Friday, September 21, 2018

శ్రీపర్వతం అయిన తిరువేంగడం/తిరుసప్తగిరుల బ్రహ్మాండనాయకుని వార్షిక బ్రహ్మోత్సవ వైభవం....! :) - 2018

శ్రీపర్వతం అయిన తిరువేంగడం/తిరుసప్తగిరుల బ్రహ్మాండనాయకుని వార్షిక బ్రహ్మోత్సవ వైభవం....! 
భాద్రపద ఆశ్వీయుజాలు రానే వచ్చాయి... ఈ సంవత్సరం అధికమాసం (అధికజ్యేష్ఠం) వల్ల పెద్దలు చెప్పినట్టుగా రెండు బ్రహ్మోత్సవాల బృహత్ విభావాంతర్గత శ్రీవిభుని తిరుమాడవీధుల ఊరెరిగింపులతో భక్త భాగవత ప్రజానీకానికి పెద్ద పండగే మరి.....
ఈ 9 రోజులు వివిధ వాహనాలపై స్వామి పొద్దునా సాయంత్రం ఊరేగడం, అంత్యమున చక్రస్నానంతో ఉత్సవాలు పరిపూర్ణమవ్వడం పెద్దలు వివరించినట్టుగా అందరికి తెలిసిందే...
ఏదో వొట్టి ఉత్సవాలు చూసి ఆనందించామా, లడ్డూ ఇత్యాది ప్రసాదాలు కళ్ళకద్దుకొని ఆరగించామా, ఆపదల్లో ఆపన్నహస్తాన్ని అందించి ఆదుకున్నందుకు, ధార్మిక కోరికలు తీర్చినందుకు, మొక్కుబడుల రూపంలో కృతజ్ఞ్యతలు చెప్పేసి, వెళ్ళొస్తా దొర అని స్వామికి టాటా చెప్పి మళ్ళీ వచ్చే సంవత్సరం 'రిపీటే....' అని మాత్రమే కాకుండా, అసల్ ఎందుకు స్వామికి ఈ బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా...?
తిరుమలలో స్వామి ప్రతిరోజు సహస్రదీపాలంకార సేవ తర్వాత తిరుమాడవీధులన్నీ తిరుగుతు అన్నీ చూసుకొని గుడిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నాడు కదా....
పొద్దున్నే కొలువు సేవలో కోట్ల హుండి ఆదాయవ్యయాలు నయాపైసలతో సహా, కేటాయింపులు, అవకతవకలు, ఇత్యాది తన సామ్రజ్యపు లెక్కలన్నీ చూసుకొని తద్ అనుగుణంగా ఆయా జీవులకు తన అనుగ్రహ ఆగ్రహాల విశేషాన్ని తెలియజేస్తూనే ఉన్నాడు కదా....
మళ్ళీ కొత్తగా పనికట్టుకొని ఈ తిరుమల దొర ఎందుకు తనకు బ్రహ్మోత్సవాలు జరిపించుకొని ఊరేగి చిన్న పిల్లవాడిలా గుర్రాలు, ఏనుగులు, ఎక్కి ఆనందిస్తున్నాడో, తెల్సుకోవాలి అనుకుంటూ కొందరికైనా ఎప్పుడో ఒకప్పుడు ఆలోచన వచ్చే ఉంటుంది... 
శ్రీచాగంటి సద్గురువుల సద్వాక్కులను ఆధారంగా చేసుకొని కొంచెం శాస్త్రాన్ని పరిశీలించి చూస్తే, మాములుగా మనకు గ్రెగోరియన్ / ఆంగ్ల కాలమానం ప్రకారంగా జనవరి తో సంవత్సరం ప్రారంభం / అటు మన దైనందిన చాంద్రమాన పంచాంగం ప్రకారంగా చూసినా చైత్రం ( మార్చి / ఏప్రిల్ ) సంవత్సరం ప్రారంభం...సో అప్పుడు చేసుకుంటే ' హ్యపి న్యువ్ ఇయర్ ' అని అందరికి చెప్పడానికి స్వామి ఉత్సవాలు చేసుకుంటున్నాడని అనుకునేవాళ్ళం కదా.... అలా కాకుండా ఈ భాద్రపద ఆశ్వీయుజాల్లో చేసుకోవడం అంటే అందులోని ఆంతర్యం విశ్వశ్రేయస్సుకై అనడం పరిపాటి అయినా, అది ఏ విధంగా అన్నది కొంచెం చిత్రమైన అంశమే....!
ఒక గొప్ప నాయకుడు ప్రతిరోజు ఎందరినో కలిసి, ఎన్నెన్నో పనులు చక్కబెట్టుకొని తన విహిత ధర్మాలన్నీ ఆచరించి, ' తన కాడర్ ' కి అన్ని సదుపాయాలు సమకూర్చి, అజరామరమైన ఖ్యాతి గడించేలా రాజ్యపాలన సాగిస్తున్నా, అలా సాయంత్రం-రాత్రి సమయం ఆయ్యేసరికి మంచి సంగీతం వింటూనో ఇంకేదైనా ఇష్టమైన ప్రవుత్తిలో లీనమై కాసేపు సేదతీరి, విశ్రాంతి తీసుకొని, బాగా నిద్రించి విశేషమైన జీవశక్తి పుంజుకొని మళ్ళీ తన దైనందిన రాజ్యపాలన లో నిమగ్నమైనట్టుగా.....
పెద్దలు చెప్పినట్టుగా మన 12 మాసాల సంవత్సర కాలచక్రాన్ని భూభ్రమనానికి అతీతమైన కాలమానంగల దేవతలకు ఒక రోజుగా భావిస్తే, పవిత్ర మార్గశిరమాసం ఉషోదయం అయినప్పుడు, దాని ముందు కాలమైన ఆశ్వీయుజ/కార్తీకములు దేవతలు విశ్రాంతి తీసుకునే 11.00 PM to 03.00 AM ని నిద్రపోయే మధ్యరాత్రి జాముగా భావిస్తే, నిద్రించే ముందు అలా ఒ అరగంటసేపు (మనకు ఒ అర్ధపక్షం కాలం అన్నమాట) మంచి సంగీత సాహిత్య నృత్య ఇత్యాది రాజోపచారాలతో విశేషంగా తన శ్రీభూ సతులతో సేదతీరి, తనకు అన్నిటికంటే ఇష్టమైన ప్రవృత్తి అయిన, శరణాగతులను ఎల్లవేళలా కాచుకొని అనుగ్రహించి తన శ్రీపాదదాస్యానందామృతాన్ని వర్షించడలోనే లీనమై సంతసిస్తూ అలా కాసేపు విశ్రాంతి తీసుకొని, తిరిగి ' మార్ఘళిత్తింగళ్ మదినిరైందనన్నాల్లాళ్... ' అంటూ తిరుప్పావై లోని గోదమ్మ కమ్మని పాశురపరిమళాలతో ఉషోదయం లో తన అరవిందదళాయతాక్షములను చిరునవ్వులతో మెల్లగా వికసింపజేస్తూ, మకరసంక్రమణ ఉత్సవాలతో విశేష జీవశక్తిని పుంజుకొని ఇక 'రిపీటే....' అన్నట్టుగా, సకల చరాచర విశ్వానికి ఆదిదేవుడైన అధినాయకుడైన శ్రీనివాసుడికి ఈ బ్రహ్మోత్సవ ఏర్పాట్లు కావించడం, అని తెలుసుకొని మనం ఆనందించడంలో ఆ ఉత్సవవైభవం మరింతగా ఇనుమడిస్తుందని నా భావన... 
అంటే నిజంగా స్వామి అలా గుడిలోపల అర్చామూర్తిగా నిలబడకుండా, భక్తులను చూడకుండా నిద్రపోతారని కాదు...., ఇది కేవలం దైవత్వపు తాత్విక సమన్వయం మాత్రమే....
' అంతర్యామి ' గా ఎల్లవేళలా ఆశ్రితులందరినీ స్వామి వెయ్యి కన్నులతో కాచుకొని సదా రక్షిస్తూనే ఉంటాడు.... 

https://www.facebook.com/Vinay.Aitha/posts/10215311891123891

No comments:

Post a Comment