Monday, November 12, 2018

శ్రీకరమైన కార్తిక మాస వైభవం....! :)

శ్రీకరమైన కార్తిక మాస వైభవం....! 
శ్రీ చాగంటి గారు, శ్రీ సామవేదం గారు మొదలైన ఆధ్యాత్మిక గురువుల / శ్రీ కాకునూరి గారు, శ్రీ అనంతలక్ష్మి గారు, శ్రీ టి.కె రాఘవన్ గారు, ఇత్యాది ఆధ్యాత్మికవేత్తల వివిధ ప్రవచనాలు / ధర్మసందేహాలు వినేవారు, ఈ పాటికే తమ తమ యథాశక్తి పూర్వక కార్తిక అధ్యాత్మ కార్యక్రమాల్లో బిజి బిజి గా ఉండి ఉంటారు...
మరీ ముఖ్యంగా బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువుల ' మహేశ్వరవైభవం ' , ' కార్తిక మాస వైభవం ', ఇత్యాది ప్రవచనాంతర్గతంగా ఈశ్వరవైభవం గురించి విన్నవారందరు ఈ పాటికే శివానందలహరి లో ఓలలాడుతున్న భావపరంపరాగతంగా ఈశ్వరున్ని మానసిక/వాచిక/కాయిక త్రివిధ శౌచంతో అర్చిస్తూ, దర్శిస్తూ, సేవిస్తూ శివశివానుగ్రహాన్ని పొందుతూ ఉండి ఉంటారు...
నాకు స్ఫురించిన కొన్ని ఆపాత కార్తిక వైభవ విశేషాలు...
2002 లో ఇంటిదెగ్గరి రాజధాని స్కూల్లో నా 10త్ క్లాస్ అయ్యాక, 85% తో స్కూల్ ఫస్ట్ / మా ఏరియాలో ఫస్ట్ / రావడంతో, అప్పుడు శ్రీ చైతన్య కాలేజి క్యాంపైన్ లో భాగంగా ప్రతి స్కూల్ లోని టాపర్ కి ఫీస్ లో కొంచెం డిస్కౌంట్ ఇవ్వడంతో, కూకట్పల్లి లోని శ్రీ చైతన్య కాలేజిలో డే స్కాలర్ గా ఎం.పి.సి / జె.ఎల్.ఇ లో జాయిన్ అయ్యి కొత్త కొత్త గా కాలేజ్ లో అడుగుపెట్టిన 15 యేళ్ళ ప్రాయంలోని రోజులవి....
1స్ట్ ఇయర్ మొత్తం ' జగద్గిరిగుట్ట / కూకట్పల్లి ' ఆర్.టి.సి రూట్ పాస్ తీసుకొని, ఇంటి నుండి ఆల్విన్ కాలని ఫేస్-1 బస్టాప్ వరకు మైలు దూరం నడిచి, అక్కడ 10 నంబర్ బస్ ఎక్కి కూకట్పల్లి బస్టాప్ లో దిగి కాలేజ్ కి వెళ్ళడం, అదే రూట్లో తిరిగి రావడం నా దినచర్య.... దార్లో మా ప్రగతి-నగర్ బస్తి / గ్రామదేవత అయిన పోచమ్మ కి నమస్కరించి, హనుమాన్ నగర్ లో నల్ల పోచమ్మ కి / హనుమాన్ / శివాలయానికి నమస్కరించి వెళ్ళడం పరిపాటి...
అలా ప్రతి రోజు 3 కి.మీ ల నడక, బస్ కోసం ఎదురుచూపులు, ఫుట్బోర్డ్ ప్రయాణాలతో, టైం/ఎనర్జి అంతా వృధా కావడంవల్ల ఎంసెట్ కి సరిగ్గా చదవలేకపోతున్నాను అని నాన్నకి చెప్పి ఒక కొత్త సైకిల్ కొనివ్వమని చెప్పడం తో, 18 వందలకు కొత్త బి.ఎస్.ఎ - ఎస్.ఎల్.ఆర్ సైకిల్ కొన్నివ్వగా, గంట పైచిలుకు ఆయాసపు ప్రయాసపు ప్రయాణం కాస్త, 20 నిమిషాల, పచ్చని పొలాల మధ్యనుండి స్వచ్ఛమైన గాలిని పీలుస్తు సాగే హాయి ప్రయాణం గా మారి, బాగ చదువుకుంటున్న రోజులవి....
సైకిల్ కదా ఎప్పుడంటె అప్పుడు, ఎక్కడికంటె అక్కడికి వెళ్ళడం ఈజి కాబట్టి, కూకట్పల్లి ప్రాంతం మొత్తం తిరుగుతూ, అప్పటికే నేను రెగ్యులర్ గా వెళ్ళే చిత్తారమ్మ / అయ్యప్ప / సాయిబాబా ఆలయాలతో పాటుగా, కూకట్పల్లి లోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి అలయం, పాత శివాలయం, మా కాలేజ్ కి పక్క గల్లిలో ఉండే శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయం కొత్తగా జీవితం లోకి ప్రవేశించాయి... ఏ గుడికి వెళ్ళినా అప్పటి ప్రార్ధన ఒక్కటే ఉండేది..ఫుల్లు గా మార్కులు/ర్యాంకులు, మంచి ఇంజనీరింగ్ కాలెజ్ లో సీటు...
ఒకరోజు నా ఫేవరెట్ సబ్జెక్ట్ కెమిస్ట్రి లో కొన్ని డౌట్స్ ఉండడంతో, అత్యంత కష్టమైన ' ఆర్గానిక్ కెమిస్ట్రి ' ఆంతరాలను అరటి పండులా అరచేతిలో ఒలిచి పెట్టగల దిట్ట గా అప్పటి అన్ని శ్రీ చైతన్య బ్రాంచీల్లో పేర్గాంచిన, నా ఫేవరెట్ లెక్చరర్ ఖుద్దూస్ సర్ హెల్ప్ కోసం, నా బెంచ్ మేట్స్ ముస్తాఫ, కడియం సంతోష్, నేను, ఇంకొందరు వేరే ఎస్.ల్.ఇ క్లాస్ ఫ్రెండ్స్ అందరం ఉండేసరికి సాయంత్రం లేట్ అయ్యింది....
ఇంటికి స్టార్ట్ అవ్వగా, ఎవరో భక్తులు బిల్వాష్టకం చదవడం తో, ఇన్నాళ్ళు ఇక్కడినుండే సైకిల్ తొక్కుతున్నా కాని ఎప్పుడూ నాకు తెలియనే లేదే, ఇక్కడ శివాలయం ఎక్కడ ఉందబ్బా అనుకుంటూ అటుగా గల్లి లోకి సైకిల్ తొక్కడంతో, 2003 వ సంవత్సరం లోని కార్తిక మాసం లో మొట్టమొదటి సారి శ్రీ భువనేశ్వరి సమేత ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయం ఎదురుగా సైకిల్ ఆపి, లోనికి వెళ్ళి దర్శనం చేసుకోవడం తో, నా జీవితం లోకి ఆ ఆది దంపతుల అనుగ్రహం కలిగింది...!
ఆ తరువాత అప్పుడప్పుడు సాయంత్రం దర్శనానికి వెళ్ళేవాన్ని...ఎప్పుడు వెళ్ళినా సరే ఒకటే మనవి... అమ్మా / శివయ్య, నాకు ఫుల్లు గా మార్కులు ఇచ్చి మంచి ఇంజనీరింగ్ సీట్ అనుగ్రహించండి ప్లీస్....రిసల్ట్స్ రాగానే మీకు ఒకటి కాదు, రెండు కొబ్బరి కాయలు కొడతా సరేనా... అంటూ అలా ఏదో వచ్చీరాని స్తోత్రాలు మమ అనిపించి ' ఓం నమః శివాయ ' అని ఒక దండం పెట్కొని రావడమే... ఒక రోజు ఒక పెద్దాయన ఎవరో, " పొద్దున అభిషేకం చేయించిన ప్రసాదం బాబు తీస్కొ అని విభూతి-కుంకుమ-కొబ్బరి ముక్కలు ఇచ్చి, మరి నువ్వు ఎప్పుడైన చేయించావా స్వామికి అభిషేకం..?.." అని అడగడం తో, బిత్తిరి మొహం వేస్కొని, 'అయ్యొ.. నేను అసలు ఎప్పుడూ పొద్దున ఈ గుడికి రాలేదండి...సాయంత్రం నా కాలేజ్ అయ్యాక ఇంటికి వెళ్ళేముందు నమస్కరించుకోడానికి అప్పుడప్పుడు అలా వస్తుంటా...అంతే..." అనడం తో, ఆ పెద్దాయన చిన్నగా నవ్వి, నా చేతిలో ఉన్న ఆయన ఇచ్చిన విభూతి నా నొసట రాసి, త్వరలో ఆయనే చేయించుకుంటాడులే నీతో అభిషేకం అంటూ ఏదో దీవిస్తూ వెళ్ళిపోయాడు....
నేను ప్రార్ధించినట్టే, బి.వి.అర్.ఐ.టి అనే టాప్ 10 కాలెజ్ లో ఆ శివయ్య / పార్వతమ్మ, నాకు ఇంజనీరింగ్ అనుగ్రహించారు....
ఇంటర్ తర్వాత అసల్ కూకట్పల్లి పెద్దగా వెళ్ళిందే లేదు కాబట్టి, ఆ స్వామిని కూడా అట్టే మరిచిపోయా...
మనకు ఏది శ్రేయస్కరమో మనకంటే బాగా తెలిసేది ఆ దైవానికే అని మన పెద్దలు చెప్పినట్టుగా, అ చిన్న కాలెజ్ జీవితంలో పెద్ద పెద్ద స్తోత్రాలతో, అభిషేకాలతో, స్వామిని పూజించ లేకపోయినా, మనస్పూర్తిగా నమస్కరించినందుకు నాపై దయ తలిచి, నా మున్ముందు ఉన్న ఇంజనీరింగ్ విద్యా సమయం లో, జీవితం లో ఎదురయ్యే ఆటుపోట్లకు తట్టుకొని నిలబడే శక్తిని అనుగ్రహించడానికి, తమ జ్యేష్ఠ పుత్రున్ని నాకు సర్వరక్షగా, విద్యా గణపతిగా / శక్తి గణపతిగా మా ఇంజనీరింగ్ కాలెజ్ లోనే శాశ్వతంగా కొలువై ఉండేలా, పుత్రవాత్సల్యం తో నన్ను అనుగ్రహించారు ఆ సర్వేశ్వరి / సర్వేశ్వరుడు...!
ఆ తరువాత చదువుల ధ్యాస లో పడి అసల్ ఆ స్వామి గురించే మర్చిపోయా...!
మంచి కాలెజ్ లో ఇంజనీరింగ్ సీట్ ఇస్తే 1 కాదు, 2 కొబ్బరికాయలు కొడతా అన్నడు, ఇప్పుడేమో అసల్ మనల్నే మర్చిపోయాడు ఈ మూర్ఖుడు, అని అనుకున్నారో ఏమో ..!
నా ఇంజనీరింగ్ అయ్యాక, నానక్ రాంగూడ లోని ' కంప్యూటర్ అసోసియేట్స్ / సి.ఏ ' లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా నా ఉద్యోగ జీవితాన్ని స్థిరీకరించి, రోజు పొద్దున్నే బ్లూ / గ్రీన్ డిసైన్స్ లో ఉండే మా సి.ఏ ఆఫిస్ రౌట్-10 బస్ లో ప్రయాణం కోసం, తమ గుడి ఆర్చ్ కి దెగ్గర్లోనే మా బస్ హాల్ట్ ఉండేలా చేసి, నా కృతఘ్నతని గుర్తు చేసి, 2008 కార్తిక మాసం లో 5 సంవత్సరాల తరువాత, కొబ్బరికాయలతో పాటుగా మొట్టమొదటి సారి అభిషేక భాగ్యాన్ని కూడా అనుగ్రహించారు...
5 సంవత్సరాల క్రితం విభూతి ప్రసాదించిన ఆ పెద్దాయన అన్నట్టుగా, శివయ్య మొత్తానికి అభిషేకం కటాక్షించడం నాకు అప్పుడు నిజంగానే ఆశ్చర్యం కలిగింది...!
2008 లో మొదట శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచన శ్రవణానుగ్రహం లభించిన తర్వాతే, ఆ శివయ్య తన ద్వాదశజ్యోతిర్లింగేశ్వర అభిషేక అనుగ్రహాన్ని ప్రసాదించడం ఇక్కడ కొసమెరుపు..!
అంటే బాహ్యం లో, గురువుల అనుగ్రహం లభించిన తర్వాతే సంపూర్ణంగా దైవానుగ్రహం ఫలించడం .....
ఆంతరం లో, సద్ గురువుల బోధల తో మొదట చిత్త శుద్ధిని అనుగ్రహించి, పంచ జ్ఞానేంద్రియాలను / పంచ కర్మేంద్రియాలను పరమాత్మ తన వశం గావించి, అటు పిమ్మట, సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన మనబడే 5 ఆస్యములతో అరూపరూపి గా ఉండే తన శివలింగ రూప తిరుమేని ని స్పృశించి తన సమీపానికి మనలను అనుమతించి సంపూర్ణంగా అనుగ్రహించుట..! 
( చిన్నప్పుడు, భద్రాద్రి కొత్తగూడెం లో రామవరం లోని మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, నేను రాగనే వాళ్ళు ' గై ' నాకు అందకుండా దాచే వారు. అది నాకు అదిందంటే ఇక చెట్టుపై ఉన్న జామ / మామిడి కాయలన్ని మాయం చేస్తాను కనుక ..  చుట్టు పక్కన ఉండే ఇరుగు పొరుగు ఫ్రెండ్స్ అమ్మని అక్క వాళ్ళు, ఫరీదా వాళ్ళు, గీతా వాళ్ళు, కూడా నేను రాగనే, అయ్యో గై లేదు వినయ్... ఇప్పుడే ఎవరో తీసుకుపోయారు...అంటూ జోక్స్ వేసేవారు...వాళ్ళింట్లోని కాయలు కూడా అన్ని కోసుకుపోతనని..... 
[ పొడవైన కర్రకు చివరన కట్టిన ఒక ఇనుప సీకును రివర్స్ U ఆకారం లో వంచి, చెట్ల పై కొమ్మలకు ఉండే కాయలను కోయడానికి ఉపయోగించే పరికరాన్ని ' గై ' అంటారు... ]
అలా ఒక మంచి గై చేతికి అందిందంటే ఇక చెట్లపై ఫలాలన్నీ టక టక మంటూ మన చేతుల్లోకి వచ్చినట్టుగా,
ఒక మంచి సద్గురు వాక్కుల అనుగ్రహం లభించిన తదుపరి, వివిధ చోట్ల వింత వింత ఐతిహ్యాల తో కొలువైన ఆ దైవం కూడా తన అనుగ్రహ ఫలాలను మనకు ఒసగుతుంది అన్నట్టుగా...
2008 నుండి, గురువానుగ్రహంగా లభించిన ఎన్నో తీర్థ యాత్రల్లో భాగంగా, ఈశ్వరుడు,
కాళేశ్వరం, శ్రీ కాళహస్తి, కాశి, శ్రీశైలం, త్రయంబకేశ్వర్, అమరావతి మినహ మిగతా 4 పంచారామాలు, అరుణాచలం, కోటిపల్లి (కోటిఫలి), యనమదుర్రు శక్తీశ్వరాలయం, జుత్తిగ శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి, శ్రీ నత్తా రామేశ్వర స్వామి, పిఠాపుర శ్రీ హుంకారిని దేవి సమేత కుక్కుటేశర స్వామి, మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, ఇత్యాది క్షేత్రాల్లో తన దర్శన / అభిషేక అనుగ్రహాన్ని ప్రసాదించి అనుగ్రహించాడు... )
సుదీర్ఘ జీవ పరంపరా యాత్రలో లీనమై మనం దైవాన్ని మరచినా, నమ్మిన సద్గురుబోధలు / నమ్ముకున్న ఆ దైవం మాత్రం మరవకుండా, ఏ జన్మలో ఉన్నా సరే మనల్ని తమ వైపుకు తమంత తామే తిప్పుకుంటాయి అని ఒక్కోసారి అనిపించడం కద్దు...!!
శ్రీ గురుభ్యో నమః.. అస్మద్ గురుపాదుకాభ్యాం నమః...
=====================
=====================
=====================
దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః |
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 5 ||
=====================
=====================
=====================

No comments:

Post a Comment