలువు బద్ద, జీవుడి " కర్మ " ....
అసలు జీవుడికి ఐహిక ఉనికి ఏర్పడడానికి మూలకారణం, ఈ " జన్మ - కర్మ " అనే ఇరు బంధనములు మాత్రమే ...
అవి రెండు లేనినాడు జీవుడికి ఉనికే లేదు.. లేదా, ఉనికి ఉండవలసిన అవసరమే లేదు..!
( షాప్ లోకి వెళ్ళిన పిల్గాడు పతంగి కొనే ముందు చూసేది ఆ రెండు పుల్లలు సరిగ్గ ఉన్నాయా లేదా అనే...అవి సరిగ్గ లేకుంటే అది పక్కనపారేసి, ఇంకో పతంగి చూస్తాడు...)
అలా ఒక మంచి పతంగి షాప్ నుండి కొనితెచ్చి మనం మొట్టమొదట చేసేది దానికి ' కన్నాలు ' కట్టడం...
( ఇక్కడ ' కన్నాలు ' అంటే చిల్లులు అని కాదు...రెండు బద్దలు కలిసే చోట రెండు చిల్లులు వేసి, కొంచెం దూరంలో తోకకు దెగ్గరగా ఇంకో 2 చిల్లులు వేసి, దారంతో ఆకాశంలో గాలిపటం యొక్క వాయుగమనానికి అనువైన ఒక నియమిత కొలతలు గల వ్యవస్థను దానికి బిగించడం...
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పరిభాషలో ఒక ఏరోడైనమిక్ ప్రొపెల్లింగ్ మాడ్యూల్ ని స్పేస్ క్రాఫ్ట్ కి అనుసంధానించడం అన్నమాట... )
అలా ఆ రెండు ' కన్నాలు ' కట్టకుంటే గాల్లో అది ఎగరవేయడం కుదరదు...
ఒక జీవుడు " జన్మ - కర్మ " అనే ఇరు బంధనాల కారణంగా, సప్తధాతువుల ఒక శరీరధారియై ప్రపంచంలోకి ప్రచేశించాక, పరమాత్మ ఆ జీవుడికి ప్రసాదించిన " మనసు - బుద్ది " అనే ఇరు అగోచర శరీర పగ్గాలే ఆ రెండు కన్నాల వాయుగమన వ్యవస్థ..... వాటి ఆధారంగానే వినువీధిలో పతంగి యొక్క గమనం శాసించబడుతుంది...
అదేవిధంగా " మనసు - బుద్ధి " అనే శరీరపు ఇరు పగ్గాల ఆధారంగానే ప్రపంచంలో మనుష్య ప్రాణియొక్క గమనం శాసించబడుతుంది...
చరక్ కి చుట్టుకుని ఉన్న దారం ఆధారంగా, ఎంత దూరంవీలైతే ఆకాశంలో అంత దూరం ఆ పతంగి తన పయనం సాగిస్తుంది...అది దారం ఉన్నంతలో ఒక పరిమిత పరిధివరకే...
ఒక శరీరధారికి పరమాత్మచే ప్రసాదించబడిన శ్వాస లెక్కలప్రకారంగా, తన ఆయుః ప్రమాణం పూర్తయ్యేంతవరకు ఒక ప్రాణి కూడా అట్లే ఈ ప్రపంచంలో తన పయనం సాగిస్తుంది...
ఇక మధ్యలో ఉండే ఆ డీల్, కీంచ్, కట్ మారో, రోక్ మారో, పిలాయించు, ఇధర్ పిలావో, ఉధర్ పిలావో, అఫ్ చేయడాలు, చరక్ లప్టాయించు, లచ్చకొట్టు, ఇలాంటివన్ని మన ఐహిక ప్రపంచజీవితపు రోజువారి లేచామా, తిన్నామా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదో ఒకటి మాట్లాడుకున్నామా, పనిచేసామా, పడుకున్నామా, మళ్ళి లేచామా రిపీట్ చేసామా....లాంటి రెగ్యులర్ గోల గా అనుకోవచ్చు.... 
ఆకశంలోకి రై రై అంటూ ఎగిరిన ఒక పతంగి యొక్క ప్రస్థానం, ఒక పేంచ్ లో అటు ఇటు పోరాడి చివరికి నానా రభస పడి అఫ్ అయిపోవడం తోనో, లేదా ' చిరిగి కరాబ్' అవ్వడంతోనో, లేదా అసల్ అనుకోని రీతిలో ఎగరవేస్తూ ఉండగానే, చరక్ కి దారం చివర ముడివేయకపోవడంతో చేతిలో నుండి దారం కొస జారిపోయి వాయువేగానికి తృటిలో మనతో సంబంధం కోల్పోయి ఆ విశాలవినీలాకాశంలో అలా కలిసిపోవడంతోనో, ముగిసిపోతుంది...! (లేదా అఫ్ అయిన ఆ పతంగి ఎక్కడో దూరంగా పడి, మనకు ఏ మాత్రం సంబంధంలేని ఎవరికో అది దొరికి, వారి కొత్త దారంతో తన పాత దారం ముడిపడి, పాత కొత్త దారాల సమ్మిళిత సంఘాతంతో, ఇంకేవైనా కొన్ని మార్పుచేర్పులతో ఆకాశంలో ఇంకో సరికొత్త ప్రస్థానం మొదలుపెడుతుంది...! )
అదే విధంగా ఒక ప్రాణి, తన విరించి లిఖిత ఆయుః ప్రమాణం పూర్తయ్యి చరమాంకంలో దగ్గు, ఆయాసం తో అటు ఇటు పోరాడి నానారభస పడి కాలం చేయడమో,
లేదా మధ్యలోనే ఎక్కడో గండకాలపు ఘడియలకు అకాల కాలంచేయడమో, లేదా అనుకోని విధంగా, రోజువారి జీవితంలోనే అందరితో నవ్వుతూ, మాట్లాడుతూ అందరూ చూస్తుండగానే సంపూర్ణ చేతనతో ఉండి ఈశ్వర నామస్మరణతో తృటిలో కనుమూసి ఈశ్వరైక్యం చెందడంతో, తమ లౌకిక ప్రస్థానానికి ముగింపు పలకడం...!
ఒక్కోసారి, కొంత విశేషమైన కర్మయొక్క ప్రభావంచే ఒక చోట గతించిన జీవుడు, అతి కొద్ది కాలానికే కర్మశేషం పూర్తిచేయడానికి ఇంకొంకరి ఇంట్లో జన్మనెత్తి ప్రారబ్ధలెక్కలకు సరితూగేల జీవించి తన ప్రస్థానం ముగించడమో...లేదా యథావిధిగా అంతూ దరిలేని కర్మసిద్ధాంతపు పునర్జన్మ చట్రం ప్రకారంగా, ఆ జీవుని సంచితపు మరియు గత జన్మ తాలూకా ఆగామిని, కలుపుకొని, ' ఇంకో కొత్త ప్రారబ్ధం ' అనే సంచిలో పాతకర్మల ఫలితాలను మోసుకుంటూ ( Old wine in a new bottle, అన్న సామెత లాగ ) అనుభవించడానికి మళ్ళీ ఎత్తవలసిన జన్మను స్వీకరించి తిరిగి తన జీవ ప్రస్థానాన్ని కొనసాగించుట... అంటే 4వ రకంగా, అఫ్ అయిన ఆ పతంగి ఇంకొకరికి దొరికి,
తను విడిపోయినప్పుడు ఉన్న పాతదారం + ఇంకో కొత్త దారం కలుపుకొని మళ్ళీ ఆకాశంలో ఎగిరినట్టుగా...!
ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది...ఆ 3వ పద్దతిలో ఆకాశంలో కలిసిపోయిన పతంగి, చరక్ కు దారం కొస ముడిపడకపోవడంతో అలా గాల్లో తేలుతూ దారం యొక్క చివర రాగానే, ఈ లోకం తో సంబంధం కోల్పోయి చాలా సునాయాసంగా తన ప్రస్థానాన్ని ముగించింది...లేదా ఆ పతంగి అందనంత దూరంలో పడి మరొక కొత్త ప్రస్థానం సాగించింది..
అదే విధంగా, ఈ దేహం ఒకనాడు కచ్చితంగా దహించుకుపోయేది... అనే సత్యాన్ని తెలుసుకున్న యోగి, ఈలోకం లోనే ఉన్నాసరే లోకానికి తన మనసును-బుద్ధిని ముడిపెట్టకుండా జీవిస్తూ, లోకేశ్వరునితో పారలౌకిక అనుబంధానికై ఉన్నతంగా తనను తాను తీర్చిదిద్దుకున్న కారణంచేత, లోకపు పోకడలతో పెద్దగా సంబంధం లేకుండా, అవసాన ఘడియలు ఆసన్నమయిన మరుక్షణం ఈశ్వర నామస్మరణతో తనను తాను ఈశ్వరైక్యం చేసుకోవడంతో తమ లౌకిక ప్రస్థానానికి ముగింపు పలికినట్టు....
లేదా భూమికి దూరంగా ఉండే ఇతర పుణ్యలోకాలకు ఉన్నత ఉత్తమ జన్మలు ఎత్తేలా ఆ జీవుడు తరలి వెళ్ళాడు అన్నమాట....!
శ్రీచాగంటి సద్గురువుల వాక్కుల్లో ,
" అనాయాసేన మరణం... వినా దైన్యేన జీవితం... దేహాంతే తవ సాయుజ్యం... దేహిమే పార్వతీపతే...!"
అనేలా జీవితాన్ని సద్గురువుల అనుగ్రహం తో తీర్చిదిద్దుకున్న వారు, ఆ 3వ పతంగినిర్యాణ ( ఉన్నత జన్మలకు ఏగుట )
లేదా పతంగినిర్వాణ ( ఈశ్వర కృపతో సామీప్య/సారూప్య/సాలోక్య/సాయుజ్య మోక్షాలను గడించుట ) కోవలోకి వస్తారన్నమాట... 
ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది..
అలా 3వ పద్దతిలో చరక్ కి చివర దారం కొస ముడిపడకపోవడంతో అఫ్ అయిన పతంగులు కొన్ని, అప్పుడప్పుడు ఏదో చెట్టుకో, స్తంభానికో, మిద్దెలపై / మేడలపై, అలా ఎక్కడైనా చిక్కుకొని అలానే గాల్లో ఎగురుతూ ఉంటాయి...
ఆ పతంగి కనిపించనంత దూరంలో ఆకాశంలో ఎక్కడో ఉన్నాసరే, దాని దారం మాత్రం మనకు అందేలా చిక్కుకొని ఉండడం చూస్తుంటాం...
అంటే ఇప్పుడు ఆ పతంగి అఫ్ అయినట్టా కానట్టా ? మనకు చిక్కినట్టా ? చిక్కనట్టా..? ఎగురుతూ ఉన్నట్టా ? లేనట్టా..? అనే ఆలోచనరాక మానదుకదా..
( నాకు అలాంటి పతంగి ఒకసారి మా ఇంటి పక్కన బిల్డింగ్ పైన ఉన్న పిల్లర్ సీకులకు దారం చిక్కుకొని కనిపించడం తో, ఠక్కున వాళ్ళ ఇంటిమీదికి దూకి పిల్లర్ పైకి ఎక్కి ఆ దారం అందుకొని ఒక 20 నిమిషాలకు ఆ పతంగిని క్రిందకు దింపి, నా చరక్ కి ముడివేసి, చరక్ ని స్పీడ్ గా ' లచ్చకొట్టడం ' తో ఆహా ఇది కదా భాగ్యం అంటే...మొత్తం సాదా దారం + మాంజా తో సహా ఇంత పెద్ద పతంగి నా ముందుకు వచ్చి వాలేలా చేసావ్...సాయి బాబా ఎంత మంచి వాడివి నువ్వు ...నీకు ఈ గురువారం పెద్ద కొబ్బరికాయి కొని కొడ్తాలే....నెక్స్ట్ ఇయర్ కి కూడా దారం కొనే అవసరం లేకుండా చరక్ మొత్తం ఫుల్ల్ అయ్యింది...అహా ఓహూ అంటూ సంబురపడ్డాను....  )
ఇదేవిధంగా అతి కొద్ది మంది మహానుభావులు, తాము తప్పక అనుభవించ వలసిన సంచిత, ప్రారబ్ధ కర్మశేషం పెద్దగా లేకపోయినాసరే, ఉన్నతమైన లోకాలకు వెళ్ళిపోకుండా, చతుర్విధ మోక్షాల్లో తమకు శ్రేష్టమైంది స్వీకరించి పరమాత్మలోకి వెళ్ళిపోకుండా, మన మధ్యనే ఉంటూ, సాటి జీవులందరు ధర్మమార్గంలో ప్రయాణించేందుకు వీలుగా ఆచార్యులై, సద్గురువులై, నిలిచి అనుగ్రహిస్తూ భువిపై అందరిలాగే తిరుగాడే మహాపురుషులు కొందరు ఆ కోవకు వస్తారన్నమాట...
శ్రీ చాగంటి సద్గురువులు, శ్రీ సామవేదం వారు, శ్రీ ఆదిశంకరాచార్య స్థాపిత శృంగేరి-ద్వారక-బదరి-పురి చతురామ్నాయ మరియు కంచి పీఠాధిపతులు, యతీశ్వరులు, యోగులు, ఇత్యాది పుణ్యపురుషులందరు...
వీరు జీవన్ముక్తులు / 5వ రకమైన విదేహముక్తిని గడించిన వారు...వీరు సమసమాజంలో మన మధ్యనే ఉండి సదా అనుగ్రహించడం వల్లే మన జీవితాలు కూడా అన్నిట్లో ఫుల్లుగా ఉండి, వారి బోధలు మనలను ముక్తితీరాలకు చేర్చే కరదీపికలై మనకు సదా తోడునీడై సహకరించుట...!
అస్మద్ గురుదేవుల " శ్రీ పోతనామాత్యుల శ్రీమద్భాగవతం " బోధలో సంక్షిప్తంగా నేను దర్శించిన సంక్రాంతి పతంగుల్లోని పరతత్వ సారం ఇదన్నమాట... 
సద్గురువుల బోధావలోకనం ఒక క్షీరసాగర మథనం లాంటిదని నా ఫీలింగ్....
అది అందుకున్న వారికి అందుకున్నంత... జీవితానికి అనుసంధానించుకొని శ్రద్ధగా సమన్వయపరచుకున్నవారికి తుదకు లభించేది జీవామృతమే..అది సేవించి ఎవరికి వారు పరమాత్మ పాదపద్మముల సన్నిధి అనే కైవల్యతీరానికి ఏగుటయే ఆ భగవత్భక్తిజ్ఞ్యానామృతసేవన సిద్ధి..!! 
ఏ ఒక్కరికో సొంతంకాని అందరి సొత్తై, అందరికంటే ఎంతో ఎత్తులో ' వెండిపైడి అగు వేంకటగిరిపి పై ' అందరికీ అందుబాటులో ఉండే ' గోవిందుడు ' అనే అతి పెద్ద దేవపతంగి...
ఎవరికి తోచినట్టు వారు ' భక్తి ' అనే సాదా దారానికి, ' శరణాగతి ' అనే మాంజా ని ముడివేసి,
' మది ' అనే చరక్ లో నిత్యం సుడులు తిరిగే (లప్టాయించే) సంకల్ప వికల్పాలతో చుట్టేసుకొని
తమవద్దకు లాక్కొని, మనోవీధుల్లో నిత్యం ఎగరవేసి ఆనందించగలిగే ' భక్తసులభుడు ' అనే అతి పెద్ద నిత్యానుగ్రహ పతంగి...
ఎన్ని సార్లు లాక్కున్నా, ఎన్ని సార్లు ఎగరవేసినా, ఎన్నటికి చెదరని, వన్నెతరగని, నీలి రంగు వెలుగు జిలిగుల తణుకులీనుతూ, ' శ్రీవేంకటేశ్వరుడు ' అనే నామధేయం తో సదా మందస్మితుడై ఉండే శ్రీవైఖానసాగమోక్త షట్కాలార్చిత, షడ్రిపుభంజక, కలిదోషనివారక, సకల శాంతిసౌఖ్యసంపద దాయక, శ్రీనివాసుడు అనే దివ్య శ్రీపతంగి.....!! 
ఆ భవ్య శ్రీవైష్ణవ పతంగిని అన్నమాచార్యులవారు తమ పదకవితల దారాలతో, ఒక సంక్రాంతికి తమ ముంగిట్లోకి ఈ కీర్తనతో అందుకున్నారనుకుంటా.... 
"కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో.."

Monday, January 7, 2019

"పురుషులలో పుణ్యపురుషులు వేరయా...విశ్వదా అభిరామ వినరా వేమా... " :)

"పురుషులలో పుణ్యపురుషులు వేరయా...విశ్వదా అభిరామ వినరా వేమా... "

అనే వేమన పద్య భాగాన్ని, అబ్బో లోకం లో, అందునా ఈ కలియుగంలో అలాంటి వారు కూడా ఉంటారా అంటూ ఏదో హాస్యాస్పదంగా చిన్నప్పటినుండి మిత్రులతో ఏవో జోకులు వేసుకుంటూ అనుకోవడం తప్ప, బ్రహ్మశ్రీ చాగంటి వారు, తమ ప్రవచనాంతర్భాగంగా నుడివిన ' శ్రుణ్వన్ తపః ' అనే వాక్యం కర్ణకుహరాల్లోంచి హృదయకుహరంలోకి చేరుకున్న రోజున అర్ధమైంది, అలాంటి వారు నిజంగా ఉంటారని...!

శరీర సహజ సంజాతాలైన కామ క్రోధాది అరిషడ్ వర్గాన్ని జయించడమే శాంతికి మార్గం అని, నిత్యం హరి నామం పలకండని, శివాభిషేకాలు చేసెయ్యండనీ, సింపుల్ గా చెప్పేసే వారు ఎందరో ఉంటారు...

ఇంకా కావాలంటే, పదివేలిస్తే శక్తిపాతాలు, దానికి పదింతలిస్తే ఏకంగా ముక్తికి సోపానాలు అంటూ, సామాన్య ప్రజానీకాన్ని అయోమయానికి గురిచేసి ' ఆధ్యాత్మికత ' అనే పదానికి అర్ధాన్ని మార్చి, అది ఒక వ్యాపారంగా ఏమార్చగలిగే వారెందరో ఉన్న ఈ కలికాలంలో, సిసలైన సాధనామార్గాన్ని సులభతరంగా అందించే అసమాన గురుస్వరూపులు, నిలువెత్తు ఆప్యాయత మూర్తిభవించి, ఈ తరానికి లభించిన రామకృష్ణ పరమహంస శ్రీ చాగంటి వారు... [ లలాట సాముద్రికాది యోగ శాస్త్రాలు పరిచయం ఉన్నవారికి, గురువుగారు మరియు గురుపత్ని గారు, శ్రీరామకృష్ణులు మరియు శారదా మాత అంశారూపులు అని ఇట్టే తెలుసుకోగలరు...]


అవతల కూర్చున్నవారు,

వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంలోని కాండలు ఆరా లేక ఏడా, భాగవతంలో ద్వాదశ స్కంధాలు, 18 మహాభారత పర్వాల పేర్లు, వంటి చిన్న చిన్న ఆధ్యాత్మిక విషయాలు కూడా సరిగ్గా గుర్తుండని [ నాలాంటి ] పామరులా,

లేదా,

ఋక్యజుస్సామములను కంఠగతం చేసుకున్న వైదిక నిష్ఠాగరిష్ఠులా,  తర్క-న్యాయ-మీమాంస-నిరుక్త-వ్యాకరణ-ఛందస్సులను ఆపోశన పట్టిన శాస్త్ర కోవిదులా,
ఆష్టాదశ పురాణాలను ఆకలింపు చేసుకున్న అపరవిద్యాదురంధరులా,

మొదలైన భేదభావాలేవీ కించిత్ కూడా లేకుండా, తమ ప్రవచనా ప్రసాదాన్ని సహృదయంతో సమభావంతో పంచిపెట్టే పుంభావ సరస్వతీ స్వరూపులు శ్రీ చాగంటి వారు....!!!

వియద్ గంగా సమమైన వారి పవిత్ర అమృత వాక్కులు, ఎందరికో జీవితపు అగోచర బాటల్లో దారి చూపే స్వప్రకాశ నక్షత్ర కాంతిపుంజములై సదా వెలుగొందుతుండాలాని ఆకాన్షిస్తూ....

అస్మద్గురుపాదద్వయము చెంత ఒక చిరు ఎకలవ్య శిష్యుడు సమర్పించే వినయాక్షర సుమాంజలి...!!!

Thursday, January 3, 2019

HariNaamaVaibhavam...!

సకలతత్త్వ సంశయఖండన మిది | సకలకర్మ నిశ్చయము నిది | సకలవిధి రహస్యప్రధాన మిది | అకారణహితం హరినామం || 
Shaik Rafi to ఫేస్ బుక్ అన్నమయ్య.. facebook annamayya
అన్నమాచార్య 591:1,2,3,4
1.సకల సంగ్రహము సకల సంచయము | అకృతసుకృత మిది హరినామం ||
2.సకలవేదశాస్త్రములసార మిది| సకలమంత్రరాజంబు నిది| సకలపురాణ రసములమధుర మిది| అకుటిలపావనం హరినామం ||
3.సకలతత్త్వ సంశయఖండన మిది | సకలకర్మ నిశ్చయము నిది | సకలవిధి రహస్యప్రధాన మిది | అకారణహితం హరినామం ||
4.సకలదేవతా స్వామిప్రియం బిది | సకలలోక రక్షణము నిది | ప్రకటం వేంకటపతి నామాంకిత- | మకించనధనం హరినామం ||


Audio_Link_To_Sakala_Sangrahamu_SakalaSanchayamu.mp3

శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం... పావనమీ రఘురామ నామం భవ తారకమంత్రం॥ :)

శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం
పావనమీ రఘురామ నామం భవ తారకమంత్రం॥ 
పై పంక్తులు ఆరుద్ర గారి అందెవేసిన చేతిలోని కలం నుండి జాలువారిన ఒక సినిమా పాటలోవే అయినా, అందు చెప్పబడినది వేదవేదాంత సారమే..!
శ్రీరామ నామం కేవల భగవంతుని నామం మాత్రమే అనుకున్న వారికి అది నామమే...
( అసల్ అలా అనుకోవడం కూడా భాగ్యమే అనుకోండి..! )
కాని అది సాక్షాత్ శ్రీవేంకటాచలం పై కొలువైన పరబ్రహ్మము యొక్క పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణుడు / గోవిందుని మరో నామమే...శ్రీరామ నామం తారక మంత్రమే...!
తులసీదాస్ గారిచే గతించిన జీవుడిని వెనక్కి రప్పించి మరీ శరీరంలోని పంచప్రాణములు తమ తమ స్థానాల్లో స్థిరంగా కొలువైఉండేలా చేసిన మృతసంజీవని శ్రీరామ నామము..!!
అంతటి " హనుమాన్ చాలిసా " ని లోకానికి ప్రసాదించిన సారస్వతామృతము కదా శ్రీరామ నామము...!!
" నను బ్రోవమనిజెప్పవే, సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే...నను బ్రోవమనిజెప్పు...నారీ శిరోమణి..జనకుని కూతుర జనని జానకమ్మ..." అని యాతనలు ఇకభరించ లేక ఎంతో ఆర్తితో వేడుకున్న కంచర్ల గోపన్నకు, కర్మఫలితాన్ని క్షయింపచేసి, రామోజి / లక్ష్మోజి గా సాక్షాత్ శ్రీవైకుంఠం నుండి స్వామివారిని, ఆదిశేషున్ని రప్పించి, త్రేతాయుగం నాటి రామ మాడల పైకంతో కప్పం కట్టించి మరీ సంకెళ్ళు విడిపించిన తారక మంత్రం...!! ఆనాటి తానీషా రాజ్య ప్రభువు నుండి ఈనాటి కే.సీ.ఆర్ ప్రజాప్రతినిధుల ప్రభువు వరకు, ఆ భద్రాద్రి రామయ్య ప్రతి చైత్ర శుద్ధ నవమికి కళ్యాణ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందుకుంటూనే ఉన్నాడుకదా...!!
ఉగ్రంగా ఊగిపోతున్న పరశురాముడు తన ఎదుట నిలబడగానే, ఆతని శక్తిని తనలో లయించి వేసిన అమేయ శక్తి పుంజము కదా శ్రీరామనామము....
ఆ శ్రీరామ నామమే గుండెల సవ్వడిగా మార్చుకున్న ఎవ్వరి ముందైనా ఎంతటి శక్తి నిలువజాలదు....
అలాంటి ఇరు శక్తులను పరస్పరం తారసపడేలా చేసిననాడు, శ్రీరామ నామము యొక్క శక్తి లోకి అవతలి శక్తి లయించి పోవడమో, లేదా ఆ సత్యాన్ని తెలుసుకుని తమను తాము అర్పించుకోవడమో...
అంతకు మించి అక్కడ సాధ్యమయ్యేది మరొకటి ఉండజాలదు...!!
అపర రుద్రాంశ సంభూతుడైన హనుమంతుని అంతటి మహాశక్తిసంపన్నుడి పైకి, సాక్షాత్ ఆ కోదండపాణి సంధించిన శరసమూహాలు, శ్రీరామ నామస్మరణ ముందు కోమల కుసుమాలై నేలరాలి ఆ చిరంజీవుని చరణారవిందాలకు అంజలి ఘటించాయే, ఇక ఇంతకు మించి శ్రీరామ నామమనే మంత్రానికి ఉన్న శక్తిని వర్ణించ ఉపమానం ఉందని నేనైతే అనుకోను...
శ్రీరాముడు ఎంతటి సౌకుమార్య సంపన్నుడో..శాంత / సాత్విక స్మరణగా ఉన్నప్పుడు శ్రీరామ నామం కూడా అంతటి కోమలమైన, శాంతి దాయక మంత్రం....
శ్రీరాముడు ఎంతటి అరివీర భయంకరుడో, రాములవారి చేతిలోని కోదండం అసురుల పాలిటి ఎంతటి సింహ స్వప్నమో, రాజస స్మరణగా ఉన్నప్పుడు శ్రీరామ నామం కూడా అంతటి శక్తి విస్ఫోటన మంత్రం...అది అణు శక్తి అయినా, మరే అన్య శక్తి అయినా, శ్రీరామ మంత్ర శక్తి ముందు అన్నీ బలాదూర్ అవ్వాల్సిందే...! 

Kanchi Shree Paramaachaarya Vaibhavam...!

Hundreds of thousands of devotees across the world have had Sri Paramaacharya's direct or indirect help / advice / blessings / grace in one form or the other in the Holy Sri Kanchi KaamakoTi peeTham, which alone would have been their solace during those times of distress...
Believe me friends, for those who have staunch belief and respect in sanaatana guruparampara institutioned by Shree AadiShakaraachaarya and sadguru's sayings, Periyaava listens keenly to our prayers and answers accordingly even today..!
Aachaarya Tiruvadhigalea Sharanam...🙏
"Sri Sri Sri Chandrasekharendra Saraswathi Maha Swami" Attained Siddhi on "8-1-1994"
...
See more