Wednesday, September 26, 2018

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ...! :)

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ...!  "
ఈ లోకంలోకి ఇద్దరి సహాయం తో మేఘమండలం నుండి ఆర్జిత కర్మానుసారంగా జీవుడు, మానవుడై కిందికి వచ్చి, ప్రారబ్ధాన్ని అనుభవించి, ఆగామిని కూడబెట్టి, సంచితపు లెక్కలు తిరిగి సరిచూసుకోవడానికి నూకలు చెల్లగానే, నలుగురి సహాయంతో అదే జీవుడై అలాంటి తిరుగు ప్రయాణమే సాగించడం... [ ఆ పెద్ద జీవయాత్ర తీరు తెన్నులు అటుంచితే.. ]
అలా ఈ చక్రం ఒక రంగులరాట్నంలా తుది మొదలు లేకుండా అలుపెరుగక అలా తిరుగుతూ ఉండడం...
ఒక విచిత్రమైతే, ఇందులో మనకు తోడు నీడై వాళ్ళ వాళ్ళ దేశకాల పరిధి / పరిమితి కి తగు విధంగా మనకు సహాయం చేస్తూ, మన యాత్రను సుగమం, సఫలం చేసేమిత్రులు ఎందరో ఉన్నపటికీ, కొన్ని మాత్రం ఎప్పటికీ మేము నీకు చిరకాలమిత్రులం అంటూ ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటూ మనకు దిక్సూచియై ఉంటాయని నా భావన... 
1. సద్గురు బోధ/వాక్యముల శ్రవణ స్మరణ మనన నిధిద్యాసనములు
2. శ్రీహరి నామసంకీర్తన / స్మరణ / భజన / కథా శ్రవణములు
3. సాంబశివాభిషేక / ధ్యాన / జప / తపములు
4. మాతృ / గో / వివిధ గురు / భూసుర / భాగవత-భక్తజన / సన్యాసుల సేవలు
[ డేరాడోరా, కల్కిఉల్కి లాంటి సన్నాసులగురించి కాదండోయ్ ! సన్యాసి అంటే - సదా ఉండే "సత్" లేదా "సత్యం" అయిన పరమాత్మయందు సదా తమ బుద్దిని న్యాసము గావించిన వారు అని నా అర్ధం ]
అయితే, మొట్టమొదటిదైన సద్గురు వాక్యం తో మిగతావన్ని ఆచరణపథంలోకి అనుసంధానం గావించినప్పుడు , అది బంగారానికి తావి అబ్బినట్టు, వాటి విలువ ద్విగునీకృతం అవ్వడం ఖాయం...
ఎందుకంటే, కొన్ని వేల స్వర్ణాభరణాలతో కూడా స్వామిని తులతూచలేని సత్యభామ, మనహ్పూర్వక రుక్మిణీ సమర్పిత తులసీదళం తక్కెడ లో వేయగానే సరితూగినట్టు, [ ఇక్కడ ఆభరణాల విలువ తగ్గించడం అంటూ ఏమిలేదు...కేవలం అవి మాత్రమే సరిపోవు అని చెప్పడం తప్ప ], ఒక సద్గురువు [ తాము ఆచరించి, ఫలితం పొంది, ఇతరులకు అదే బోధించే వారు ], చెప్పిన వాక్యాలను మన మనో తక్కెడలో పెట్టి అటుపిమ్మట మిగతావన్ని జోడించిననాడు, పరమాత్మ ఎప్పుడూ మనపక్కనే ఉంటాన్నది సత్యం....!
అందుకే స్వామి ఏడు కొండలపై పిలిస్తే పలికే దైవమై ఉన్నపటికీ, భగవద్ రామానుజాచార్యులు కట్టడి చేసిన సుసాంప్రదాయానుగుణంగా నన్ను చేరిన వారికే నేను సదా సమీపుడను అంటూ, శ్రీ భాష్యకార్ల సన్నిధి తనకంటే ఉన్నతంగా ఉత్తమంగా ఉత్తర ఈశాన్యంగా ఉండేలా చేసాడు స్వామి..!
సరే ఇంతకి ఇప్పుడు ఇక్కడ నేను, ప్రస్తావించదలచినది ఏమనగా,
ఈ తెలుగునాట, అలాంటి శ్రీ చాగంటి సద్గురువుల వాక్యాలను జీవితంలో ఒక్కసారైనా వినని అభాగ్యుడు ఉండడనుకోండి...
నేను అలా ఒకసారి వారు "ఉమామహేశ్వరవైభవం" గురించి చెబుతూ," సకల విద్యలకు, కళలకు, సారస్వతానికి అధిదైవం అయిన గణపతిని మనం వివిధ రూపాల్లో / రక రకాలుగా పూజించినప్పటికీ , ప్రార్థనాశ్లోకం ప్రకారం మనం చెప్పుకున్నట్టు ఆయనది "శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ..." కాబట్టి మీకు ఆయాన అనుగ్రహం ఉంటే ఎప్పుడైనా ఆపాదతలమస్తకం అలా పున్నమిచంద్రునిలా తెల్లగా ఉండే గణపతిని పూజించే భాగ్యం లభించవచ్చు " అని చెప్పారు...
నేడు నిజంగా అలా నిలువెల్లా తెలుపు రంగుతో ఉండి, కొలువుదీరిన గణపతి పూజలో తరించడం భలే ఆశ్చర్యానంద దాయకమైన మధుర స్మృతి...!
విశేషం ఎంటంటే, అది స్వయంభూ హనుమద్ / గణపతి ఏక శిలాస్థిత ఆలయం అవ్వడం... హనుమంతుడు కూడా నిజానికి ధవళ వర్ణంలోనే ఉండడం...
( బహుశా వీళ్ళిద్దరు సిందూరం పులుముకున్నాక అలా మనం ఎప్పుడూ చూసే అరుణవర్ణం లోకి వచ్చారనుకుంటా...!  )
నగురోరధికం..! నగురోరధికం ...!!

No comments:

Post a Comment