Thursday, September 27, 2018

Nice article about 'Sri Balamurali garu' by 'Sri Sudhakar Modumudi' garu....

విశ్వవిఖ్యాత కర్ణాటక సంగీత వినీలాకాశంలోని ఒక ధృవతార నేడు మనకు అందని సుదూరాలకు జారుకుంది...
తమ స్వఛ్చమైన , సుస్పష్ఠమైన , సరలమైన తెలుగు ఉఛ్చారణతో పండిత పామర భేదం లేకుండా ఎందరో సంగీతాభిమానుల హృదయాలను రంజింపచేసిన ఆ స్వరం నేడు శాశ్వతంగా మూగబోయింది...
అన్నమయ్య కృతులకు, త్యాగయ్య పదగతులకు సరికొత్త సొబగులను అద్దుతూ సాగిన వారి రసఝరి ఇక ' రసో వై సహ ' అంటూ ఆ పరతత్వ పవనాలలో లీనమైపోయింది.... 
వసంత శ్రీ to Indian Classical Music
Nice article about Sri Balamurali garu by Sri Sudhakar Modumudi garu !
తెలతెలవారుతోంది...ఉదయభానుడి లేలేత కిరణాలు కోనసీమ కొబ్బరితోపుల నుండి భూమిని తాకటానికి యత్నిస్తున్నాయి.అది..తూర్పు గోదావరి జిల్లా 'అంతర్వేదిపాలెం' అనే చిన్న పల్లెటూరు.
పక్షుల కిలకిలారావాల మధ్య,ఒక పెంకుటింటి సావట్లోనుండి సన్నగా మధుర వీణాగానం వినబడుతోంది..ఆ వైణికురాలికి పట్టుమని ఇరవైఏళ్లుండవు..ఏడోనెల గర్భంతోనూ అవస్థపడుతూనే సంగీత సాధన చేస్తోంది.'నిండు చూలాలివి.అంత శ్రమపడి,క్రింద కూర్చొని,ఆ వీణ వాయించకపోతే ఏమమ్మా?'..అంటూ కొంచెం నిష్టూరంగానే అడిగింది ఆడబడుచు కసువు ఊడుస్తూ.
'నిశ్శబ్దం'..అని సైగచేస్తూ..'లోపలి బిడ్డ వింటున్నాడు..వాడికోసమమ్మా'..అని, కీర్తన ప్రారంభించింది ఆ వైణికురాలు..ఆవిడే..సంగీత విద్వాన్ మంగళంపల్లి పట్టభిరామయ్యగారి ధర్మపత్ని సూర్యకాంతమ్మ.
గర్భంలోని తనకు పుట్టబోయే శిశువు గొప్ప సంగీత కళాకారుడు కావాలని ఆమె కోరిక...చూస్తుండగానే నవ మాసాలూ పూర్తయ్యాయి.1930 వ సంవత్సరం,జూలై 6, ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున, సాయంత్రం 6-40 గంటలకు పండంటి మగపిల్లవాణ్ణి ప్రసవించింది.
తొలిచూలు కావడంతో కాలు కింద పెట్టనివ్వకుండా ఆమెకు అన్నీ తామేఅయి, చూసుకుంటున్నారు పుట్టింటివారు శంకరగుప్తంలో.
అయితే,విధి బలీయమైంది.....
ప్రసవించిన పదహారో రోజే పరమాత్ముడిలో లీనమైపోయింది ఆ తల్లి..ఎన్నో జన్మల ఆమె పుణ్యం మాత్రం వృధా పోలేదు.
"సీతావర! సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా!" అని త్యాగయ్య అన్నట్లు, గర్భస్థ శిశువుగా సంగీతశిక్షణ ఆరంభించిన ఆ బాలుడే.. 'ఇంతింతై..వటుడింతై..'అన్నట్లు దినదిన ప్రవర్ధమానుడై,సంగీత జగత్తులో ఒక దివ్య రత్నంగా భాసిల్లిన 'పద్మ విభూషణుడు' మంగళంపల్లి బాలమురళీకృష్ణ.
ఆ తల్లి తపఃఫలంకాకపోతే ఏమిటి? 10 వ ఏట నుండే కచేరీలు చేయడం.. 18 ఏళ్ల చిరుత ప్రాయంలోనే అనితరసాధ్యమైన 72 మేళకర్త రాగాలలో కృతులు రచించడం..అచిరకాలంలోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఖండాంతర ఖ్యాతినార్జించడం..ఇప్పటికి ఇరవై వేల ప్రదర్శనలివ్వటం..భార్య మరణానంతరం, తిరిగి వివాహం చేసుకోమని పట్టాభిరామయ్యగారిని బంధువర్గంలో కొందరు బలవంతపెట్టినా, బాలమురళికి సవతి తల్లివల్ల సంగీత సాధనకు ఇబ్బందిరాకాడదని,పునర్వివాహం చేసుకోకుండా త్యాగంచేశారు పట్టాభిరామయ్యగారు.
బాలమురళీకృష్ణ గారు, ఒక జీవితకాలంలో ఏ మనుష్యమాత్రుడూ చేయలేని ఘనకార్యాలెన్నో చేశారు..
ఈ ఖ్యాతికంతటికీ ప్రధాన కారకులు..తల్లిదండ్రులు..ఆ తరువాత ఆయన గురువు 'గాయక సార్వభౌమ'రామకృష్ణయ్య పంతులుగారు.
బాలమురళీగారు స్వయంగా ఒక సందర్భంలో 'మా గురువుగారి దగ్గర నేను నేర్చుకున్నంత పాఠం మరెవరూ నేర్చుకొని ఉండరు' అన్నారు.దీనికి కారణం,ఆయన ఏకసంథాగ్రాహి కనుక, పంతులుగారు మురళీగారికి ప్రత్యేకంగా కూర్చోబెట్టి,పాఠం చెప్పటం!
వందలాది గీతాలు,వర్ణాలు,స్వర పల్లవులూ,కృతులూ..ఒకటేమిటి?అందరూ నెలరోజుల్లో నేర్చుకునే పాఠం మురళీగారికి ఒక్క రోజులో చెప్పేవారట పంతులుగారు.గాత్రంతో పాటు వైలిన్లో కూడా బాలమురళిని నిష్ణాతుణ్ణి చేశారాయన!
పంతులుగారికి బాలమురళి అంటే ఎంతటి ఇష్టం,గౌరవం అంటే, కొన్ని సందర్భాలలో తన పాదాలకు మురళి నమస్కారం చేయబోతే,' వద్దంటూ' వారించేవారట!
బాలమురళీకృష్ణ సాక్షాత్తూ సరస్వతీ అవతారమని నమ్మేవారాయన!
బాలమురళీకృష్ణ చిన్నతనంలో తాను సృష్టించిన 4 స్వరాల ( స గ2 ప ని1 ) 'మహతి' అనే రాగంలో రచించిన గురుస్తుతి విని, ఎంతగానో పొంగిపోయారు పంతులుగారు...
మహనీయ మధురమూర్తే!
కమనీయ గానమూర్తే!
సహన సౌశీల్యాది
సద్గుణోపేత సత్కీర్తే!
మహతీ మంద్ర సుగాత్రే!
మాంపాహి గురుమూర్తే!
అహరహమానందమయ
గాన బోధనానురక్తే!
ఆశ్రిత మురళీకృత మృదు
సంగీత సుధాసక్తే!
మాంపాహి గురుమూర్తే!
*బాలమురళీ గారు మనవడితో అరుదైనచిత్రం

No comments:

Post a Comment