శ్రీశోభకృత్ 2024 మాఘ శుద్ధ సప్తమి / రథసప్తమి పర్వదిన శుభాభినందనలు...
🙂
ప్రత్యక్షపరమాత్మగా ఎల్లరిచే ఆరాధింపబడే సూర్యనారాయణుడి జన్మతిధి గా రథసప్తమి పర్వదినం అనాదిగా గొప్ప ప్రాభవం గల పర్వం....
ఎంతటి ప్రాభవం అంటే ఏడుకొండల ఎంకన్న ఏకంగా ఒకరోజు బ్రహ్మోత్సవం గా పేర్గాంచిన సకల వాహన సేవలను అందుకునే వైభవభరిత పర్వోత్సవం రథసప్తమి పండగ....
మనుషులకే కాదు, చీమ మొదలుకొని ఏనుగు వరకు, సకలప్రాణులకు కూడా ఎంతో ముఖ్యమైనది ఆరోగ్యం...
ఎందుకంటే ఆరోగ్యమే అన్నిటినీమించిన ఐశ్వర్యం కాబట్టి...
పుస్తకాలను కొనగలరేమో కాని విద్యను కొనలేరు...
మంచాన్ని కొనగలరేమో కాని నిద్రను కొనలేరు...
అట్లే, వివిధ రుగ్మతలకు వైద్యాన్ని కొనగలరేమో కాని ఆరోగ్యాన్ని కొనలేరు...
అటువంటి దుర్లభమైన ఆరోగ్యాన్ని వరంగా అనుగ్రహించే వరిష్ఠదైవం శ్రీసూర్యనారాయణమూర్తి...!
ఆరోగ్యం తద్వారా మానసిక శారీరక ఉల్లాసం, తద్వరా మేధో వైభవం, తద్వారా శ్రేయోకారక ఐశ్వర్యం, తద్వారా మనఃశాంతితో కూడిన ప్రశాంతజీవనం, తద్వారా జీవనసాఫల్యం....ఇన్నిటికీ ప్రత్యక్ష పరోక్ష కారణం శ్రీసూర్యనారాయణమూర్తి...
'అన్నా నమస్తే ఎట్లున్నవే...'
అని కుశలవచనాలు స్టార్ట్ చేసి...
'నువ్వు ఇంద్రుడివే...
నువ్వు చంద్రుడివే...'
అనేంతరవరకు ముచ్చట్లతో సాటి పరిచయస్తులను మురిపించి చాయ్ బిస్కెట్లు ఫ్రీ గా ఇప్పించుకునే వారెందరో గల ఈ ప్రపంచంలో....,
అట్లాంటి చక్కని స్తుతులతో, స్తోత్రాలతో, పద్యగద్యాలతో, దేవతలను స్తుతించి వారి అమేయానుగ్రహాన్ని బడసి తరించడం కూడా అంతే గొప్పవిషయం అనే అంశాన్ని ఈ ఆధునిక ప్రపంచం విస్మరించడం శోచనీయం...
చక్కని వినసొంపైన సంస్కృతభాషావైభవంతో గొప్పగొప్ప మహర్షులతో కృతిపరచబడి,
కనిపించే గొప్ప ఛందస్సు వెనక నిక్షిప్తమైన కనిపించని గొప్పగొప్ప సూక్ష్మశబ్దశక్తితరంగాల మహత్తును తమలో నిక్షిప్తం గావించుకున్న ఆర్షసారస్వతసిరులకు అనాదిగా ఈ భారతావని నెలవు....
అట్టి మహత్వభరిత సాహితీసుమాలమాలల్లో, శ్రీసూర్యనారాయణమూర్తిని ఉద్దేశ్యిస్తూ ఈ లోకానికి వివిధ మాన్యులైన మహర్షులచే అందివ్వబడినవి...
శ్రీమద్రామాయణాంతర్గత అగస్త్యశ్రీరామసంవాద ఆదిత్యహృదయ స్తోత్రం,
సూర్యాష్టకం,
శివప్రోక్త సూర్యస్తోత్రం,
శ్రీకృష్ణార్జునసంవాద సూర్యమండలస్తోత్రం,
స్కాందపురాణాంతర్గత శ్రీసూర్యకవచం,
శ్రీసూర్యాష్టోత్తరశతనామవళి,
ఇత్యాదివి సూర్యప్రీతికొరకు అనుసంధింపబడే మహత్వభరితసారస్వతసిరులు.....
వీటిని అనుసంధిస్తూ సాగే నిత్య శ్రీసూర్యనారాయణారాధనతో గొప్ప ఆరోగ్యాన్ని గడించి ప్రశాంతమైన జీవితాన్ని సాధించుకోవడం ప్రతిఒక్కరి ఆవశ్యక విహితకర్తవ్యం..
శ్రీమహావిష్ణువును ఆరాధించమంటే పువ్వులూ, తులసిపత్రి ఇత్యాదివి...
శివుణ్ణి ఆరాధించమంటే ద్రవ్యాలు, బిల్వపత్రి ఇత్యాదివి...
శక్తిని ఆరాధించమంటే పసుపుకుంకుమ, పువ్వులు పండ్లు, నైవేద్యాలు, ఇత్యాదివి...
నిత్యం ఈ అల్లరి, ఖర్చు, సామాన్యులకు భారం కదా...
అని అనుకునే వారికి...
వీరందరి సమ్మిళితస్వరూపంగా ప్రతినిత్యం కళ్ళెదుటే వెలిగే ప్రత్యక్షదైవమైన శ్రీసూర్యపరమాత్మకు కేవలం త్రికరణశుద్దిగా ఒనరింపబడే నమస్కార/అర్ఘ్య/స్తోత్ర మాత్రంచేత ప్రసన్నుడై వరాలను అనుగ్రహించే ప్రత్యక్ష ఆశుతోషపరమేశ్వర స్వరూపం సూర్యుడు అనే అంశాన్ని ఈ ఆధునిక ప్రపంచంలోని విజ్ఞ్యానులు విస్మరించడం విచారకరం...
సాయాహ్నవేళ అస్తాద్రికి జారుకునే ఆదిత్యుడి అరుణవర్ణరంజిత కిరణాలు ఎంతో గొప్ప వైటమిన్-డి & ఇతర ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ని ప్రసాదించును అని శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో తెలియజేయడం చాలామందికి గుర్తుండే ఉంటుంది...
పనికిమాలిన ఎన్నో విషయాలకు సమయం దొరికే ఆధునిక మనిషికి, పనిగట్టుకొని ఇవ్విధంగా పరమాత్మను
సూర్యుడిలో దర్శించి తరించవచ్చు అని తెలుసుకోవడానికి కూడా సమయం ఉండదు...
మనం ఫ్రీగా ఒడియాలు ఎండబెట్టుకోవడానికి సూర్యశక్తిని ఉపయుక్తం గావించుకుంటే...
సంపన్నులు సోలార్ ఫలకాలతో ఫ్రీ గా కరెంట్ ను సాధించుకోవడానికి సూర్యశక్తిని ఉపయుక్తం గావించుకుంటారు...
అన్న చందంగా.....
ఒక సామాన్యస్థాయిలోని సూర్యోపాసన ఆరోగ్యం, శారీరక మానసిక ఉల్లసానికి కారణం అయితే...
మరో ఉన్నతస్థాయిలోని సూర్యోపాసన అనేది గొప్ప ఆత్మశక్తివృద్ధిని తద్వారా అధ్యాత్మ విజ్ఞ్యానశక్తివృద్ధిని, తద్వారా జ్యోతిష విద్వత్ వృద్ధిని, తద్వారా మనిషికి జీవితమార్గంపై గట్టిపట్టును అనుగ్రహించే సాధనమై ఒప్పారుతుంది...
అందుకే...
"నయనయోశ్చాంద్రాదిత్యౌ తిష్టేతాం.." అని ఎంతో గొప్పగా వచిస్తోంది శ్రీరుద్రసారస్వతం...
అనగా, సూర్యచంద్రులు మన కళ్ళలో కొలువైఉండడం అని కాదు అందలి అర్ధం...
సూర్యుడి ఆత్మశక్తి కారక విద్వత్తును....
చంద్రుడి మనోశక్తి కారక మహత్తును...
అనుగ్రహించే సాధనములుగా మన నయనమండలం సూర్యచంద్రమండలాలుగా భాసిల్లును అనేది అందలి అసలైన అర్ధం....
ఏ ఆహారం వేడిగా ఉన్నప్పుడు స్వీకరించాలో....
ఏ ఆహారం వేడిగా ఉన్నప్పుడు స్వీకరించకూడదో....
తద్వారా అందలి ఆరోగ్యకారక అంశాలను మనం సామాన్యంగా డాక్టర్లచే వింటూనే ఉంటాము...
ఫర్ ఎగ్సాంపుల్,
అన్నం, పప్పు, చారు, కూర, పాలు, కాఫీ...,
ఇత్యాదివి....
ఓ మోస్తరు వేడిగా ఉన్నప్పుడే భుజించాలి....
పెరుగు, మజ్జిగ, తేనె, నూనె పదార్ధాలు, ఇత్యాదివి వేడిగా భుజించకూడదు...
అనే అంశాలపట్ల అవగాహన కలిగిఉండడం అనేది చక్కని ఆరోగ్యానికి బాటలు....
అదే విధంగా జీవితంలో ఎప్పుడు, ఎవరి దెగ్గర, ఎందుకు, ఎట్ల ఆత్మశక్తికారక విద్వత్తుకు, బుద్ధికి, ప్రాధాన్యత ఇవ్వాలో...
ఎప్పుడు, ఎవరి దెగ్గర, ఎందుకు, ఎట్ల, మనోశక్తికారక దయకు, హృదయానికి ప్రాధాన్యత ఇవ్వాలో...
అనే అంశాలపట్ల అవగాహన కలిగిఉండడం అనేది చక్కని జీవనసాఫల్యానికి బాటలు వేస్తుంది...
భౌతికంగా సూర్యచంద్రులు రోదసిలో ఎంతో దూరంలో ఉండే రెండు వేర్వేరు ఫిజికల్ స్పేషియల్ ఎంటిటీస్ అయినా...
నిజానికి అధ్యాత్మ జ్యోతిష శాస్త్రంలో చంద్రుడు అనగా పరావర్తన సూర్యుడు....
ఎందుకంటే సూర్యపరావర్తనశక్తి లుప్తమైతే అది అమావాస్య అని అంటున్నాము...
ఖగోళ సౌరవ్యవస్థలోని ఫాలాన నక్షత్రంతో చంద్రుడు పరిపూర్ణంగా కూడిఉన్నరోజుని పౌర్ణమి అని అంటున్నాము...
అందుకే పరమేశ్వరుణ్ణి "సోమ సూర్య అగ్ని లోచన..." అని స్తుతించేది....
వినతా సుతుడిగా, వైనతేయుడిగా జగద్ప్రసిద్ధినొందిన గరుత్మంతుల వారి అన్న అనూరుడే సూర్యరథసారధి...
అన్న అనూరుడు శ్రీసూర్యనారాయణుడి రథసారధిగా ఉంటే
తమ్ముడు వైనతేయుడు శ్రీమహావిష్ణువు యొక్క వాహనంగా ఉండడం విశేషం......
అని శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో తెలియజేయడం చాలామందికి గుర్తుండే ఉంటుంది...
అధ్యాత్మజగత్తులో త్రేతాయుగం నుండి ఇప్పటికీ మరియు ఎప్పటికీ "జ్ఞ్యానినామగ్రగణ్యం" అని స్తుతింపబడే హనుమంతులవారికి గురువు సాక్షాత్తు శ్రీసూర్యనారాయణమూర్తి...!
ఉదయాద్రి నుండి అస్తాద్రి వరకు సంచరిస్తూ,
చండప్రచండప్రతాపజ్వాలలతో నింగిలో అప్రతిహతవేగంతో సంచరించే శ్రీసూర్యనారాయణమూర్తికి అభిముఖంగా ఉండి వెనక్కి ప్రయాణిస్తూ సకల శాస్త్రాలను అభ్యసించిన అనన్యసామాన్యుడు కాబట్టే ఆ కపికులతిలకుడు ఇనవంశోత్తముడైన శ్రీరామచంద్రుడి నుండి చిరంజీవిత్వాన్ని గైకొని "రామాయణమహామాల రత్నం, వందే అనిలాత్మజం" గా చరితార్ధుడైనాడు.....
అటువంటి ప్రత్యక్ష పరమాత్మయొక్క అనుగ్రహాన్ని బడసి తరించుటకు ఎల్లరూ నేటి రథసప్తమీ రోజైనా శ్రీసూర్యనారాయణమూర్తికి నమస్కరించి ఉంటారని ఆశిస్తూ ఎల్లరికీ రథసప్తమి పండగ శుభాకాంక్షలు...🙂💐
No comments:
Post a Comment