Friday, September 21, 2018

2013 నాటి కాకినాడలోని టి.టి.డి వారి మొట్టమొదటి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవం...

2013 నాటి కాకినాడలోని టి.టి.డి వారి మొట్టమొదటి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవ ఘట్టాలను నా వద్ద నున్న రికార్డింగ్లలో వింటూ ఆ నాటి మధుర స్మృతులను నెమరువేసుకుంటూ, మాధవ పదమంజీర సవ్వడుల పరాకులో ఒలికిన కొన్ని భావపరంపరలు... 
"అణోరణీయాన్....మహతోమహీయాన్....." అని పరమాత్మ గురించి పెద్దలు చెప్తూ ఉంటారు...
" బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాగ్నిర్వికల్పం పునః మాయ కల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం.... " అని దక్షిణామూర్తి స్తోత్రం లో చెప్పినట్టుగా, ఒక విశాల మర్రివృక్షం యొక్క వ్యాప్తిని, పరమాత్మ ఒక చిన్న మర్రివిత్తు లో నిఘూడపరిచిన వైనం కేవల లౌకిక తర్కానికి అంది ఆకళింపుచేసుకునే విషయమేఅయితే, పుట్టి బుద్ధి గడించిన ప్రతిప్రాణి పరమయోగి అయిపోయి పరమపద ప్రాకారాల ఆనూపానూ ఇట్టే పరికించి అట్టే ప్రచారం చేసే ప్రవక్తగా మారిపోయి, కర్మ సిద్ధాంతం లుప్తమై, ప్రపంచం నలుచెరగులా శాంతి కపోతాలు సదా తచ్చాడుతాయి అనడం అతిశయోక్తి కాదేమో...! 
ప్రకృతి పురుషుల అవాంగ్మానసగోచరమైన దివ్యలీలా వైభవాన్ని, ఈ విశాల విశ్వంలో ఎక్కడదాచినా సరే, ప్రతిప్రాణిలోని విశిష్టతని అందిపుచ్చుకొని దాన్ని మించి ఉన్నతిని సాధించగల అంతులేని మానవమేధకు చిక్కకుండా, ఎక్కడ నిఘూడపరిస్తే ఎల్లకాలం క్షేమంగా ఉంటుందో ఆలోచించి, తన ఉనికిని ఊపిరిని పరమాత్మ వేదస్వరంగా మార్చి, ఘనజటలుగా మలిచి, అది అర్హులకు మాత్రమే అంది లోకశ్రేయస్సుకై మాత్రమే ఉపయోగపడేలా, గురుపరంపరాగతంగా వైదిక విద్యను వ్యవస్థీకరించాడు ఈశ్వరుడు...! అందుకే ఈ సనాతనమైన భరతభూమి యొక్క జీవనాడి సద్గురువుల రసాంకురములపై నిక్షిప్తమై యుగ యుగాలుగా ఎన్ని వింతలు విచిత్రాలు లోకాన్ని ముంచెత్తుతున్నా, "దేవుడు ఉన్నాడు....దీనుల మొరలను ఆలకించి...దైన్యాన్ని తొలగించి....దరిజేర్చి దారి చూపుటకు..." అని నమ్మి నమస్కరించడానికి వేదస్వరం ఈ నాటికీ, మరియు ఎప్పటికీ, చిరంతన శాంతి సౌఖ్యాలను కలిగించే సుసాధనమై వర్ధిల్లుతుంది...!
ఇంట్లో గిన్నెలు, బియ్యం, కూరగాయలు, నీళ్ళు, అన్నీ ఉన్నా సరే, పాచకాగ్ని (వంట గాస్, కట్టెల పొయ్యి, కిరోసిన్ పొయ్యి, ఇలా ఎదైనా సరే సరైన మోతాదులో) లేని నాడు అవి వండుకుని తినే భాగ్యం ఉండనట్టుగా...
పూలు, పండ్లు, నైవేద్యాలు, దేవతా మూర్తులు, అలంకారాలు, ఇలా ఎన్ని ఉన్నాసరే, వేద ప్రోక్తమైన ఘనజటలు, వైదికమైన సూక్తాలు, సదాచార సంపన్నులచే సాయించబడిన దేవభాష సంస్కృత స్తోత్రాలు, ఇత్యాదులు లేని నాడు, ఆ దైవిక ప్రక్రియకు జీవమైన దేవతానుగ్రహమును ఆపాదించబడి, క్రతువు సఫలీకృతమై భక్తులందరి ఈప్సితములు ఈడేరుట ఆ రీతిగనే ఉండు...
ఎల్లప్పుడు లోక శ్రేయస్సుకై తమ ఊపిరిని వెచ్చించే వేదమూర్తుల ఆశీర్బలానికి / అనుగ్రహానికి, తూకములు, కొలమానములు కేవలం గగనపు అంచులు, సముద్రపు లోతులు, శ్రీనివాసుని విభూతులు.... 
ఒక సూక్తాన్ని, వేదస్వరంగా ఘనజటపరిచి వల్లెవేసినప్పుడు, ఇంత ప్రశాంతతను/ఆనందాన్ని ఇవ్వగలదా అని అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాం..! ( ఆ భక్తి సంస్కారం అలవడిన హృదయానికి మాత్రమే అనుకోండి...)
అదేవిధంగా, ఇన్ని సంవత్సరాలుగా ఒక సద్గురువు వాక్కుల స్వరానికి అనుగుణంగా మదిజలధుల కెరటాలపై సాగే మనసనే నావను నడుపుతూ బ్రతికేస్తున్న శిష్యులకు, గురువు గారి పూర్తి పేరు తెలియగానే అలాంటి సంతోషమే కలుగుతుంది కదా మరి...! 
ఒక ముఖపుస్తక పన్నలో లభించిన గురువుగారి పూర్తి పేరును చూసినప్పుడు కలిగిన ఆనందం కూడా అలాగే ఉంది.... 
( ఆనాటి అత్యంత మనోహరమైన విద్వన్మణుల వేదపారాయణం, స్వామి కల్యాణాంతర్భాగ విశేషములు ఆసక్తి గలవారికి అటాచ్మెంట్ లో కలవు... )

https://www.facebook.com/Vinay.Aitha/posts/10215163573856052

No comments:

Post a Comment