Wednesday, September 26, 2018

నా జీవితం లో - పుంభావ సరస్వతీ స్వరూపులు బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువు గారు

బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువు గారు....!
[ 2017 హేవిళంబి ఆశ్వీయుజ కృష్ణపక్ష దశమి నాటి వారి భాగ్యనగర / సికింద్రబాద్ / బోయీగుడ లోని రైల్ కళారంగ్ రాక సందర్భంగా కొన్ని విశేషాలు... ]
ఆధ్యాత్మిక జగతికి పెద్దగా పరిచయం అక్కర్లేని పుంభావ సరస్వతీ స్వరూపులు... మరీ ముఖ్యంగా ఈనాటి నవతరానికి ' అధ్యాత్మ విద్యా ' అంటే పాతచింతకాయ పచ్చడి కాదు, అది పుట్టతేనేలో మాగిన ఒక మంచి నిత్యనూతన మామిడి పండు గా, ఏ లాభాపేక్ష లేకుండా ఎందరో జీవుల అధ్యాత్మ రసాంకురములకు రుచిచూపిస్తూ, లక్షలాది ముముక్షువులకు దిటవైన బాసటగా తిరుగాడుతున్న అపర దక్షిణామూర్తి స్వరూపులు....
వారు ఎంతో శ్రమించి ఏర్పాటు చేసిన వందలాది ప్రవచనాల మామిడితోటలో, ఏ చెట్టు ఎక్కి ఏ పండు కోసుకున్నా, ఆ ' ప్రవచనం ' అనే మామిడి చెట్టు పై కొలువైన ' దైవానుగ్రహం ' అనే మామిడి పండు త్రికరణశుద్దితో ఆస్వాదించిన వారి జీవితాలను సుసంపన్నం చేస్తూనే ఉంది....ఉంటుంది....!
ఆ పెద్ద వివిధ రసాల మధురస భరిత ఫల తోటలోని, ఏదో ఒక చెట్టు పై మనసు నిలిపి కాయలన్ని కోసుకొని, ఓపికగా ఉండి, పైన ఉన్న చిటారు కొమ్మకు బాగా దోరగా మాగిన చిలక కొట్టిన పండ్లను నేర్పుగా సంగ్రహించిన వారికి (అనగా వారి ప్రవచనాంతర్గతంగా వారు అక్కడక్కడ ఉటంకించే సజీవ దైవసాన్నిధ్య విషయాలు) , సద్యో ఫలితంగా ఆ ప్రవచనంలో ప్రతిపాదించబడిన సర్వేశ్వర దర్శనం కూడ లభించడం ఎందరెందరికో విదితమే....
వారి జీవితం ఒక సుసాంప్రదాయ యజ్ఞ్యవేదిక...వారి సద్ వాక్కులే అందులో కొలువైన అగ్నిహోత్రం...అది మామూలు అగ్నికాదు...దేవతావృక్షాల కొమ్మలు రాపాడించి రగిలించబడిన అరుణాచల అగ్నిలింగంలోని జ్ఞ్యానానలం....మనోసంకల్పములు అనే హవిస్సును ఎవరికి వారు ఆ అగ్నిహోత్రంలో ఏకాగ్ర చిత్తశుద్ధి అనే స్వాహాకారంతో సమర్పిస్తూ, చివరికి వారి పాదపద్మములకు త్రికరణశుద్ధితో చేసుకున్న ఒక నమస్కారం పూర్ణాహుతిగా
సమర్పించిన నాడు , యజ్ఞ్య ఫలంగా మన ధార్మిక సంకల్పాలన్ని ఇట్టే ఫలిస్తాయి అనేది ఎందరికో స్వానుభవసత్యం....
అది కేవలం ఒక మామూలు అగ్నిగా భావించి, ఒక పూటకు సరిపడే అన్నం కూర వండుకోవడానికి వచ్చిన వారికి అది అక్కడివరకే ఫలిస్తుంది...
మనలో కొలువైన అవిద్యా అనే భండాసురనిర్మూలనకు, అది సకల దేవతలు కలిసి ' పరంజ్యోతి ' అయిన లలితా పరాభట్టారిక ఆవిర్భావం కొరకు ఏర్పాటు చేసిన అద్వితీయ యజ్ఞ్యవేదికగా భావించి, తమను తాము శారీరకంగా మానసికంగా వారి 'సద్వాక్కుల శ్రవణం' అనే అగ్నిహోత్ర హవిస్సుగా మార్చుకున్న వారికి, ఇల్లే ఒక మణిద్వీపమై, వారి వాణి సాక్షాత్ మన ఇంటకొలువైన ' సచామర రమావాణి సవ్యదక్షిణసేవిత ' యొక్క స్వరమై , ఆ ' గోప్త్రి గోవింద రూపిని ' ఎప్పుడూ మనతోనే ఉండేలా చెయ్యగల గీర్వాణం వారి ప్రవచనం...! 
( చిన్నప్పుడు వేసవి సెలవుల్లో, భద్రాద్రి కొత్తగూడెం లో రామవరం అనే ఒక చిన్న పల్లె లో ఉన్న మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడల్లా, హైదరాబాదు నుండి మనవడు వచ్చాడని ఎంతో మురిసిపోయి, అమ్మమ్మా ఇంతకి ఇప్పుడు ఏ చెట్టు తో స్టార్ట్ చెయమంటావ్ నన్ను...? ఆ జామ చెట్టా, ఈ మామిడి చెట్టా, ఆ మామిడి చెట్టా, ఆ ఎదురింటి దుర్గమ్మ ఇంట్లోని ఎర్ర జామకాయల చెట్టా అని జోకులు వేస్తుంటే...., ఒక పని చెయ్యర, ఆ నిమ్మ చెట్టు ఎక్కుపో... అంటూ అదే లెవెల్ లో జోకులు వేసి నా 4 సంవత్సరాల మధుర శైశవ / బాల్యానికి, ఆ తరువాత పదవతరగతి వరకు నాకు స్కూలు సెలవులు అనగానే గుర్తొచ్చే ఎకైక స్వర్గసీమగా ఉన్న అలనాటి అమ్మమ్మ ఇంటిలా, గురువుగారి ప్రవచనాల తోట ఒక అమోఘమైన వెలకట్టలేని పెన్నిధి... అది అందుకున్న వారికి అందుకున్నంత....!
ఒక చిన్నపాటి 2 బి.హెచ్.కె అనే ( పూర్తి వాస్తు విరుద్ధమైన ) కొత్త ఇంట్లోకి, నా ఇంటర్మీడియట్ / ఏంసెట్ చదివే రోజుల్లో విధివశాత్తు మా కుటుంబం వెళ్ళడం, అమ్మ కంటే ఎంతో ఆప్యాయంగా చూసుకున్న అమ్మమ్మ అనారోగ్యంతో స్వామి సన్నిధికి శాశ్వతంగా వెళ్ళిపోవడం - అప్పటివరకు జీవితంలో ఏనాడూ పెద్దగా ఏడుపంటూ తెలియని నేను ఆనాడు ఏడిచినంతగా మరెప్పుడు ఏడవకపోవడం.....
అప్పటినుండి జీవితంలో అసలు సంతోషం జాడే లేకుండా వెళ్ళిపోవడం... ఒక దశాబ్దంపాటు, ఆనందానికి అల్లంత దూరంలోనే ఉంటూ, వర్ణించలేని ఇక్కట్లే స్నేహితులుగా, దుఃఖమే దరిజేర్చుకున్న ఆప్తమిత్రుడిగా, వాటిమధ్య సాగుతున్న చదువులు / ఆతరువాతి కొలువు అభాగ్యపు జీవితపరమావధిగా, నిస్సారంగా, నిస్తేజంగా, మారిన నా జీవితంలోకి, చీకట్లను చీల్చుకుంటూ ఉదయాద్రిపై సాగే సరికొత్త సూర్యోదయంలా, మండువేసవిలో దాహార్తి తీర్చే చలివేంద్రంలా, ఆకలితో అల్లాడుతున్న అభాగ్యుడికి ఆకుపచ్చటి అరటాకుపై పరచిన షడ్రసోపేత భోజనప్రసాదంలా... గురువుగారి ప్రవచనాలు ప్రవేశించి , వారి ' శ్రీమద్రామాయణం ' తో ఇల్లు సవరించుకొని, ' శ్రీమద్భాగవతంతో ' దుష్కర్మలను దూరం చేసుకొని, ' శ్రీ వేంకటేశ్వర వైభవం 'తో, జీవితాన్ని ఆవరించి ఉన్న అలక్ష్మిని క్రమక్రమంగా దూరంచేసుకుంటూ, నేను స్వానుభవపూర్వకంగా పొందిన మేలు అంతని ఇంతని చెప్పనలవికాదు.... )
ఇలా ఎందరో ఏకలవ్య శిష్యుల జీవితాలను ఎక్కడో కాకినాడలో ఉంటూనే, కంచి కామాక్షి తత్వంతో వారికి కావలసింది తెలుసుకొని, మధుర మీనాక్షి తత్వంతో వారి శ్రీకర చూపుల తోనే అంతర్ కైలాస స్థిత జ్ఞ్యాన చంద్రమౌళిని మనకు దర్శింపచేస్తూ, కాశివిశాలాక్షి తత్వంతో అధ్యాత్మ తృష్ణ కలిగిన వారు దేశంలో ఎక్కడెక్కడున్నా సరే అక్కడికివెళ్ళి వారిని సంపూర్ణంగా అనుగ్రహిస్తూ సాగుతున్న వారి అద్వీతీయ ధర్మపరిరక్షణా జైత్రయాత్ర అప్రతిహతంగా ఇంకా ఎన్నెన్నో చోట్లా కొనసాగాలాని అభిలషిస్తూ... వీలైన వారందరు రేపటి వారి భాగ్యనగర ప్రవచనా శ్రీకార్యానికి హాజరు కావలసిందిగా కోరుతున్నామహో....!!! 

No comments:

Post a Comment