Tuesday, September 25, 2018

గురుర్ బ్రహ్మా...గురుర్ విష్ణుః...గురుర్ దేవో మహేశ్వరః...గురుః సాక్షాత్ పరబ్రహ్మా...తస్మై శ్రీ గురవే నమః...!! :)

గురుర్ బ్రహ్మా...గురుర్ విష్ణుః...గురుర్ దేవో మహేశ్వరః...గురుః సాక్షాత్ పరబ్రహ్మా...తస్మై శ్రీ గురవే నమః...!! 
కొన్ని కోట్ల హృదయాల అధ్యాత్మ సామ్రాజ్యానికి మకుటంలేని చక్రవర్తులై, అనాహతపు గురు పీఠంపై స్థిరాసీనులై, శిష్యులు గావించే భగవద్భక్తి అనే సేద్యానికి నారు నీరు అన్నీ తమ సద్వాక్కుల ద్వార సమకూరుస్తూ, మనోసంకల్ప కెరటాలను నిత్యం కైవల్యతీరం వైపు మళ్ళిస్తూ, చిరంతన శాంతి సౌఖ్యాలనే ఫలాలను సేద్య ఫలంగా అనుగ్రహిస్తూ, తెలుగునాట కొలువైన అపరదక్షిణామూర్తులు, పోతపోసుకున్న పుంభావ శారదా స్వరూపులు, బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువుల చాంద్రమాన జన్మదినమైన, ఆషాఢ శుద్ధ నవమి మరియు రాబోవు గురుపౌర్ణిమ / వ్యాసపౌర్ణిమ పర్వదిన శుభాభినందనలు...!
ఈ భరతభూమి పై ఎన్ని పర్వదినాలు ఉన్నా, దక్షిణాయనపుణ్యకాలప్రారంభంలో వచ్చే ఆషాఢపౌర్ణమి అనగానే సనాతన సాంప్రదాయావలంబీకులకు ఎక్కడలేని సంతోషం..
తమ తమ అభిరుచులకు అనుగుణంగా ఒక గురుస్వరూపాన్ని తమ సర్వస్వంగా, పరతత్వంగా ఆరాధించి, ఆ గురుప్రసాదితమైన అధ్యాత్మ విద్యా సుమాలతో ఈశ్వరార్చన చేసి చతుర్విధ పురుషార్ధాలను, చిత్తశుద్ధిని పొంది ఈశ్వరైక్యం దిశగా జీవితాన్ని సుసంపన్నం చేసుకునే మహాప్రస్థానంలో, మనస్పూర్తిగా శిష్యులకు గురువులు ప్రత్యక్ష ఆశీస్సులు అనుగ్రహాన్ని ప్రసాదించే మహత్తరమైన రోజు...
అందునా ఈ కలియుగంలో, సద్గురువుల, ఆచార్యుల, యతిపురుషుల వాక్కులే శ్రీరామ రక్షగా ఉండి, చేసుకున్న కాస్తో కూస్తో దైవారాధన ఫలించేందుకు తోడ్పడే ఏకైకసాధనం...
పాదరసమైనా ఒడుపుగా పట్టగలమేమో కాని, పరమాత్మతత్వాన్ని సద్గురువుల సహాయం లేకుండా ఒడిసిపట్టుకోవడం కల్ల...
ఈ యాంత్రిక జీవితపు రాపిడిలో, మనసుకు బాధా నివృత్తి, శోకనాశనం, శాంతి సౌఖ్యాలు, ఇవన్నీ ఎన్ని దూరతీరాలకు ఏగినా అందని ద్రాక్షే...
కేవలం సంగీత సాహిత్యాలు, అందునా భగవద్సంబంధమైనవి మాత్రమే సంపూర్ణ ప్రశాంతత, సుఖసంతోషాలు ఇవ్వగల సుసాధనాలు అని పెద్దలు పేర్కొనడం పరిపాటి...
----------------------------------------------------------------------
బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువుగారి వాగ్వైభవం.....! 
కొన్ని పండ్లు (చెట్టుమీద పండిన బంగినపల్లి మామిడిరసం మొదలైనవి..) తలచుకున్నంత మాత్రాన తినేసి కడుపునిండిపోయినంత ఆనందం కలుగుతుంది...
అలాగే కొందరు మహనీయుల స్మరణమాత్రం చేతనే ఎంతో ఆనందం అప్రయత్నంగా కలుగుతుంది...
అటువంటి బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువుగారి సద్వాక్కుల శ్రోతలు కొన్ని కోట్ల మంది అధ్యాత్మ జగత్తునందు ఉన్నారు...
ఒక్కొక్కరికి ఆ వాక్కులు ఒక్కోలా తమ ఆర్తిని శమింపచేసి సహాయసహకారాలు అందించి ఉంటాయి...కాని, నా జీవితంలో వారి సద్వాక్కుల ప్రస్థానం వేరు...
దశాబ్దం క్రితం, ఎన్నో కష్టాలకోర్చి నాన్న గారి అకాల ఉద్యోగవిరమణ తో లభించిన డబ్బుపై వచ్చే కొద్దిపాటి వడ్డీతో ఇంజనీరింగ్ విద్యను దైవానుగ్రహంతో పూర్తిచేసుకొని, ఇంకా పైచదువులకు వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేక, ఏమాత్రం మానసిక ప్రశాంతత లేని జీవితంతో 21వ పడిలో కొత్తగా ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టిన రోజులవి... అప్పటికే గురువుగారి ప్రవచనాలు అడపాదడపా వింటున్న నాకు ఒకరోజు, సికింద్రబాద్ లోని ఒక సుబ్రహ్మణ్య సేవాసమితికి గురువుగారు వస్తున్నారు అని తెలిసి, వారిని ఒక్కసారైనా దెగ్గరినుండి చూడాలనే ఆశతో అక్కడికి వెళ్ళిన నాకు ఆనాటి వారి గంగావతరనం మరియు షణ్ముఖోత్పత్తి ప్రవచనాలు ముగిసాక నా బ్యాగులో ఉన్న రెండు దానిమ్మ పండ్లు వారి పవిత్ర కరకమలములందు పెట్టి పాదాభివందనం చేసుకున్నాను...
ఒక్కసారిగా మనసుకు ఏదో తెలియని అలౌకిక ప్రశాంతత, అప్రయత్నంగా ఆనందభాష్పాలు... "ఇవి అచ్చం నేను ప్రతి వారం మా ఇంటి దెగ్గరి గుడిలో దశాబ్ద కాలంగా నమస్కరించే సాయిబాబా పాదాల్లాగా ఉన్నాయేంటి.." అనే భావనతో ఇంటికి వెనుదిరిగినా, నా మనసు మాత్రం గురువుగారు ఇన్నోవా కారు ఎక్కివెళ్ళేముందు వేసిన ఆఖరి అడుగును చూస్తూ అక్కడే ఉండిపోయింది...
ఈతి బాధలతో సతమతమవుతూ, దైవంపై విశ్వాసం సన్నగిల్లుతు ఉన్న నాకు, మదిలోని అన్ని అలజడులు తీర్చడానికి వచ్చిన సద్గురువులు వారే అని ఆ తర్వాత అర్ధమయ్యింది...!
ఓ పక్క ఆధ్యాత్మిక ఉన్నతి, మరో పక్క లౌకిక బాధలకు ఉపశాంతి వారి సద్వాక్కుల ద్వారా పొందుతూ, గురువుగారు ఫలానా రోజు హైదరాబాదుకు ప్రవచనానికి వస్తున్నారు అని తెలియగానే, ఠక్కుమని ఆ రోజు అందరికంటేముందుగానే వెళ్ళి గురువుగారి దర్శనం, పాదాభివందనం చేసుకోవడం ఒక తీర్థయాత్రలా మరపురాని అనుభూతి...
మొట్టమొదటి సారి కాకినాడ లోని శ్రీవేంకటేశ్వరవైభవోత్సవంలోని శ్రీభూసమేత శ్రీనివాస కల్యాణం, అమీర్ పేట దెగ్గర శ్రీనగర్ కాలని లోని సత్యసాయి నిగామాగమంలోని వల్లి దేవసేనాసమేత సుబ్రహ్మణ్య కల్యాణం, ఇలా కొన్నిసార్లు వారి ఆధ్వర్యంలో జరిగిన అత్యంత సశాస్త్రీయ క్రతువుల ప్రసాదం స్వీకరించిన అనంతరం, నా జీవితానికి లభించిన ఉన్నతి మాటల్లో వర్ణించలేని వైభవం...
వారి సద్వాక్కులు జీవితం లోకి రాకముందు, ఒక సామాన్య 4 రూముల మధ్యతరగతి ఇంట్లో, తీవ్రమైన వాస్తు దోషాలతో, ఏలినాటిశనిపీడలతో, అసలు ఎందుకు ఈ బ్రతుకు అని రోజుకు ఒక్కసారైనా ఇంట్లో అందరం గొడవపడకుండా ఉండని దుర్భర రోజులు అవి...అగ్నికి ఆజ్యం తోడైనట్టు, నైరుతి మూలలో ఉన్న ఒక చిన్న దేవుడిగూటికి, దక్షిణ పశ్చిమాలకు తిరిగి నమస్కరిస్తున్న రోజులు...!
(సాంప్రదాయికులకు ఈపాటికే అర్ధమైఉంటుంది, 5 ఫీట్ల వరకు పల్లమైన దక్షిణ, పశ్చిమ, నైరుతి భాగ వాస్తు దోషం మరియు అన్ని సంవత్సరాల నిత్య దక్షిణాభిముక పూజా నమస్కారాలాతో మేము పొందిన నరకయాతన..!)
ఇంకా బాధిస్తే ఉంటారో పోతారో అనుకున్నాడో ఏమో భగవంతుడు...తెలుగునాట భక్తుల మేధోతంత్రుల్లో శివజ్ఞ్యాన ప్రదాయిని ని జాగృతం చేస్తు సాగుతున్న సద్గురువుల వాక్కులను చెవిన వేసాడు ఈశ్వరుడు... వారి సంపూర్ణరామాయణం, శ్రీవేంకటేశ్వరవైభవం, శ్రీమద్భాగవతం ఇలా ఎన్నో తోడుగా ప్రసాదించి, ఇంటిని వాస్తుబద్దంగా, దేవుడి గూడు తూర్పుగా, దైవం ఉత్తరాభిముఖంగా చేసి, మా దైనందిన పూజా నమస్కారాలు తూర్పుకు అభిముఖంగా చేసి, ఉద్యోగ, కుటుంబ కర్తవ్యాలను సమర్ధవంతంగా నిర్వహించే దక్షతను ప్రసాదించి, వారి ప్రవచనాలు నేటి మా జీవితాలను ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దాయో మాటల్లో వర్ణించలేను...
ఒక దశాబ్ధకాలపు యాతనల / కష్టాల మధ్య సాగిన ప్రార్థనలు ఫలించి, నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత మహదేవ అన్నట్టు, ఆ దైవం తనపై మరింతగా విశ్వాసాన్ని పెంచి మా జీవితాలకు శుభాలను ఒసగుతూ, నిత్యవాసంతికమా ఏమి అన్నట్టు చుట్టూ ఉన్న వేప, మామిడి, సీతాఫల వృక్షాలపై కర్ణపేయమైన పక్షులకలకూజితములతో ఉండే ప్రాంతంలో, నేడు ఒక పెద్ద సొంత ఇంట్లో నేను శ్రీవేంకటపరదైవతాన్ని సేవిస్తూ బ్రతికే మహద్భాగ్యానికి నిశబ్ధ కారణం ఆ సద్వాక్కే..!!
"గురువుగారు అందరికీ చెప్పిన శ్లోకాలు, పద్యాలు, ప్రవచనాలే కదా నువ్వు కూడా విన్నది, మరి ఎందుకు అంతగా నీ జీవిత ఉన్నతికి కేవలం వారి సద్వాక్కులే కారణం అని భావిస్తూ ఉంటావు..." అని అనుకోవచ్చు కొందరు... నా హృదయసీమపై, మనోఫలకంపై అంతగా ఆ సద్గురు వాక్కులు నాటుకు పోవడానికి కొన్ని బలమైన కారణాలేఉన్నాయి...!
ఇంటర్మీడియట్ ఒకటవ సంవత్సరం వరకు ఒక చిన్న రెండురూముల రేకుల ఇంట్లో సాగిన సంతోషకరమైన అతి సామాన్య జీవితం నాది. గృహలక్ష్మిగా ఇంట్లోనే ఉండే అమ్మ, సనత్ నగర్ ఆల్విన్ లో ఒక చిరుద్యోగి అయిన నాన్న, రెండేళ్ళు చిన్నవాడైన తమ్ముడు, మా ఇంటిచుట్టూ ఉన్న రంగు రంగుల గులాబి, చామంతి, లిల్లి, మల్లె, విరజాజి, ముద్దమందారం, దానిమ్మ, జామ, చిక్కుడు, మొక్కజొన్న, మొదలైన మొక్కలూ చేట్లే నా ప్రపంచం... వాటిమధ్య మేము ఆడిందే ఆట పాడిందే పాట...ఆధ్యాత్మికత, సంప్రదాయం, ఆచారాలు, స్తోత్రాలు, ఇత్యాదులపై ఏమాత్రం అవగాహన లేని సగటు మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. రోజు ఓ రెండు పూలు దేవుడి గూట్లో పెట్టి నమస్కరించడం, పండగలకు ఒక కొబ్బరికాయ కొట్టడం, రెండేళ్ళకోసారి జగద్గిరిగుట్టపై ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి గుడి జాతరకి వెళ్ళడం, ప్రతి గురువారం దెగ్గర్లోని సాయిబాబా గుడికి హారతులకు, శనివారం హనుమంతుని ఆలయానికి ప్రదక్షిణలకు, ఆదివారం చిత్తారమ్మ / పోచమ్మ గుడికి వెళ్ళి నమస్కరించడం తప్ప, పెద్దగ ఏమి తెలియని చిన్నపాటి జీవితం.
దెగ్గర్లోనే ఉండే చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు అలా సిటీకి, గణేష్ ఉత్సవాలకు టాంక్ బండ్, అలా వెళ్ళడం, సంవత్సరంలో ఒక్కసారైనా కులదైవమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి అభిషేక/దర్శనాలు, అట్నుండే కొండగట్టు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడం రివాజు.
నాన్న కంపెనీ కాంటీన్ నుండి తెచ్చే చిన్న బిస్కెట్ పాకెట్లు, సమోసా, కచోరి, ఫ్రూట్ బ్రెడ్, సోన్ పాపడ, ఇవి తింటూ పెరిగిన బాల్య కౌమారములు. నాన్న వాడే బజాజ్ చేతక్ బండి నడపడం రాగానే ఏదో విమానం నడపడం వచ్చినంత సంతోషంతో సాగిపోతున్న రోజులు అవి...
గట్టిగా వర్షం పడితే పగిలిన ఇంటిపైరేకుల్లోనుండి కురిసే నీటితో ఉండే చాలి చాలని ఈ చిన్న ఇల్లు పక్కనపెట్టి, పిల్లలు పై చదువులకు వెళ్ళకముందే, ఇంటికి ఉత్తరాన ఎదురుగా ఉన్న విశాలమైన ఒ 100 గజాల్లో ఒక మంచి 2 బి.హెచ్.కే కట్టుకుని నిండు 100రేళ్ళు అలాగే సంతోషంగా జీవిద్దామని, వాస్తు శాస్త్రాన్ని మరచి నాన్న వేసిన తప్పటడుగు, తదుపరి దశాబ్ద కాలంపాటు మా జీవితాన్ని కుదిపేసిన తప్పుటడుగుగా మారి, ఆఖరికి ప్రాణంపైకి వచ్చింది...!
హద్దెరగని ఆగ్రహావేశాలతో ప్రాణాలపైకి తెచ్చుకొని గరళసేవితుడైన తండ్రి ప్రారబ్ధాన్ని, జరగరాని ఘోరం జరగకుండా గరళకంఠుడి త్రిశూలమై నిలువరించింది ఆ వాక్కు...! శ్రీవేంకటహరినామం / సద్గురువాక్కుల రామాయణం తప్ప, ఆనాడు పల్స్ / బి.బి.అర్ హాస్పిటల్స్ లో మానసికంగా ఒంటరివాడినై ఎందుకీ దుర్భర వెధవ జీవితం అని శోకంలో మునిగిపోయిన నాకు, వేరే తోడేలేకపోయింది... ఈతి బాధలతో శోకపూరితమైపనిచేయని నా బుర్రకి, ఇక దేనికోసం బ్రతుకు అనిపించి చేసుకోబోయిన ఘోరాన్ని పలుమారు తృటిలో తప్పించింది కూడా ఆ వాక్కే... ఎంతటి దీన అవస్థ వచ్చినా సరే గుళ్ళో కొట్టిన కొబ్బరి ముక్కలు తిని అక్కడే నీళ్ళు త్రాగైనా బ్రతకొచ్చు కాని, క్షణికావేశానికి లోనై ఇలాంటి ఘొరాల్ని చేసుకుంటే పిశాచజన్మ ఎత్తి అనుభవించే బాధ చాల ఎక్కువ.... అని నేర్పిన ఆ వాక్కుకి ఏమిచ్చి ఋణంతీర్చుకోగలము..? ( నేను ఆ సమయంలో విన్నది, సుందరకాండలో సీతమ్మ దర్శనంకాలేదని శోకతప్తమైన హనుమంతుడి గురించిన గురువుగారి ప్రవచనం )
అన్నివిధాలా క్షీణించిన నాన్న మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కోల్పోయి రోజు బాధపడే అమ్మ, ఇంజనీరింగ్ చదువులతో కుస్తీ పట్టేనేను, డిగ్రీ / ఎం.సి.ఏ చదువులతో తమ్ముడు, అప్పుడప్పుడు వచ్చి, అయ్యొ పాపం ఎలా ఉండే మనిషి ఇలా అయిపోయి కుటుంబాన్ని ఇంతగా క్షోభ పెడుతున్నాడు ఏంటో ఏమో అని బాధపడే ఇరుగు పొరుగు, కొందరు బంధుజనం.... ఇలా ఉన్న దుర్భర జీవితంలోకి, ఇంటికి ఓ రెండు మైళ్ళ దూరంలో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీ చాగంటి వారి ప్రవచనాలు ప్రవేశించి, ఆధ్యాత్మికతపై కొద్ది కొద్దిగా అవగాహన రావడం, తన్మూలంగా ఇంటిని, జీవితాన్ని చక్కదిద్దుకోవడం, తిరుమల శ్రీవారి సేవలభించడం, ఇలా క్రమక్రమంగా అశుభనాశనం, శుభదాయకంగా, వారి ప్రవచనాశ్రవణం వర్ధిల్లి ఇప్పుడున్న నేనుగా నన్ను, నా జీవితాన్ని సుస్థిర పరిచిన వైనం, కేవలం నాకు మాత్రమే తెలిసిన గురుకటాక్ష వైభవం...!!
ఉన్నప్పుడు చేసుకున్న పుణ్యమే, లేనప్పుడు / కష్టాలలో కూరుకుపోయినప్పుడు పొట్టకి బట్టకి లోటులేకుండా కాపాడుతుంది అని పెద్దలు చెప్పేది ఎంతో నిజం...
చిన్నప్పుడు మా బస్తిలోని పోచమ్మ గుడిని కట్టి ప్రతిష్ఠ చేసిన వారిలో మా నాన్న కూడా ఉండడం, పక్కనే హనుమంతుని ఆలయం కట్టేటప్పుడు కూడా మా అమ్మ నాన్న ఆ త్రయాహ్నిక విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువుల్లో కైంకర్యపరులుగా పాల్గొనడం, నేను మరియు తమ్ముడు ప్రతి సంవత్సరం గణపతినవరాత్రుల్లో వీలైన సేవ చేయడం వల్ల లభించిన పుణ్యమే, గడ్డు కాలంలో మాకు శ్రీరామరక్షగా ఉండి కాపాడింది...!
వ్యక్తిగతంగా కూడా, నా జీవితానికి ఆ వాక్కు చేసిన మేలు చిరస్మరణీయమైనది...
సంపన్న ఉన్నత కుటుంబాల్లో కౌమార యవ్వన ప్రవేశంచేసే వారి పిల్లలకి, పంచె / ధోతి కట్టించడం పెద్ద ఉత్సవంగా చేసుకుంటారని సినిమాల్లో మరియు కొందరి ఇళ్ళల్లో చేయడం తెలుసు. మా తాతగారు (కీ.శే. పితామహులు) తప్ప, మా నాన్న తరం వారెవ్వరు పంచెకట్టు తెలిసిన వారు కారు. మొట్టమొదటి సారి కాకినాడకి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవంలో పాల్గొనాలని వచ్చిన నాకు, అయ్యప్ప ఆలయం లోని వాయవ్యమూలన ఉన్న అమ్మవారి సన్నిధిలోనే ఆ అనుగ్రహం లభించింది. బస చేసిన ఉడిపి లాడ్జి నుండి ఒక కొత్త పెద్ద లుంగి చుట్టుకుని వచ్చి ప్రదక్షిణ చేస్తున్న నన్ను, అక్కడ గుడిలోని అర్చక స్వామి పిలిచి, "బాబు, సాంప్రదాయికంగా పంచె కట్టుకొని ఉత్సవాల్లో పాల్గొనడం ఇక్కడ అందరికి తెలిసిన ఆచారం. గురువుగారు కూడా అదే చెప్తూ ఉంటారు కదా.." అని అనడంతో, "నేను ఈ ఊరికి కొత్తండి. ఇక్కడ నాకు ఎవ్వరు తెలియదు. ఇప్పటివరకు పంచె ఎప్పుడూ కట్టుకోలేదు, రాదు..." అని ఒకింత బాధతో నిట్టూర్స్తున్న నాకు, వారే స్వయంగా పక్కకు తీస్కెళ్ళి, అస్తవ్యస్తంగా కట్టుకొచ్చిన ఆ ' పెద్ద ' లుంగిని సాంప్రదాయిక పంచే కట్టుగా కట్టేసరికి, నమ్మి నమస్కరించిన పరాశక్తి ఆ ' ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ' ఈ జీవితానికి పంచె కట్టు నేర్పిందన్న సంతోషంతో, ఆనందభాష్పాలతో, దత్తమందిరం వైపుగా ముందుకు సాగిన ఆ క్షణాలు మదిలో చిరంతన మధుర స్మృతులు...!
ఊర్లో ఎవ్వరు తెలియదని బాధతో ఉన్న నన్ను చూసి జాలిపడిందేమో ఆ దుర్గమ్మ, నిద్రాణమై ఉండే కుండలినీ శక్తిని జాగృత పరిచేందుకు ఎంతో కీలకమైన పంచె కట్టు నేర్పిన ఆ ఊరినుండే, 5 నెలలు తిరిగే సరికి నాకు ఒక మంచి ఆప్త మితృన్ని ప్రసాదించి, సర్పవరంలోని నా మితృని కుటుంబాన్ని ఎంతో సన్నిహితంగా చేసి, ఆ ఇంట్లో ఎందరో సువాసినుల మధ్య లలిత చేసుకునే భాగ్యం కటాక్షించింది ఆ సర్వేశ్వరి. నా మితృడితో పరిచయమైన ఇతర మితృలతో ఒక రెండు సంవత్సరలపాటు చేసిన తీర్థయాత్రలు, జీవితంలో మరచిపోలేనివి...ఫలానా క్షేత్రం వెళ్ళేముందు, గురువుగారు చెప్పిన తద్ క్షేత్రానికి సంబంధించిన ముఖ్యమైనవన్ని రాసుకొని, ఆ యాత్ర పరిపూర్ణమయ్యేలా చేసిన ఆ మితృలు కూడా గురుకటాక్షమేగా మరి...!
కాళేశ్వరం లో పుష్కరాలతో మొదలై, అరుణాచలం (గిరిప్రదక్షిణం సహ), శ్రీశైలం (ఇష్టకామేశ్వరి సహ), శ్రీకాళహస్తి, తిరుమల, అయినవిల్లి, దక్షారామం, కోటిపల్లి, కుమారారామం, ర్యాలి, పిఠాపురం, కుక్కే సుబ్రహ్మణ్య, ఉడుపి శ్రీ కృష్ణ, పాలకొల్లు క్షీరారామం, యనమదుర్రు శక్తీశ్వర ఆలయం, బాసర, భద్రాచల అంబసత్రం, మురమళ్ళ, భీమవరం మావుళ్ళమ్మ, అన్నవరం వనదుర్గమ్మ / సత్య నారాయణస్వామి, బెజవాడ కనకదుర్గమ్మ, ఇలా ఎందరో దేవతల సశాస్త్రీయ సందర్శనాసౌభాగ్యానికి / అనుగ్రహానికి మూలకారణం ఆ గురువాగ్వైభవ కటాక్షమైన మితృత్వం.
ఈ మధ్యలో, షిరిడి, నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మరియు బ్రహ్మగిరుల్లోని గోదారమ్మ ఉద్గమస్థానం, పంచవటి గోదావరి స్నానం / అక్కడి పరిసర గోరారాం - కాలారాం వంటి ఆలయాలు, ఇంకోసారి అరుణాచలం (మరచిపోలేని ఆది అన్నామలై ఆలయంలో లింగోద్భవకాల అభిషేకం తో కూడిన హేమలంబ/హేవిళంబి శివరాత్రి నాటి గిరిప్రదక్షిణం..! ), కంచి (కామాక్షి అమ్మవారి శుక్రవారాభిషేకం ఆ తరువాతి ఆశ్చర్యదాయక స్వర్ణాభరణాల అలంకార దర్శనం, ఏకామ్రేశ్వర, వరదరాజ, ఉలగళంద పెరుమాళ్ (ఇంతింతై వటుడింతై అని గురువుగారు వర్ణించిన వామనమూర్తికి అచ్చం ప్రతీకగా ఉన్న ఆశ్చర్యదాయకమైన వామన మూర్తి ఆలయం / దివ్యదేశం), చిత్రగుప్త, మొదలైన ఆలయాలు), కంచి కామకోటి పీఠంలోని అమృతతుల్యమైన భోజన ప్రసాదం, ఇద్దరి జగద్గురువుల దర్శనభాగ్యం / వారి కరకమలముల మీదుగా విభూతి,కుంకుమ ప్రసాదాలు, మహాస్వామి/పెరియావా/పరమాచార్య బృందావనం / స్వర్ణరథయాత్ర, నల్లకుంటలో మొన్నటి శ్రీఆదిశంకరులజయంత్యుత్సవాల్లో శృంగేరి జగద్గురువుల దర్శనభాగ్యం..., ఇలాంటివన్ని ఫలించేలాచేసి ఇటీవలే, ఇంటికి ఒక గంట దూరంలోనే జోడీని అనుగ్రహించి నన్నొక ఇంటివాడిని కూడా చేసింది శ్రీమద్భాగవతప్రవచనాంతర్గత ఆ వాగ్ప్రసాదిత సర్వదేవకృత లక్ష్మీస్తోత్రం...!! )
కాకినాడలోని ఆనాటి శ్రీవేంకటేశ్వరవైభవోత్సవాల్లోని, శ్రీభుసమేత శ్రీనివాసకల్యాణం నా జీవితానికి ఎన్ని విధాల ఎంతమేలు చేసిందో వర్ణించడం అసాధ్యం....అప్పుడు అక్కడ వేదికపై అమ్మవార్లకు మాంగల్యధారణసమయంలో శ్రీ సుబ్రహ్మణ్య శర్మగారు పలికిన వచనం, " ఈ అత్యంత సశాస్త్రీయ కల్యాణ వీక్షణం మీ జీవితాల్లో శుభాల పరంపరకు కారణమవుతుంది. అందరూ శ్రద్ధగా మంగళసూత్రాలకు నమస్కారం చేసుకోండి..."
ఇప్పుడు నేను భుజిస్తున్న ప్రతిమెతుకుపై ఆ నాటి స్వామి కల్యాణం నాకు సాక్షాత్కరిస్తుందంటే అది అతిశయోక్తి కానేరదు...!. అంతటి అనుగ్రహదాయకంగా వర్ధిల్లింది ఆ నాటి వేదమూర్తుల ఆశీర్వచనం, స్వామి వాహనసేవ, ప్రసాద స్వీకరణ ఇత్యాది ఉత్సవఘట్టములు.
చిన్నప్పుడు స్కూల్లో సిలబస్ లోని తెలుగు పద్యాలు తప్ప, పోతనామాత్యుల భాగవతం అనేది ఒకటుందనే స్పృహకూడా లేని జీవితానికి, భాగవత ప్రార్థనా శ్లోకపద్యాలు కంఠస్తం గావించి, అవి నా దైనందిన పూజాంతర్భాగంచేసింది అ వాక్కు...
శారదనీరదేందుఘనసార..... అనే పద్యంతో గుక్కతిప్పుకోకుండా ఆ శ్రీవాణిని కీర్తించి అర్థిస్తే తప్పకుండా సహాయం చేస్తుందని నేర్పింది ఆ వాక్కు... (అలా ప్రార్దించి ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానం పొంది సమాధానపడిన సందర్భాలెన్నో...!)
అసలు ఆచమనం అంటే పూజకు ముందు స్పూన్ తో కొన్ని నీళ్ళుత్రాగి పెదాలు తడుపుకోవడం అని అనుకొని బ్రతికేసిన నా అవధిలేని అజ్ఞ్యానానికి, అది ఎందుకో ఏమిటో, దక్షిణహస్త అమృతమార్గం గుండా బుడగలులేని నీటిని ముమ్మారు కేశవ నారాయణ మాధవ అని మాత్రమే ఎందుకు తీసుకోవాలో నేర్పించి, పూజకు కావల్సిన కనీస అర్హతను కట్టబెట్టింది ఆ వాక్కు...
అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ.... అనే పద్యాన్ని దేశకాల నియమాలు లేకుండా పఠించినా, సాక్షాత్ ఇంద్రకీలాద్రిపై ఉన్న ఆ దుర్గమ్మ మనకు కావల్సినవి అన్ని దెగ్గరుండిసమకూర్చుతుందని నేర్పింది ఆ వాక్కు...
ఒక్కమాటాలో చెప్పాలంటే, ఉన్నత చదువులను గడించిన సాంప్రదాయిక కుటుంబాలవారు, వాళ్ళ వాళ్ళ పిల్లలకు చిన్నపటినుండి కావల్సిన విద్యాబుద్దులు అన్ని దెగ్గరుండి నేర్పించి ఐహిక, పారమార్ధిక జీవయాత్రకు కావల్సిన భక్తి జ్ఞ్యానసామాగ్రిని సమకూర్చి వారి జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దినట్టుగా, తల్లి తండ్రి గురువు దైవం అన్నీ తానై, తనంతటతానే అన్నింటా అమరిపోయి అమరవంద్యుడైన ఆ ఆనందనిలయున్ని ఒక ఆప్తమితృనిగా చేసిపెట్టింది అ వాక్కే...
' ఒకనాడు అంజనీసుతుడు తన మలయమారుతాన్ని అనుగ్రహించి గురువుగారి ఫ్లెక్సీని చూపించిఉండకపోతే, చక్కదిద్దే పెద్దదిక్కు లేక జీవితం ఏ కలి ప్రభంజనంలో కొట్టుకుపోయేదో...', అనే తలపువచ్చిన మరుక్షణం, నయనధారలను ఆపడం కష్టంగానే అనిపిస్తుంటుంది...!
ఎన్ని లీటర్ల కమ్మని గోవుపాలు ఉన్నా, కొంచెం తోడు కలపనిదే అది పెరుగై అందులోనుండి మధురమైన వెన్న మరియు అమృత తుల్యమైన నెయ్యి రావనేది, చిన్నప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వేసవి సెలవుల్లో వెళ్ళిన నాకు, అక్కడ తాత నానమ్మలు రోజు పాలు పితికి సాగించే పాడివ్యాపారంలో అర్ధమైన సత్యం...
అలాగే, ఎన్ని చక్కని అధ్యాత్మ విద్యా విషయాలు గడించినా,' సద్గురు వాక్కు ' అనే తోడు లభించి వాటిని శ్రద్ధగా అనుసంధానిస్తే తప్ప, మధురమైన పరమాత్మ తత్వం, అమృత తుల్యమైన, ఆనందదాయకమైన పరతత్వరుచి, "పారలౌకిక రుచి దర్శనం" లభించవనేది నా స్వానుభవపూర్వక సత్యం...!!!
పుట్టగొడుగుల్లా పేటకోపీఠం, పూటకో స్వామీజి పుట్టుకొస్తున్న ఈ కలికాలంలో, ఆధ్యాత్మికత అంటే అంతా బిసినెస్ బూటకం అని భావిస్తున్న ఈ తరానికి చెందిన ఎందరికో సరైన అవగాహన సరళమైన వాక్కులతో కల్పిస్తూ, కడుదూరాలనుండే అందరిని దైవానికి దెగ్గర చేస్తు, శిష్యుల జీవితాలు సర్వతోముఖాభివృద్దితో తరించేంతగా శాసించడం కేవలం సద్గురువులకే చెల్లు..!
" ఏటికి ఎదురీదడం రాదుకాని, గుంపును గోదారి దాటిస్తా...అన్నాడంటా వెనకటికి ఒక మహానుభావుడు...
అలాంటి వారిని కాకుండా, తాము తరించి ఇతరులను తరింపచేసే వారిని సద్గురువులుగా స్వీకరించి పరమహంసల యొక్క క్షీరనీరన్యాయాన్ని సదా పాటిస్తూ, జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమే ప్రతి ఒక్కరి లక్ష్యం అవ్వాలి..." అని బోధించే శ్రీ చాగంటి వారి మాట, మరెందరో జీవితాల్లోకి ప్రవేశించి వారికి ఎనలేని బాసటగా నిలవాలని అభిలషిస్తూ....
అస్మద్ గురుదేవుల పాదపద్మములకు జన్మదిన శుభాభినందనా నమస్సులు తెలుపుతూ, ఒక ఏకలవ్య వినేయుడి వినయాక్షర సుమాంజలి... 
శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుపాదుకాభ్యాం నమః.....!
https://www.facebook.com/Vinay.Aitha/posts/10214940850368104

No comments:

Post a Comment