"ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు | ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య || "
అందరికి అన్నమాచార్య 610 వ జయంత్యుత్సవ శుభాభినందనలు.. 
షడ్శతోపరిదశ సంవత్సరాల క్రితం పాపపంకిలమైన కలియుగ జీవనానికి, పరమపావనమైన భవరోగ సమ్హరనౌషదాన్ని ప్రసాదంగా పంచిపెట్టే యజ్ఞ్యాన్ని ఆరభించడానికి, ఆ ఫలితాలను చిరకాలం శరణాగతులపాలిటి భావపంజరకీరపు హరినామసంకీర్తనలై చిరంతనంగా మదిలో మ్రోగుతూ, ఎదలో ఊగుతూ మనసును నిర్మలపరిచి మాధవ ఆవాసంగా మలిచి ధర్మార్థకామమోక్షాలను చతుర్విధ పురుషార్దాలను శ్రీహరి వరాలుగా అందించి, జీవనసాఫల్యతకు, 'కలౌ సంకీర్త్య కేశవం' అనే పెద్దల నానుడి సర్వకాలసర్వావస్థలయందు శ్రేయోదాయకమైన అధ్యాత్మసాధనగా మలిచి, భగవద్ 'నామస్మరణాత్ అన్యోపాయం నహిపశ్యామో భవతరణం...' అనే సత్యాన్ని రూఢి పరచేందుకు, శ్రీవైకుంఠం నుండి తాళులపాకకు దిగివచ్చిన శ్రీహరి నందక ఖడ్గ శక్తి పుంజము, ' అన్నమయ్య ' గా అవతరించిన రోజు వైశాఖ పౌర్ణమి.!
భగవద్ కరుణాకటాక్షము, ఎటువంటి భేదభావం లేకుండా, "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు..." అంటూ, ప్రాణికోటి ఆర్తికి సమనుగుణంగా ఉండే సత్యఫలం అని చాటి చెప్పి, "వేదాంతనిలయా వివిధాచరణ ఆదిదేవా శ్రీవేంకటాచలేశ, సోదించి తలచినచోట నీ వుందువట యేదెస నీ మహిమ యిదేటిదయ్యా" అంటూ, భగవంతుడు ఎక్కడెక్కడో మాత్రమే ఉండేవాడు కాదు, ఎక్కడంటే అక్కడికే వచ్చేవాడు అని ప్రపన్నులందరికి పరతత్వ సౌమ్య సామీప్య సారంగత్వాన్ని తేటపరుస్తూ, "ఈతడే హరుడు యీతడే యజుడు ఈతనికి నీ చేతలెంత ఘనమటుగాన... కడుపెక్కు బ్రహ్మాండ కటకములు సుడివడిన కడుపులో నిడుకొన్న ఘనుడు....తిరువేంకటేశ్వరుడు దేవ దేవోత్తముడు పరిపూర్ణుడచ్యుతుడభవుడు..శరణాగతుల రక్షసేయు వాడనుమాట గురుతుగా తలపోసి కొనియాడగా వలసె" అంటూ శ్రీవేంకటహరి యొక్క త్రిమూర్త్యాత్మకత్వాన్ని తెలియచెప్పి, "నిలుచున్నాడిదె నేడును నెదుటను కలిగిన శ్రీవేంకటవిభుడు వలసినవారికి వరదుండీతడు కలడు గలడితని గని మనరో" అంటూ, అందరికి రక్షకుడు, పోషకుడు, తోషకుడు, మోక్షదాయకుడు ఆ సప్తగిరులపై సిరుతానవ్వులవాడిగా శ్రీనివాసుడిగా కొలువైఉన్నాడు అని చెప్తూ, అలతి అలతి పదాలతో ఆనందపు ఆర్ణవాలను సృజిస్తూ, కైవల్యసిద్ధిని కరముల నిలిపిన కారణజన్ములు కారుణ్యమూర్తులు, సద్గురువులు, శ్రీ అన్నమాచార్యులు....!
నమో శ్రీ తాళ్ళపాక గురవేనమః...!!

No comments:
Post a Comment