ఒక్క సారి మనసులో స్వామివారిని త్రికరణ శుద్ధితో వేడుకొని మన బాధలను, కష్టాలను స్వామికి విన్నవించుకొంటే, స్వామివారు తమ కుడి చేతిలో ధరించిన సుదర్శన చక్రాన్ని మనకు రక్షగా ఈ 14 లోకాల్లో మనం ఎక్కడ ఉన్నా సరే పంపించేస్తారు.
ఒక్కసారిగా మనము చక్రత్తాళ్వార్ వారి రక్షణా వలయంలోకి వెళ్ళిపోయామంటే , మనకు కష్టం కలిగించే వాళ్ళు, ఎంత గొప్ప వాళ్ళు, ఎంత పెద్ద వాళ్ళు, ఎంత అధికార బలం ఉన్నవాళ్ళు, ఎంత మేధో సంపద ఉన్నవాళ్ళు, మొదలైన వేటితో సంబంధం లేకుండా శత్రువులను ఛీల్చి చెండాడే దాక వెనక్కి తిరిగిపోని అమోఘమైన దైవికాస్త్రం - "సుదర్శనం"..!!
హిందూ ధర్మచక్రం.
శ్రీమహావిష్ణువు లోక కల్యాణం కోసం తన ఆయుధంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించేవాడనే విషయం పురాణాల ద్వారా తెలుస్తుంది. శ్రీమహావిష్ణువు చేతిలోని ఈ చక్రాయుధం అత్యంత శక్తిమంతమైనదని చెప్పబడుతోంది. ఏ ఉద్దేశంతో శ్రీహరి ఆ చక్రాన్ని ప్రయోగిస్తాడో, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చనిదే తిరిగిరాకపోవడం ఈ చక్రం ప్రత్యేకత. దేవతలను ... మహర్షులను ... సాధారణ మానవులను అనేక ఇబ్బందులకు గురిచేసిన రాక్షసులు ఎందరో ఈ చక్రానికి బలైపోయారు.
అయితే ఎంత దుర్మార్గులు అయినప్పటికీ మొదటిసారే శ్రీహరి వారిపై చక్రాన్ని ప్రయోగించిన దాఖలాలు కనిపించవు. నయానా .. భయాన చెప్పి చూసినా వినిపించుకోకపోతే, చివరి ప్రయత్నంగా మాత్రమే ఆయన సుదర్శన చక్రాన్ని ప్రయోగించేవాడు. అసలు ఈ చక్రం శ్రీ మహావిష్ణువు ఆయుధంగా ఎలా మారిందనే సందేహం చాలామందిలో కలుగుతుంటుంది. తిరుగులేని ఈ చక్రాన్ని శ్రీమహావిష్ణువుకు ఇచ్చినది పరమశివుడేనని పురాణాలు చెబుతున్నాయి.
పూర్వం 'శ్రీదాముడు' అనే అసురుడు అపారమైన తన శక్తిసామర్థ్యాలతో సమస్త లోకాలలోని ప్రజలను భయభ్రాంతులను చేయసాగాడు. అంతా కలిసి తమని రక్షించవలసిందిగా శ్రీహరిని ప్రార్థిస్తారు. అసురుడి ఆటకట్టించడానికి అవసరమైన సూచన కోసం శివుడిని ప్రార్థిస్తాడు శ్రీమహావిష్ణువు. దాంతో పరమశివుడు ప్రత్యక్షమై, సమస్త దేవతల శక్తి నిక్షిప్తం చేయబడినదంటూ ఓ చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకు ప్రసాదిస్తాడు.
ఒకసారి ప్రయోగించబడిన ఆ చక్రాయుధం ఆ పని పూర్తి అయిన తరువాతనే యథాస్థానానికి చేరుకుంటుందనీ, దానిని ఉపసంహరించడం కుదరదని చెబుతాడు. ఎంతటి పరాక్రమం కలిగినవారైనా ... తపోబల సంపన్నులైనా ... వర గర్వితులైనా దాని ధాటికి తల వంచవలసిందేననీ, ప్రాణాలను సమర్పించుకోవాల్సిందేనని అంటాడు. శ్రీదాముడిని సంహరించడానికి ఇదే తగిన ఆయుధమని చెబుతాడు. పరమశివుడికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ మహావిష్ణువు ఆ చక్రాయుధంతో శ్రీదాముడిని సంహరించి, సమస్త లోకాలకు సంతోషాన్ని కలిగించడంలో మరోమారు ప్రధానమైన పాత్రను పోషిస్తాడు.
No comments:
Post a Comment