" మహానటి...! "
అలనాటి మేటి వెండితెర సితార జీవిత ప్రస్థానాన్ని కథాంశంగా తీసుకొని, ఎక్కడా పరిధి దాటకుండా మహామహుల చరిత్రలోని సంఘటలను తెరకెక్కించడం ఒక అభినందనీయమైన విషయమే... జనసామాన్యమునకు ఈ చిత్రంలో ఒక మంచి సందేశం కూడ దాగుందని నా అభిప్రాయం...
అందరూ నావారే అని అనుకునే అమాయకపు అంధత్వం, అభినయంతో అందలం చేరుకున్న జీవితాన్ని అధః పతాళానికి నెట్టేసింది...
నమస్కారం చేసి అభిమానం చూపిన ప్రతివారు నమ్మకమైన వారు అని అనుకొని అక్కునజేర్చుకుంటే, జీవితానికి దరిలేకుండా పోతుందనే సత్యాన్ని ఆవిష్కరించింది...
మనతోనే, మనవారిలా ఉంటూ మన కాళ్ళ కిందే గోతులు తీస్తు బ్రతికే మనవారిని గుర్తించకుండా ఉంటే, ఒకనాడు మనకు నిలువ నీడ కూడ లేకుండా చేస్తారనే కఠోర స్వానుభవాన్ని జీవితపు పాఠంగా చూపింది...
ఈ కలికాలంలో దైవ నామం, గురువాక్యం అనే రెండు ఊపిరిలోని ఉచ్వ్వాస నిశ్వాసగా మలచుకొని జీవిస్తు,
బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువుగారి మాటల్లో చెప్పాలంటే, సంసారం / జీవితం అనే పనసపండును ఒలిచి, సంపూర్ణంగా ఆస్వాదించాలి అనుకోవడం సబబే అయినా, చేతికి ఆముదం రాసుకోవడం అత్యంతముఖ్యం..!
కొన్ని సంవత్సరాల పర్యంతం నీటిలో ఉన్నాసరే, బయటకు తీసిన మరుక్షణం తామరాకు నీటి బిందువులను ముత్యాల్లా జాలువార్చెయ్యగల తత్వం అలవర్చుకొని, ఎన్ని సంవత్సరాలు సంసారంలో ఉన్నాసరే, అందులో మమేకమై ఉన్నట్టు ఉండి, అన్ని అడుసంటుబంధాలను ఈశ్వరుని పిలుపు వచ్చిన మరుక్షణం మనసునుండి మరల్చి స్వామిలో ఐక్యమవ్వడమే ధ్యేయంగా బ్రతికినప్పుడు, జీవితం తప్పకుండా శ్రీహరి శ్రీపాదార్పిత తులసీదళం, శ్రీకంఠార్పిత గంగాజలం, అవుతుంది తప్ప, అడవికాచిన వెన్నెల కానేరదు... 
సద్గురువుల మాటల్లో జీవిత లక్ష్యం, "అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం, దేహాంతే తవసాయుజ్యం దేహిమే పార్వతీపతే...!!" 

No comments:
Post a Comment