Wednesday, March 20, 2024

శ్రీశోభకృత్ నామ సంవత్సర 2023 ధనుర్మాస శ్రీవ్రతం / తిరుప్పావై అనుసంధాన సమయ శుభాభినందనలు...🙂

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

శ్రీహరిని భక్తిపాశాలకు కట్టుబడేలా వశంగావించుకోవడం ఈ కలియుగంలో కూడా భక్తులకు సాధ్యమే అని నిరూపించిన మహాలక్ష్మి స్వరూపంగా, భూదేవి అంశలో శ్రీవిళ్ళిపుత్తూరులో తులసీవనంలో ప్రభవించి విష్ణుచిత్తుల వారి ప్రియసుతగా కొనియాడబడిన ఆండాళ్ అమ్మవారు శ్రీరంగనాథుని తన పతిగా పొందేందుకు రచించి ఆలపించిన ఎంతో మహిమోపేతమైన ద్రావిడపాశురాల ప్రశస్తి ఎట్టిదంటే, శ్రీవ్రతం / తిరుప్పావై పాశురాల పఠనం పేర తిరుమల తిరుసప్తగిరుల్లో కూడా మార్గశిరమాసంలో సుప్రభాతానికి బదులుగా నెలరోజులపాటు ప్రతిధ్వనించేంతటి మహత్తరమైనది...

ఎంతో పవిత్రమైన, మహిమోపేతమైన మాసం ఈ మార్గశిరమాసం కాబట్టే పరమాత్మ "మాసానాం మార్గశీర్షోహం" అని భగవద్గీతలో సెలవిచ్చాడు.....

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలను శ్రద్ధగా ఆలకించిన వారికి గుర్తున్నట్టుగా, ఈ మార్గశిరమాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రం నాడు పరమేశ్వరుడికి గావించే రుద్రాభిషేకం యొక్క మహత్తు అంతా ఇంతా కాదు...
ఎందుకంటే అది దేశకాలానుగుణంగా ఎంతో గొప్ప వైభవం గల పశుపతినాథుడికి ప్రియమైన ఖగోళ విశేషం...

( మృగశిర నక్షతం తో చంద్రుడు కూడిఉండే పౌర్ణమి / పశుపతినాథ్ గా పరమేశ్వరుడు పరిఢవిల్లే విశేషం / ఆత్మజ్ఞ్యానిగా తనను తాను, లేక తన స్వస్వరూపానుసంధానస్థితి లో స్థిరంగా ఉండి పశుపతినాథ్ గా మనలోనే ఉండే జీవేశ్వరుణ్ణి, పరమేశ్వరుడిగా తెలుసుకోవడానికి ఈ మర్గశిరమాసం ఎంతో ఉపయుక్తమైన సాధనా / ఉపాసనా కాలం అనేది యోగశాస్త్రం / జ్యోతిషశాస్త్రం యొక్క విశేషం )

ఉపాసనా / సాధనా అనేది రెండు విధాలుగా ఈ లోకంలో భక్తులను ఉన్నతంగా తీర్చిదిద్దే యోగవిశేషం...

మొదటిది ఆంతర ఉపాసనా....
శ్రీఆదిశంకరాచార్యులచే బహుధా ప్రచరింపబడిన అద్వైతసంప్రదాయ / శైవసంప్రదాయ వైభవంలో ,
" శివోహం " / " సోహం "
" అహం బ్రహ్మాస్మి " / 
" తత్ త్వం అసి " /
" దేహో దేవాలయః ప్రోక్తో...జీవో దేవః సనాతనః "
ఇత్యాది శాస్త్రవాక్యాలతో ప్రతిపాదింపబడే శాశ్వతమైన వైశ్విక ఆత్మతత్వం, ధ్యానసిద్దిగా భక్తులకు అనుగ్రహింపబడే భగవద్ విశేషం...

రెండవది బాహ్య ఉపాసన...
శ్రీమద్రామానుజాచార్యులచే బహుధా ప్రచరింపబడిన 
" విశిష్టాద్వైత సంప్రదాయం " / శ్రీవైష్ణవసంప్రదాయంలో ,
భక్తభాగవతులపట్ల గౌరవమరియాదలతో మసులుకునే 
భగవద్భక్తిప్రపత్తిగల జీవితంలో "దాసదాసోహం" గా 
శాశ్వతమైన వైశ్విక ఆత్మతత్వం, ఆచార్యచరిత ఆచారవైభవసిద్ధిగా భక్తులకు అనుగ్రహింపబడే భగవద్ విశేషం...

అటు శైవంలో శివుడికి అర్ధాంగి గా,
శివవామభాగనిలయ గా,
శ్రీచక్రసంచారిణి గా,
ఉండే అమ్మవారు...
శైవానికి శాక్తేయ వైభవాన్ని జతపరిచి భక్తుల లౌకిక ఆర్తితో పాటుగా ఉపాసనలను / సాధనలను కూడా ఈడేర్చే అన్నపూర్ణగా పరిఢవిల్లే విశేషం....
అందుకే కదా అన్నపూర్ణాష్టకంలో శ్రీఆదిశంకరులన్నారు...
"జ్ఞ్యానవైరాగ్యసిద్ధ్యర్ధం భిక్షాందేహిచపార్వతీ" అని...

ఇటు శ్రీవైష్ణవంలో శ్రీమన్నారాయణుడి సోదరి గా,
హరిభక్తిప్రదాయిని గా,
ఉండే అమ్మవారు.....
శ్రీవైష్ణవానికి శాక్తేయ వైభవాన్ని జతపరిచి భక్తుల లౌకిక ఆర్తితో పాటుగా ఉపాసనలను / సాధనలను కూడా ఈడేర్చే నారయణిగా పరిఢవిల్లే విశేషం....
అందుకే కదా మన పెద్దలు అనేది...
" సర్వమంగళమాంగళ్యే శివేసర్వార్ధసాధికే 
శరణ్యేత్రయంబికే గౌరి నారాయణి నమోస్తుతే..."
అని...

అందుకే....
ఆనాడు ద్వాపరంలో శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాపహరణం గావించి వారిచే గావింపబడిన కాత్యాయని నోమునే తన శ్రీవ్రతానికి ఆలంబనగా గావించి, ఆండాళ్ అమ్మవారు ముప్పది పాశురాలతో ముకుందుడిపై తన భక్తిని, ప్రేమను, తిరుప్పావై ప్రబంధపఠనంగా ఈ లోకానికి చాటిచెప్పి, ఈ కలియుగంలో కూడా పరమాత్మను ప్రసన్నం గావించుకొని, ఏకంగా పతిగా పొంది, శ్రీరంగనాయకి గా పేర్గాంచి ఇహపరాల్లోను కూడా శాశ్వతత్త్వాన్ని గడించి, కొలిచిన భక్తుల కొంగుబంగారమై పరిఢవిల్లే వైభవం ఇప్పటికీ ఈ లోకం ఆరాధించే సత్యమే....

అద్వైత సంప్రదాయంలో ఉపాసన మొదలుపెట్టి, నిత్యము కొనసాగిస్తూ, సాధనలు ఫలించి, ఆత్మతత్త్వమునందు స్థిరంగా ఉండి పరమాత్మను దర్శించాలంటే, అందుకు కావలసిన శౌచసిద్ధి, శమదమాదులు, నిత్యము సమకూరిఉండడమనేది ఈ కలియుగంలో అంతగా అందరికీ కుదిరేపని కాదు....
ఎందుకంటే అది ఏరొప్లేన్ లో ప్రయాణించే సామ్యముగల  ఉన్నతోన్నతమైన ఆంతరచైతన్యస్థితి...

సైకిల్, బైక్, కార్, లాంటి సామాన్య, మధ్యస్థ, ఉన్నత సాధానాల్లోని ప్రయాణానికి సామ్యముగా ఉండే సులభమైన శ్రీహరిభక్తి యొక్క ఉపాసన / సాధనా విశేషంతో మాత్రమే ఆ ఉన్నతోన్నతమైన అద్వైతసంప్రదాయ ప్రతిపాదిత పరమేశ్వర సాయుజ్య స్థితి అనేది ఆత్మానుభవం గా భక్తులకు అందివచ్చే భగవదనుగ్రహవిశేషం....

అందుకే విజ్ఞ్యులైన శ్రీవైష్ణవశిఖామణులు అనే మాట.
"శివుణ్ణి మించిన శ్రీవైష్ణవుడు లేడు...ఆతడే ప్రప్రథమ శ్రీవైష్ణవోత్తముడు"  అని....
అందుకే కద శ్రీకైలాసంలో గౌరీశంకరులు నిత్యమూ స్మరియించే శ్రీరామనామమే, కాశిపురిలో దేహన్నిత్యజించే భాగ్యవంతుల కుడిచెవిలో ఆ శ్రీవిశ్వనాథుడు ఉపదేశించే తారకమంత్రమయ్యింది....

విశిష్టాద్వైతాన్ని గౌరవిస్తూ అద్వైతస్థితిని అందుకునే ఈ భగవద్ తత్త్వాన్ని, ఒక సామాన్యుడికి కూడా అర్ధమయ్యేలా చాలా సింపుల్ గా చెప్పాలంటే...
ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తి, ప్యారిస్ వెళ్ళి ఐఫిల్ టవర్ ఎక్కి ప్రపంచాన్ని చూడాలంటే ఏం చేయాలి...?

ఒక సైకిలో, బైకో, వేస్కొని వాళ్ళ ఊర్లో ఉన్న రైల్వే స్టేషన్ కి చేరుకొని, తను ఎక్కవలసిన రైలుబండి ఎక్కి, సికింద్రాబాద్ లో దిగి, ఒక ఊబర్ క్యాబ్ లో శంషాబాద్ ఏర్పోర్ట్ కి చేరుకొని, తను ఎక్కవలసిన ఏర్ ఫ్రాన్స్ ఫ్లైట్ ఎక్కి, ప్యారిస్ కి చేరుకుంటే, అప్పుడు ఐఫిల్ టవర్ ఎక్కి ప్రపంచాన్ని చూడాలనుకునే తన కలనెరవేరుతుంది....కద....
అంతేకాని, ఆ పల్లెటూర్లో అప్పటికప్పుడు ఏర్ ఫ్రాన్స్ ఫ్లైట్ లాండ్ అయ్యి, తనను ఫ్రాన్స్ కి తీస్కెళ్ళడం అంతగా కుదిరేపని కాదు....

ఇదే విధంగా శ్రీహరిభక్తి అనే సులభతరమైన సాధనం తో తన అధ్యాత్మ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రతిభక్తుడూ కూడా, ఏదో ఒకనాటికి తన భక్తిప్రపత్తులకు అనుగుణంగా ఆ సర్వోన్నతమైన శాశ్వతశివసాయుజ్య స్థితిని అనగా ముక్తిని గడించి తరించడం అనే ఆర్షసిద్ధాంతానికి ప్రతీకగా, భోగినాడు శ్రీగోదారంగనాయకుల కళ్యాణం నిర్వహింపబడడం....

భూమిపై నిల్చొనిఉన్న వారికి, ఆకాశంలో ప్రయాణించే ఒక విమానం మరియు దాని గమనం ఒక చిన్న పక్షి యొక్క మందగమనం లా అనిపించవచ్చు.....
కాని అదే స్థాయిలో ప్రయాణించే మరో విమానానికి, లేక మరో ఆకాశగమన సాధనానికి మరియు అందులో ఉన్న విజ్ఞ్యులకు ఆ విమానం ఎంత గంభీరంగా, ఎంత వేగంతో, ఎంత స్థిరంగా వినువీధిలో తనకునిర్దేశింపబడిన మార్గంలో దూసుకెళ్తున్నదో అనేది గ్రాహ్యమయ్యే ఖగోళసత్యం...

అదే విధంగా, ద్రావిడ తిరుప్పావై పాశురాల్లో ఉటంకింపబడే పరతత్త్వం అనేది మాములుగా చదివితే కొందరు చెలికత్తెలను గోపికలుగా భావిస్తూ, తననుతాను ఆ గోపకాంతలకు నాయకిగా భావించుకుంటూ, శ్రీరంగనాథుణ్ణే శ్రీకృష్ణుడిగా, గోవిందుడిగా భావిస్తూ, స్వామిని ప్రసన్నం గావించుకునే ప్రక్రియలో ఆలపించే పద్యగద్యాలుగా అనిపించినా,
మహిమాన్వితమైన తిరుప్పావై ద్రావిడ పాశురపఠనం ద్వారా జనించే శబ్దశక్తితో జాగృతమయ్యే పంచకోశాంతర అధ్యాత్మదీప్తి మరియు వాటిచే గ్రాహ్యమయ్యే పరతత్త్వద్యుతి అనేది ఆనాటి విళ్ళిపుత్తూరు భక్తులనుండి ఈనాటి యావద్ లోకంలోని పాఠకులకు వారివారి జీవితాంతర్గతంగా స్వగ్రాహ్యమయ్యే పరమాత్మానుగ్రహవిశేషం....

ధనుర్మాసంలోని తిరుప్పావై పఠనం, 
ప్రసాద స్వీకరణ, (మరీ ముఖ్యంగా 27వ పాశురపఠనం రోజున భక్తులకు కూడారై ఉత్సవం పేరుతో అనుగ్రహింపబడే నేతిపాయసం), భోగినాటి శ్రీగోదారంగనాయకుల కళ్యాణవీక్షణం, ఎంత గొప్పగా లౌకిక సిరిసంపదలను కూడా వర్షిస్తుందో, శ్రీవైష్ణవవిజ్ఞ్యులను ఎవ్వరిని అడిగినాసరే ఇట్టే చెప్తారు....

కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక్కో అధ్యాయం పేరిట సాగే స్కాందపురాణాంతర్గత కార్తీక పురాణ పఠనం / శ్రవణం ఎంతటి భగవదనుగ్రహాన్ని ప్రసాదిస్తుందో....
తదనంతర చాంద్రమాన మార్గశిర మాసంలో వచ్చే సౌరమాన ధనుర్మాసం (అనగా ఖగోళంలో సూర్యుడు ధనూ రాశిలో సంచరించే కాలం) లో ఆండాళ్ అమ్మవారి అనుగ్రహంగా ఈ కలియుగంలో భక్తులెల్లరికీ లభించిన ద్రావిడ సంక్షిప్త ప్రబంధనిధిగా పేర్కొనబడే తిరుప్పావై పాశుర పఠనం / శ్రవణం / మననం కూడా అంతటి భగవదనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని విజ్ఞ్యుల ఉవాచ....

అందులో ఏమేమున్నయో తెలియకున్నా సరే...
కేరళ లో తయారైన శ్రీశబరిమల అయ్యప్పస్వామి వారి అరవణప్రసాదం ఎంతో భక్తితో సేవిస్తాం....
ఎందుకంటే తద్వారా ధర్మశాస్త యొక్క అనుగ్రహం శబరిమలకు ఇంకా వెళ్ళని, వెళ్ళలేని, భక్తులకు కూడా లభిస్తుందనే విశ్వాసం అనాదిగా ఉన్న సత్సంప్రదాయవైభవం...

అదే విధంగా, గొప్ప శబ్దశక్తివైభవం గల ద్రావిడం రాకున్నా / అర్ధంకాకపోయినా సరే, మహిమాన్వితమైన ద్రావిడ పాశురాల్లో నిక్షిప్తమైన భగవద్ తత్త్వం ఎంటో తెలియకున్నా సరే, తిరుప్పావై పాశురాలను చదివినా, ఆలకించినా కూడా ఎంతో గొప్ప శ్రీహరి అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసం అనాదిగా ఉన్న సత్సంప్రదాయవైభవం...

ధ్యానం ::
నీళా తుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతిశతశిరః సిద్ధమధ్యాపయంతీ ।
స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః ॥

అన్న వయల్ పుదువై యాండాళ్ అరంగర్కు
పన్ను తిరుప్పావై ప్పల్ పదియం, ఇన్నిశైయాల్
పాడిక్కొడుత్తాళ్ నఱ్పామాలై,
పూమాలై శూడిక్కొడుత్తాళై చ్చొల్లు,
శూడిక్కొడుత్త శుడర్కొడియే తొల్పావై,
పాడియరుళవల్ల పల్వళైయాయ్, నాడి నీ
వేంగడవఱ్కెన్నై విది యెన్ఱ ఇమ్మాట్రం,
నాన్ కడవా వణ్ణమే నల్‍కు.

ఆండాళ్ తిరువడిగలే శరణం...
ఆచార్య తిరువడిగలే శరణం...
🙏🙏🙏🙏🙏🙏🙏


No comments:

Post a Comment