Tuesday, September 25, 2018

వందే (తిరుశుకనూరు) తిరుచానూరు పురవాసిన్యై, అలర్మేల్మంగ / పద్మావతి నాయక్యై ..! :)

వందే (తిరుశుకనూరు) తిరుచానూరు పురవాసిన్యై, అలర్మేల్మంగ / పద్మావతి నాయక్యై ..! 
"వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం..." అంటూ కీర్తిస్తుంది శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాంతర్గత శ్రీ స్తవం...
గట్టిగా ఒక 5 నిమిషాలు అమ్మ సన్నిధిలో కూర్చొని, ఇది నా బాధ, ఇదిగో వాళ్ళు ఇలా నన్ను అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, అని మన లిస్ట్ మొత్తం అమ్మ ముందు ఏకరువు పెట్టి చంటి పిల్లల్లా ఏడిస్తే, ' ఉప్పొంగు అనురాగ గంగ ' అయిన అమ్మ మనసు, ఊరుకోదు కదా...
శ్రీశైలం డాం గేట్లు ఒక్కసారిగా అన్ని తెరవగానే, సంభ్రమాశ్చర్యచకితమైన వేగం తో కిందికి దూకుతూ, ఆవరించిన పొగమంచుతో, ఏగిసిపడే చల్లటి తుంపరలతో చూసిన వాళ్ళకి అక్కడున్నవాళ్ళకి వర్ణించనలవి కాని ఆహ్లదానందాలు పంచినట్టుగా.....
ఒక్కసారి అమ్మ క్రీగంటి చూపులతో తన అమేయమైన దయను వర్షించడం మొదలుపెట్టిందంటే, ఇక ఆ ఝరులకు ఆశ్చర్యం ఆర్ణవమేఅవుతుంది...
ఆవిడ కరుణను అపారంగా పొందిన సత్పురుషులకు చేసుకున్న ఒక్క త్రికరణాత్మక నమస్కారం, ఎంతటి దుస్సహ బాధలనైనా అవతలికి ఈడ్చివేసి, తన అప్రతిహత శ్రీకటాక్షాన్ని వర్షించగలదు... ఎంతైనా కలియుగ ప్రత్యక్ష పరమాత్ముని ప్రేయసి, హృదయాంతరంగా కదా , అలర్మేల్మంగ 
మొన్నటి హేమలంబ చైత్ర శుద్ద సప్తమి రోజు ఒక ఆలయంలో, శ్రీభూ సమేత శ్రీనివాస కళ్యానానంతరం ఒక పాంచరాత్ర ఆగమ ధురీణులైన శ్రీ వైష్ణవాచార్యుల ఆశీస్సుల కోసం వెళ్ళినప్పుడు, కళ్యానాక్షతలతో పాటుగా, స్వామి తిరుమేనిపైనుండి జాలువారిన మంచి మేలిమి 3 ముత్యాలు అమ్మ అనుగ్రహంగా వచ్చినప్పుడు, ఎంతో సంతోషంతో టక్కుమని జేబులో వేస్కొని ఇంటికి తీసుకు పోయా...
నా ఆనందం కొద్ది, నేటి ఉదయం కార్తీక భృగువార సమయంలో మళ్ళీ వారి దర్షనం / ఆశీర్వాదం పొందడం ఎంతో సంతోషమైన విషయం...ఎందుకంటే ఆ ముచ్చటైన 3 ముత్యాలు, సాక్షాత్ ఆ అలర్మేల్మంగమ్మ చిరు మందహాసభరిత అమేయానుగ్రహంలా, వాటి ఆశ్చర్యానందదాయక శ్రీకటాక్షాన్ని తొందర్లో వర్షించబోతున్నాయి, నా ప్రార్ధనలన్నీ ఫలించగా, 7 కొండల పైనున్న అమే విభుడు సై సై అన్నాడేమొ...రై రై అంటూ చెంగు చెంగున దూకుతూ, " ఒరెయ్ నన్ను అందరు 'హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం ...' అంటూ కీర్తిస్తారురా....ఆ వర్ణనకు తగ్గట్టే వస్తా నీ ఇంటి సిమ్హాసనంపై శాశ్వతంగా కొలువై ఉండడానికి..." అనట్టుగా ఉంది నా ఆనందం.... 
( సద్గురు బోధలు / శ్రీ వైష్ణవాచార్యుల వాక్కులు / క్రియలు, ఎంతటి అనుగ్రహమైన చేకూర్చి పెట్టగలవు.. వాటికి ఒక హద్దు గీయగలము అని అనుకునే సో కాల్డ్ హేతువాదులు, అదొక అసంభవ అసంబద్ధ ప్రయాస అని ఒప్పుకోక తప్పదు ...  )
అన్నమాచార్యుల వర్ణన అందుకే అంత గొప్పగా,
"జందెపు ముత్యపు సరులహారముల చందన గంధికి చాంగుభళా.. విందయి వేంకట విభుబెనచిన తన సంది దండలకు చాంగుభళా.."
అంటూ, ఆ జగన్మంగళ దాయకులైన, జగదేకపతి జగదేకమాత యొక్క అమలిన శృంగార వైభవాన్ని అంత రొమాంటిక్ గా వర్ణించగలిగారు పదకవితా పితామహులు .... 

No comments:

Post a Comment