Tuesday, September 25, 2018

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవోమహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ...!! :) జీవనాడిగా 5 పద్యాలు

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవోమహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ...!! 
అని కదా చిన్నప్పటినుండి స్కూల్లో పదవతరగతి వరకు రోజు ప్రార్ధన చేసి క్లాస్ ప్రారంభించి చదువులు గడించింది..
కాని నాకెప్పుడూ ఒక తుంటరి అనుమానం ఉండేది. అలా ఎలా ఒకే గురువు 3 దేవుళ్ళుగా ఉండి మనకు సాక్షాత్ పరబ్రహ్మ గా సర్వకాలాల్లో అనుగ్రహిస్తూ ఉంటారు అని... అప్పుడు ఏదో నలుగురిలో నారాయణ అని రోజు అనేసి , సబ్జెక్ట్ల మీద, మార్కుల మీద, రాంకుల మీద ధ్యాస తప్ప, ఆ గహనమైన అధ్యాత్మ విషయం మీద మనసు పెట్టి తెలుసుకొనే పరిణతి / తెలిపే అంతటి ద్రష్టలు లేని చిన్ననాటి చిన్నపాటి స్కూలు జీవితం అది...
రోజు ఆ తరువాత ... 'సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిని..విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతు మే సదా...' అని పెద్ద గొంతుతో పక్క క్లాస్ రూం కు వినపడేలా రోజు అరిచినందుకు, ఆ సరస్వతీ మాత నవ్వుకొని, ఎప్పటికైనా వీడికి అలాంటి ఒక సద్గురువును ప్రసాదించి, ఈ వెర్రి జీవుడి జీవితపు గతి గమనము గమ్యము సరిగ్గా తెలియపరచేల చేయాలని అనుకుందో ఏమో, తనను ఆసాంతాం ఉపాసించి ఆపాద తలమస్తకం నడయాడే సరస్వతీ స్వరూపులై ఉన్న శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనా ఫలదోటను అందించి, ఎన్నెన్నో జన్మల నుండి రంగులరాట్నంలా తిరిగే జీవుడికి ఇక విశ్రాంతి కల్పించాలని, ' జన్మమృత్యుజరాతప్త జనవిశ్రాంతి దాయిని ' ని తెలుసుకొనేలా చేయాలని సంకల్పించి, గిర్రున తిరిగే కాలచక్రపు కుదుపునకు దశాబ్దంపాటు అల్లకల్లోలమై అల్లాడుతున్న జీవితం లో, ఒక ఆదివారపు శుభఘడియల్లో నేను సికింద్రబాదు లో అనుకోకుండా ' షణ్ముఖోత్పత్తి / గంగావతరణం' ప్రవచనంలో మొట్టమొదటిసారి గురువుగారిని దర్శించి, కడలికెరటాలన్ని రామేశ్వరం దరి చేరగానే నిర్మలంగా అయినట్టుగా, ఆంతర అధ్యాత్మ కడలి కెరటాలన్ని సద్గురువాక్కుల దరి చేరగానే, ఒక్కొకటిగా అన్నిటికీ హేతుబద్దమైన వివరణ లభించడంతో, మనసుతేలిక పడుతూ మరోపక్క ఈతిబాధల అలలు కూడా తీవ్రంగా ఎగిసిపడకుండా, ఎంతో కొంత శాంతిస్తూ ఉన్న ఆ సమయం నాకు ఎప్పటికి మరచిపోలేని ఒక విచిత్ర జీవితకాలపు మధురస్మృతి....
కొన్ని సంఘటనలు, కొందరు మనజీవితంలోకి ప్రవేశించడం, కొందరి పరిచయం, సంపూర్ణంగా జీవితాన్నే మార్చివేయగలవని నా గట్టి నమ్మిక. పేపర్లో / టీ.వి లో, ఒక పేపర్ బోయ్ దేశ అంతరిక్ష పరిశోధనా ప్రస్థానాన్ని శాసించి భారత రాష్ట్రపతి గా ఎదగడం... ఒక సాదా సీదా సన్యాసి / చాయివాలా దేశప్రధానిగా మారి, దేశంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన సమాంతర ఆర్ధిక వ్యవస్థను ఒక్క రాత్రికి రాత్రే నిర్మూలించడం...
ఇలాంటి వార్తలు విన్నప్పుడు, ఆధ్యాత్మికత లో కూడా ఇలాంటి నిర్ణయాత్మక దిశానిర్దేశం గావించి, శిష్యులు ఎవరు ఎక్కడ అనేదానితో సంబంధం లేకుండా అందరిని ఆదరించి ఉద్ధరించే సద్గురువులు లభించడం ఈ భారతదేశానికి మాత్రమే చెల్లిన ఒక అమూల్య సంపద అనే భావన రావడం సహజం...
మామూలుగా ఏదైనా ఒక మంచి సినిమా చూసి ఆ.. ఈ కథ బానే ఉందిలే అని అనుకొని ఒక 3 గంటల పాటు హాయిగ అందులో లీనమై కొన్ని పాటలకు పరవశించి, కొన్ని డైలాగులకు విసిల్ వేసి, కొన్ని సందర్భాలకు బాధపడి, బయటికి వచ్చాక పాప్కార్న్ పాకెట్ అలా పడేసి, మళ్ళి యథాతధంగా కొన్ని దశాబ్దాలు ఆడే నిజ జీవితపు సినిమాలోకి ప్రవేశించి, అదే విధమైన స్పందన ప్రతిస్పందనతో బ్రతికే సగటు మధ్యతరగతి మనిషికి,
ఒక్కసారిగా ఒక మంచి సద్గురువుయొక్క నిస్వార్ధమైన వాక్కు తోడుగా లభించి, తన్మూలంగా కొన్ని వందల వేల పుస్తకాలను వడపోసినా లభించని, వందలకొద్దీ పుణ్యక్షేత్రాలు తిరిగినా దొరకని, అత్యంత ప్రాచీనమైన, విలువైన, వేవేల జన్మాంతర సాధనాఫలితంగా మాత్రమే అంకురించే ఆత్మజ్ఞ్యాన జిగ్ఞ్యాస అనే చిన్న మొక్కని, సైద్ధాంతిక అద్వైతానుభవ స్థితిలో నిలిచిపోయి సాధనకొనసాగించేంతగా, ఒక మహావృక్షంగా మలచగల మహాపురుషులు, సమాజానికి లభించడం అటువంటి కోవలోకే వస్తాయనడంలో అతిశయోక్తిలేదు...
చిరంతనప్రవాహమైసాగే జీవ నది సముద్రసంగమంతో శాంతిచినట్టుగా, కొన్ని అడ్వెర్టయిస్మెంట్లు , కొన్ని పద్యాలు, కొన్ని వాక్యాలు, కొందరు మహాత్ములు, జీవితంలోకి పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రవేశించిననాడు, షడూర్ముల పూరిత మన జీవనగతికి ఎంతో మానసిక ప్రశాంతత, ఐహిక పారమార్ధిక సార్ధకత లభిస్తాయనడం కద్దు...!
సకల సద్గురువుల కలబోతగా ఈ నేలపై నడయాడే, అలాంటి శ్రీ చాగంటి సద్గురువు గారి ప్రవచనాంతర్గత ఎన్నో పద్యాలు / వాక్యాలు, ఎందరో మధ్యతరగతి సామాన్య ప్రజలకు బాసటగ ఉండి ఎంతో ఉన్నతంగా వారి జీవితాలను తీర్చిదిద్దుతున్న విషయం జగద్విదితమే అయినా, కొన్ని పద్యాలు మాత్రం బహుబాగా జనబాహుల్యానికి జీవనాడిగా మారిపోయాయని నా భావన... 
అందులో కొన్ని...
***************************************************************
నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,
జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు పై
కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా!
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు;మూలకారణం బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే
వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే
చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!
అపశబ్దంబులఁ గూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వపా
ప పరిత్యాగము సేయుఁ గావున హరిన్ భావించుచుం బాడుచున్
జపముల్ సేయుచు వీనులన్ వినుచు నశ్రాంతంబుగీర్తించుచుం
దపసుల్ సాధులు ధన్యులౌదురుగదా తత్త్వజ్ఞ! చింతింపుమా
***************************************************************

No comments:

Post a Comment