ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి....,
ఇత్యాది పేర్లు కలిగిన ఎకైక దేశం భారతదేశం. వీటన్నిటికి మూలాధారమైన గకారపంచకం - "గోవు", "గోవిందుడు", "గురువు", "గీత", "గంగ" , ఈ సనాతన సాంప్రదాయం యొక్క ఉనికికి, అది నిరంతరం విశ్వశ్రేయస్సుకై పరిఢవిల్లడానికి, ఆధార స్తంభములు... అవి ఎంత పటిష్టంగా ఉంటే ఈ ధర్మభూమిపై శాంతియుత జీవనం అంత భద్రంగా ఉంటుంది... గుడికి వచ్చిన భక్తుడు ఎవరు అన్నదానితో సంబంధంలేకుండా, ఒక సద్బ్రాహ్మణుడు వారి యొక్క, మరియు వారి కుటుంబం యొక్క శ్రేయస్సుకై తగు అర్చాదికాలు జరిపి, మనం వేసే పదోపరకో తీసుకొని, మనస్పూర్తిగా ఆశీర్వదించి భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్తగా ఉండే వారిపై, వారిని పెంచి పోషించే సంస్థలపై, పీఠాలపై,
(ఇక్కడ చెప్పబడింది తత్ దైవ సంబంధ అష్టోత్తరాలు, మంత్రపుష్పం ఇత్యాది కనీస ఆలయ ఆచార మరియాదలు తెలిసి సశాస్త్రీయంగా భక్తులకు అర్చనలు జరిపే సద్వర్తనులగురించి గాని, పరమపవిత్రమైన ఉపవీతం (జంధ్యం) వేసుకొని ఏవో నీళ్ళునములుతూ పూజలను మమ అనిపించి వైదిక వృత్తిని కేవలం ధనార్జనకు బాటగా ఎంచుకున్న వారి గురించి కాదు అని గమనించాలి )
హేతువాదం అంటూ, సైన్స్ అంటూ, శివలింగం పై పాలు పోయడం వృధా, ఒక మూర్తికి అన్నేసి పూలు సమర్పించడం దగా, అనే స్వనిర్మిత కుటిల వాక్యాలు ప్రచారం గావించే భూమికి భారమమైన వారినుండి సాంప్రదాయాన్ని సంరక్షించడం అందరికి విహితధర్మం.
ఒక చిన్నపిల్లవాడికి ఇవాళ అలాంటి అశాస్త్రీయ ఆలోచనా విధానాన్ని నేర్పిస్తే, వాడూ పెద్దవాడై తనచుట్టు ఉన్న ఒక వెయ్యిమందికి అదే సైన్స్ అని నూరిపోస్తాడు....
సద్గురువులనుండి భాగవతాన్ని శ్రవణం గావించిన వారికి, ధర్మం వృషభం గా (ఎద్దుగా), భూమి గోవు గా, కలి యొక్క ఉద్దృతిని వర్ణిస్తూ భాధపడే ఘట్టం , ఈనాటి సమాజానికి సద్ గోబ్రాహ్మణ సంరక్షణ ఎంత కీలకమైన అంశమో అర్ధమవుతుంది...
కాబట్టి ఓ హేతువాదులారా, గోవులను సద్బ్రాహ్మణులను చిన్నచూపు చూసే సంకుచిత స్వభావ మర మనుషులారా, మీరు నమ్మకున్నా, పాటించకున్నా, సేవించకున్నా, సమాజానికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు... కాని పనికట్టుకొని ' తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచెన్ ' అన్న చందంగా మీయొక్క వితండవాదాన్ని విస్తరింపచేసి సమాజంలో వ్యాప్తిచెందేలా చూసి, అందరూ మీలా మర మేధావులైపోవాలనే తపనను వీడి, " సర్వేజనా సుజనా భవంతు, సర్వే సుజనాః సుఖినో భవంతు " అనే వచనాను సారంగా అందరూ శాంతియుతంగా జీవించడానికి తగినంత సహకారం చేయడమే మీమేధస్సును మానవాళి అభివృద్దికై ఉపయోగించడానికి ఒక పెద్ద హేతువు..!

No comments:
Post a Comment