Friday, September 21, 2018

శ్రీనివాసుని మేనల్లుడైన, జగదాంబికా సుతుడిగా కొలువబడే, శ్రీ గణనాథుని వైభవం...! :)

శ్రీనివాసుని మేనల్లుడైన, జగదాంబికా సుతుడిగా కొలువబడే,
శ్రీ గణనాథుని వైభవం...! 
(అటు తాత్వికంగా చూసినా, శ్రీహరి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిది, పరమశివుని రుద్రగణాలన్నింటికి అధిపతి అయిన గణపతిది, ఒకే సామ్యం అని పెద్దల ఉవాచ కనుక గణపతి నవరాతృలు అందరికీ చాల పెద్ద పండుగే కదా...)
---------------------
ఇంటర్మీడియట్ పరీక్షల రిసల్ట్స్ ని చూసి బిట్స్ పిలానీ లో మెకానికల్ ఇంజనీరింగ్ కి ఉన్న అవకాశాలను చూస్తు ఒకవైపు, ఇటు రాసిన ఎంసెట్ పరీక్ష రిసల్ట్స్ వచ్చేవరకు వేచిచూసి ఆ తర్వాత ఏ గ్రూప్ తీస్కోవాలో చూద్దామా అనే అలోచనతో ఇంకోవైపు, 17వ పడిలోని నా ఆలోచనలు ఊగిసలాడుతున్న సమయం అది...
నాన్న అకాల ఉద్యోగవిరమణతో లభించిన డబ్బును అత్యంత జాగ్రత్తగా పొదుపు చేసి, దానిపై వచ్చే కొద్దిపాటి వడ్డీతో ఇక మున్ముందు ఉన్న భారమైన కాలంతో, అంతంతమాత్రంగా ఉన్న, అమ్మ వివరించిన కుటుంబ ఆర్ధిక పరిస్థితిని క్షుణ్ణంగా బేరీజు వేసి, నా తర్వాత ఉన్న తమ్ముడి పై చదువులకు కూడా అయ్యే ఖర్చుని పరిగణలోకి తీసుకొని, అప్పటికే ఇంజనీరింగ్ చదువుతూ, ఇంటికి దెగ్గరగా ఉన్న చుట్టాలైన అన్నలని, అక్కని సంప్రదించి, ఇక్కడే ఏదో గ్రూప్ లో ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం చేయడమే సబబు అని నిర్ణయించుకొని, మాసబ్ టాంక్ జె.ఎన్.టి.యు కౌన్స్లింగ్ లో, మెదక్ నర్సాపూర్ లోని బి.వి.ఆర్.ఐ.టి, వన్ అఫ్ ది టాప్ 10 కాలేజెస్ అని అప్పటికే అందులో ఫైనల్ ఇయర్ చదువుతున్న, దెగ్గరి చుట్టాలైన ఒక అన్న చెప్పడంతో, ఇంటికి దెగ్గరగాకూడా ఉంటది కదా, సో చదువులకు కీలకమైన సమయం ప్రయాణంలో వృధా కాకుండా ఉంటదని భావించి, అందులోనే ECE గ్రూప్ తీసుకుని, ఒకసారి కాలేజి, బస్ రూటు, మొదలైనవన్నీ చూసొద్దామని నాన్న తో పాటు మొట్టమొదటి సారి మా కాలెజ్ కి వెళ్ళిన రోజులు అవి.....
సువిశాల 70+ ఎకరాల్లో వివిధ చెట్లు, మామిడి తోటలతో, నందనవనంలా ఉన్న కాలేజ్ ని చూసి అబ్బురపడి, ఎంట్రీ గేట్ నుండి ఒ 5 నిమిషాల నడక తర్వాత వచ్చిన మహాత్మగాంధీజి స్తూపానికి నమస్కరించి వెనకాల క్రీం కలర్ లో ఆరెంజ్ బార్డర్ తో ఉన్న మూడు పెద్ద బిల్డింగ్లని చూసి, ఇందులో నా ECE బ్లాక్ ఏదై ఉంటుందబ్బా అని అలోచిస్తు, అప్రయత్నంగానే కుడివైపు వెళ్ళి చూడగానే EEE,ECE,BME సైన్ బోర్డ్స్ చూసి, హా ఇదే కదా అని అలా కాసేపు మధ్యలో ఉన్న లాన్లో నిల్చొని అన్ని క్లాస్రూంలు,లాబ్స్ చూసి, మిగతా బ్లాక్స్ కూడా చూసేసి మెదక్ నుండి జె.బి.యస్, వయా నర్సాపూర్ వెళ్ళే బస్లో ఇంటికి తిరిగివచ్చేసి అలా కాసేపు విశ్రాంతి తీస్కున్నా...
రాను పోను కలిపి రోజుకు 85+ కిలోమీటర్ల ప్రయాణంతో, మంచి పేరుగల విద్యాసంస్థలో చదివి, నా మీద నమ్మకంతో మూలధనం నుండి ఫీజుల రూపంలో అమ్మ ఖర్చుపెట్టే తిరిగిరాని ప్రతీరూపాయి ఎంత కీలకమైందో తెలుసుకొని, అందుకు అనుగుణంగానే కష్టపడి ఇంజనీరింగ్ విద్యలో ఉత్తీర్ణుడవ్వడం అప్పుడు నాముందు ఉన్న పెను సవాల్. మిన్ను విరిగి మీదపడినా సరే అది సాధించి తీరడమే ఎదురుగా ఉన్న అప్పటి నా జీవిత లక్ష్యం....!
( నా ఉక్కు సంకల్పానికి విధి ఓర్వలేకపోయిందేమో, ప్రతి విద్యార్థికి అత్యంత కీలకమైన ఈ పైచదువుల సమయంలోనే జీవితం నాకు ఎన్ని అగ్నిపరీక్షలు పెట్టిందో తలచుకుంటేనే ఒక్కోసారి దుఃఖం కట్టలు తెంచుకుంటుంది.... ఇంట్లోని ఈతిబాధలకు కృంగిపోయి అటు చదువులు ఇటు నా జీవితం కూడా ఆగ్రహావేశాలకి బలైపోయి ఆగిపోవాల్సిన దుస్థితిని, చిన్నపటినుండి గణపతినవరాత్రుల్లో ఎంతో ప్రేమగా నేను ఆరాధించిన ఆ గణపతి పరబ్రహ్మం ముందుగానే దర్శించి, ఇక వీడికి నేను ప్రత్యక్షంగా సహాయం చేసితీరవలసిన సమయం ఆసన్నమయిందని దయతలిచి నా కాలేజి లోకే గుడికట్టించుకొని వచ్చేసాడు. శక్తిగణపతిగా / విద్యాగణపతిగా స్వామిని ప్రతినిత్యం ఆరాధించి, రోజు ఆయన ప్రసాదం స్వీకరించి పొందిన శక్తియుక్తులతోనే ఇంజనీరింగ్ విద్యలో ఉత్తీర్ణుడనైన నాకు, 3 బహుళజాతీయ సంస్థల ఆహ్వానాలతో నా ఉద్యోగజీవితాన్ని సుస్థిరపరిచిన నా కాలేజి, అందులోని గణపతి ఆలయం / సరస్వతి మందిరాలు గుర్తుకురాగానే ఇప్పటికీ అశ్రువులు ఆకాశ గంగాధారలా ఆపతరం కాదు. )
2004 సెప్టెంబర్ రానేవచ్చింది...' వెల్కం టు 2004 బాట్చ్ ఫ్రెషర్స్ ' అని ఇండక్షన్ ప్రోగ్రాం లో మా కాలెజ్ చైర్మన్, శ్రీ కె.వి.విష్ణురాజు గారు, ప్రసంగించి అందరికి బెస్ట్ విషెస్ చెప్పి, మంచి షడ్రసోపేతమైన భోజనం పెట్టి అందరిని పలకరించి వెళ్ళారు...ఆ తర్వాత తెలిసింది మా కాలెజ్ లో ఏ ముఖ్యమైన ఫంక్షన్ జరిగినా, చైర్మన్ గారు విచ్చేస్తున్నారు అంటే ఇక ఆ రోజు అందరికి ఘుమఘుమలాడే షడ్రసోపేతమైన భోజన విందు తో పండగే అని...! 
సాధారణంగా స్టుడెంట్స్, తమ విద్యాలయం అంటే కొన్ని సంవత్సరాలు ఫీజ్ కట్టి చదువులను కొనుక్కునే ఒక సంస్థ అనే భావన దెగ్గరే ఉండిపోతారు...ఇవ్వాళ్టి విద్యావ్యవస్థ కూడా అట్లే ఉంది కాబట్టి అది లోకసామాన్యమైన భావన అనుకోండి...
కాని నాకు నా కాలేజి కేవలం ఒక చదువుల దుకాణం మాత్రమే కాకుండా, ఒక సగటు మధ్యతరగతి విద్యార్థి ఎన్నో ఆశలతో, ఆశయాలతో కాలేజిలోకి అడుగుపెట్టాక, అవన్నీ సఫలత పొందేలా చేసి, జీవితాన్ని సార్థకపరిచే సరస్వతీ సౌధమై వర్ధిల్లింది...!
ఎవరి భావనకు తగ్గట్టు భగవంతుడు వారికి సహాయం చేస్తాడు అని నమ్మి , నా 4 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యా ప్రస్థానాన్ని ఆరంభించిన రోజులు అవి....
నెలకు 500 పాకెట్ మనితో, 360 రూపాయలు ' బాలానగర్-విష్ణుపూర్ ' మెదక్ రూట్ అర్.టి.సి బస్ పాస్ కి పోను, మిగిలే 140 ని దారిఖర్చులకి దాచుకుని చదువుకోవలసిన పరిస్థితులు...
(ఫస్ట్ ఇయర్ లో ఎక్కువసార్లు కాలెజినుండి నుండి సాయంత్రం షేర్ ఆటోలో పారిపోవడానికి అదనంగా అయ్యే 400+ ఎక్కువ ఖర్చుకి బడ్జెట్ గీసుకొని బ్రతికిన రోజులే నా జీవితానికి ఆర్థిక శాస్త్ర ఆంతరాలను ఆకళింపు చేసుకునేందుకు దోహడపడ్డాయి కాబోలు...! ) ప్రతి సెమిస్టర్ కి అన్ని పుస్తకాలు కాలేజి లైబ్రరి లో ఇస్తారు. అదనంగా లైబ్రరి పాస్ పై 2 పుస్తకాలు ఇంటికి తెచ్చుకొని చదువుకోవచ్చు...
చదువుల ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కొంచెం ఆనందంతో అడుగులు ముందుకు వేసిన నాకు ' శ్రేయాంసి బహు విఘ్నాని ' అన్నట్టుగా, రాగింగ్ భూతం రూపలోం మొదటి సంవత్సరం అంతా అవేదనతోనే సరిపోయింది...
కాలేజి లోపలైతే ఆర్.పి సర్, ఇంగ్లిష్ సురెందర్ సర్ భయానికి కొంచెం కంట్రోల్ లోనే ఉండే సీనియర్స్, పొద్దున బస్సుల్లో, సాయంత్రం బయటకు వచ్చాక మాత్రం ఇక మాకు ప్రత్యక్ష నరకమే చూపేవారు...
హాయిగా ఆటపాటలతో గడిచిన స్కూల్ జీవితం, ఆ తరువాతి 24x7 చదువుల శ్రీచైతన్య కార్పోరేట్ కాలెజి జీవితం కదా, కేవలం సినిమాల్లో చూసిన రాగింగ్ మొత్తం కళ్ళెదుట నిత్యకృతమై ఉండేసరికి కొన్ని నెలలు అసలు కాలేజిలో అడుగుపెట్టాలంటేనే హడల్ ఎత్తిపోయి ముచ్చెమటలు పట్టడం దినచర్య అయ్యేది...
ఎందుకు తీస్కున్నాం రా నాయన విసిరేసినట్టుగా సిటీకి దూరంగా ఉన్న ఈ ఊర్లో ఇంజనీరింగ్ అని అప్పుడప్పుడు ఏడిస్తే ఓదార్చే వారే లేనప్పుడు కలిగే క్షోభతో, అటు సిగ్గుతో ఎవ్వరికీ చెప్పుకోలేక ఇటు భరించలేక ఒక్కోసారి అసల్ కాలెజ్ మానెసి ఇంట్లోనే ఉండిపోవాలనేంతగా చిరాకు, ఆవేదన వచ్చేవి....ఇంటిదెగ్గర ఉండే అన్న / అక్క దెగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళినపుడు ' ఒక్క సంవత్సరం ఓపికపట్టి, ఎక్కువైందని అనిపిస్తే తప్పించుకుంటూ తిరిగితే ఇంక తర్వాత వాళ్ళే ఫ్రెండ్స్ అయ్యి ప్రాజెక్ట్లు, సెమినార్లు, ప్లేస్మెంట్లు, అన్నిట్లో సహాయం చేస్తార్ రా...." అంటూ చెప్పడంతో అలా కొంచెం ఓదార్పు పొంది, పొద్దున అయితే బస్లో అందరు ఉంటారు కాబట్టి మరీ హద్దులు దాటకుండా చేసే రాగింగ్ ని భరిస్తూ, సాయంత్రం కాలెజ్ అవ్వగానే అన్నివిధాలా ప్రయత్నించి కొందరు ఫ్రెండ్స్ తో కలిసి నర్సాపూర్లోకి షార్ట్ కట్ లో దూరంగా నడిచి, షేర్ ఆటోలో పరార్ అవ్వడం రోజువారి పనిగా అయిపోయ్యేది...
ఊరంతా బాగా తెలిసిన సీను అనే ఒకతను ఏ ఏ షార్ట్ కట్ రూట్లు సీనియర్లకు అంతగా తెలియవో చెప్పి వాట్లో నుండి పారిపోవడానికి బాగా హెల్ప్ చేసేవాడు. కాలెజ్ వెనక ఉండే మొక్క జొన్న చేను, పొలాల గట్లవెంబడి పరుగులుపెట్టడం స్కూల్లోని P.T క్లాస్ లా ఉండేది... ECE ఫైనల్ ఇయర్లో ఉన్న పవన్ అన్నకు నేను తమ్ముడిని అని తెలిసి నాకు ఇంకా బాగా ఆ CSE సీనన్న అన్నివిధాలుగా హెల్ప్ చేసేవాడు.....ఏ సీనీయర్ ఏలాంటి టార్ఛర్లు పెడతాడో అవి ఏ విధంగా తప్పించుకోవచ్చో చెప్పడం ఆయనకు కొట్టినపిండి... అసల్ ఆయన హెల్ప్ లేకుంటే ఫస్ట్ ఇయర్లోనే నా బక్క ప్రాణం పుటుక్కుమని పొయ్యేదేమో.....
నా రోజువారి ఆటోలో ఎస్కేపింగ్ సంగతి తెలిసి క్లాస్లో ఫ్రెండ్స్ అందరు కామెడి గా నాకు ' ఆటో ' అని సార్ధకనామధేయం పెట్టేసి, ECE 2004 బాట్చ్ లో వినయ్ అంటే, 04211AO487, 488, 489 ఈ ముగ్గుర్లో ఎవరు అని అడిగేవారు కాని, ' ఆటో వినయ్ గాడు ' అనగానే ఠక్కున నేను గుర్తుకు రావడం పరిపాటి...! 
అలా మెల్లమెల్లగా కాలెజ్ లైఫ్ కి అలవాటుపడుతు చదువులు, మార్కులే ఎకైక ధ్యేయంగా నా ఇంజనీరింగ్ విద్యా బండి ముందుకు వెళ్తుంది....
తిరుమలగిరి వంశీ, అమీర్ఫేట్ సునయన్, ఈ ఇద్దరు అందరికీ అన్నిట్లో గుర్తోచ్చే కామన్ ఫ్రెండ్స్...క్లాస్లోని అందరికి ఏ విషయం లో ఏ సహాయం కావలన్నా ముందుండి చేయడం వల్ల వీళ్ళు రాహుల్ డ్రవిడ్ లాగా ది డిపెండబిల్ బడ్డీస్ ఫర్ ఆల్ గా అందరి ఫ్రెండ్స్ లిస్ట్లో కామన్ నేంస్......
ఇక నా రోజువారి అర్.టి.సి ప్రయాణంలో ఎంతో మంచి ఫ్రెండ్స్ అందరం కలుపుకొని ఒక గాంగ్ అన్నమాట...నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన 488 జె.బి.యస్ వినయ్ గాడి తో మొదలుకొని, ఫెరోజ్ గూడ చేతన్, సనత్ నగర్ బాలు, బాలానగర్ మనోజ్, IDPL లో నేను మరియు జగద్గిరిగుట్ట నుండి ప్రశాంత్, సాయి కిరణ్, మోహన్, చింతల్ లో రాఘవేంద్ర, షాపూర్ లో లక్ష్మికాంత్, సురారం లో సాయి కార్తీక్, ఇలా అందరితో బస్ ఫుల్ అవుతూ ముందుకు వెళ్ళడం తో మా జీవితం కూడా కొంచెం కొంచెం ముందుకు వెళ్తుండేది...
ఎంతో కష్టపడి కర్చీఫ్ వేసి సీటు ఆపుకొని (రిజర్వేషన్ వయా కర్చీఫ్ డ్రాపింగ్ అన్నమాట ) ఎప్పుడైన సీట్ దొరికిందని సంతోషించే లోపే నెక్ష్ట్ స్టాప్ లో ఎవరైన సీనియర్ ఎక్కాడంటే లేచి సీటు సమర్పయామి చేయడం మా జునియర్ల దైనందిన బాధ్యత...!! పొరపాటున మరిచామా, ఇక ఆ జునియర్ ఆ రోజు అందరి సీనియర్స్ కి బక్రా ఆఫ్ ది డే అన్నమాట..
అలా సాగిపోతున్న ఫస్ట్ ఇయర్ లో ఒక్క కెమికల్ బ్రాంచ్ తప్ప మిగత 5 బ్రాంచిలన్నిటికి ఒకే సిలబస్ కావడం చేత అందరం అందరికీ సహాయం చేసుకుంటూ చదువుకుంటూ, మా రెకార్డ్స్ తోపాటు అప్పుడప్పుడు సీనియర్ల రెకార్డ్లు కూడా రాస్తు, సాయంత్రం ఏ సీనియర్ చేతిలో ఎవడు బుక్కైపోతాడో అని ఆలోచిస్తూ, అలా అలా మొత్తానికి ఎక్స్టర్నల్ ఎగ్సాంస్ రానే వచ్చాయి...
ప్రతి బ్రాంచ్ / డిపార్ట్మెంట్లో నాకున్న మితృల పరిచయంతో వారి టాప్ ఫాకల్టి దెగ్గర ఉండే టిప్స్ నేర్చుకోవడానికి అప్పుడప్పుడు వెళ్ళెవాడిని....CSE/IT బ్రాంచెస్ లో బాగా ఫేమస్ అయిన మధుబాబు సర్, ఆర్.పి సర్ వద్ద C & DS లాబ్ ప్రోగ్రామింగ్ లో మెలకువలకోసం లీషర్ పిరియడ్స్ లో వెళ్ళేవాడిని....
అందరి మితృల / ఫాకల్టిల సహాయ సహకారాలతో మొత్తానికి ఫస్ట్ ఇయర్ ఎగ్జాంస్ రాసి, రెసల్ట్స్ వచ్చాక, డిఫరెంట్ సిలబస్ అయిన కెమికల్ బ్రాంచ్ లోని శిరీష ఫస్ట్ విత్ 90+ %, ఆ తరువాత ఒకే సిలబస్ అయిన మిగతా 5 బ్రాంచిలన్నిట్ట్లోకి నేనే కాలెజి ఫస్ట్ విత్ 85+ % అని నోటిస్ బోర్డ్లో నా పేరు రెండో వరుసలో ఉండేసరికి, కష్టాల మధ్య పడిన కష్టానికి ప్రతిఫలం చూసేసరికి అవధిలేని ఆనందం...! 
అప్పటినుండి కాలేజిలో అన్ని బ్రాంచిల్లో ఎంతో మంది మంచి ఫ్రెండ్స్ అయ్యి అందరితో ఉన్న మితృత్వ సహాయసహకారంతో సాగిపోతున్న రోజులు అవి....
అటు కాలెజిలో చదువులతో ఆనందించాలో, ఇటు రోజు రోజుకి ఎక్కువైపోతున్న ఇంట్లోని ఈతిబాధలకు దుఃఖించాలో అన్నట్టుగా డోలాయమానంగా ఉన్న సమయంలో, నీకు నేనున్నాను....... అంటూ నా చిన్ననాటి ఆరాధ్య దైవమైన గణపతి నాకాలెజిలోకే గుడికట్టించుకొని వచ్చేసాడు...
ఇల్లు, లోకమే కాదు ఈ మొత్తం విశ్వం ఎమైపోయినా సరే, ఎన్ని బాధలు చుట్టుముట్టినా సరే, అవన్ని పంటి బిగువన నొక్కిపెట్టి, చిన్న నవ్వు మాటున దాచిపెట్టి, ఇంజనీరింగ్ విద్యలో ఉత్తీర్ణుడవ్వడమే ఎకైక లక్ష్యమై సాగిపోవాలి అన్నది నా గణపతి సందేశం....
అందుకు అన్ని రకాలుగా నా కాలెజిలోని గణపతి, సరస్వతులు నాకు కీలకమైన సమయాల్లో సహాయం చేస్తూనే ఉన్నారు.... ఒక రోజైతే 2-II సెం లో ఇంట్లో రాత్రి జరిగిన తీవ్ర గొడవలకు అరిచి అరిచి తిండీ నిద్రలేక, చదివింది ఒక్క ముక్క కూడా గుర్తుకు రాక, ఎగ్జాం హాల్లో నిద్ర మత్తులో చతికిలపడిపోయిన నాకు, ఏడ్వాలో నిద్రపోవాలో తెలియనంతగా అలసి ఉన్న ఆ క్షణంలో ఆదుకుంది మాత్రం ఖచ్చితంగా ఆ విద్యా గణపతే...! సాధారణంగా గణపతిని, సరస్వతి మాతను ప్రార్ధించి రాయడం మొదలుపెట్టానంటే కనీసం 5 బుక్లెట్లకు తగ్గని నా సిరాప్రవాహం ఆ రోజు కనీసం ఒక్క బుక్లెట్ కూడా రాయలేనంత దీనావస్థలో శోషించుకుపోయి ఆగిపోయింది... బయటికి వచ్చినదే ఆలస్యం ఏడుపు తప్ప ఇంకే ఆలోచన రాని స్థితి...
ఆ ఆఖరి కొన్ని నిమిషాల్లో గణపతిని దీనంగా ప్రార్దిస్తు నిద్రిస్తూ ఏం రాసానో ఏమో కాని, 4 మార్కులతో పరీక్ష గట్టెక్కించి, సప్ప్లి * మార్క్ లేకుండా ముందు సెం కి వెళ్ళేలా వెన్నంటే ఉన్న ఆ గణపతికి రెసల్ట్స్ వచ్చిన రోజు ఎన్ని ప్రదక్షిణలు, గుంజీలు తీసి అలసి సొమ్మసిల్లి పడిపోయానో ఇంకా బాగా గుర్తు.... మొదటి సంవత్సరం కాలెజి ఫస్ట్ అని కంగ్రాజ్యులేట్ చేసిన వారే, వీడే అంటరా 2nd ఇయర్ ఫేయిల్ అయ్యింది, అనే మాట చెవిన పడ్డ మరుక్షణం నాకు అది జీర్ణించుకోలేక ఏం చెస్కునే వాన్నో ఏమో...
ఇక 2nd ఇయర్ రాగనే, E-cet వాళ్ళు కూడా జాయిన్ అవ్వడంతో ఇంకొందరితో ఫ్రెండ్స్ లిస్ట్ పెరిగి, సికింద్రబాద్ నుండి రాజేష్, సనత్ నగర్ నుండి శ్రీనాథ్, చింతల్ నుండి చైతన్య, పటాణ్ చెరు నుండి మురళి, సైనిక్ పురి నుండి మధుసాయి, ఇలా అందరం కలిసి మా చదువుల బండిని ముందుకు లాక్కెళ్తూ, అప్పుడప్పుడు అలా విశ్రాంతిలా, బర్త్ డేలకు ఎగ్గ్ పఫ్, పేస్ట్రి, బంప్స్ తో ఆనందిస్తూ, కష్టపడిన ఆ రోజులు నిజంగా జీవితానికి అందిన వన్నెతరగని వివేకానందుని బోధనలు....
కొందరి మితృల సహాయం ఐతే అత్యంత కీలక ప్రభావమై వర్ధిల్లింది...
ముషీరాబాద్ సందీప్.పి, ఖైరతాబాద్ పరశురాం, ఆల్విన్ కాలని హరీష్, నేను - మేము నలుగురం ఎగ్జాంస్ అనగానే ఒక గ్రూప్ అన్నమాట...కాలెజి లైబ్రరి లోని బుక్స్ అన్నీ మేమే
చదివేస్తున్నట్టు ఉండేది మా ప్రిపరేషన్ సీన్... వ్యక్తిగతంగా సందీప్ / హరీష్, నా ఇంజనీరింగ్ విద్యాప్రస్థానానికి లభించిన అరుదైన కీలక మితృలు...వాళ్ళు కాలేజ్ బస్లో వచ్చేవారైనా సరే నాకు అన్నిట్లో తోడునీడై నిలిచేవారు...
సందీప్ ఇంగ్లిష్ లో ఒక చిన్న స్పీచ్ ఇచ్చినా సరే కాలెజి మొత్తం అబ్బురపడేది... ఆంగ్ల వాక్పటిమ లో అంతటి ఆరితేరిన ఘానాఘనుడు తను.....! దోమల్గుడలోని శ్రీ రామకృష్ణ మఠ్ ని నా జీవితం లోకి సందీప్ తీసుకురావడం వళ్ళే, గల్లీ స్కూల్లో చదివిన ఇంగ్లిష్ కి కార్పోరేట్ నగిషీలు చెక్కడం సాధ్యమయ్యింది.... అన్నమాచార్య సంకీర్తనలు, కర్ణాటిక్ బేసిక్స్ కూడా నేర్పిన ఆర్.కే మఠ్, జీవితానికి వివేకానందుని ఆర్ష ఆంగ్లేయ సాహితీ పరిమళాలు అలది నిరంతర మనో పవిత్రతను ఆపాదించింది..అక్కడి బుక్ స్టాల్లో కొనుకున్న చిన్న చిన్న పుస్తకాలే నా భావి జీవిత నిర్మాణానికి సోపానాలై పరిఢవిల్లాయి...
ఇంటికి దెగ్గర్లోనే ఉండే హరీష్, పి.సి సిస్టం, సిగ్నల్స్ న్ సిస్టెంస్, ఇత్యాది సబ్జెక్ట్లపై నాకు ఎంతోసహాయం చేసి నన్ను గట్టెకించాడు...ఇక పరశురాం నా శ్రీచైతన్య ఇంటర్ ఫ్రెండ్ కూడాను...
మేము జోకులు వేసుకొని పగలబడి నవ్వుకున్న ఆ రోజులు, కాలేజి మామిడి తోటలో తెంపుకున్న కాయలు, కోఠి లో కొన్న సర్య్కూట్లతో లాబ్స్ లోని ఎక్స్పరిమెంట్లు, టాంక్బండ్ పై బోట్ ట్రిప్స్, ఇలా సందీప్ నేతృత్వంలో మా గ్రూప్ కి ఎన్నో మధురస్మృతులు...
ఇక క్లాస్స్ లోని ఆర్.టి.సి గాంగ్ లో నేను, జే.బి.యస్ వినయ్, సికింద్రాబాద్ రాజేష్, చింతల్ చైతన్య, ఇంకో మిని గాంగ్ అన్నమాట...
మా నెలవారి ఆర్.టి.సి బస్ పాస్ రినివల్ దెగ్గరినుండి మా ఇంట్లోని పి.సి లో ఉండే సాంగ్స్, వాల్ పేపర్స్, సాఫ్ట్వేర్స్, అలా అన్నిటిని చదువులతో పాటుగా బాలెన్స్ చేస్తూ కలిసి మెలిసి తిరిగే బ్యాట్చ్... చింతల్ లోని గణేష్ నగర్ లో చైతు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ అమ్మ పెట్టే బాదాం మిల్ల్క్ మిక్స్ ఆండ్ స్నాక్స్ నెలకు ఒక్కసారైనా బాగా లాగించేవాన్ని... వాళ్ళింట్లో కరివేపాకు కూడా బాగా తెంపుకునే వాన్ని... మొత్తం పూల మొక్కలతో వాళ్ళ ఇల్లంతా నందనవనం లా ఉండేది....నాకు నా 10వ తరగతికి ముందు ఉన్న మా ఇల్లే గుర్తొచ్చేది... నా చదువులు నా లోకం అన్నట్టుగా ఉండే నాకు, మిగతా కాలెజి లోకానికి చైతు ఒక వారధి లా ఉండేవాడు....జే.బి.యస్ వినయ్ ఇంట్లో కూడా అంతే చనువు నాకు... ఇంటర్నల్స్ అనగానే పొద్దున్నే వీడికి ఫొన్ చేసి, అరెయ్ బస్లో కర్చీఫ్ వేసి నాకూ సీటు రెసెర్వ్ చెయర అంటూ చెప్పేవాన్ని...సీటు లేకపోతే వాడిసీటే నాకోసం సగం షేర్ చేసేవాడు...వాడి సోని ఫోన్లో వాడికంటే ఎక్కువ పాటలు నేనే వినేవాన్ని...పిడుగు పక్కన పడ్డాసరే ప్రశాంతంగా ఎలా ఉండాలో వీడిని చూసి నేర్చుకునే వాన్ని..అంతటి కాం అండ్ కంపోస్డ్ ఫెల్లొ వీడు....
ఇక ECE కాని ఇతర ఆర్.టి.సి ఫ్రెండ్స్ అందరం కూడా ఇంకో మిని గాంగ్... ఫెరోజ్ గూడ CSIT చేతన్ అందరికి బాగా ఆప్తుడైన ఫ్రెండ్..మొత్తం పి.సి సిస్టెం లోని హార్డ్వేర్ / సాఫ్ట్వేర్ పై గట్టి పట్టున్న వీడు మా ఆందరి ఇంట్లోని పి.సి లకి డాక్టర్ లాగా ఉండేవాడు...ఎదైనా కొత్త ఒ.స్, సాఫ్ట్వేర్స్ కావాలన్నా మా అందరికి గుర్తొచ్చే ఎకైక ఫ్రెండ్ చేతన్.... ఇంకా సనత్నగర్ CSE బాలకృష్ణ, EEE ప్రశాంత్,అంజిరెడ్డి,ఫణి, ఆల్విన్ కాలని పవన్.... ఇంకా ఎందరో, ఇలా అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ రోజువారి ప్రయాణం సాగించే వాళ్ళం.....
ఖాలీ కడుపుతో హడావుడిగా వెళ్ళి పల్లెవెలుగు బస్సుల్లో సీట్లు కాట్చ్ చేయడం అనే దైనందిన పరుగులపందెం లో అలిసిన శరీరానికి కొంచెం శక్తి కావాలి కాబట్టి పుద్దున్నే ఆకలికి తట్టుకోలేక సగం టిఫిన్ బాక్స్ ఖాలి అయ్యేది....
ఫ్రెండ్స్ ఎవరైనా పక్కనే ఉంటే వాళ్ళ బాక్స్ లోనుండి కూడా ఒ రెండు స్పూన్లు కలిపేసి గండిమైసమ్మ స్టాప్ దాటేలోపు కిచిడిలాగా బ్రేక్ఫాస్ట్ అయిపోయ్యేది...
ఇక ఆ మిగిలిన సగం డబ్బా, లంచ్ టైం లో క్లాస్ లో ఇతర టిఫిన్ బాక్స్ తెచ్చే గాంగ్ తో పంచుకొని, శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్దులారగించిన చందంగా ఉండేది మా లంచ్ టైం...
తినేటప్పుడు అందరం కృష్ణులమే....పంచేటప్పుడు అందరం గోపాలబాలురమే... కమ్మని పుదీనా (మింట్ లీవ్స్) వాసనతో ఉండే బిర్యానీల ఘుమఘుమలు రావడం స్టార్ట్ అయ్యిందంటే వెనకాల సురేష్ గాడి టిఫిన్ బాక్స్ ఓపెన్ అయ్యిందని క్లాస్ మొత్తానికి అర్ధమయ్యేది.... వాడి బాక్స్ అయితే అందరు ఎగబడి మరీ తలో చెంచా తినేసి ఖాలి చేసేవారు...అంత క్రేజ్ ఉండేది వాడు ఇంటినుండి తెచ్చే ఏ వంటకానికైనా... సతీష్ శిఖనం, కృష్ణ కిషోర్ మెరువ, వినయ్ (488) [ వీళ్ళు సబ్సే సైలెంట్ ఫోక్స్ ఇన్ ది క్లాస్ ], ఇంకో ఇద్దరు వంశీలు , ఇంకో ముగ్గురు సందీప్లు, ఇద్దరు శరత్లు [మ్యాడి,శెర్రి], వినయ్ విశ్వనాథ్ (489), వెంకటేష్ (484), విజయ్ చెన్నై (485) ,వెంకట్ వినోద్ (అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగ అవార్డ్ అందుకున్న ఘనుడు..!) , ఇద్దరు హర్షాలు ,మధుసాయి,రాజేష్, శ్రీనాథ్, మురళి,... ఇలా అందరి టిఫిన్ బాక్సులతో ఒక్కోసారి, ఇంకొందరు కాంటీన్ బాట్చ్ ( విజయ్ మణివర్మ,(486) ,సందీప్ వర్మ, వంశీ.జి,......అలా ఇంకొందరు ) తో, అప్పుడప్పుడు కలిసి భోజనం చేయడంలోని మధుర స్మృతులు ఎల్లప్పుడు సంతోషకారకాలే... ఇక నా బెంచ్ లోని సందీప్.పి నాకు తన GRE ఇంగ్లిష్ గ్రామర్ , వొక్కాబ్ అండ్ సబ్జెక్ట్ల సారాన్నే కాదు తన బాక్స్ లోని వంటకాలను కూడా అంతే ఆప్యాయతతో షేర్ చేసేవాడు...
అప్పుడప్పుడు అందరు కలిసి బయటకి వెళ్తే, చైతు నన్ను కూడా రమ్మని తీసుకెళ్ళేవాడు....' ఎప్పుడూ పుస్తకాల పురుగులా ఉండడమేనా...ఇంట్లో ఎట్లాగో ఆనందంగా ఉండవు... మోనొటొని బ్రేక్ చేయడానికైనా అప్పుడప్పుడు అలా బయటతిరిగితే బావుంటదిరా.... తర్వాత అవే మంచి మెమోరీస్ గా మిగిలిపోతాయి ....' అని అనడంతో అలా నర్సాపూర్ ఊరంతా చూస్తూ ఊరి చెరువు దెగ్గరికెళ్ళి అందరం ఆడుకోవడం, మెదక్ చర్చి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడి ఆర్కిటెక్చరల్ మార్వెల్స్ కి ఆశ్చర్యపడి పిక్స్ దిగడం, ఫైనల్ ఇయర్లో సిమ్హాచలం-విజాగ్-అరకు-రాజమండ్రి_పేరంటాలపల్లి (బోట్ ట్రిప్),మారేడుమిల్లి టూర్ వెళ్ళడం......ఇప్పుడు తరచి చూస్తే అవే ఎంతో గొప్ప మధుర స్మృతులు... 
మా క్లాస్ గల్స్ కూడా నాకు ఎగ్జాంస్ ప్రిపరేషన్ లో, లాబ్ రికార్డ్స్ లో వీలైన సహాయం చేసేవారు.... తనూజ,సౌమ్య,సౌజన్య,సుజాత,బిందు,స్వాతి,సుభిక్షం,సంతోషి,దివ్య,సిందూర,ఉష,వైజయంతి ఇలా ఎందరో....
నాకు ప్రత్యేకంగా ఇంకొందరు ఫ్రెండ్స్ కూడా ఉండేవారు... బస్సు ఎక్కే IDPL లో సాయి బాబా గుడి, హనుమంతుని గుడి, తో మొదలై ,సురారం కట్టమైసమ్మ గుడి మీదుగా ఫారెస్ట్ లో కొండాపుర్ లోని హనుమంతుని గుడి తర్వాత వచ్చే అయ్యప్ప ఆలయం వరకు అందరిని రోజు బస్లోనుండే పలకరిస్తూ ఉండేవాన్ని....ఎంతో చవకగా ఉండే గుమ్మడిదల సంత నుండి ఎప్పుడైన 2 వారాలకోసారి అలా బండెడు తాజా కూరగాయలు కూడా కొనితెచ్చేవాన్ని ...!
ఇక ఫాకల్టి లో కొందరు ప్రొఫెస్సర్లు కేవలం ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అని కాకుండా, తమ సర్వస్వాన్ని విద్యార్ధుల ఉన్నతి కోసం వెచ్చించి, శ్రమించి వాళ్ళ ఆనందం లో తమ ఆనందాన్ని చూసుకునేవారు....
సంజయ్ దూబె సర్, అనుపమా మామ్మ్, మట్టారెడ్డి సర్, మధుబాబు సర్, ఆర్.పి సర్, ' మెఫా ' సర్, లక్ష్మణ్ సర్, గురు స్వామి సర్, సంజీవ్ సర్, ఏ.ల్ కిషోర్ సర్, నాగపరమేశ్వరి మామ్మ్, సురెందర్ సర్, రుచితా మామ్మ్, జయశ్రీ మామ్మ్, ఇలా కొందరివి కలెజ్లోని పిల్లలందరికి శాశ్వతంగా గుర్తుండిపోయే పేర్లు....
ప్రశాంతత లేని జీవితంలో సుఖశాంతులు, గొప్ప చదువులు లభించడం, ఇవన్నీ ఎండమావుల్లోని నీటిలా ఉన్నా, అంతంత మాత్రంగా సాగిన చదువులకు గణపతి అనుగ్రహం తోడై 81 % తో నేను ప్రార్ధించినట్టుగా డిస్టింక్షన్ లో నా ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేయించిన ఆ గణపతికి నేను ఎన్ని విధాల ఋణపడిఉన్నానో.... అంటే ఆ గణపతి రూపంలో నాకు ముఖ్యమైన సంఘటనల్లో సహాయం చేసిన ప్రతి మనిషికి నేను సదా ఋణపడిఉన్నానన్నమాట...! 
కాలేజి అంటే కేవలం ఇటుకల గోడలు, మనుషుల సమూహాలతో నిండి ఉన్న బిల్డింగ్లు గా కాకుండా, జీవితాన్ని అన్ని విధాల సుసంపన్నం చేసే దేవాలయంగానే భావించాను ఎలప్పుడు... అందులోని స్టాఫ్ అందరు అర్చకులుగా, మితృలందరు భాగవతులుగా, భావించి చదివిన చదువులకు పరిపూర్ణతను కల్పిస్తూ, టి.సి.యస్ / అక్క్సెంచర్ / సి.ఏ అనే మూడు బహుళ జాతీయ సంస్థల ఆహ్వానాలు నాకు ప్రసాదంగా అందించి, ఆనాడు ఎంతో తీవ్రమైన కష్టాలలో ఉన్న నా జీవితానికి దిటవైన ఆలంబన కల్పించిన నా కాలేజి అంటే అందుకే నాకు అంత అభిమానం....!
నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా కాలెజ్ లోని గణపతిని, ' ఇక రోజు నిన్ను చూడడం కుదరదు కదా... నువ్వు నా జీవితానికి దూరంగా వెళ్ళిపోతావా....' అంటూ అప్పుడప్పుడు అడుగుతూ చిన్న పిల్లవాడిలా ఏడిచేవాన్ని కూడా...
" నేను సదా నీతోనే ఉంటాలేరా... " అన్నట్టుగా, అప్పటికే అడపా దడపా నెలకు ఓసారైనా అలా కొంచెం అర్ధమై కొంచెం అర్ధం కాక, ఈయన ఎవరో దేవుడి గురించి ఫ్రీ గా ఇంతబాగా చెప్తున్నారే అనుకుంటూ వింటున్న శ్రీచాగంటి సద్గురువుల సద్వాక్కే, 21 వ పడినుండి నాజీవితంలోకి ప్రవేశించి, ఉద్యోగం తో పాటుగా కాలక్రమేనా ' సత్ యోగాన్ని ' సిద్దింపచేసే శాశ్వత గాణాపత్య విద్యా శ్రీగంధమై వర్ధిల్లింది...!!!!!
అలా ప్రతిచోట నాకు ఆ సిద్ధి బుద్ది సమేత శ్రీగణపతి, ఒక ఆప్త మితృడిలాగే ఉండి నా మానుష ప్రయత్నానికి తన దైవిక అనుగ్రహాన్ని తోడు చేసి నన్ను అన్నిట్లో తడబడకుండా గట్టెకిస్తూనే ఉన్నాడు...!  🙏
--------------------------------------------------
ప. శ్రీ గణ నాథం భజామ్యహం
శ్రీ-కరం చింతితార్థ ఫలదం
అ. శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం
శ్రీ-కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం (శ్రీ)
చ. రంజిత నాటక రంగ తోషణం
శింజిత వర మణి-మయ భూషణం
ఆంజనేయావతారం సు-భాషణం
కుంజర ముఖం త్యాగరాజ పోషణం (శ్రీ)

No comments:

Post a Comment