Wednesday, March 20, 2024

శ్రీశోభకృత్ నామ సంవత్సర మాఘ బహుళ త్రయోదశి ప్రయుక్త చతుర్దశి, 2024 మహాశివరాత్రి పర్వసమయ శుభాభినందనలు.....🙂


శివశివేతిశివేతిశివేతివా..
హరహరేతిహరేతిహరేతివా..
భవభవేతిభవేతిభవేతివా...!

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ..!

ఓం నమఃశివాయ్ ఓం నమఃశివాయ్ హరహరభోళే నమఃశివాయ్..!

అరుణాచల శివ అరుణాచల శివ 
అరుణాచల శివ అరుణాచల
అరుణాచల శివ అరుణాచల శివ 
అరుణాచల శివ అరుణాచలా..!

ఇత్యాదిగా ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా శివనామ స్మరణలో పరవశించి తరించే మహాశివరాత్రి పర్వం / జాగరణ గురించి తెలియనివారుండరు....

ఎందుకంటే శివమయమైనదే మన జీవితం...
మన జీవితంలో ఆ శివం లుప్తమైతే పేరుతో కాకుండా ఫలానా బాడి అని పిలుస్తారు...
నిత్యం ఫలాన పేరుతో పిలవబడడానికి మరియు ఫలాన బాడి అని పిలువబడడానికి వ్యత్యాసం కేవలం ఊపిరి పీల్చుకోకపోవడం మాత్రమే అనేది అందరికీ తెలిసినదే...
ఆ ఊపిరి ఎవరికి వారే పీల్చుకోవడం అనేదే నిజమైతే...
మరి మన తాత నానమ్మ అమ్మమ్మ మరియు గతించిన ఇతర బంధుమితృల ఊపిరి ఎందుకు ఒకానొకరోజు ఆగింది..?

ఫలానా సంఖ్య ఊపిరిలో, ఫలాన వ్యక్తిలోని శివం పరమేశ్వరుడిలోకి లయించే ప్రక్రియ తనంతతానుగానే జరిగిపోతుందా .....
లేక ఆ నిర్ణయాధికార వ్యవస్థకి లయకర్త గా ఒకరు బాధ్యులై ఉన్నారా....? ఉంటే వారికి ఆ బాధ్యతను అప్పగించిన భగవంతుడెవ్వడు...??
అనే అంశాలగురించి...
"కోటి మంది వైద్యులు కూడివచ్చిన గాని మరణమయ్యెడి వ్యాధి మాన్పలేరు..." అనే వాక్యాన్ని శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో ఎందరో విని, తగురీతిలో వివేచనాత్మక అంతర్విచారణ గావించే ఉంటారు...

"యమస్యకరుణానాస్తి.." అని అంటోంది శాస్త్రం...అట్టి యముడికే యముడైన పరమేశ్వరుణ్ణి...
" శంభ॑వే॒ నమః॑ । నమ॑స్తే అస్తు భగవన్-విశ్వేశ్వ॒రాయ॑ మహాదే॒వాయ॑ త్ర్యంబ॒కాయ॑ త్రిపురాంత॒కాయ॑ త్రికాగ్నికా॒లాయ॑ కాలాగ్నిరు॒ద్రాయ॑ నీలకం॒ఠాయ॑ మృత్యుంజ॒యాయ॑ సర్వేశ్వ॒రాయ॑ సదాశి॒వాయ॑ శ్రీమన్-మహాదే॒వాయ॒ నమః॑ ॥ "
అని సర్వేశ్వరుడిగా కీర్తిస్తున్నది శ్రీరుద్రం...

"
నమః॒ సోమా॑య చ రు॒ద్రాయ॑ చ॒
నమ॑స్తా॒మ్రాయ॑ చారు॒ణాయ॑ చ॒
నమః॑ శం॒గాయ॑ చ పశు॒పత॑యే చ॒
నమ॑ ఉ॒గ్రాయ॑ చ భీ॒మాయ॑ చ॒
నమో॑ అగ్రేవ॒ధాయ॑ చ దూరేవ॒ధాయ॑ చ॒
నమో॑ హం॒త్రే చ॒ హనీ॑యసే చ॒
నమో॑ వృ॒క్షేభ్యో॒ హరి॑కేశేభ్యో॒
నమ॑స్తా॒రాయ॒
నమ॑శ్శం॒భవే॑ చ మయో॒భవే॑ చ॒
నమః॑ శంక॒రాయ॑ చ మయస్క॒రాయ॑ చ॒
నమః॑ శి॒వాయ॑ చ శి॒వత॑రాయ చ॒
"

రుద్రపఠనంలోని తదనంతరభాగం, 
"నమో హంత్రేచ..." అని ఆ లయకర్తయొక్క విద్యుక్తధర్మ స్ఫోరక గౌణమును కీర్తిస్తూ...
తుదకు 
"నమః శివాయచ..శివతరాయచ.."
అని అట్టి లయకర్తకు శుభంకర అని కృతజ్ఞ్యతలను ఆవిష్కరిస్తున్నది శ్రీరుద్రపఠనం....

"సమ్హరించేవాణ్ణి శంకరుడిగా (శం కరోతి ఇతి శంకరః), శివుడిగా నమస్కరించడం ఏంటి..?"
అని కొంచెం ఆశ్చర్యకరమైన స్తుతిగా అనిపించవచ్చు....
కాని అందలి అంతరార్ధం వేరు....
కరెక్ట్ గా చెప్పలంటే...
శివుడు "కాలసమ్హారమూర్తి"...
అందుకే శుభంకరుడిగా, శివుడిగా శ్రీరుద్రం అంత ఘనంగా నమస్కరిస్తున్నది...

మీరెప్పుడైనా చిదంబరం వెళ్ళినప్పుడు అక్కడ ఉండే "కాలసమ్హారమూర్తి" ని దర్శించి, ధ్యానించి ఆ విశేషాలను తెలుసుకోండి....

నా ధ్యానంలో ఈశ్వరుడు అనుగ్రహించినంత మేర నేను ఆ సమ్హారమూర్తి శివుడెట్లు అవుతున్నాడో...
కాబట్టి శివతరాయచ గా ఎందుకు నిత్యం నమస్కరింపబడుతున్నాడో...
కొంత తెలియజేసే ప్రయత్నంగావిస్తాను...

మీ ఇంటి దెగ్గర్లో ఒక పార్క్ ఉందని అనుకుందాం...
మొదటి రోజు, ఆ పార్క్ ఎంతో చూడముచ్చటగా...
పచ్చని చెట్లతో, పూలమొక్కలతో, లతలతో, అలరారుతోంది......
అట్లు కొన్ని నెలల గడచిన తర్వాత సరైన "మేంటనెన్స్" లేక....
చిత్తు కాగితాలు, చెత్తచెదారం, తో నిండి పచ్చదనం పరిశుభ్రత లుప్తమై దుర్గంధభూయిష్ఠమైన ప్రదేశం గా మారింది....

అనగా కాలంతర్గతంగా వచ్చిచేరిన అవాంఛిత నిరుపయోగ 
పదార్ధాల వల్ల, ఆ చూడచక్కని ఉద్యానవనం అలా ఒక డస్ట్బిన్ గా మారింది...అని అర్ధం....

అనతికాలంలో భూమిలో కలిసి కరిగిపోయే ఆకులు ఇత్యాది ప్రకృతి సిద్ధమైన చెత్త తనంత తానుగా కొన్నాళ్ళకు లయించినా....ప్లాస్టిక్, రబ్బర్, సీసం, ఇత్యాదివి వాటంతట అవి అంత తేలికగా లయించవు...కాబట్టే ఒక "మేంటనెన్స్"
వ్యవస్థ (జి.హెచ్.ఎం.సి లాంటివి) తరచు ఆ శుభ్రపరిచే ప్రక్రియను ( అనగా కాలాంతర్గతంగా పోగయ్యే వ్యర్ధాలను లయించే ప్రక్రియ ) నిర్వహిస్తూ ఆ ఉద్యానవనం ఎప్పటికీ అట్లే నిత్యనూతనంగా అలరారేలా చేస్తున్నది అని అర్ధం....

మనిషి జీవితంలో శివుడి అనుగ్రహ పాత్ర కూడా అట్టిదే...
"కాలం" అనేది ఒక అగోచర, అమేయ, అగ్రాహ్య, అనిర్వచనీయ, ఆశ్చర్యకరమైన అంశం... కాలం ఎల్లరి జీవితాలను శాసించడం అనేది తనంతతానుగా జరిగిపోతూఉండే ప్రక్రియ...
అట్టి కాలం తన అధీనంలో ఉండేవాడే శివుడు...
అందుకే ఆతడు వాసుకి అనే సర్పాన్ని కంఠాభరణంగా కలిగి ఉన్నాడు.....
అమృతం కోసం దేవదానవులు ప్రయత్నిస్తే కాలంతర్గతంగా ఉద్భవించిన అవాంఛితమైన హాలహలం అనే కాలకూట విషాన్ని తన కంఠంలో బంధించి లయించాడు....
అనగా తత్త్వతః కాలంతర్గతంగా జనించే సకల అవాంఛనీయ ప్రక్రియలను, ప్రకోపాలను, తనలోకి లయించే కారుణ్యమూర్తియే లయకర్త...తద్వరా ఆతడు శ్రీకరుడు శుభంకరుడు అయిన శంకరుడిగా వర్ధిల్లుతునాడు...

చక్కని ఇల్లు ఉండడం ఎంత ముఖ్యమో...
ఇల్లును అంత చక్కగా మేంటేన్ చేయడం కూడా అంతే ముఖ్యం...
(అనగా ఎప్పటికప్పుడు కాలాంతర్గతంగా వచ్చి పోగయ్యే అవాంఛిత దుమ్ము, ధూళి, ఉండకుండా శ్రీకరంగా ఉండడం..)

చక్కని శరీరం ఉండడం ఎంత ముఖ్యమో...
శరీరాన్ని అంత చక్కగా మేంటేన్ చేయడం కూడా అంతే ముఖ్యం...
(అనగా ఎప్పటికప్పుడు కాలాంతర్గతంగా వచ్చి పోగయ్యే అవాంఛిత రుగ్మతలు, జాఢ్యాలు, ఉండకుండా శ్రీకరంగా ఉండడం..)

ఇది లౌకికం...
కాబట్టి...మనచేతిలో ఉన్న అంశం...

చక్కని పుణ్యకర్మలఫలితం ఉండడం ఎంత ముఖ్యమో...
పుణ్యకర్మలఫలాలను అంత చక్కగా మేంటేన్ చేయడం కూడా అంతే ముఖ్యం...

చక్కని కాలం చిరంతనంగా ఉండడం ఎంత ముఖ్యమో...
ఆ కాలవైభవాన్ని అంత చక్కగా మేంటేన్ చేయడం కూడా అంతే ముఖ్యం...

ఇది అలౌకికం...కాబట్టి...
మనచేతిలో లేని అంశం...

మరి ఎవరి చేతిలో ఉన్న అంశం...??

కాలాన్ని సువ్యవస్థీకరించే నాదశక్తిని సృజించే ఢమరుకం కట్టబడిన త్రిశూలం ఆయుధంగా చేతిలో ఉన్నవాడి చేతిలో ఉండే అంశం..
కాలాధిపతి, దినాధిపతి, గ్రహాధిపతి, ఆత్మాధిపతి, ఆరోగ్యాధిపతి అయిన సూర్యశక్తి నుండి ఒకానొక సందర్భంలో విశ్వకర్మచే తయారుచేయబడినది త్రిశూలం కాబట్టి...
కాలాంతర్గతంగా ఉనికిని సంతరించుకునే సకలవైశ్విక పారమార్ధిక మరియు లౌకిక చర్యలను నియంత్రించే శక్తి  శివుడు ధరించే ఆ దైవిక త్రిశూలానికి ఉంటుంది....
ఆ నియంత్రణను శ్రేయోదాయకమైన విధంగా సువ్యవస్థీకరించడం చాలా ముఖ్యం కాబట్టి, అట్టి త్రిశూలానికి దైవిక ఢమరుకం కట్టబడి ఉంటుంది....
అదే విధమైన కాలనియంత్రక శక్తి శ్రీమహావిష్ణువు ధరించే సుదర్శనచక్రానికి కూడా అదే సూర్యశక్తిగా అందివ్వబడింది...
హరి స్థితికారక పనులకు...
హరుడు లయకారక పనులకు ...
వారివారి దైవిక శస్త్రాస్త్రాల సూర్యశక్తిని అనగా ప్రత్యక్ష కాలస్వరూపం యొక్క శక్తిని వినియోగిస్తున్నారు అని అర్ధం...

హరి సమ్హారకుడిగా....
హరుడు సమ్రక్షకుడిగా....
ఉన్న ఉదంతాలే మన పురాణాల్లో ఎక్కువ...కాబట్టి హరిహరులకు అభేదం....
కాని తత్త్వతః ఒక ప్రక్రియకు ఒక శక్తికేంద్రాన్ని నిర్వచించాలి కాబట్టి అలా హరి స్థితికర్తగా...హరుడు లయకర్తగా ఆదిపరాశక్తిచే నియమితులైరి...

నిజానికి ఆ లయకర్త సమ్హరించేది కాలాన్ని....అందుకే శివుడు కాలసమ్హారమూర్తిగా ఆరాధింపబడుతున్నాడు.....
కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉండడంలో అసలైన అర్ధం ఏంటో తెలుసా....
రవం అనగా ధ్వని....
భైరవ అనగా ఆ ధ్వనిని తన అధీనంలో అదిమిపెట్టగల శక్తి..
కాలభైరవ అనగా కాలాంతర్గతంగా ధ్వనించే అన్నిరకాల శక్తులను కూడా తన అధీనంలో అదిమిపెట్టి ఉండే శక్తి..
అట్టి కాలభైరవ శక్తి తనకు క్షేత్రపాలకుడిగా ఉండడం అంటే...

అన్ని కాలాలు, అన్ని కాలాంతర్గత క్రియాకలాపాలు, కాలం యొక్క అన్ని స్వరూపాలు, కూడా ఎవరికి కింకరులై వ్యవహరిస్తాయో, అట్టి రుద్రుడే మహాకాలుడైన కాలకాలుడు....అనే సందేశమే కాలభైరవుడు పరమేశ్వరుడి క్షేత్రపాలకుడిగా ఉండడంలోని ఆంతర్యం.....

మీరు ఈ కాలభైరవశక్తి యొక్క విశేషాలను బాగుగా అర్ధంచేసుకోవాలంటే...
శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ, శ్రీఆదిశంకరమఠం నిర్వహణలో ఉన్న సత్రం/విశ్రాంతిగృహసముదాయానికి దెగ్గర్లో ఉండే కాలభైరవ మూర్తిని దర్శించి ధ్యానించి తెలుసుకోండి....

శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో, "శ్రీకంచిపరమాచార్య వారి శ్రీశైల యాత్ర, 7 తాటిచెట్ల లోతు తవ్వమని చెప్పడం, అప్పుడు సరస్వతీ తీర్థం బహిర్గతమవ్వడం, అప్పటినుండి ఇప్పటికీ కూడా శ్రీఆదిశంకర మఠ నిర్వాహకుల సమ్రక్షణలో ఉన్న ఆ సర్వస్వతీ తీర్థం భక్తులకు దర్శనీయమై ఉండడం...", గురించి శ్రద్ధగా విన్నవారికి నేను చెప్పే ప్రదేశం సుపరిచితమే కద....
శ్రీశైల గ్రామ దేవత అంకాళపరమేశ్వరి ఆలయం, 
బయలువీరభద్రుడు, సిద్ధరామప్ప పాదాలు, గోశాల దెగ్గర్లోని హేమారెడ్డి మలమ్మ ఆలయం, కొంచెం దూరంలో ఉండే
సాక్షిగణపతి ఆలయం, హాఠకేశ్వరం, శిఖరనంది, ఫాలధారపంచధార ఇత్యాది శ్రీశైల ఆలయ పరిసర ఇతర దర్శనీయ వాటికలు భక్తులకు విదితమే కద....

దేశము, కాలము, నామము అనే శక్తిత్రయంతో ముడిపడిన అద్వితీయ మహోన్నత దైవిక ప్రదేశమే మన ప్రాచీన భారతావని.....

"ఫాలానా మహాశివరాత్రి నాడు అరుణాచలగిరిప్రదక్షిణ గావిస్తున్నప్పుడు, ఆది అన్నామలై ఆలయ వెనక భాగంలో కొలువైన లింగోద్భవమూర్తికి గావించిన అభిషేకాన్ని దర్శించి శివనామస్మరణతో జాగరణలో తరించడం మా జన్మాంతర సుకృతం...."
అని ఎవరైనా భక్తులు మీతో చెప్పినపుడు.....

ఇక్కడ 

1. దేశము - అనగా అరుణాచల అగ్నిలింగక్షేత్రానుబంధమైన ఆది అన్నామలై ఆలయం...

2. కాలము - అనగా మహాశివరాత్రి పర్వదినం

3. నామము - అనగా శివనామము

యొక్క సమ్మిళిత సమాహార స్వరూపం యొక్క విశేషమే మహాపుణ్యప్రదమైన అంశంగా పరిగణింపబడుతోంది అని అర్ధం కద....

ఇక్కడ మీరు గమనిస్తే, మొదటి రెండు విశేషాలు అనగా దేశము, కాలము ఎల్లప్పుడూ మన అధీనంలో ఉండడం కుదరదు....

అనగా,
"నేను ప్రతి తిరుమల బ్రహ్మోత్సవంలో అన్ని వాహనసేవలను దర్శిస్తూ గోవింద నామస్మరణ గావిస్తాను..."అని అనడం అందరికీ ఎల్లవేళలా కుదరదు...

"నేను ప్రతి శివరాత్రికి అరుణాచల గిరిప్రదక్షిణం గావించి లింగోద్భవకాల అభిషేకానికి ఆది అన్నామలై ఆలయానికి చేరుకుంటాను......"అని అనడం అందరికీ ఎల్లవేళలా కుదరదు...

అప్పుడప్పుడు అలాంటి పుణ్యం ఈశ్వరానుగ్రహంగా సంప్రాప్తించును....

కాని,
నేను ఎల్లప్పుడు
శివగోవిందగోవింద...
హరిగోవిందగోవింద...
హరగోవిందగోవింద...
ఇత్యాది భగవద్ నామస్మరణలో లీనమై ఉంటాను....
అని అనడం ఎవ్వరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఈశ్వరకృపగా కుదిరే అనుగ్రహమే.....

కాబట్టి దేశము, కాలము, నామము అనే శక్తిత్రయంలో నామము ఎల్లప్పుడూ కూడా భక్తుడి అధీనమై ఉండును...
తద్వారా నామి కూడా ఎల్లప్పుడూ భక్తుడి అధీనమై ఉండును..
కాబట్టే యావద్ భారతావనిలో ఒక్కోభక్తుడి ఆర్తికి తగ్గట్టుగా పలికిన ఈశ్వరుడు అక్కడ అట్ల కొలువై, విరాజిల్లుతున్నాడు అనేది జగద్విదితమైన విశేషం...

అనగా, "Order of precedence" (సాఫ్ట్వేర్ ప్రపంచానికి బాగా సుపరిచితమైన అంశం) అనే విశేషం కారణంగా,
భగవద్ నామమే ఎల్లప్పుడూ కూడా అత్యంత మహిమాన్వితమై ఉండును....

అనగా మీరు మహాశివరాత్రికి అరుణాచలంలో ఉన్మా కూడా శివనామ స్మరణలో కాకుండా మీ మనసు ఏదో లౌకిక సినిమాపై నిమగ్నమై ఉన్నప్పుడు, అది ఎందుకు పనికిరాని తీర్థయాత్ర....

మీరు ఏదో ఒక లౌకిక సినిమా చూస్తున్నా కూడా, మీ మనసు అరుణాచలశివ అంటూ స్మరించగలిగే స్థాయిలో ఉంటే, సినిమా వీక్షణం కూడా పుణ్యదాయకమైన వ్యాపకమైనది....
కద ...

చ10. ప్రేమ ముప్పిరికొను వేళ
నామము తలచే వారు
రామ భక్తుడైన త్యాగ-
రాజ నుతుని నిజ దాసులైన వా(రెందరో)

అని కృతిపరిచారు సద్గురు శ్రీత్యాగబ్రహ్మం గారు... జగద్ప్రసిద్ధినొందిన వారి "ఎందరో మహానుభావులు" అనే శ్రీరాగ పంచరత్నకృతిలో....

మరియు
కాలసమ్హారమూర్తిగా కొనియాడబడే పంచాస్య పరమేశ్వరవైభవాన్ని "విదళితకాలం" అని ఎంతో ఘనంగా కీర్తిస్తూ, సంగీతరసఝరుల్లో సమ్మిళితం గావింపబడిన భగవద్ నామం యొక్క వైభవాన్ని సామవేదసారంగా అభివర్నిస్తూ, శ్రీత్యాగరాయుల వారు చిత్తరంజని రాగంలో అందించిన ఈ కృతి ఎంతటి ఆహ్లాద దాయకమో కద....

ప. నాద తనుమనిశం శంకరం
నమామి మే మనసా శిరసా

అ. మోదకర నిగమోత్తమ సామ
వేద సారం వారం వారం (నా)

చ. సద్యోజాతాది పంచ వక్త్రజ
స-రి-గ-మ-ప-ధ-ని వర సప్త-స్వర
విద్యా లోలం విదళిత కాలం
విమల హృదయ త్యాగరాజ పాలం (నా)

దేశకాలనుగుణంగా ఈశ్వరనామస్మరణవైభవం ఎట్టిదో చాలా సింపుల్ గా వివరిస్తాను....

ఈశ్వర నామము అనేది ఒక 500 రూపాయల పచ్చ నోటు అనిగనక మీరనుకుంటే..,(ఇది ధనప్రధానమైన కలియుగం కాబట్టి కరెన్సి నోట్ ని ఉదాహరణ గా స్వీకరించాను)

అమెరికా, సాన్ఫ్రాన్సిస్కో డౌన్టౌన్ లో మీరు ఈ 500 రూపాయల పచ్చ నోటు ని వినియోగిస్తే, ఓ 6 డాలర్ల  ఫారిన్ ఎక్స్చేంజ్ రొక్కం గా విలువకట్టి హార్డ్లీ ఓ కప్ కాఫి పొందగలరు...
అదే ఇండియా, హైదరాబాద్ లో జె.ఎన్.టి.యు ఏరియాలో అయితే 2 విస్తర్ల ఫుల్ అన్లిమిటెడ్ పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన అమృతమయమైన బ్రాహ్మణ భోజనాన్ని పొందగలరు....
అనగా
అదే వ్యక్తి..అదే 500 నోట్....
కాని...
దేశం మారింది...తద్వారా ఫలితం కూడా మారింది...
కద....

హైదరాబాద్, జె.ఎన్.టి.యు ఏరియాలో... వింటర్ సీసన్ లో మీరు 500 రూపాయల పచ్చ నోటు ని వినియోగించినా, ఓ కిలో మామిడిపండ్లు కూడా దొరకవు...
అదే హైదరాబాద్, జె.ఎన్.టి.యు ఏరియాలో... 
సమ్మర్ సీసన్ లో మీరు 500 రూపాయల పచ్చ నోటు ని వినియోగిస్తే, 5 కిలోల రకరకాల వెరైటీల్లో అమృతమయమైన మామిడిపండ్లు దొరుకుతాయ్....

అనగా
అదే వ్యక్తి..అదే 500 నోట్....
కాని...
కాలం మారింది...తద్వారా ఫలితం కూడా మారింది...
కద....

అచ్చం ఇదే విధంగా దేశకాలానుగుణంగా ఈశ్వరనామ స్మరణ వైభవం ఫలితం కూడా మారుతూ ఉంటుంది...

కాని ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే...
మీరు హైదరాబాద్, జె.ఎన్.టి.యు ఏరియాకి వెళ్ళినా...
అమెరికా, సాన్ఫ్రాన్సిస్కో డౌన్టౌన్ కి వెళ్ళినా...
పక్క గల్లికి వెళ్ళినా సరే...
500 నోటు ఉంటేనే దేశకాలానుగుణంగా వివిధ ఫలితాలను పొందగలం...
లేనిచో ఎన్ని దేశాలు తిరిగినా, ఏ కాలంలో తిరిగినా, ఫలితం నిష్పలం..
అచ్చం అదే విధంగా మీరు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే...
మీరు అరుణాచలం వెళ్ళినా, కాశి వెళ్ళినా, తిరుమల వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, చిదంబరం వెళ్ళినా...
ఇంటికి దెగ్గర్లో ఉండే ఏదేని ఆలయానికి వెళ్ళినా... సరే...
ఈశ్వరనామస్మరణ యొక్క నిధి మీవద్ద ఉంటేనే.... దేశకాలానుగుణంగా వివిధ ఫలితాలను పొందగలం...
లేనిచో ఏ కాలంలో ఎన్ని తీర్థాలు తిరిగినా, ఎన్ని క్షేత్రాలు దర్శించినా ఫలితం గగనం...

ఎందుకంటే ఈశ్వరుడిపై మనకు గల విశ్వాసానికి సూచికయే ఈశ్వరనామస్మరణ...
ఎందుకంటే నామమే నామికి ఉనికి కాబట్టి....
నామస్మరణమే నామిని మనవద్దకు రప్పించే సాధనం కాబట్టి...

ఆఫ్ట్రాల్ ఓ 50 మంది ఉన్న క్లాస్ లోనే,
అటెండెన్స్ కి పూర్తి పేరు పిలిచినా సరే సరిగ్గా పలకని ఎందరో లాస్ట్ బెంచ్ దోస్తుల అల్లరి మనకు తెలిసినదే...
మరి అటువంటిది...కోటానుకోట్ల జీవుల వివిధ స్థాయిలోని స్థితిని, లయాన్ని, చక్కబెట్టే పనిలో బాగా బిజిగా ఉండే ఈశ్వరుడు తగురీతిలో నామస్మరణం అనే సాధనం ద్వారా పిలిస్తేనే పలుకుతా అని అంటే అందులో అతిశయం అని అనడానికి ఏముంటుంది...?

అంటే అన్నిసార్లు అంత గొప్పగా పిలిస్తేనే పలకడానికి ఈశ్వరుడు సరిగ్గా వినడా ఏంటి...?
అనే వెర్రి డౌట్లు కొందరికి రావొచ్చు....

"ఒక చీమ కాలికి మువ్వలను తయారుచేసి తొడిగితే చీమలు నడుస్తున్నప్పుడు జనించే ఆ అత్యంత స్వల్ప మాగ్నిట్యూడ్ లో ఉండే అందెలరవాన్ని కూడా ఈశ్వరుడు వినగలడు...."
అనే శ్రీచాగంటి సద్గురువుల వివరణ కొందరికైన గుర్తుండే ఉంటుంది...

కాబట్టి ఇక్కడ ప్రశ్న ఈశ్వరుడు వినగలడా అని కాదు...
ఈశ్వరుడు తనకు పలికేలా భక్తుడు స్మరించగలడా అనేదే ప్రశ్న...
ఆ ప్రశ్నకు సమాధానం తెలిసేది కేవలం ఆర్తితో పిలిచే సదరు భక్తుడికి మాత్రమే కాబట్టి....
ఈశ్వర నామస్మరణం, మననం, నిధిధ్యాసనం లోని వైభవం ప్రస్ఫుటంగా ప్రకటనమయ్యేది ఆయా భక్తుల హృదయాలకు మాత్రమే....అని అనడం అతిశయోక్తి కానేరదు....

కీ.శే|| వీర్రాజు గారు అని, ఎందరో భక్తులచే ఎల్లప్పుడూ మనస్పూర్తిగా నమస్కరింపబడే 90 సంవత్సరాల మహానుభావులు ఒకరు ఉండేవారు వి.వి.నగర్ భగవద్ నామస్మరణ భజన బృందంలో....
ప్రతీ శనివారం నన్ను ఎంతో ఆప్యాయంగా ఆదరించి భజన సంప్రదాయంలోని ఈశ్వర నామస్మరణ వైభవాన్ని అలది భజనలో పాల్గొనే ఎల్లరినీ ఎంత గొప్పగా తరింపజేసేవారో నేను ఎప్పటికీ మరవలేను...

అంతటి వృద్ధ్యాప్యంలో కూడా, కట్టుడు పళ్ళతో, వణుకుతున్న చేతులతో, గాద్గదిక స్వరంతోనే వారు గావించే గగనగంభీరమైన భజనల్లో ఆ ఈశ్వరుడు ఎంతగా ఓలలాడేవాడో, అక్కడుండే ఎందరికో సుపరిచితమే....
వీర్రాజు గారి స్వరంలో భజనలు వినడం కోసమే నేను అప్పట్లో ఆలయానికి తప్పకుండా వెళ్ళేవాణ్ణి....
రోమాలు నిక్కపొడిచేలా వారు ఈ క్రింది నరసిమ్హశతకపద్యాన్ని ఆలపిస్తుండేవారు....అందులో ప్రతిపాదింపబడే వేదాంత సందేశంలో ఈశ్వరనామస్మరణ యొక్క వైభవం ఎంత గొప్పగా వర్నింపబడిందో కద....

సీ. బ్రతికినన్నాళ్లు నీ - భజన తప్పను గాని
మరణకాలమునందు - మఱతునేమొ
యావేళ యమదూత - లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి - పట్టునపుడు
కఫ వాత పైత్యముల్ - గప్పగా భ్రమచేత
గంప ముద్భవమంది - కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను - నారాయణా యంచు
బిలుతునో శ్రమచేత - బిలువనొ

తే. నాటి కిప్పుడె చేతు నీ - నామభజన
తలచెదను, జెవి నిడవయ్య । - ధైర్యముగను.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

హరుడి రుద్రాంశలో సద్యోఈశ్వరశక్తిగా స్తంభోద్భవ నారసిమ్హశక్తిగా భక్తుడి మాటకు కట్టుబడి ప్రభవించిన
శ్రీలక్ష్మీనరసిమ్హస్వామి అనుగ్రహం భక్తుల దురితాలను భన్జించే భవుడి అనుగ్రహమై భక్తులెల్లరికి లభించుగాక......

హరిలోనే హరుణ్ణి దర్శించిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు శ్రీవేంకటేశ్వరస్వామి పై రచించిన ఈ క్రింది సంకీర్తన, శ్రీగరిమెళ్ళ అనిల్ బ్రో గారి అమృతగళంలో నిజంగా ఎంత వైభవంగా ఉంటుందో ఒకసారి వింటే తెలుస్తుంది...ఆ హరిహరాత్మక చిద్విలాస వైభవం..

[ Lyrics too are present in the comments section of the rendition
https://youtu.be/xEhbBo377-w?si=u9Mt3Xygmglx3DTR ]

హరనమః పార్వతీపతయే హరహరమహాదేవ శంభోశంకర...

సర్వం వేములవాడ శ్రీరాజరాజేశ్వరి సమేత 
శ్రీరాజరాజేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు...
☺️🪔🌙🫐🌷🌸🌟🍊🍀🪷🇮🇳
🙏🙏🙏🙏🙏


No comments:

Post a Comment