భారతీయులందరికి 69 వ గణతంత్రదినోత్సవ శుభాభినందనలు...!! 
స్వతంత్ర భారత దేశంగా ఆగస్ట్ 15 అందరికి కొత్త భారతావని ని అందించినా, భిన్నత్వం లో ఏకత్వమనే సార్వకాలిక సర్వోన్నత సమాజ శ్రేయస్కర జీవనవిధానాన్ని, భారతీయులందరికి ఒక కట్టుదిట్టమైన చట్టబద్ధమైన రాజ్యాంగ రూపకల్పనగా పొందుపరిచి, జనవరి 26 న దేశానికి, గణతంత్రదినోత్సవం పేరున అందివ్వబడిన విషయం అందరికి తెలిసిందే...
అంటే దాని అర్ధం, ఎంతో పోరాటం తరువాత లభించిన స్వాతంత్రం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి రాజనీతి స్రష్ఠలచే రచింపబడిన రాజ్యాంగ బద్ధమైనప్పుడు మాత్రమే దానికి సాధికారత, సార్థకత లభించినట్టుగా....,
మనం ఎన్నెన్నో పూజలు, జప/తపాలు, నామస్మరణలు, మొదలైన ఆధ్యాత్మిక సాధనలు ఆచరించి, ఆర్జించుకున్న దైవానుగ్రహం అనే అపురూప ఫలాన్ని ఆస్వాదించి అమోఘమైన ఫలితాలు సాధించాలి అంటే, సద్గురువులు, ఆచార్యులు, యతీంద్రులు, మొదలైన ద్రష్టలచే ఆచరింపబడి కట్టుదిట్టం గావించబడిన అధ్యాత్మ విధానాన్ని అనుసరించినప్పుడు మాత్రమే, మన ప్రయత్నానికి సార్థకత చేకురుతుంది.
స్కూల్లో, కళాశాలలో, విశ్వవిద్యాలయంలో, డబ్బులు కట్టి మనం నేర్చుకున్న పిసరంత లౌకిక పరిజ్ఞ్యానంతో, అదెందుకు అలా చేయాలి, ఇదెందుకు ఇలా చేయాలి, ఇవన్నీ పాతకాలం మనుషులు పాటించవలసిన పామరపు పోకడలు కదా అనుకున్నప్పుడు, విజ్ఞ్యానార్జనకు ఆమడ దూరంలోనే ఉండిపోతామేమో ...
అందుకే అనుకుంటా సద్గురు శ్రీ త్యాగరాయులవారు,' తెలిసి రామ చింతనతో నామము సేయవే ఓ మనసా, తలపులన్ని నిలిపి నిమిషమైన తారక రూపుని నిజ తత్వములను (తె)' అని ఆనాడే అధ్యాత్మ సుసాధనను కృతిపరిచారు...

No comments:
Post a Comment