శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.
శ్రీకంఠుడికి వందనం 🙏
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్, దయా
శాలికి, శూలికిన్, శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్,
బాల శశాంక మౌళికిఁ, గపాలికి, మన్మథ గర్వ పర్వతో
న్మూలికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్.
చతుర్ముఖబ్రహ్మ గారికి వందనం 🙏
ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి ని
ర్ణేతకు, దేవతా నికర నేతకుఁ, గల్మష ఛేత్తకున్, నత
త్రాతకు, ధాతకున్, నిఖిల తాపస లోక శుభప్రదాతకున్.
శ్రీగణపతికి వందనం 🙏
ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సం
పాదికి, దోషభేదికిఁ, బ్రపన్నవినోదికి, విఘ్నవల్లికా
చ్ఛేదికి, మంజువాదికి, నశేష జగజ్జన నంద వేదికిన్,
మోదకఖాదికిన్, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్.
శ్రీసరస్వతీ దేవికి వందనం 🙏
క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ, జంచరీక చయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికిఁ, దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్,
వాణికి. నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.
పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ, నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి, మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ! మేల్
పట్టున్ నా కగుమమ్మ, నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం -
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా -
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ
అంబ, నవాంబుజోజ్జ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శ్రుతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంబరవీధి విశ్రుతవిహారిణి, నన్ గృపఁ జూడు భారతీ!
శ్రీమహాశక్తికి వందనం 🙏
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వసంపదల్
శ్రీలక్ష్మీ దేవికి వందనం 🙏
హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం
దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భాసురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.
Referred from
https://telugubhagavatam.org/?tebha&Skanda=1&Ghatta=1
🙂
No comments:
Post a Comment