Tuesday, September 25, 2018

శ్రీవారి, 2017 హేవిళంబి సాలకట్ల బ్రహ్మొత్సవాల్లో......

శ్రీవారి, 2017 హేవిళంబి సాలకట్ల బ్రహ్మొత్సవాల్లో, అశ్వీయుజ శుక్ల పంచమి నాటి 3వ రోజు, స్వామి దర్శనంతో పాటుగా, ఇద్దరు మహనీయులను దర్శించి నమస్కరించి వారి ఆశీర్వచనం పొందిన ఆనందానుభవం...
ఒకరు, భక్తి టి.వి లో , ' ధర్మసందేహాలు ' అనే సంచిక ద్వారా తమ స్వచ్చమైన మనసుతో మందహాసభరితంగా ఎదుటి వారి భావాలు కించిత్ కూడా నొచ్చుకోకుండా సమాధానాలు తీరుస్తూ, తమదైన శైలిలో అధ్యాత్మ విజ్ఞ్యానాన్ని అందరికి పంచిపెట్టే గాణాపత్య వరిష్ఠులు, శ్రీ కాకునూరి గారు......
మరొకరు, స్వామిని ఆపాదమస్తకం తమ గళంలో నింపుకొని, ఆనాడు అన్నమాచార్యులు ఏ భావంతో కీర్తనలు రచించారో, అంత రసమయంగా, విన్నవెంటనే మనసు అమాంతం కులశేఖర పడి వద్దకు చేరుకొని, స్వామిని సేవించి ఆనందించే భాగ్యం కలిగిస్తున్న, తి.తి.దే ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ గురువు గారు....
******************************************************************
గోవిందుడు....తిరువేంకటనాథుడు....ఏడుకొండల స్వామి...తిరువేంగడముడై....తిరుమలతిమ్మప్ప....శ్రీనివాసపెరుమాళ్....శ్రీవేంకటేశ్వరస్వామి....బాలాజి...వేంకటరమణుడు...! 
వెన్నుడికి వేల పేర్లు అన్నట్టు, ఆ అప్రాకృత అమేయ శక్తిభరిత పాపధ్వంసక పుణ్యదాయకమైన ఏడుకొండలపై సకలదేవతా సార్వభౌముడై, ప్రత్యక్ష పరమాత్ముడై నెలకొన్న శ్రీహరికి ఎన్నెన్నో పేర్లు....ప్రేమతో భక్తితో దాసులు పెట్టుకున్నవి కొన్ని, శాస్త్రవిహితమైనవి కొన్ని...సాక్షాత్ స్వామి పెట్టుకున్నవి ఇంకొన్ని....!
ఏపేరుతోపిలిచినా పలికే ఆశ్రిత పారిజాతమై, ప్రపన్నుల కల్పవృక్షమై, హరిదాసుల కామధేనువై, తాపసుల చింతామణిగా...కొలిచినవారి కొంగుబంగారమై...తలచిన వారి త్రివిధ తాపహరణమై...వింత వింత లీలా వినోదభరితుడై...యుగయుగాలుగా జగాలనేలేటి ఆ జలజనాభుడి దీనజనరక్షణా వైచిత్రి అనన్యసామాన్యమైనది...
అది తలపులకు అందని ఒక తపోభూమిక....అది బుద్ధికి అందని ఒక బృహత్ బ్రహ్మాండాంతర్గత దీపిక, అది మనసుకి అందని ఒక మాధవ చైతన్యపు మరీచిక...!!
విఖనస మహర్షి చే అనుగ్రహించబడిన, ఈ కలికాలపు జీవనగతికి తగిన, సర్వ శ్రేష్ఠమైన వైఖానస ఆగమోక్త వివిధ నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలతో...వైదికంగా పరిపుష్ఠమైన ఆచార సాంప్రదాయాలతో సంతుష్టుడై...
ప్రపన్నుల, శరణాగతుల, భాగవతుల వేవేల మొక్కుబడులు, సంకీర్తనలు, నామస్మరణాదులతో, జనసామాన్యమునకు సదా సమీపుడై....,
ఎక్కడెక్కడినుండో పాదయాత్రగా వచ్చే వారు కొందరు...
కొండ నడిచి ఎక్కి, మూటలు ఒక మూలకు నెట్టి, ఎక్కడవీలైతే అక్కడ అన్ని చక్కబెట్టుకొని, సర్వదర్శనంలో స్వామిసన్నిధికి వచ్చి ఆ ఆనందనిలయ వైష్ణవమాయావలయంలో తన్మయులై సంతసించే వారు కొందరు......
ఖరీదైన కార్లలో వచ్చి, రమణీయ సౌధాలలో విడిదిచేసి, పట్టుపీతాంబరాలు చుట్టుకొని, పరమాత్ముని దర్శనానికై ఏర్పాటుకావించిన వివిధ ' ఆర్జిత సులభ మార్గాల ' ద్వారా స్వామి సన్నిధి చేరుకొని, అదే ఆనందనిలయ వైష్ణవమాయావలయంలో తన్మయులై సంతసించే వారు ఇంకొందరు......
'బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే...' అన్న చందంగా... మార్గాలు వేరైనా మాధవుడు ఒక్కడే అని చాటుతూ ఉండే ఆ తిరువేంకటకృష్ణుని కమనీయ విలాసాం కడు ఆశ్చర్యానందదాయకం....! 
తి.తి.దే వారి అధికారిక చిహ్నం ప్రకారంగా చెప్పబడే ' శ్రీనివాసో విజయతే ' అనే సద్వాక్యం, మరియు ప్రతి రోజు అర్చకులచే ' నిత్యైశ్వరోభవ..! ' అంటూ మంగళవచనాలను అందుకొనే ఆ జగన్మంగళదాయకుడి కీర్తి / యశస్సు / ఐశ్వర్యం, దిన దిన ప్రవర్ధమానంగా విశ్వవ్యాప్తమై మరెందరో తన శ్రీపాద శరణాగతిచే ఆనందమయ జీవితము గడపాలని తప్ప, నిజంగా స్వామికి అవన్ని అవసరం అని మనం అనుకుంటే మన జ్ఞ్యాన లేమికి స్వామి నవ్వుకుంటాడు తప్ప మరోటికానేరదు....

No comments:

Post a Comment