Tuesday, September 25, 2018

"దేశ భాషలందు తెలుగులెస్స..." ! :)

రాష్ట్ర భాష అయిన తెలుగుని, అన్ని ప్రభుత్వ / ప్రభుత్వేతర ప్రాథమిక / ఉన్నత విద్యాలయాల్లో తప్పనిసరిగా ఉండేలా ముఖ్యమంత్రివర్యులు కె.సి.ఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా అందరు హర్షించవలసిన విషయం. కనీసం ఇప్పటికైనా మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు / కర్ణాటక / కేరళ వారిని చూసి, లిఖిత మాతృభాషపై పిల్లలకు చిన్నపటినుండే ఎంతో కొంత అవగాహన కల్పించడం ఎంతో కీలకమైన అంశంగా గుర్తించి ఇలాంటి సార్వకాలిక శ్రేయోకారక నిర్ణయాలు తీసుకోవడం విద్యావ్యవస్థని మరింత పటుతరం గావిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
హింది / ఇంగ్లిష్ భాషలను, జాతీయ / అంతర్జాతీయ భాషలుగా మనం ఎంత ఆదరించి నేర్చుకుంటున్నామో, అంతే ఆదరణ ఖచ్చితంగా మాతృభాషకు ఇచ్చి తీరాలి...
భోజనం అంటే, అన్నం, కూర, చారు, పెరుగు అన్ని ఉన్నప్పుడే అది శరిరానికి సంపూర్ణ ఆరోగ్యసిద్ధి చేకూర్చినట్టు, తమ తమ మాతృ భాష, జాతీయ భాష అయిన హింది, అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్ లో కనీస అవగాహన ఉన్నప్పుడే ఒక భారాతీయునిగా ఎవరికి వారు గుర్తింపుపొందడం సబబు.
పోతనామాత్య విరచిత [ లేదా తెనిగించిన ] తెలుగు భాగవతంలోని ఒక్క పద్యమైనా చదవలేని నాడు, తెలుగు వారిగా గుర్తింపు పొందే అర్హత మనకు మనమే కోల్పోయినట్టు అని నా భావన...
"జాని జాని యెస్ పప్పా..." మా పిల్లలకు ఎంత బాగా వచ్చో , " కమలాక్షునర్చించు కరములు కరములు...." కూడా అంత బాగా వచ్చు, అని చెప్పుకోవడంలో గొప్పదనం ఉంది కాని.....
"మా పిల్లలకి ఎంగిలిపీసు తప్ప, తెలుగు ఒక్కముక్క కూడా రాదు తెలుసా .." అని చెప్పుకోవడంలో అసలు గొప్పేముంది...! 
"దేశ భాషలందు తెలుగులెస్స..." అని నుడివిన శ్రీకృష్ణదేవరాయల పలుకును , "దేశ భాషలందు తెలుగు ' లెస్ '..." గా చేయడం దేశద్రోహమే అంటాను నేనైతే...!
కనీసం కొన్నైనా భాగవత పద్యాలు / అన్నమాచార్యుల కీర్తనలు చదువుకొని / పాడుకొని, దేవునిపై అంతో ఇంతో భక్తిని సమకూర్చుకొని, ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది ఎవరి జీవితం వారు సుసంపన్నం చేసుకోవడం కోసమైనా, తెలుగు వారిగా పుట్టినందుకు, తెలుగును ఖచ్చితపాఠ్యాంశంగా ఆమోదించి తీరవలసిందే....
[ మరి తెలుగేతర వాళ్ళుకూడా ఎందరో ఉంటారు కదా అంటే, వారికి CBSE / ICSE స్కూల్లు ఉన్నాయి కదా....వారికి నచ్చిన భాషని అభ్యసించడానికి ...  ]

No comments:

Post a Comment